పరిపూర్ణులైనవారు మాత్రమే అర్థవంతమైన జీవితాన్ని జీవించగలరు

వాస్తవానికి, మనుష్యులు తమ పాత పితరుడైన సాతానుడిని పూర్తిగా వదిలిపెట్టేలా చేయడమే ఇప్పుడు జరిగించబడుచున్న కార్యము యొక్క ఉద్దేశం. వాక్యము ద్వారా అందించబడే ప్రతి తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశము పతనమైన మానవుల భ్రష్టత్వపు స్వభావమును చూపించడం మరియు జీవము యొక్క ప్రాధాన్యతను అర్థము చేసుకోవడానికి మనుష్యులను ప్రోత్సాహపరచడమే. పునరావృతమయ్యే ఈ రెండు తీర్పులు మనుష్యుల హృదయాలను చీల్చివేస్తాయి. వాటిలో ప్రతి తీర్పు నేరుగా వారికే సంబంధించినదిగా ఉంటుంది మరియు వారి హృదయాలను గాయపరుస్తుంది. తద్వారా, వారు ఆ విషయాలన్నిటిని వదులుకొని, జీవమును గూర్చి తెలుసుకోగలరు, ఈ లోకములోని మాలిన్యమును గూర్చి తెలుసుకోగలరు, దేవుని జ్ఞానమును గూర్చి, ఆయన శక్తిని గూర్చి తెలుసుకోగలరు, అంతేగాకుండా సాతాను ద్వారా భ్రష్టుపట్టిన మానవులను గూర్చి కూడా తెలుసుకుంటారు. మనిషి ఎంత ఎక్కువగా ఈ శిక్షను మరియు తీర్పును పొందుకుంటాడో, అంతే ఎక్కువగా మనిషి హృదయం గాయపరచబడుతుంది మరియు అంతే ఎక్కువగా అతని ఆత్మ కూడా బలహీనపరచబడవచ్చు. అతి ఘోరంగా మోసపరచబడిన, భ్రష్టుపట్టిన ఈ మనుష్యుల ఆత్మలను పైకి లేవనెత్తడమే ఈ తీర్పు యొక్క ముఖ్య లక్ష్యం. మనిషిలో ఆత్మ లేదు, అంటే ఎంతో కాలం క్రితమే అతనిలోని ఆత్మ చనిపోయింది. దేవుడున్నాడని, పరలోకముందని మరియు మరణపు అగాధములో పోరాటము చేయుచున్నాడని అతనికి తెలియదు; భూమి మీద ఇటువంటి భయంకరమైన నరకములో అతను జీవిస్తున్నాడని అతనికి ఎలా తెలుస్తుంది? సాతానుడి భ్రష్టత్వము ద్వారా తను కూడా భ్రష్టుపట్టిపోయాడని, మరణపు పాతాళములో పడిపోయాడని అతను ఎలా తెలుసుకుంటాడు? భూమి మీదనున్న ప్రతీది మానవాళి ద్వారా మరమ్మతు చేయలేని విధంగా నాశనం చేయబడిందని అతను ఎలా తెలుసుకుంటాడు? ఈ రోజున సృష్టికర్త భూమి మీదకి వచ్చాడని, తాను రక్షించాలనుకునే నశించుపోవుచున్న ప్రజల గుంపు కొరకు ఆయన వెదకుచున్నాడని అతను ఎలా తెలుసుకుంటాడు? అనేకమైన శుద్దీకరణ మరియు తీర్పుల తరవాత కూడా, మనిషిలోని నిస్తేజమైన ప్రజ్ఞ స్పందించలేని స్థితిలోనే ఉండిపోయింది. మనుష్యులు ఎంతగానో దిగజారిపోయారు! ఈ రకమైన తీర్పు ఆకాశము నుండి కురిసిన బహు క్రూరమైన వడగండ్లు లాంటిది, ఇది మనిషికి అత్యంత ప్రయోజనకరమైనది. ఈ విధంగా మనుష్యులను తీర్పు తీర్చకపోయినట్లయితే, ఎటువంటి ఫలితం ఉండదు మరియు బహు ఘోరమైన అగాధము నుండి ప్రజలను రక్షించడం అసాధ్యమవుతుంది. ఇటువంటి కార్యము కొరకు కాకపోయినట్లయితే, ప్రజలు పాతాళ లోకము నుండి బయట పడడం చాలా కష్టం. ఎందుకంటే, వారి హృదయాలు ఎప్పుడో చనిపోయాయి మరియు వారి ఆత్మలు ఎప్పుడో సాతాను ద్వారా అణగద్రొక్కబడియున్నాయి. బహు ఘోరమైన దురవస్థ స్థితిలో ఇరుక్కుపోయిన మిమ్మల్ని రక్షించడానికి తదేకంగా కేకవేసి మిమ్మల్ని పిలవవలసిన అవసరత ఉంది, మిమ్మల్ని తదేకంగా తీర్పు తీర్చవలసిన అవసరత ఉంది; అలా చేసినప్పుడే, కరుడుగట్టిన మీ హృదయాలను కరిగించడం సాధ్యమవుతుంది.

మీ శరీరం, మీ అపరిమితమైన కోర్కెలు, మీ లోభం, మీ మోహం మొదలగునవన్నీ మీలో లోతుగా వేళ్లూనుకున్నాయి. ప్రాచీనమైన మరియు పునరావృతమయ్యే ఆలోచనలనే కాడి నుండి మీరు తప్పిపోకుండా ఈ విషయాలనేవి మీ హృదయాలను నిరంతరం నియంత్రణ చేయుచున్నవి. ప్రస్తుతం మీరు మీ పరిస్థితిని మార్చుకోవాలని ఇష్టపడరు, లేక చీకటి ప్రభావము నుండి తప్పించుకోవాలని ఇష్టపడరు. కేవలం పైన చెప్పబడిన వాటి ద్వారా బంధించబడి ఉంటారు. ఈ జీవితం చాలా బాధాకరమైనదని, ఈ మనుష్యుల లోకం చాలా చీకటి సంబంధమైనదని మీకు తెలిసినప్పటికినీ, మీ జీవితాన్ని మార్చుకుంటారనే ధైర్యము మీలో ఒక్కరికి కూడా లేదు. మీరు కేవలము ఈ జీవితములో వాస్తవ స్థితిగతుల నుండి తప్పించుకోవాలనుకుంటారు, ప్రాణము తృప్తిగా ఉండాలనుకుంటారు, మరియు సమాధానంగా, సంతోషంగా, పరలోక వాతావరణాన్ని కలిగి బ్రతకాలనుకుంటారు. మీ ప్రస్తుత జీవితాన్ని మార్చుకోవడానికి కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలని ఇష్టపడరు; మీరు తప్పక ప్రవేశించాల్సిన జీవితం కోసం తీర్పు మరియు శిక్షలో పరిశోధించడానికి కూడా మీరు ఇష్టపడరు. బదులుగా, శరీరానికి అతీతమైన అందమైన ప్రపంచమును గురించి అవాస్తవికమైన కలలు కంటూ ఉంటారు. ఎటువంటి శ్రమను, బాధను పొందకుండానే, ఎటువంటి ప్రయాస పడకుండానే గొప్ప జీవితాన్ని పొందుకోవాలని మీరు కోరుకుంటున్నారు. అది సంపూర్ణముగా అవాస్తవికం! ఎందుకంటే, మీరు కలిగియున్న నిరీక్షణ శరీరములో అర్థవంతమైన జీవిత కాలాన్ని జీవించడానికి కాదు మరియు జీవిత కాలమంతటిలో సత్యాన్ని సంపాదించుకోవడానికి కాదు, అది సత్యము కొరకు బ్రతకాడానికి మరియు న్యాయం కొరకు బ్రతకాడానికి ఇవ్వబడింది. అది మీరనుకునే ప్రకాశవంతమైన, మిరుమిట్లు గొలిపే జీవితం కాదు. అది ఆకర్షణీయమైన లేక అర్థవంతమైన జీవితముగా ఉండదని మీరు భావిస్తారు. మీ దృష్టిలో జీవించడం అనేది అన్యామని భావిస్తుంటారు! శిక్షా సంబంధమైన ఈ రోజును మీరు అంగీకరించినప్పటికీ, మీరు అనుసరించేది సత్యాన్ని సంపాదించుకోవడానికో లేక ప్రస్తుతమందు సత్యాన్నిబట్టి బ్రతకడానికో కాకుండా శరీరానికి అతీతమైన సంతోషకరమైన జీవితములోనికి ప్రవేశించడానికి అనుసరిస్తున్నారు. మీరు సత్యాన్ని వెదకడం లేదు, లేక సత్యం కొరకు నిలబడడం లేదు, మరియు మీరు నిశ్చయముగా సత్యం కొరకు జీవించడం లేదు. ఈ రోజున వాస్తవ స్థితిలోనికి ప్రవేశించడానికి అనుసరించడానికి బదులుగా మీ ఆలొచనలన్నీ భవిష్యత్తు మీద మరియు ఎప్పుడో వచ్చే ఆ రోజు మీద ఉన్నాయి: మీరు నీలి ఆకాశం వైపు తదేకంగా చూసి, ఎంతో బాధతో కన్నీళ్ళు కార్చి, ఏదో ఒక రోజున పరలోకానికి కొనిపోబడాలనుకుంటారు. మీరు ఆలోచించే విధానం వాస్తవిక స్థితితో సంబంధం కోల్పోయిందని మీకు తెలియడం లేదా? రక్షకుడు ఎంతో దయగలవాడనీ మరియు కనికర సంపన్నుడనీ ఏదో ఒక రోజున ఆయన వచ్చి తనతో పాటు మిమ్మల్ని తీసుకుపోతాడనీ, ఎందుకంటే, మీరు ఈ లోకములో కఠిన శ్రమలను అనుభవించారు కాబట్టి, బాధితులైన మరియు అణచివేయబడిన మీ తరఫున ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడనీ మరియు మీ మనోవేదనలను పరిష్కరిస్తాడని మీరు ఆలోచిస్తూనే ఉంటారు. నిజానికి, నీవు పాపంతో నిండియుండలేదా? ఈ లోకంలో నీవు ఒక్కడివే శ్రమను అనుభవిస్తున్నావా? నీకు నీవుగా సాతాను ఉచ్చులో చిక్కుకోలేదా, అంటే దేవుడు నిజంగానే నీకున్న మనోవేదనలన్నిటినీ పరిష్కరించాలా? దేవుడు అడిగే వాటిని చేసి, ఆయన తృప్తిపరచలేని వారందరూ దేవుని శత్రువులుగా పిలువబడరా? దేవుడు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే నమ్మరో, వారందరూ క్రీస్తు విరోధులు కారా? నీవు చేసిన మంచి క్రియలు దేని కొరకు లెక్కించబడతాయి? దేవుణ్ణి ఆరాధించే హృదయాన్ని అవి తీసుకోగలవా? నీవు చేసే కొన్ని మంచి కార్యాల వలన దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేవు. నీవు బాధించబడినందున మరియు అణచివేయబడినందున, నీవు చేసిన తప్పులను బట్టి దేవుడు ప్రతీకారం తీర్చుకోడు మరియు నీకున్న మనోవేదనలన్నిటినీ పరిష్కరించడు. దేవుణ్ణి విశ్వసించిన వారందరికి ఇంకా దేవుని గురించి తెలియదు, అయితే మంచి కార్యాలు చేసిన వారందరూ కూడా శిక్షించబడలేదా? నీవు బహు అరుదుగా దేవుణ్ణి నమ్మి, నీకు విరుద్ధంగా జరిగిన తప్పులన్నీ పరిష్కరించి, ప్రతీకారం తీర్చుకోవాలని దేవుని నుండి ఆశిస్తావు, మరియు నీవు తల ఎత్తుకొని ఉండే రోజును దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటావు. అయితే, సత్యము విషయములో శ్రద్ధ పెట్టడానికి మాత్రం నీవు తిరస్కరిస్తావు, సత్యాన్నిబట్టి బ్రతాకలనే తృష్ణను నీవు కలిగియున్నావా? ఈ శూన్యమైన మరియు క్లిష్టమైన జీవితము నుండి బహు కొద్దిమంది మాత్రమే తప్పించుకుంటారు. ఈ శరీరములో మరియు నీ ఈ పాప జీవితములో నీవు ఈ జీవితాన్ని జీవిస్తున్నప్పుడే, నీ మనోవేదనలను పరిష్కరించడానికి మరియు నీ అస్తిత్వము చుట్టూ పొగబారిన దానిని తీసివేయడానికి దేవుని వైపు ఆశగా చూస్తావు. అయితే అది సాధ్యమా? నీవు సత్యాన్ని సంపాదించుకున్నట్లయితే, నువ్వు దేవుణ్ణి అనుసరించవచ్చు. నీవు సత్యాన్నిబట్టి జీవించినట్లయితే, నీవు దేవుని వాక్య ప్రత్యక్షతను కలిగియుండవచ్చు. నీవు జీవమును కలిగియున్నట్లయితే, నీవు దేవుని ఆశీర్వాదాన్ని సంతోషంగా అనుభవించవచ్చు. సత్యాన్ని సంపాదించుకున్న ప్రతియొక్కరూ దేవుని ఆశీర్వాదాన్ని సంతోషంగా అనుభవించవచ్చు. కష్టాలనైనా, శ్రమలనైనా ఎదుర్కొని, దేవుణ్ణి హృదయ పూర్వకముగా ప్రేమించే వారందరికి పరిష్కారాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు గానీ తమను తాము ప్రేమించుకునేవారికి, సాతాను మోసాలకు గురైన వారికి ఆయన ఎటువంటి వాగ్దానము చేయడం లేదు. సత్యాన్ని ప్రేమించని వారిలో మంచితనం ఎలా ఉంటుంది? శరీరాన్ని మాత్రమే ప్రేమించుకునే వారిలో నీతి ఎలా ఉంటుంది? నీతి మరియు మంచితనం అనేవి సత్యాన్ని మాత్రమే చూపించడానికి చెప్పబడినవి కావా? అవి కేవలము దేవుణ్ణి హృదయపూర్వకముగా ప్రేమిస్తున్నవారి కోసం ఉంచబడినవి కావా? సత్యాన్ని ప్రేమించని వారు కుళ్ళిపోయిన శవాలు లాంటివారు, అలాంటి వారందరూ చెడుకు ఆశ్రయము లాంటివారు కారా? సత్యాన్నిబట్టి జీవించలేనివారందరూ సత్యానికి శత్రువులు కారా? మరి మీ విషయం ఏమిటి?

ఈ చీకటి సంబంధమైన ప్రభావాల నుండి తప్పించుకొని, అశుద్దమైన వాటి నుండి నిన్ను నీవు విడిపించుకున్నట్లయితే, పరిశుద్ధంగా మారినట్లయితే, అప్పుడు మీరు సత్యాన్ని సంపాదించుకుంటారు. దీని అర్థం, నీ స్వభావము మారింది అని కాదు గానీ నీవు సత్యాన్ని ఆచరిస్తున్నప్పటికీ, శరీరాన్ని త్యజించలేకపోవుచున్నావని అర్థం. ఇదే శుద్దీకరణ చెందినవారి ద్వారా పొందుకునే శ్రేష్టతయైయున్నది. జయ కార్యము ప్రధాన లక్ష్యం ఏమిటంటే, మానవాళిని శుద్దీకరించడమే, తద్వారా మనిషి సత్యాన్ని సంపాదించుకుంటాడు, ఎందుకంటే మనిషి సత్యాన్ని కొద్దిగా మాత్రమే అర్థం చేసుకున్నాడు! అటువంటి మనుష్యుల మీద జయించు కార్యము జరిగించడమే అత్యంత ప్రాముఖ్యం. మీరందరూ చీకటి ప్రభావము క్రింద పడియున్నారు మరియు చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే, ఈ కార్యము యొక్క గురి ఏమనగా మానవ స్వభావమును తెలుసుకొనునట్లు మిమ్మల్ని బలపరచడమే, తద్వారా సత్యాన్నిబట్టి జీవించునట్లు చేయడమే. పరిపూర్ణముగా ఉండడం అంటే సృష్టించబడిన ప్రతీది అంగీకరించవలసిన విషయం. ఈ స్థాయిలో జరిగే కార్యము కేవలము ప్రజలను పరిపూర్ణులనుగా చేసే పనిలో నిమగ్నమైనట్లయితే, అప్పుడు అది ఏ బ్రిటన్‌లోనో, లేక అమెరికాలోనో, లేక ఇశ్రాయేలులోనో జరిగించబడి ఉండేది; ఏ దేశపు ప్రజల మీదనైనా జరిగించబడి ఉండేది. అయితే జయించు కార్యము ఎంపిక చేయబడింది. జయించు కార్యములో మొట్ట మొదటి అడుగు తక్కువ సమయం; అంతేగాకుండా, ఇది సాతానును కించపరచడానికి మరియు సమస్త విశ్వాన్ని జయించడానికి ఉపయోగించబడుతుంది. ఇది జయ కార్యములో ప్రారంభ దశ. దేవుని యందు విశ్వాసముంచు ఏ జీవియైనా సంరక్షించబడుతుందని చెప్పవచ్చు, ఎందుకంటే పరిపూర్ణత సాధించడమనేది సుదీర్ఘ కాలము తరువాత వచ్చే మార్పుయైయున్నది. అయితే, జయించబడడం అనేది విభిన్నమైనది. జయించడం కొరకు ఇవ్వబడిన దుష్టాంతం మరియు నమూన ఏమిటంటే, ఒక వ్యక్తి తప్పనిసరిగా వెనుకబడిపోవడం మరియు భయంకరమైన చీకట్లో జీవించడమే; వారు అత్యంత దిగజారిపోయి ఉంటారు, దేవుణ్ణి స్వీకరించడానికి ఇష్టపడనివారైయుంటారు మరియు దేవునికి బహు అవిధేయత చూపినవారైయుంటారు. నేను జయించాను అని సాక్ష్యము చెప్పే వ్యక్తి ఇలాగే ఉంటాడు. జయించు కార్యములో ప్రధాన లక్ష్యం ఏమంటే సాతానును ఓడించడమే, ప్రజలను పరిపూర్ణులనుగా చేసే ప్రధాన లక్ష్యం ప్రజలను సంపాదించడమే అవుతుంది. మీలాగే ప్రజలందరి మీద ఈ జయించు కార్యము ప్రయోగం చేయబడి, వారు జయించిన తరువాత ప్రజలు సాక్ష్యాన్ని కలిగియుండడానికి ప్రోత్సహిస్తుంది. ప్రజలు జయించిన తరువాత సాక్ష్యము కలిగియుండడానికి కృషి చేయడమే ప్రధాన లక్ష్యం. జయించిన ఈ ప్రజలందరూ సాతానును అవమానించే లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించబడతారు. అందుచేత, జయించుటలో ముఖ్య పధ్ధతి ఏమిటి? శిక్ష, తీర్పు, శాపాలను వేయడం, బయలుపరచడం, ప్రజలను జయించడానికి నీతి స్వభావమును ఉపయోగించడం. తద్వారా వారు దేవుని నీతి స్వభావమును బట్టి పూర్తిగా ఒప్పించబడతారు. మనుష్యులను జయించడానికి మరియు వారిని సంపూర్ణముగా ఒప్పించడానికి దేవుని మాటల అధికారాన్ని, వాటి నిజ తత్వమును ఉపయోగించుటయై యున్నది–దీనినే జయించడమంటారు. పరిపూర్ణులైన వారందరూ జయించిన తరువాత విధేయతను సంపాదించుకుంటారు, అయితే వారు తీర్పు కార్యమునకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు, వారి స్వభావాన్ని మార్చుకుంటారు, దేవుణ్ణి తెలుసుకుంటారు. వారు దేవుణ్ణి ప్రేమించే మార్గాన్ని కూడా అనుభవిస్తారు మరియు సత్యముతో నింపబడతారు. వారు దేవుని కార్యాన్ని అనుభవించడం ఎలాగో నేర్చుకుంటారు, దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తారు మరియు వారు స్వంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పరిపూర్ణులైనవారు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థము చేసుకున్నవారు కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుభవించినందుకు కృతజ్ఞతలు చెప్తారు. జయించినవారు సత్యమును గూర్చి అవగాహన ఉన్నవారు, అయితే వీరు సత్యము యొక్క నిజమైన అర్థాన్ని అంగీకరించరు. జయించిన తరువాత, వారు విధేయత చూపుతారు, అయితే వారు కలిగియున్న విధేయత వారు పొందుకొనిన తీర్పుకు వచ్చిన ఫలితమే. అనేక సత్యాంశములను గూర్చిన నిజమైన అర్థాలను వారు ఏ మాత్రమును అర్థం చేసుకోలేరు. వారు తమ నోటి మాటలతో సత్యాన్ని ఒప్పుకుంటారు గానీ వారు సత్యాన్ని అనుకరించరు; వారు సత్యాన్ని గ్రహిస్తారు గానీ వారు సత్యాన్ని అనుభవించరు. పరిపూర్ణులైన వారి మీద జరిగిన కార్యములో జీవమును అనుగ్రహించుటతో పాటు శిక్షలు మరియు తీర్పులు కూడా ఉంటాయి. సత్యమునందు ప్రవేశించడానికి విలువనిచ్చే వ్యక్తి పరిపూర్ణుడైన వ్యక్తియని అర్థం. పరిపూర్ణులైన వారికి మరియు జయించిన వారికి మధ్యన ఉండే వ్యత్యాసము వారు సత్యములోనికి ప్రవేశించారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పరిపూర్ణులైన వారు సత్యాన్ని గ్రహించినవారు, సత్యమును అనుసరించు మార్గములోనికి ప్రవేశించినవారు, సత్యాన్నిబట్టి జీవించేవారు; పరిపూర్ణులు కానివారు సత్యాన్ని గ్రహించనివారు, సత్య మార్గములోనికి ప్రవేశించనివారు మరియు సత్యాన్నిబట్టి బ్రతికేవారు కాదు. ఇటువంటి ప్రజలు ఇప్పుడు పూర్తిగా విధేయత చూపుచున్నారు, వారు జయించియున్నారు. జయించిన వారు సత్యాన్ని వెదకకపోయినట్లయితే, వారు సత్యాన్ని అనుసరిస్తారు గానీ సత్యాన్నిబట్టి బ్రతకరు, వారు సత్యమును గూర్చి విని, ఆలోచనలు కలిగి కూడా సత్యమును అనుసరించి బ్రతకరు కాబట్టి వారు పరిపూర్ణులు కానేరరు. పరిపూర్ణులవ్వాలని కోరుకునేవారు పరిపూర్ణమైన మార్గమును అనుసరిస్తూనే దేవుడు కోరికల మేరకు సత్యాన్ని అభ్యసిస్తూనే ఉంటారు. ఈ విధంగా, వారు చిత్తాన్ని తృప్తిపరుస్తారు, మరియు వారు పరిపూర్ణులుగా ఉంటారు. జయించు కార్యము ముగియక మునుపు చివరి వరకు అనుసరించేవారెవరైనా జయించినవారే గాని పరిపూర్ణులైనవారని చెప్పలేము. “పరిపూర్ణులు” అనే మాట జయించు కార్యమును ముగించుకొని, సత్యాన్ని అనుసరించే వారిని గూర్చి సూచించబడింది. జయించు కార్యము చివరి వరకు ఉన్న తరువాత, సత్యాన్నిబట్టి జీవించి, శ్రమలలో సహితం స్థిరముగా నిలబడినవారిని గూర్చి ఇది సూచిస్తోంది. జయించినవారిని మరియు పరిపూర్ణులైనవారిని వేరు పరిచేదేమిటంటే కార్యములలో జరిగే వ్యత్యాసాలు మరియు ప్రజలు సత్యమును అర్థము చేసుకొని, సత్య మార్గములోనికి ప్రవేశించే స్థాయినందున్న వ్యత్యాసాలు. పరిపూర్ణ మార్గము వైపుకు అడుగులు వేయనివారందరూ అంటే సత్యాన్ని అనుసరించని వారందరూ అంతిమంగా పరిత్యజించబడుతారు. సత్యాన్ని అనుసరించేవారు మాత్రమే, సత్యాన్నిబట్టి బ్రతికేవారు మాత్రమే దేవుని ద్వారా పూర్తిగా లాభమును పొందుకుంటారు. అదే పేతురు ప్రతిరూపము వలె జీవించేవారందరూ పరిపూర్ణులవుతారు, ఇతరులు జయించబడినవారవుతారు. జయించబడినవారందరి మీద జరిగించబడిన కార్యములో శాపాలు వేయడం మరియు శిక్షించడం అనేవి ఉంటాయి, మరియు ఉగ్రతను చూపించడం, మరియు వారికి వచ్చే ప్రతీది నీతి మరియు శాపాలే. ఇటువంటి వ్యక్తి మీద కార్యము జరిగించడం అనేది ఎటువంటి పధ్ధతిని గానీ లేక సభ్యతను కనుపరచకుండా బహిర్గతము చేయడమే–వారి మనస్సులోని భ్రష్టత్వమును బహిర్గతం చేయడమే. తద్వారా వారు తమంతట తామే దానిని గుర్తించి, దానిని పూర్తిగా ఒప్పుకుంటారు. ఒక వ్యక్తి సంపూర్ణముగా విధేయత చూపు వ్యక్తిగా మారినప్పుడు, జయించు కార్యము ముగిసిపోతుంది. చాలామంది సత్యాన్ని అర్థము చేసుకోవడానికి ఇష్టపడకపోతే, వారి విషయములో జయించు కార్యము ముగించబడలేదని అర్థం.

మీరు పరిపూర్ణులవ్వాలనుకుంటే, పాటించవలసిన ప్రమాణాలు ఉన్నాయి. నీవు చేపట్టిన సంకల్పము, నీవు కలిగియున్న పట్టుదల మరియు నీ ప్రజ్ఞ అనే వాటి ద్వారా, మరియు నీ అన్వేషణ ద్వారా నీవు జీవమును అనుభవించగలుగుతావు మరియు దేవుని చిత్తాన్ని తృప్తిపరచగలుగుతావు. నీ ప్రవేశం మరియు పరిపూర్ణమైన మార్గములో అవసరమైన సంగతులు ఇవే. పరిపూర్ణమైన కార్యము ప్రజలందరి మీద జరుగుతుంది. దేవుణ్ణి అన్వేషించే ప్రతి ఒక్కరు పరిపూర్ణులవ్వచ్చు, పరిపూర్ణులవడానికి అవకాశమును మరియు అర్హతలను కలిగియున్నారు. నిర్దిష్టమైన నియమమంటూ ఇక్కడ లేదు. పరిపూర్ణుడవ్వాలనుకునే ఒక వ్యక్తి ముఖ్యంగా తాను అన్వేషించేదాని మీద ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని ప్రేమించి, సత్యాన్ని అనుసరించి నడుచుకునే ప్రజలు ఖచ్చితంగా పరిపూర్ణులవుతారు. సత్యాన్ని ప్రేమించని ప్రజలు దేవుని చేత మెప్పించబడరు; వారు దేవుడు మెచ్చుకునే జీవితాన్ని కలిగియుండరు, మరియు వారు పరిపూర్ణులవ్వలేరు. పరిపూర్ణము చేయు కార్యము కేవలము ప్రజలను సంపాదించుకొనుటకు మాత్రమే, ఇది సాతాను పోరాటము చేసే కార్యములో భాగము కాదు; జయించు కార్యము అనేది కేవలము సాతానుతో పోరాటము చేయుట కొరకే, అంటే సాతానును ఓడించడానికి మనిషి జయాన్ని ఉపయోగించడం అని అర్థం. ప్రజలను పరిపూర్ణము చేసే కార్యము అంటే, ఇది క్రొత్త కార్యము కాదు. శరీరములో జరిగే దేవుని కార్యములో పనుల లక్ష్యం యొక్క సారాంశము ప్రజలు జయించబడడమే. ఇది కృపా యుగములో సిలువ కార్యము ద్వారా సమస్త మానవాళి అందరి కొరకు జరిగించబడిన విమోచన కార్యమువలె ఉంటుంది. “ప్రజలను సంపాదించడం” అనే మాట శరీరములో జరిగే కార్యానికి అదనంగా చేర్చబడింది, సిలువకు వేసిన తరువాత మాత్రమే జరిగింది. యేసు వచ్చి, ఆయన కార్యమును జరిగించినప్పుడు, ఆయన తన మరణాన్ని ఉపయోగించడానికి గల ముఖ్య గురి ఏమనగా పాతాళ మరణ బంధకాల మీద విజయభేరిని మోగించడం, సాతాను ప్రభావము మీద విజయము సాధించడం, అంటే సాతానును ఓడించడమే ముఖ్యమైన గురిగా ఉంటుంది. యేసు సిలువ మరణం పొందిన తరువాత మాత్రమే పేతురు పరిపూర్ణమైన మార్గములో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రారంభించాడు. యేసు కార్యము చేస్తున్నప్పుడు యేసును అనుసరించినవారిలో పేతురు కూడా ఉన్నాడు, అయితే ఇతను ఆ సమయములో పరిపూర్ణుడైయుండలేదు. యేసు తన కార్యమును చేసి ముగించిన తరువాత, పేతురు క్రమేపి సత్యాన్ని అర్థము చేసుకున్నాడు, ఆ తరువాత పరిపూర్ణుడయ్యాడు. దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి, అతి తక్కువ సమయములో చాలా ప్రాముఖ్యమైన కార్యములోని ముఖ్యమైన ఘట్టాన్ని సంపూర్తి చేయడానికి మాత్రమే వచ్చాడు గానీ ప్రజలను పూర్తి స్థాయిలో పరిపూర్ణులనుగా చేయాలనే ఉద్దేశముతో భూమి మీద ఉన్నటువంటి ప్రజల మధ్యన ఎక్కువ కాలం ఉండాలనుకోలేదు. ఆయన ఆ కార్యాన్ని చేయలేదు. ఆయన తన కార్యమును జరిగించుటతో పాటు మనిషి సంపూర్తిగా పరిపూర్ణుడయ్యే వరకు ఆయన వేచి ఉండలేదు. ఆయన శరీరధారిగా రావడానికి గల ముఖ్యమైన ప్రాముఖ్యత మరియు లక్ష్యం ఇది కాదు. తక్కువ సమయములో మనుష్యులను రక్షించడానికే ఆయన వచ్చాడు, మానవాళిని పరిపూర్ణులుగా చేయడానికి ఎక్కువ కాలము జీవించుటకు రాలేదు. మనుష్యులను రక్షించే కార్యము అంటే ప్రాతినిధ్యం వహించడం మరియు క్రొత్త యుగానికి నాంది పలకడం. ఇది అతి తక్కువ సమయములోనే చేసి ముగించవచ్చు. అయితే, మనుష్యులను పరిపూర్ణులనుగా చేయడానికి మనిషిని ఒక నిర్దిష్టమైన స్థాయికి తీసుకురావలసిన అవసరత ఉంది; అటువంటి కార్యము ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఈ కార్యము దేవుని ఆత్మ ద్వారానే జరిగించబడినప్పటికీ, శరీరధారిగా ఉన్నప్పుడు జరిగించబడిన కార్యములో మాట్లాడిన సత్య పునాది మీదనే అది జరిగించబడుతుంది. మానవాళిని పరిపూర్ణులనుగా చేయాలనే ఆయన గురిని సాధించడానికి ఎక్కువ కాలము కాపరి పరిచర్యను చేయడానికి ఆయన లేపిన అపొస్తులల ద్వారా జరుగుతుంది. ఈ కార్యమును జరిగించడానికి దేవుడు శరీరధారిగా రాలేదు. ఆయన కేవలం జీవన విధానమును గూర్చి మాట్లాడియున్నాడు, ఆ మాటలను ప్రజలు అర్థము చేసుకోవాలి, మరియు ఆయన మానవాళికి కేవలం సత్యాన్ని మాత్రమే అందించాడు, సత్యాన్ని అనుసరించడములో నిరంతరము మనిషితో ఉండలేదు, ఎందుకంటే అది ఆయన పరిచర్యలో భాగమైయుండలేదు. అందుచేత, మనిషి సత్యాన్ని పూర్తిగా అర్థము చేసుకొని, సత్యాన్ని పూర్తిగా పొందుకొనే రోజువరకు ఆయన మనిషితో ఉండలేదు. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసముంచే సరియైన మార్గములో ప్రవేశించినప్పుడు, పరిపూర్ణులయ్యే మార్గమునందు ప్రవేశించినప్పుడు ఆయన శరీరధారిగా వచ్చి చేసిన కార్యము ముగించబడుతుంది. ఇది ఆయన పూర్తిగా సాతానును ఓడించి, లోకమును జయించినప్పుడే ముగించబడింది. ఆ సమయములో మనిషి సత్యములోనికి ప్రవేశించాడో లేదో అనే విషయాన్నిఆయన పట్టించుకోలేదు, లేక మనిషి జీవితము గోప్పదనో లేక చిన్నదనో విషయాన్నీ కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వాటిని పట్టించుకోలేదు; శరీరధారిగా వచ్చిన దేవుని పరిచర్యలో అవేమి లేవు. ఆయన ఉద్దేశించిన కార్యము ముగించబడిన వెంటనే, శరీరధారిగా ఆయన చేయడానికి వచ్చిన కార్యాన్ని చేసి ముగించాడు. అందుచేత, శరీరధారిగా వచ్చిన దేవుని కార్యము దేవుని ఆత్మ నేరుగా చేయలేని కార్యమైయుండెను. అంతేగాకుండా, చాలా తక్కువ సమయములో జరిగే రక్షణ కార్యమైయుండెను గానీ ఎక్కువ కాలము ఆయన ఈ భూమి మీద జరిగించే కార్యము కాదు.

మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది నేను జరిగించు కార్యములో లేదు. మీ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నందునే దీనిని చేయాలని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. సత్యమునందు, పరిపూర్ణులనుగా చేసే కార్యములో ఇది భాగము కాదు; మీ మీద అదనంగా జరిగించబడిన కార్యమైయున్నది. ఈ రోజున మీలో జరిగించబడిన కార్యము మీ అవసరతనుబట్టే జరిగించబడింది. ఇది వ్యక్తిగతమైనది మరియు పరిపూర్ణులైన ప్రతి వ్యక్తి ద్వారా ప్రవేశించాలనే మార్గము కాదు. ఎందుకంటే, మీ సామర్థ్యమనేది గతములో పరిపూర్ణులైనవారికున్న దానికంటే చాలా తక్కువ ఉంది. ఈ కార్యము మీలో జరిగించబడినప్పుడు ఎన్నో అడ్డంకులు ఉండేవి. ఈ అదనపు కార్యము జరిగేటప్పుడు నేను మీ మధ్యనే ఉన్నాను, ఎందుకంటే పరిపూర్ణత లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రాముఖ్యంగా, దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన తన పరిధిలోనే ఉండి, తన కార్యమును చేశాడు, ఆయనకు సంబంధము లేనటువంటి విషయాలను గూర్చి బాధపడలేదు. ఆయన కుటుంబ విషయాలలో జోక్యం చేసుకోలేదు లేక ప్రజల జీవితాలలో జోక్యం చేసుకోలేదు. ఆయన ఇటువంటి అల్పమైన విషయాలను పూర్తిగా పట్టించుకోలేదు; ఇవన్ని ఆయన పరిచర్యలో భాగము కాదు. అయితే, మీ సామర్థ్యము నేను కోరుకొనుచున్నదానికంటే చాలా తక్కువ–వాస్తవానికి, ఎటువంటి పోలిక ఉండదు–ఇది చేయబోయే కార్యానికి ఎక్కువ అడ్డంకులను కలిగిస్తుంది. అంతేగాకుండా, ఈ కార్యము ఈ చైనా దేశములోని ప్రజల మధ్యన జరిగించబడాలి. మీరు అల్ప విద్యావంతులుగా ఉన్నారు, నేను మాట్లాడడం తప్ప, మీకు మీరే చదువుకొని ప్రయోజకులవ్వమని చెప్పడం తప్ప మరొక అవకాశం నాకు లేదు. ఇది అదనపు కార్యమని మీకు నేను చెప్పాను గానీ దీనిని కూడా మీరు సంపాదించుకోవలసిన విషయమైయున్నది, మీరు పరిపూర్ణులవడానికి ఎంతో సహకరిస్తుంది. వాస్తవానికి, విద్య, స్వంత ప్రవర్తనను గూర్చిన ప్రాథమిక అవగాహన, మరియు జీవితమును గూర్చిన ప్రాథమిక అవగాహన అనేవి మీరు స్వాభావికముగానే సంపాదించుకోవలసిన విషయాలు; ఈ విషయాలన్నిటి గూర్చి నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే, ఇవన్నిటిని మీరు కలిగిలేనందున, ఈ లోకములో మీరు జన్మించినందున మీలో వీటినన్నిటిని నింపే పని చేయడం తప్ప నాకు వేరొక మార్గం లేదు. మీరు నా గురించి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, దీన్ని మీయందు చేయాలని కోరుకుంటున్నాను–మీ సామర్థ్యమును పెంచుకోవాలని ఇంకను నేను ఆశిస్తున్నాను. నేను వచ్చి, ఈ పని చేయడం నా ఆలోచన కాదు, ఎందుకంటే నా పని మిమ్మల్ని జయించడం మాత్రమే, మీకు తీర్పు తీర్చుటచేత మిమ్మల్ని సంపూర్ణముగా ఒప్పించడమే నా పని. తద్వారా, మీరు ప్రవేశించవలసిన జీవన విధానము మీకు తెలియపరుస్తాను. ఈ విషయాన్ని మరొక విధంగా చెప్పాలంటే, మీరు ఎంతటి విద్యావంతులైనప్పటికీ, జీవితాన్ని గూర్చి ఎంతటి జ్ఞానాన్ని పొందుకున్నవారైనప్పటికీ నాతో కలిసి చేయడానికి ఏమీ ఉండదు, నా మాటతో మిమ్మల్ని జయించాల్సిన అవసరం లేదు. జయించు కార్యములో సాధించే ఫలితాలను నిశ్చయము చేసుకోవడానికి మరియు ఆ తదుపరి కలిగే మీ పరిపూర్ణత కొరకే ఈ విషయాలన్నీ అదనంగా చేర్చబడ్డాయి. ఇదంతా జయించు కార్యములో భాగము కాదు. ఎందుకంటే, మీకు చాలా తక్కువ సామర్థ్యము ఉంది మరియు మీరు సోమరులుగా ఉన్నారు మరియు మీరు నిర్లక్ష్యం చేయుచున్నారు, మూర్ఖంగా ఉన్నారు మరియు నిదానంగా ఉన్నారు, భావాలు లేనివారుగాను మరియు తెలివిలేనివారుగాను ఉన్నారు–ఎందుకంటే, మీరు సాధారణ స్థితికి భిన్నంగా ఉన్నారు–అందుచేత, మీరు మొట్ట మొదటిగా మీకున్న సామర్థ్యాన్ని పెంచుకోవాలని నేను కోరుచున్నాను. పరిపూర్ణులవ్వాలని కోరుకొనేవారందరూ తప్పనిసరిగా నిర్దిష్టమైన ప్రమాణాలను ఎదుర్కోవాలి. పరిపూర్ణులవడానికి, తప్పకుండ స్పష్టమైన మరియు స్థిర మనస్సును కలిగి, అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. మీలో ఎవరైనా పనికిమాలిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడకుండా, సత్యాన్ని అన్వేషించడానికి ఇష్టపడినట్లయితే, వారు చేసే ప్రతిదానిలో గంభీరంగా ఉన్నట్లయితే, ఎవరైనా ప్రత్యేకించి సాధారణ మనుష్య తత్వాన్ని కలిగియున్నట్లయితే, పరిపూర్ణులవడానికి తప్పకుండా మీరు కొన్ని షరత్తులను పాటించాలి.

మీ మధ్యన ఎటువంటి పని జరిగించబడాలనే దానిని బట్టి మీ మధ్యన జరుగుచున్న కార్యము నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ మనుష్యులందరినీ జయించిన తరువాత కొంతమంది మాత్రమే పరిపూర్ణులవుతారు. అందుచేత, ప్రస్తుతం ఎక్కువ కార్యము కూడా మిమ్మల్ని పరిపూర్ణులనుగా చేయాలనే లక్ష్యం కొరకు సిద్ధపాటు చేయుటలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే, అనేకమంది సత్యము కొరకు ఆకలిదప్పులు కలిగియున్నారు, వీరు పరిపూర్ణులవ్వగలరు. జయించు కార్యము మీ మీద నిర్వహించబడకపోయినట్లయితే, ఆ తదుపరి జరిగే ఎటువంటి కార్యము జరగలేదని అర్థం, అప్పుడు సత్యము కొరకు ఆరాటపడే కొందరు దాన్ని పొందుకోలేదనే పరిస్థితి ఏర్పడదా? ప్రస్తుతం జరుగుచున్న కార్యము తరువాత ప్రజలను పరిపూర్ణులనుగా చేయుటకు మార్గాన్ని తెరవడానికి గురిని కలిగి ఉంటుంది. నా పని కేవలం జయించు కార్యమైనప్పటికీ, నేను మాట్లాడే జీవన విధానము తరువాత ప్రజలను పరిపూర్ణులనుగా చేయడానికి సిద్ధముగా ఉంటుంది. జయించిన తరువాత వచ్చే కార్యము ప్రజలను పరిపూర్ణులనుగా చేయుట మీద కేంద్రీకరిస్తుంది, మరియు పరిపూర్ణులనుగా చేసే కార్యము కొరకు పునాది వేసే క్రమములో జయించడం అనేది జరిగి ఉంటుంది. జయించిన తరువాతే మనిషి పరిపూర్ణుడు కాగలడు. ఇప్పుడే ముఖ్యమైన పనిని జయించాలి; ఆ తరువాత, సత్యమును వెదకుతూ, దాని కొరకు ఆశను కలిగి ఉంటారో వారు పరిపూర్ణులవుతారు. పరిపూర్ణత చెందడానికి ప్రవేశానికి సంబంధించిన ప్రజల క్రియాశీల అంశాలను కలిగి ఉంటుంది: నీకు దేవుని ప్రేమించే హృదయం ఉందా? సత్యాన్ని అనుకరించే విషయములో ఎంత మట్టుకు నిబద్ధత కలిగియున్నావు? పరిపూర్ణులవడానికి మానవ జీవితములోని ప్రతి కోణములో ప్రాథమిక జ్ఞానాన్ని కలిగియుండాలి. ఇదే కావలసిన ముఖ్య ఆధారము. జయించిన తరువాత పరిపూర్ణులవ్వనివారు సేవ చేసే సాధనాలుగా మిగిలిపోతారు మరియు అంతిమంగా వారు అగ్ని గంధకాల గుండములోనికి పడవేయబడతారు, అగాధ కూపములోనికి నెట్టబడతారు, ఎందుకంటే మీ స్వభావము మారలేదు, మీరు ఇంకా సాతానుకు సంబంధించినవారు. ఒక మనిషి పరిపూర్ణత చెందుట కొరకు తగిన షరత్తులను పాటించకపోతే, అప్పుడు అతడు ఉపయోగములేనివాడు, అంటే అతను వ్యర్థుడు, ఒక ఉపకరణం, అగ్ని పరీక్షలో నిలవలేనివాడు మాత్రమ! ఇప్పుడు నీకున్న దేవుని ప్రేమ ఎంత గొప్పది? మీ విషయమై మీకున్న అసహ్యత ఎంత గొప్పది? నీవు సాతానుడి గురించి ఎంత లోతుగా తెలుసుకున్నావు? మీ సంకల్పాన్ని మీరు బలపరచుకున్నారా? మీ మనుష్యతత్వములో మీ జీవితము మంచిగా నియంత్రించబడిందా? మీ జీవితము మారిందా? మీరు క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నారా? మీ జీవితము మారినట్లుగా కనబడుతోందా? ఇవన్ని మారకపోయినా, వీటిని వదులుకోకపోయినా మీరు పరిపూర్ణులు కాలేరు; అందుచేత, నీవు కేవలం జయించబడ్డావు. నిన్ను పరీక్షించే సమయము వచ్చినప్పుడు, నీకు సత్యము కొరవడి ఉంటుంది, మీ మానవత్వము అదో మాదిరి విచిత్రంగా ఉంటుంది మరియు నీవు క్రూరమైన మృగముకంటే నీచంగా ఉంటావు. నీ సాధన అంతా కేవలం జయించబడడముగామే ఉంటుంది, అంటే నేను జయించిన వస్తువుగానే నీవు ఉంటావు. ఒకసారి యజమాని కొరడా దెబ్బ అనుభవించిన గాడిద ఆ తరువాత యజమానిని చూసిన ప్రతిసారి ఎంతో భయంగా ఉన్నట్లుగానే, నీవు కూడా ఆ జయించబడిన ఆ గాడిదలా మాత్రమే ఉండిపోతావు. ఒక వ్యక్తికి అటువంటి సానుకూల విషయాలు కొరవడితే, భయంగానో, పిరికివాడిగానో, అన్ని విషయాల్లో సంకోచపడే వ్యక్తిగానో, ఏదైనా స్పష్టంగా వివేచించలేని స్థితిలోనో, సత్యాన్ని అంగీకరించని వ్యక్తిగానో, ఆచరించే మార్గము లేని వ్యక్తిగానో ఉండిపోతాడు. వాటన్నింటికి అతీతంగా దేవుణ్ణి ప్రేమించే హృదయం లేకుండా, అంటే ఒక వ్యక్తికి దేవుణ్ణి ఎలా ప్రేమించాలనే అవగాహన లేకపోయినట్లయితే, అర్థవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలని తెలియకపోయినట్లయితే, లేక నిజమైన వ్యక్తిగా ఎలా ఉండాలో తెలియకపోయినట్లయితే అటువంటి వ్యక్తి దేవుని కొరకు సాక్ష్యాన్ని ఎలా కలిగియుండగలడు? ఇది మీ జీవితము తక్కువ విలువను కలిగియున్నదని మరియు మీరు జయించబడిన గాడిద అన్నట్లుగా చూపిస్తుంది. నువ్వు జయించిన వ్యక్తిగా ఉండవచ్చు, అయితే దాని అర్థం నువ్వు మహా ఘట సర్పమును త్యజించావని మరియు దాని అధికారమునకు లోబడుటకు తిరస్కరించావని అర్థం; అంటే, నీవు దేవుడున్నాడని నమ్ముతున్నావు, దేవుని ప్రణాళికలన్నిటికి విధేయత చూపుటకు ఇష్టపడుచున్నావు, మరియు నీకు ఎటువంటి ఫిర్యాదులు లేవని దాని అర్థం. అయితే, సానుకూల అంశాల విషయానికొచ్చినప్పుడు, నీవు దేవుని వాక్య ప్రకారముగా జీవిస్తున్నావా మరియు దేవుణ్ణి కనపరచుచున్నావా? నీవు ఇటువంటి అంశాలను కలిగియుండకపోతే, నువ్వు దేవుని ద్వారా సంపాదించబడిన వ్యక్తివి కాదని అర్థం. నువ్వు కేవలం జయించబడిన గాడిదవి మాత్రమే. ఆశించదగినది నీలో ఏమీ లేదు, పరిశుద్ధాత్ముడు నీయందు పనిచేయుటలేదు. నీకు మానవత్వం చాలా కొరవడింది; దేవుడు నిన్ను వాడుకోవడం అసాధ్యం. నీవు దేవునిచేత ఆమోదించబడాలి మరియు నమ్మని మృగాలకంటే, నడిచే శవాలకంటే నూరు రెట్లు ఎక్కువగా మారాలి, అంటే ఈ స్థాయిని ఎవరైతే చేరుకుంటారో, వారు మాత్రమే పరిపూర్ణులగుటకు అర్హతను కలిగియుంటారు. ఎవరైతే మానవత్వాన్ని మరియు ప్రజ్ఞను కలిగియుంటారో వారే దేవుని పనికి ఉపయోగపడతారు. మీరు పరిపూర్ణులైనప్పుడే మనిషిగా పరిగణించబడతారు. పరిపూర్ణులైన మనుష్యులు మాత్రమే అర్థవంతమైన జీవితాలు జీవించేవారుగా ఉంటారు. అటువంటి మనుష్యులు మాత్రమే దేవునికి మరింత గొప్పగా సాక్ష్యమివ్వగలరు.

మునుపటి:  పేర్లు మరియు గుర్తింపుకు సంబంధించిన విషయాలు

తరువాత:  మీరు హోదా ఆశీర్వాదాలను పక్కన పెట్టాలి మరియు మనిషికి మోక్షం ఇవ్వడానికి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger