దేవుని కార్యపు దర్శనం (3)

పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలోకి ప్రవేశించిన దేవుడు మొదటిసారిగా శరీరధారిగా మారాడు. దేవుడు తలపెట్టిన కార్యమునకు అదే తగినది కావడమే అందుకు కారణం. కృపా యుగము యేసు నామంతో ప్రారంభమైంది. యేసు తన పరిచర్యకు ఉపక్రమించిన సమయంలో, యేసు నామమునకు పరిశుద్ధాత్మ సాక్ష్యమివ్వడం ప్రారంభించాడు మరియు అటుపిమ్మట యెహోవా నామము ప్రస్తావించబడడము ఆగిపోపోయింది; దానికి బదులుగా, యేసు నామంతో కొత్త కార్యాన్ని పరిశుద్ధాత్మ ప్రధానంగా మొదలుపెట్టింది. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించారో, వారు ఆయన కోసం సాక్ష్యమిచ్చారు మరియు వారు చేసిన కార్యము సైతమూ యేసుక్రీస్తు కోసమే చేయబడింది. ధర్మశాస్త్ర యుగపు పాత నిబంధన ముగింపునకు రావడమంటే, ప్రధానంగా యెహోవా పేరుతో నిర్వహించబడిన కార్యము ముగిసిందని అర్థం. ఇటు తర్వాతి నుండి, యెహోవా అనేది దేవుడి నామం కాదు; దానికి బదులుగా ఆయన యేసు నామముతో పిలువబడ్డాడు మరియు ఇక్కడి నుండి పరిశుద్ధాత్మ ప్రధానంగా యేసు నామముతో కార్యాన్ని మొదలుపెట్టింది. అయినప్పటికీ, నేటికీ యెహోవా వాక్యములను తిని, సేవించే మరియు ఇంకనూ ధర్మశాస్త్ర యుగపు కార్యము ప్రకారమే ప్రతిదీ చేస్తున్నవారు ఉన్నారు—అంటే, నీవు నిబంధనలను గుడ్డిగా అనుసరించడం లేదా? మీరంతా గతంలో చిక్కుకుపోయినవారు కాదా? అంత్యకాలము సమీపించినదని మీకు తెలుసు! ఈ సమయంలో, యేసు వచ్చినప్పుడు, ఆయన ఇంకా యేసు అనే పిలువబడతాడా? మెస్సీయ వస్తాడని ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చెప్పాడు, అయితే ఆయన వచ్చినప్పుడు, ఆయనను మెస్సీయ అని కాకుండా యేసు అని పిలిచారు. తాను తిరిగి వస్తాననీ, వెళ్లిపోయిన విధంగానే తిరిగి వస్తాననీ యేసు చెప్పాడు. ఇవి యేసు చెప్పిన మాటలే, కానీ యేసు వెళ్ళిన మార్గాన్ని నీవు చూశావా? యేసు తెల్లటి మేఘంపై ఎక్కి వెళ్లిపోయాడు, కానీ ఆయన తెల్లటి మేఘంపై ఎక్కి, స్వయంగా మనుషుల మధ్యకు తిరిగి వస్తాడని అనుకోవచ్చా? అలా జరిగితే, అప్పటికీ ఆయనను యేసు అనే పిలుస్తారా? యేసు మళ్లీ తిరిగి వచ్చినప్పటికి, యుగము మారిపోయి ఉంటుంది, అలాంటప్పుడు ఇంకా ఆయనను యేసు అనే పిలవవచ్చా? దేవుడు అంటే, యేసు నామముతోనే గ్రహింపునకు రావాలా? కొత్త యుగములో ఆయనను కొత్త నామముతో పిలవకూడదా? ఒక వ్యక్తి స్వరూపం మరియు ఒక ప్రత్యేకమైన నామము సంపూర్ణంగా దేవుడికి ప్రాతినిధ్యం వహించగలదా? ప్రతి కాలములోనూ, దేవుడు కొత్త కార్యము చేస్తాడు మరియు కొత్త నామముతో పిలువబడతాడు; ఆయన వేరువేరు యుగాల్లోనూ ఒకే కార్యమును ఎలా చేయగలడు? ఆయన పాతదాన్నే పట్టుకొని వేలాడగలడా? విమోచన కార్యము కోసం యేసు నామము తీసుకోబడింది, అంతమాత్రాన, ఆయన అంత్యకాలములో తిరిగి వచ్చినప్పుడు కూడా అదే పేరుతోనే పిలువబడతాడా? ఆయన ఇప్పటికీ అదే విమోచన కార్యము చేస్తుంటాడా? యెహోవా మరియు యేసు ఒక్కరే అయినప్పటికీ, వారు వేరువేరు కాలాల్లో వేరువేరు నామములతో ఎందుకు పిలువబడ్డారు? అది వారి కార్యపు యుగాలు వేర్వేరుగా ఉండటం వల్ల కాదా? ఒకే నామము సంపూర్ణంగా దేవుడికి ప్రాతినిధ్యం వహించగలదా? కాబట్టే, భిన్న కాలాలలో దేవుడు భిన్న నామములతో తప్పక పిలవబడాలి. అలాగే, యుగాన్ని మార్చడానికి మరియు ఆ యుగాన్ని సూచించడానికి ఆయన తప్పక నామమును ఉపయోగించాలి. స్వయంగా ఏ ఒక్క నామమూ దేవుడిని సంపూర్ణంగా సూచించలేదు కాబట్టి ప్రతి నామము ఒక కాలములోని దేవుడి స్వభావపు తాత్కాలిక కోణాన్ని మాత్రమే సూచించగలదు; అంటే, నామము చేయవలసిందల్లా ఆయన కార్యమును సూచించడమే. కాబట్టి, మొత్తం యుగాన్ని సూచించేలా, తన స్వభావానికి తగిన ఏ నామమునైన దేవుడు ఎంచుకోగలడు. యెహోవా యుగం అయినప్పటికీ, యేసు యుగం అయినప్పటికీ, ప్రతి యుగం ఒక నామముతో సూచించబడుతుంది. కృపా యుగము ముగింపులో, అంత్య యుగము సమీపించింది, యేసు అప్పటికే వచ్చేశాడు. మరి, ఆయన యేసు అనే ఎలా పిలవబడగలడు? అప్పటికీ ఆయన మనుష్యుల మధ్య యేసు రూపంతోనే ఎలా ఉండగలడు? ఒక నజరేయుడి స్వరూపం కంటే యేసు ఎక్కువేమీ కాదని నీవు మరచిపోయావా? యేసు మానవాళికి విమోచకుడు మాత్రమేనని నీవు మరచిపోయావా? అంత్యకాలములో మనిషిని జయించి, పరిపూర్ణుడిగా చేసే కార్యమును ఆయన ఎలా చేపట్టగలడు? యేసు తెల్లటి మేఘంపై ఎక్కి వెళ్లిపోయాడు—ఇది వాస్తవం—కానీ ఆయన తెల్లటి మేఘంపై ఎక్కి మనుషుల మధ్యకు ఎలా తిరిగి రాగలడు మరియు యేసు అని ఎలా పిలవబడగలడు? ఆయన నిజంగా మేఘంపై ఎక్కి వచ్చినట్లయితే, మనిషి ఆయనను ఎందుకు గుర్తించలేదు? ప్రపంచవ్యాప్త ప్రజలు ఆయనను గుర్తించలేదా? అలాంటప్పుడు, దేవుడంటే యేసు మాత్రమేనా? అలాంటప్పుడు, దేవుని స్వరూపం యూదుడిగానే కనిపిస్తుంది మరియు ఎప్పటికీ అలాగే ఉంటుంది. తాను వస్తాననీ, వెళ్లిపోయిన రీతిలోనే తిరిగి వస్తాననీ యేసు చెప్పాడు, కానీ ఆయన మాటలకు నిజమైన అర్థం నీకు తెలుసా? ఆయన మీ ఈ సమూహానికి మాత్రమే ఆ మాట చెప్పాడని అనుకోవచ్చా? ఆయన మేఘంపై ఎక్కి ఎలా వెళ్లిపోయాడో అలాగే తిరిగి వస్తాడని మాత్రమే నీకు తెలుసు, కానీ దేవుడు తన కార్యమును ఎలా చేస్తాడో నీకు ఖచ్చితంగా తెలుసా? నీవు నిజంగా చూడగలిగితే, యేసు మాట్లాడిన మాటలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసా? ఆయన ఇలా చెప్పాడు: అంత్యకాలములో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, ఆ విషయం ఆయనకే తెలియదు, దేవదూతలకూ తెలియదు, పరలోకంలోని దూతలకూ తెలియదు మరియు సమస్త మానవాళికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుస్తుంది, అనగా, ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. స్వయంగా మనుష్య కుమారుడికి కూడా తెలియదు, అలాంటప్పుడు నీవు మాత్రం చూడగలవా మరియు తెలుసుకోవగలవా? నీవు స్వయంగా తెలుసుకోగలిగే, నీ కండ్లతో చూడగలిగే సామర్థ్యం ఉంటే, ఈ మాటలు చెప్పడం వృథాయే కదా? ఆసమయంలో యేసు ఏమి చెప్పాడు? “అయితే ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. … మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” ఆ రోజు వచ్చినప్పుడు, స్వయంగా మనుష్య కుమారుడికే తెలియదు. మనుష్య కుమారుడు ఒక మామూలు మరియు సాధారణ వ్యక్తిలాగా దేవుడి శరీర అవతారాన్ని సూచిస్తాడు. స్వయంగా మనుష్య కుమారుడికే తెలియనప్పుడు, నీవు ఎలా తెలుసుకోగలవు? తాను వెళ్లిపోయినట్టే తిరిగి వస్తానని యేసు చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు, స్వయంగా ఆయనకు కూడా తెలియదు, మరి, ఆయన నీకు ముందుగానే ఆ సంగతి తెలుపగలడా? నీవు ఆయన రాకను చూడగలవా? అది ఒక పరిహాసం కాదా? దేవుడు భూమిపైకి వచ్చినప్పుడల్లా, ఆయన తన నామము, తన లింగం, తన స్వరూపం మరియు తన కార్యమును మారుస్తాడు; ఆయన తన కార్యమును పునరావృతం చేయడు. ఆయన నిత్య నూతనుడు మరియు ఎన్నటికీ పాతబడని దేవుడు. ఆయన ఇంతకు ముందు వచ్చినప్పుడు, ఆయనను యేసు అని పిలిచారు; ఈసారి మళ్లీ వచ్చినప్పుడు ఆయనను ఇంకా యేసు అనే పిలుస్తారా? ఆయన ఇంతకు ముందు వచ్చినప్పుడు, ఆయన పురుషుడు; ఈసారి కూడా మళ్లీ ఆయన పురుషుడుగానే ఉంటాడా? ఆయన కృపా యుగములో వచ్చినప్పుడు ఆయన కార్యము సిలువనెక్కడం; ఆయన మళ్లీ వచ్చినప్పుడు, అప్పుడు కూడా మానవజాతిని పాపం నుండి విమోచించే పనే చేస్తాడా? ఆయన మళ్లీ సిలువనెక్కుతాడా? అది ఆయన కార్యమును పునరావృతం చేయడం అవ్వదా? దేవుడు నిత్య నూతనుడు మరియు ఎన్నటికీ పాతబడనివాడని నీకు తెలుసు కదా? దేవుడు మార్పుచెందని వాడని అనేవారు కూడా ఉన్నారు. అది నిజమే, కానీ దేవుడి స్వభావంలో మరియు ఆయన గుణగణాలలో మార్పులేకపోవడాన్ని అది ప్రస్తావిస్తుంది. ఆయన నామము మరియు కార్యములో మార్పులనేవి ఆయన గుణగణాలు మారాయని చెప్పే రుజువు కాదు; మరో మాటలో చెప్పాలంటే, దేవుడు ఎల్లప్పుడూ దేవుడే, అది ఎప్పటికీ మారదు. దేవుడి కార్యము మారేది కాదని నీవంటే, ఆయన తన ఆరువేల యేండ్ల నిర్వహణ ప్రణాళికను పూర్తి చేయగలడా? దేవుడు నిరంతరం మారనివాడని మాత్రమే నీకు తెలుసు, కానీ దేవుడు నిత్య నూతనుడు మరియు ఎన్నటికీ పాతబడనివాడని నీకు తెలుసా? దేవుడి కార్యము మారనిదైతే, ఆయన నేటివరకు ఇంతదూరం మానవాళిని నడిపించగలిగేవాడా? దేవుడు మారలేనివాడైతే, ఆయన ఇప్పటికే రెండు కాలాల కార్యమును ఎందుకు చేశాడు? ఆయన కార్యము ఎప్పుడూ ముందుకు కొనసాగకుండా ఆగదు, అంటే ఆయన స్వభావం మనిషికి మెల్లమెల్లగా బహిర్గతం చేయబడుతుందని మరియు బహిర్గతం చేసినది ఆయన సహజ స్వాభావం అని అర్థం. మొదట్లో, దేవుడి స్వభావం మనిషికి కనిపించకుండా ఉంచబడేది, ఆయన బహిరంగంగా తన స్వభావాన్ని మనిషికి ఎన్నడూ బయలుపరచలేదు, మనిషికి ఆయన గురించి అసలు తెలియదు. దీని వలన, ఆయన తన స్వభావాన్ని మెలమెల్లగా మనిషికి బహిర్గతం చేయడానికి తన కార్యాన్ని ఉపయోగిస్తాడు, కానీ ఈవిధంగా పని చేయడమంటే, ప్రతి యుగంలో దేవుడి స్వభావం మారుతుందని కాదు. దేవుడి చిత్తం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి, దేవుడి స్వభావం కూడా నిరంతరంగా మారుతూ ఉంటుందని కాదు. అలా కాకుండా, ఆయన కార్యపు యుగాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి, మనిషి ఆయనను తెలుసుకోగలిగేలా, దేవుడు తన సహజ స్వభావాన్ని సంపూర్ణతతో తీసుకుంటాడు మరియు దానిని అంచెలంచెలుగా మనిషికి బహిర్గతం చేస్తాడు. అయితే, దేవుడికి అసలుకు ప్రత్యేకమైన స్వభావం లేదని లేదా కాలాలు గడిచేకొద్దీ ఆయన స్వభావం క్రమక్రమంగా మారిందనడానికి ఇది ఏ రకంగానూ రుజువు కాదు—అలాంటి అవగాహన పొరపాటైనది. దేవుడు కాలానుగుణంగా తన సహజ మరియు ప్రత్యేకమైన స్వభావాన్ని—ఆయన అంటే ఏమిటో—మనిషికి బహిర్గతం చేస్తాడు; కేవలం ఒక కాలపు కార్యము దేవుడి సంపూర్ణ స్వభావాన్ని వ్యక్తపరచదు. కాబట్టి, “దేవుడు నిత్య నూతనుడు మరియు ఎన్నటికీ పాతబడనివాడు” అనే మాటలు ఆయన కార్యమును సూచిస్తాయి మరియు “దేవుడు మార్పులేనివాడు” అనే మాటలు దేవుడు గురించి సహజంగా వినిపించేవి మరియు ఆయన ఏమిటో సూచిస్తాయి. ఏదేమైనా, నీవు ఆరు వేల యేండ్ల కార్యాన్ని ఒకే ఆధారంపై ఉంచలేవు లేదా దానిని మృత పదాలతో పరిమిత పర్చలేవు. అది మానవుని మూర్ఖత్వం మాత్రమే. మనిషి ఊహించినంత సరళంగా దేవుడు లేడు మరియు ఆయన కార్యము ఏ ఒక్క యుగాన్నీ పట్టుకొని ఉండలేదు. ఉదాహరణకు, యెహోవా ఎల్లప్పుడూ దేవుడి నామమునకు ప్రాతినిధ్యం వహించలేడు; దేవుడు తన కార్యమును యేసు నామముతో కూడా చేయగలడు. దేవుడి కార్యము ఎల్లప్పుడూ పురోగామి దిశలోనే కొనసాగుతుందనడానికి ఇది ఒక సంకేతం.

దేవుడు ఎల్లప్పుడూ దేవుడే, ఆయన ఎన్నటికీ సాతానుగా మారడు; సాతాను ఎల్లప్పుడూ సాతానే, అది ఎన్నటికీ దేవుడు కాలేదు. దేవుడి జ్ఞానం, దేవుడి అద్భుతత్వం, దేవుడి నీతిబద్ధత మరియు దేవుడి మహత్యం ఎన్నటికీ మారవు. ఆయన గుణగణాలు మరియు ఆయన వద్ద ఉన్నది, ఆయన సహజ స్వభావం ఎన్నటికీ మారవు. అయితే, ఆయన కార్యము విషయానికొస్తే, అది ఎల్లప్పుడూ ముందుకే పురోగమిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ మరింత లోతుకు వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నిత్య నూతనుడు మరియు ఎన్నడూ పాతబడనివాడు. ప్రతి యుగములో దేవుడు ఒక కొత్త నామమును తీసుకుంటాడు, ప్రతి యుగములో ఆయన కొత్త కార్యమును చేస్తాడు మరియు ప్రతి యుగములో తన కొత్త చిత్తం మరియు కొత్త స్వభావాన్ని తాను సృష్టించిన జీవులు చూసేందుకు ఆయన వీలుకల్పిస్తాడు. ఒక కొత్త యుగములో, ప్రజలు దేవుడి కొత్త స్వభావపు వ్యక్తీకరణను చూడలేకపోతే, వారు ఆయనను శాశ్వతంగా సిలువ మీద మేకులతో కొట్టేయరా? అలా చేయడంతోనే వారు దేవుడిని నిర్వచించరా? దేవుడు కేవలం పురుషుడిగా మాత్రమే దేహధారియై అవతరిస్తే, ప్రజలు ఆయనను పురుషుడిగానే నిర్వచిస్తారు, అంటే, పురుషుల దేవుడిగా నిర్వచిస్తారు మరియు ఆయనను స్త్రీల దేవుడిగా ఎప్పటికీ విశ్వసించరు. అప్పుడు పురుషులు దేవుడిని తమతో సమానమైన లింగమని, అంటే, దేవుడు పురుషులకు అధిపతి అని భావిస్తారు—అలాంటప్పుడు స్త్రీల సంగతేమిటి? అది అన్యాయం; అది ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారంగా మారదా? అదే నిజమైతే, దేవుడు రక్షించిన వారందరూ ఆయనలాగే పురుషులై ఉంటారు, ఒక్క స్త్రీ కూడా రక్షించబడదు. దేవుడు మానవజాతిని సృష్టించినప్పుడు, ఆయన ఆదాము మరియు హవ్వలను సృష్టించాడు. ఆయన ఆదామును సృష్టించడమే కాకుండా, స్త్రీపురుషులిద్దరినీ తన స్వరూపంలో తయారు చేశాడు. దేవుడు పురుషులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన స్త్రీలకు కూడా దేవుడే. అంత్యకాలములో దేవుడు కార్యపు కొత్త దశలో ప్రవేశిస్తాడు. ఆయన తన స్వభావాన్ని మరింతగా బహిర్గతము చేస్తాడు మరియు అది యేసు కాలములోని కనికరం మరియు ప్రేమ అయి ఉండదు. ఆయన చేతిలో కొత్త కార్యము ఉన్నందున, ఈ కొత్త కార్యము కొత్త స్వభావంతో కూడినదై ఉంటుంది. కాబట్టి, ఈ కార్యము ఆత్మ ద్వారా జరిగి ఉంటే—దేవుడు దేహ రూపముగా మారనట్లయితే, దానికి బదులుగా మనిషికి ఆయనతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా ఆత్మ ఉరుము ద్వారా నేరుగా మాట్లాడితే, మనిషి ఆయన స్వభావాన్ని తెలుసుకోగలడా? కార్యమును చేసింది ఆత్మ మాత్రమే అయితే, అప్పుడు దేవుడి స్వభావాన్ని తెలుసుకోవడానికి మనిషికి ఏ మార్గమూ ఉండేది కాదు. దేవుడు దేహధారిగా మారినప్పుడే, వాక్యము దేహములో కనిపించినప్పుడే మరియు ఆయన తన సంపూర్ణ స్వభావాన్ని దేహం ద్వారా వ్యక్తపరచినప్పుడే, ప్రజలు దేవుడి స్వభావాన్ని తమ సొంత కండ్లతో చూడగలరు. దేవుడు యథార్థంగా మరియు నిజంగా మనుషుల మధ్య జీవిస్తాడు. ఆయన ప్రత్యక్షంగా కనిపించదగినవాడు; నిజానికి, అప్పుడే మనిషి ఆయన స్వభావంతో వ్యవహరించగలడు, ఆయన వద్ద ఉన్న మరియు ఆయన సహజ స్వభావంతో వ్యవహరించగలడు; ఈవిధంగా మాత్రమే మనిషి నిజంగా ఆయనను తెలుసుకోగలడు. అదే సమయంలో, “దేవుడు పురుషులకూ దేవుడు మరియు స్త్రీలకూ దేవుడు” అనేదాన్ని కలిగివున్న కార్యమును కూడా దేవుడు పూర్తి చేశాడు మరియు దేహ రూపములో తన సమస్త కార్యాన్ని పూర్తి చేశాడు. ఆయన ఏ కాలములోనూ కార్యాన్ని నకలు చేయడు. అంత్యకాలము వచ్చేసింది కాబట్టి, ఆయన అంత్యకాలములో తాను చేసే కార్యమును చేస్తాడు మరియు అంత్యకాలములో తన సంపూర్ణ స్వభావాన్ని బహిర్గతము చేస్తాడు. అంత్యకాలము గురించి మాట్లాడేటప్పుడు, అది ఒక ప్రత్యేక కాలాన్ని ప్రస్తావిస్తుంది, అందులో మీరు తప్పక విపత్తు, భూకంపాలు, కరువులు మరియు ప్లేగులు ఎదుర్కొంటారని యేసు చెప్పినది ఉంటుంది, అది కొత్త కాలమని మరియు ఇకపై పాత కృపా యుగము లేదని చూపిస్తుంది. ప్రజలు చెప్పినట్లు, దేవుడు ఎన్నటికీ మారనివాడనీ, ఆయన స్వభావం ఎల్లప్పుడూ కనికరం మరియు ప్రేమేననీ, ఆయన తననుతాను ప్రేమించుకున్నట్టే మనిషిని కూడా ప్రేమిస్తాడనీ మరియు ప్రతి మనిషికి ఆయన రక్షణ కల్పిస్తాడనీ మరియు మనిషిని ఎప్పుడూ ద్వేషించడనీ అనుకుంటే, ఆయన కార్యము ఎప్పటికైనా ముగియగలదా? యేసు వచ్చి సిలువ వేయబడినప్పుడు, సమస్త పాపుల కోసం తనను తాను బలి ఇచ్చి, స్వయంగా బలిపీఠంపై అర్పించుకున్నప్పుడు, ఆయన అప్పటికే విమోచన కార్యమును పూర్తి చేశాడు మరియు కృపా యుగమును ముగించాడు. కాబట్టి, అంత్యకాలములోనూ అదే కాలపు కార్యాన్ని తిరిగి చేయడంలో అర్థం ఏముంటుంది? చేసిన కార్యమునే చేయడం అంటే యేసు కార్యమును నిరాకరించడం కాదా? దేవుడు ఈ దశలోకి వచ్చినప్పుడు సిలువ వేయించుకునే కార్యమును చేయకుండా, ప్రేమ మరియు కనికరంతోనే ఉండి ఉంటే, ఆయన ఈ యుగానికి ముగింపు పలకగలిగేవాడా? ప్రేమ మరియు కనికరం గల దేవుడు ఈ కాలానికి ముగింపు పలకగలిగేవాడా? ఈ కాలాన్ని ముగించే ఆయన అంతిమ కార్యములో, దేవుడి స్వభావం శిక్ష మరియు తీర్పుతో కూడినది, దీనిలో ప్రజలందరికీ బహిరంగంగా తీర్పునివ్వడానికి మరియు నిజాయితీ గల హృదయంతో తనను ప్రేమించే వారిని పరిపూర్ణులుగా చేయడానికి అవినీతినంతటినీ ఆయన బహిర్గతం చేస్తాడు. ఇలాంటి స్వభావం మాత్రమే ఈ కాలానికి ముగింపు పలకగలదు. అంత్యకాలము ఇప్పటికే వచ్చేసింది! సృష్టిలోని సమస్త జీవులు వాటి రకాన్ని బట్టి వేరు చేయబడతాయి మరియు వాటి స్వభావాన్ని బట్టి వివిధ వర్గాలుగా విభజించబడతాయి. దేవుడు మానవాళి ఫలితాన్ని మరియు వారి గమ్య స్థానాన్ని బహిర్గతం చేసే క్షణం ఇదే. ప్రజలు శిక్ష మరియు తీర్పుకు లోనుకాకపోతే, వారి అవిధేయత మరియు అవినీతిని బహిర్గతం చేసే మార్గమేదీ ఉండదు. శిక్ష మరియు తీర్పు ద్వారా మాత్రమే సమస్త సృష్టికి సంబంధించిన ఫలితం బహిర్గతమవుతుంది. శిక్షించబడినప్పుడు మరియు తీర్పు పొందినప్పుడు మాత్రమే మనిషి తన అసలు రంగులు బయటపెడుతాడు. చెడు చెడుతో, మంచి మంచితో చేర్చబడుతుంది మరియు సమస్త మానవాళి తమ రకాన్ని బట్టి వేరు చేయబడుతుంది. శిక్ష మరియు తీర్పు ద్వారా, సమస్త సృష్టికి సంబంధించిన ఫలితం బహిర్గతం చేయబడుతుంది, దీంతో చెడు శిక్షించబడవచ్చు మరియు మంచి ప్రతిఫలం పొందవచ్చు మరియు ప్రజలందరూ దేవుడి ఆధిపత్యానికి లోబడి ఉంటారు. ఈ కార్యమంతా తప్పక నీతిమంతమైన శిక్ష మరియు తీర్పు ద్వారా సాధించబడాలి. మనిషి చెడిపోవడం అనేది తారాస్థాయికి చేరుకుంది మరియు అతని అవిధేయత విపరీతమైన తీవ్రంగా మారింది కాబట్టి, ప్రధానంగా శిక్ష మరియు తీర్పుతో కూడిన మరియు అంత్యకాలములో బహిర్గతము చేయబడే దేవుడి నీతిమంతమైన స్వభావం మాత్రమే మనిషిని పూర్తిగా మార్చగలదు మరియు మనిషిని పరిపూర్ణం చేయగలదు. ఈ స్వభావం మాత్రమే చెడును బహిర్గతం చేయగలదు, ఆవిధంగా అవినీతిమంతులందరినీ తీవ్రంగా శిక్షించగలదు. కాబట్టి, ఇలాంటి స్వభావం కాల సంబంధిత ప్రాముఖ్యతతో నిండి ఉంటుంది మరియు ప్రతి కొత్త యుగపు కార్యము కోసం ఆయన స్వభావం ప్రత్యక్షం చేయబడుతుంది మరియు ప్రదర్శించబడుతుంది. అంటే, దేవుడు తన స్వభావాన్ని ఏకపక్షంగా మరియు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా బహిర్గతం చేస్తాడని కాదు. అంత్య కాలములో మనిషి ఫలితాన్ని బహిర్గతం చేయడంలో, దేవుడు ఇంకా మనిషిపై అపారమైన కనికరం మరియు ప్రేమను కురిపిస్తాడు మరియు మనిషి పట్ల ప్రేమను కొనసాగిస్తాడు, మనిషిని నీతిమంతమైన తీర్పునకు లోనుచేయడానికి బదులు రవ్వంత కూడా నీతిమంతమైన తీర్పు లేకుండా, అతని పట్ల సహనం, ఓర్పు మరియు దయ చూపిస్తాడు మరియు మనిషి పాపాలు ఎంత ఘోరమైనవైనా క్షమిస్తాడు అనుకుంటే: అప్పుడు దేవుడి నిర్వహణ యావత్తు ఎప్పుడు ముగుస్తుంది? అలాంటి స్వభావం, మానవాళి సముచిత గమ్య స్థానంలోకి మనుష్యులను ఎప్పుడు నడిపించగలదు? ఉదాహరణకు, ఎల్లప్పుడూ ప్రేమను చూపే న్యాయాధిపతి, దయగల ముఖం మరియు సున్నితమైన హృదయం గల న్యాయాధిపతిని తీసుకోండి. ఆయన వ్యక్తులు చేసిన నేరాలతో సంబంధం లేకుండా వారిని ప్రేమిస్తాడు మరియు వారు ఎవరైనప్పటికీ వారిని ఆయన ప్రేమిస్తాడు, వారితో ఓర్పుగా ఉంటాడని అనుకుంటే, అలాంటప్పుడు, ఆయన న్యాయమైన తీర్పును ఎప్పుడు ఇవ్వగలడు? అంత్యకాలము సమయంలో, నీతిమంతమైన తీర్పు మాత్రమే మనిషిని వారి రకాన్ని బట్టి వేరు చేసి, కొత్త రాజ్యంలోకి తీసుకురాగలదు. ఈవిధంగా, దేవుడి నీతిమంతమైన తీర్పు స్వభావము మరియు శిక్షల ద్వారా మొత్తం యుగము ముగించబడుతుంది.

దేవుడి నిర్వహణ యావత్తులో ఆయన కార్యము పూర్తి స్పష్టంగా ఉంది: కృపా యుగము కృపా యుగమే మరియు అంత్యకాలము అంత్యకాలమే. ప్రతీ కాలము మధ్య స్పష్టమైన తేడాలున్నాయి, ఎందుకంటే ఒక్కో యుగములో దేవుడు ఆ కాలానికి ప్రాతినిధ్యం వహించే కార్యము చేస్తాడు. అంత్యకాలపు కార్యము జరగడానికి, ఆ కాలాన్ని ముగించడానికి దహనం, తీర్పు, శిక్ష, ఉగ్రత మరియు విధ్వంసం తప్పక ఉండాలి. అంత్యకాలము అంతిమ కాలాన్ని సూచిస్తుంది. అంతిమ కాలము సమయంలో, దేవుడు ఆ కాలానికి ముగింపు పలకకుండా ఉంటాడా? కాలాన్ని ముగించడానికి, దేవుడు తనతో పాటు శిక్ష మరియు తీర్పు తప్పక తీసుకురావాలి. ఆవిధంగా మాత్రమే ఆయన ఆ కాలానికి ముగింపు పలకగలడు. యేసు ఉద్దేశం మనిషి మనుగడ కొనసాగేలా, జీవిస్తూ ఉండేలా మరియు అతడు మరింత మెరుగైన మార్గంలో కొనసాగేలా చేయడమే. మనిషి పతనంలోకి జారిపోకుండా మరియు ఇకపై పాతాళము, నరకంలో జీవించకుండా అతడిని పాపం నుండి ఆయన రక్షించాడు, మనిషిని పాతాళము మరియు నరకం నుండి రక్షించడం ద్వారా యేసు మనిషిని జీవిస్తూ ఉండేలా చేశాడు. ఇప్పుడు, అంత్యకాలము వచ్చేసింది. దేవుడు మానవుడిని నిర్మూలిస్తాడు మరియు మానవ జాతిని సమూలంగా నాశనం చేస్తాడు, అంటే, మానవజాతి తిరుగుబాటును ఆయన మారుస్తాడు. కాబట్టి, గతంలోని కనికరం మరియు ప్రేమతో కూడిన స్వభావంతో, ఈ కాలానికి ముగింపు పలకడం లేదా ఆరు వేల యేండ్ల నిర్వహణ ప్రణాళికను సఫలం చేయడం దేవుడికి అసాధ్యమవుతుంది. ప్రతి కాలము దేవుడి స్వభావపు ప్రత్యేక ప్రాతినిధ్యంతో ఉంటుంది మరియు ప్రతి కాలములో దేవుడు చేయవలసిన కార్యము ఉంటుంది. కాబట్టి, ప్రతి కాలములో స్వయంగా దేవుడు చేసే కార్యములో ఆయన నిజ స్వభావపు వ్యక్తీకరణ ఉంటుంది మరియు ఆయన నామము మరియు ఆయన చేసే కార్యము రెండూ కాలానుగుణంగా మారతాయి—అవన్నీ కొత్తవి అవుతాయి. ధర్మశాస్త్ర యుగములో, మానవాళికి మార్గం చూపించే కార్యము యెహోవా పేరు మీద జరిగింది మరియు భూమిపై మొదటి దశ కార్యము ప్రారంభించబడింది. ఈ దశలో, కార్యములో భాగంగా ఆలయం మరియు బలిపీఠం నిర్మించడం మరియు ఇశ్రాయేలు ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి న్యాయాన్ని ఉపయోగించడం మరియు వారి మధ్యలో పని చేయడం ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు మార్గనిర్దేశం చేయడం ద్వారా, భూమిపై తన కార్యము కోసం ఆయన ఒక పునాదిని ప్రారంభించాడు. ఆ పునాది నుండి, ఆయన ఇశ్రాయేలు దాటి తన కార్యాన్ని విస్తరించాడు, అంటే ఇశ్రాయేలు నుండి మొదలుపెట్టి, ఆయన తన కార్యాన్ని బయటికి విస్తరించాడు, తద్వారా తర్వాతి తరాలు క్రమంగా యెహోవా దేవుడని మరియు భూమ్యాకాశములు మరియు సమస్తాన్ని సృష్టించింది యెహోవాయే అని మరియు సమస్త జీవులను సృష్టించింది యెహోవాయే అని తెలుసుకునేలా చేశాడు. ఆయన తన కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజల ద్వారా వారిని దాటి వెలుపలికి విస్తరించాడు. భూమిపై యెహోవా కార్యానికి ఇశ్రాయేలు భూభాగం మొదటి పవిత్ర ప్రదేశం మరియు దేవుడు భూమిపై తన కార్యము చేయడానికి మొదటగా వెళ్లిన ప్రదేశం ఇశ్రాయేలే. అది ధర్మశాస్త్ర యుగములో జరిగిన కార్యము. కృపా యుగములో, మనిషిని రక్షించిన దేవుడు యేసు. ఆయనలో ఉన్నది మరియు ఆయన సహజ స్వభావమైన దయ, ప్రేమ, కనికరం, సహనం, ఓర్పు, విధేయత, శ్రద్ధ మరియు సహనశక్తి మరియు ఆయన చేసిన చాలావరకు కార్యము మనిషికి విమోచన కలిగించడం కోసమే. ఆయన స్వభావం కనికరం మరియు ప్రేమ. ఆయన కనికరం మరియు ప్రేమగలవాడు కాబట్టి, దేవుడు తనను తాను ప్రేమించుకున్నట్లు మనిషిని కూడా ప్రేమిస్తున్నాడనీ, ఎంతగా అంటే ఆయన తనను తాను సంపూర్ణంగా అర్పించుకునేంతగా ప్రేమిస్తున్నాడనీ చూపించడానికి ఆయన మనిషి కోసం స్వయంగా సిలువ వేయించుకోవాల్సి వచ్చింది. కృపా యుగములో, దేవుడి నామము యేసు, అనగా దేవుడు మనిషిని రక్షించిన దేవుడు మరియు ఆయన కనికరం మరియు ప్రేమగల దేవుడు. దేవుడు మనిషితో ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరం మరియు ఆయన రక్షణ ప్రతి ఒక్క వ్యక్తికి తోడుగా ఉన్నాయి. యేసు నామమును మరియు ఆయన సమక్షాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే మనిషి శాంతి మరియు ఆనందం, ఆయన ఆశీర్వాదం, ఆయన అపారమైన మరియు అనేక కృపలు మరియు ఆయన రక్షణ పొందగలిగాడు. యేసుకు సిలువ వేయడం ద్వారా, ఆయనను అనుసరించిన వారందరూ రక్షణ పొందారు మరియు వారి పాపాలు క్షమించబడ్డాయి. కృపా యుగములో, దేవుడి నామము యేసు. మరో మాటలో చెప్పాలంటే, కృపా యుగములో కార్యము ప్రధానంగా యేసు నామమున జరిగింది. కృపా యుగములో, దేవుడు యేసు అని పిలువబడ్డాడు. ఆయన పాత నిబంధనను దాటి కొత్త కార్యపు దశను చేపట్టాడు మరియు ఆయన కార్యము సిలువ వేయబడడంతో ముగిసింది. అది ఆయన కార్యపు సంపూర్ణత. కాబట్టి, ధర్మశాస్త్ర యుగములో, దేవుడి నామము యెహోవా మరియు కృపా యుగములో యేసు నామము దేవుడిని సూచించింది. అంత్యకాలములో, ఆయన నామము సర్వశక్తిమంతుడైన దేవుడు. సర్వశక్తిమంతుడు అంటే, మనిషికి మార్గనిర్దేశం చేయడానికి, మనిషిని జయించడానికి మరియు మనిషిని పొందడానికి మరియు చివరిలో ఆ యుగానికి ముగింపు పలకడానికి తన శక్తిని ఉపయోగించే సర్వశక్తిమంతుడైన దేవుడు అని అర్థం. ప్రతి యుగములోనూ, ఆయన కార్యపు ప్రతి దశలోనూ, దేవుడి స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రారంభంలో, పాత నిబంధన ధర్మశాస్త్ర యుగములో మనిషికి మార్గనిర్దేశం చేయడం అనేది చిన్న బిడ్డ జీవితానికి మార్గనిర్దేశం చేయడం లాంటిది. తొట్టతొలి మానవజాతి యెహోవా నుండి కొత్తగా జన్మించింది; వారు ఇశ్రాయేలీయులు. వారికి దేవుడిని ఎలా గౌరవించాలో లేదా భూమిపై ఎలా జీవించాలో తెలియదు. దీనర్థం, యెహోవా మానవజాతిని సృష్టించాడు, అంటే ఆదాము మరియు హవ్వలను సృష్టించాడు, కానీ యెహోవాను ఎలా గౌరవించాలో లేదా భూమిపై యెహోవా న్యాయసూత్రాలను ఎలా అనుసరించాలో అర్థం చేసుకోవడానికి వారికి ఆయన శక్తినివ్వలేదు. యెహోవా ప్రత్యక్ష మార్గదర్శకత్వం లేకుండా, ఎవరు కూడా దానిని నేరుగా తెలుసుకోలేరు, ఎందుకంటే ఆరంభంలో మనిషికి అలాంటి సామర్థ్యాలు లేవు. మనిషికి యెహోవా దేవుడని మాత్రమే తెలుసు, కానీ ఆయనను గౌరవించే విషయానికొస్తే, ఎటువంటి ప్రవర్తన ఆయనను గౌరవించడంగా పిలువబడుతుందో, ఎటువంటి మనస్సుతో ఆయనను గౌరవించాలో లేదా ఆయన పట్ల గౌరవంతో ఏమి అర్పించాలో మనిషికి ఏమాత్రం తెలియదు. మనిషికి యెహోవా సృష్టించిన అన్నింటిలో ఆనందించగలిగే వాటిని ఎలా ఆనందించాలో మాత్రమే తెలుసు, కానీ దేవుడు సృష్టించిన జీవికి భూమిపై ఎలాంటి జీవితం యోగ్యమైనదనే విషయం గురించి మనిషికి లేశమాత్రంగా కూడా తెలియదు. వారిని నిర్దేశించే వారెవరూ లేకుండా, వారికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసేవారెవరూ లేకుండా ఉంటే, ఈ మనుష్యులు ఎప్పటికీ మానవాళికి తగిన జీవితాన్ని కొనసాగించి ఉండేవారు కాదు, సాతాను చేత రహస్యంగా బంధించబడి మాత్రమే ఉండేవారు. యెహోవా మానవాళిని సృష్టించాడు, అంటే ఆయన మానవాళి పూర్వీకులైన హవ్వ మరియు ఆదాములను సృష్టించాడు, కానీ ఆయన వారికి ఎలాంటి తదుపరి తెలివిని లేదా జ్ఞానాన్ని ప్రసాదించలేదు. వారు అప్పటికే భూమిపై జీవిస్తున్నప్పటికీ, వారికి దాదాపుగా ఏమీ తెలియదు. కాబట్టి, మానవాళిని సృష్టించడంలో యెహోవా కార్యము సగం మాత్రమే పూర్తయింది, పూర్తి కావడానికి ఇంకా చాలా దూరంలో ఉంది. ఆయన మట్టి నుండి మనిషి నమూనాను మాత్రమే రూపొందించాడు మరియు దానికి తన ఊపిరినిచ్చాడు, కానీ ఆయనను గౌరవించటానికి మనిషికి తగినంత సంసిద్ధతను ప్రసాదించలేదు. ప్రారంభంలో, మనిషికి ఆయనను గౌరవించే లేదా ఆయనకు భయపడే మనస్సు లేదు. మనిషికి ఆయన మాటలను వినడం మాత్రమే తెలుసు, కానీ భూమిపై జీవించడానికి ప్రాథమిక జ్ఞానం మరియు మానవ జీవితపు సాధారణ నియమాల గురించి తెలియదు. కాబట్టి, యెహోవా స్త్రీ మరియు పురుషుడిని సృష్టించి, తన ఏడు రోజుల కార్యాన్ని పూర్తి చేసినప్పటికీ, ఏ విధంగానూ ఆయన మనిషిని పూర్తి చేయలేదు, ఎందుకంటే మనిషి ఒక పొట్టు మాత్రమే మరియు అతనిలో మానవుడనే వాస్తవికత లేదు. మానవజాతిని సృష్టించింది యెహోవా అని మాత్రమే మనిషికి తెలుసు, అంతేగానీ యెహోవా మాటలకు లేదా న్యాయసూత్రాలకు ఎలా కట్టుబడి ఉండాలో అతనికి అస్సలు తెలియదు. కాబట్టి, మానవజాతి ఉనికిలోకి వచ్చిన తర్వాత కూడా, యెహోవా కార్యము ముగియలేదు. మానవజాతి భూమిపై కలిసి జీవించగలిగేలా, ఆయనను గౌరవించగలిగేలా మరియు వారు ఆయన మార్గదర్శకత్వంలో భూమిపై సాధారణ మానవ జీవితపు సరైన మార్గంలో ప్రవేశించగలిగేలా చేయడం కోసం వారు తన యెదుటకు రావడానికి మానవజాతికి ఆయన ఇంకా పూర్తిగా మార్గనిర్దేశం చేయాల్సి ఉంది. యెహోవా నామమున ప్రధానంగా నిర్వహించబడిన కార్యము ఈవిధంగా మాత్రమే మొత్తంగా పూర్తయింది; అంటే, ఈవిధంగా మాత్రమే ప్రపంచాన్ని సృష్టించే యెహోవా కార్యము పూర్తిగా ముగిసింది. కాబట్టి, మానవజాతిని సృష్టించిన తరువాత, మానవజాతి తన శాసనాలు మరియు న్యాయసూత్రాలకు కట్టుబడటానికి మరియు భూమిపై సాధారణ మానవ జీవితంలోని అన్ని కార్యకలాపాలలో పాలుపంచుకోడానికి, ఆయన అనేక వేల యేండ్లు భూమిపై మానవ జీవితానికి మార్గనిర్దేశం చేయాల్సి వచ్చింది. అప్పుడు మాత్రమే యెహోవా కార్యము మొత్తంగా పూర్తయింది. మానవజాతిని సృష్టించిన తర్వాత ఆయన ఈ కార్యాన్ని చేపట్టాడు మరియు జాకబ్ యుగం వరకు దానిని కొనసాగించాడు, ఆ సమయంలో ఆయన జాకబ్ పన్నెండు మంది కుమారులను ఇశ్రాయేలులోని పన్నెండు తెగలుగా చేశాడు. అప్పటి నుండి, ఇశ్రాయేలు ప్రజలందరూ భూమిపై అధికారికంగా ఆయనచే నడిపించబడిన మానవజాతిగా మారారు మరియు ఆయన భూమిపై తన కార్యము చేసిన ప్రత్యేక ప్రదేశంగా ఇశ్రాయేలు మారింది. యెహోవా భూమిపై అధికారికంగా తన కార్యమును చేసిన మొదటి వ్యక్తుల సమూహంగా ఈ ప్రజలను చేశాడు మరియు ఆయన ఇశ్రాయేలు మొత్తం భూభాగాన్ని తన కార్యానికి మూలబిందువు చేశాడు, భూమిపై ఆయన నుండి జన్మించిన ప్రజలందరూ ఆయనను ఎలా గౌరవించాలో మరియు భూమిపై ఎలా జీవించాలో తెలుసుకునేలా వారిని మరింత గొప్ప కార్యానికి నాందిగా ఉపయోగించాడు. కాబట్టి, ఇశ్రాయేలీయుల పనులు అన్యదేశాల ప్రజలు అనుసరించడానికి ఒక ఉదాహరణగా మారాయి మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య చెప్పబడిన వాక్యములు అన్యదేశాల ప్రజలు వినాల్సిన వాక్యములుగా మారాయి. ఎందుకంటే, యెహోవా నుండి న్యాయసూత్రాలను మరియు ఆజ్ఞలను మొదటగా అందుకున్నది వారే కాబట్టి, యెహోవా మార్గాలను ఎలా గౌరవించాలో మొదటగా తెలుసుకున్నది కూడా వారే కాబట్టి. వారు యెహోవా మార్గాలు తెలిసిన మానవజాతి పూర్వీకులు, అదేవిధంగా యెహోవా ఎంచుకున్న మానవజాతి ప్రతినిధులు. కృపా యుగము వచ్చినప్పుడు, యెహోవా అటుపై మనిషికి ఆవిధంగా మార్గనిర్దేశం చేయలేదు. మనిషి పాపం చేశాడు మరియు పాపం చేయడానికి తనను తాను వదిలేశాడు కాబట్టి ఆయన మనిషిని పాపం నుండి రక్షించడం ప్రారంభించాడు. ఆవిధంగా, మానవుడు పాపం నుండి పూర్తిగా విడుదల చేయబడే వరకు ఆయన మనిషిని నిందించాడు. అంత్య కాలములో, ఆ దశ కార్యము కేవలం తీర్పు మరియు శిక్ష ద్వారా మాత్రమే కొనసాగించగలిగేంత స్థాయికి మనిషి పతనమయ్యాడు. ఈవిధంగా మాత్రమే కార్యము పూర్తిచేయబడగలదు. ఇది అనేక యుగాలుగా కొనసాగుతున్న కార్యము. మరోలా చెప్పాలంటే, కాలము నుండి కాలాన్ని విభజించడానికి మరియు వాటి మధ్య పరివర్తన చేయడానికి దేవుడు ఆయన నామము, ఆయన కార్యము మరియు తన విభిన్న స్వరూపాలను ఉపయోగిస్తాడు; ప్రతి కాలములో దేవుడి నామము మరియు ఆయన కార్యము ఆయన కాలాన్ని మరియు ఆయన కార్యాన్ని సూచిస్తాయి. ప్రతి యుగములో దేవుడి కార్యము ఒకేలా ఉంటుందని మరియు ఆయన ఎల్లప్పుడూ ఒకే నామముతో పిలువబడతాడని అనుకుంటే, ఆయనను మనిషి ఎలా తెలుసుకుంటాడు? దేవుడు తప్పక యెహోవా అని పిలవబడాలి మరియు యెహోవా అని పిలువబడే దేవుడు తప్ప, మరేదైనా ఇతర నామముతో పిలవబడే మరెవరూ దేవుడు కాదు. లేకుంటే దేవుడు కేవలం యేసు మాత్రమే కాగలడు మరియు యేసు అనే నామము కాకుండా వేరే ఏ నామముతోనూ పిలవబడకపోవచ్చు; యేసు తప్ప, యెహోవా గానీ మరియు సర్వశక్తిమంతుడైన దేవుడు గానీ దేవుడు కాదు. దేవుడు సర్వశక్తుడనేది నిజమని మనిషి విశ్వసిస్తాడు, కానీ మనిషితో ఉన్న దేవుడే దేవుడు, ఆయనను తప్పక దేవుడు అని పిలవాలి, ఎందుకంటే దేవుడు మనిషితో ఉన్నాడు కాబట్టి. ఇది చేయడమంటే సిద్ధాంతాన్ని ధృవీకరించడం మరియు దేవుడిని ఒక నిర్దిష్ట పరిధిలోకి పరిమితపర్చడం. కాబట్టి, ప్రతి యుగములో, దేవుడు చేసే కార్యము, ఆయనను పిలవబడే నామము మరియు ఆయన సంతరించుకునే స్వరూపం—ఈనాటి వరకు ప్రతి దశలో ఆయన చేసే కార్యము—ఇవన్నీ ఏకైక నియమాన్ని పాటించవు మరియు ఎలాంటి పరిమితులకు లోబడవు. ఆయనే యెహోవా, ఆయనే యేసు, అలాగే మెస్సీయ మరియు సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా ఆయనే. ఆయన నామమునకు సంబంధించిన మార్పులతో ఆయన కార్యము క్రమంగా మార్పుకు లోనుకాగలదు. ఏ ఒక్క నామమూ ఆయనను సంపూర్ణంగా సూచించలేదు, కానీ ఆయనను పేర్కొనే అన్ని నామములు ఆయనను సూచించగలవు మరియు ప్రతి యుగములో ఆయన చేసే కార్యము ఆయన స్వభావాన్ని సూచిస్తుంది. అంత్యకాలము వచ్చినప్పుడు, నీవు చూసే దేవుడు ఇప్పటికీ యేసు అని, ఆయన తెల్లటి మేఘం మీద స్వారీ చేస్తున్నాడని మరియు ఆయన ఇంకా యేసు స్వరూపంతోనే ఉన్నాడని మరియు ఆయన చెప్పే వాక్కులు ఇప్పటికీ యేసు చెప్పిన వాక్కులే అనుకుంటే: “మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లే మీ పొరుగువారిని ప్రేమించాలి, మీరు ఉపవాసం ఉండాలి మరియు ప్రార్థన చేయాలి, మీరు మీ సొంత జీవితాన్ని ఇష్టపడినట్లే మీ శత్రువులను ప్రేమించాలి, ఇతరులతో సహనం, ఓర్పు మరియు వినయంగా ఉండాలి. మీరు నా శిష్యులుగా మారడానికి ముందు మీరు ఈ పనులన్నీ తప్పక చేయాలి. ఈ పనులన్నీ చేయడం ద్వారా మీరు నా రాజ్యంలోనికి ప్రవేశించవచ్చు” లాంటివన్నీ కృపా యుగములో జరిగిన కార్యానికి చెందదా? ఆయన చెప్పేది కృపా యుగపు మార్గం కాదా? ఈ మాటలను మీరు వింటే మీకు ఎలా అనిపిస్తుంది? అది ఇప్పటికీ యేసు కార్యమే అని మీకు అనిపించదా? అది నకలు చేసినట్లు కాదా? మనిషి అందులో ఆనందం పొందగలడా? దేవుడి కార్యము ఇప్పుడున్నట్లుగానే ఉంటుందనీ మరియు ముందుకు కొనసాగదనీ, ఆయనకు అంతమాత్రమే శక్తి ఉంది మరియు ఇక చేయడానికి కొత్త కార్యము ఏదీ లేదు, ఆయన తనకున్న శక్తిని దాని పరిమితి వరకు వెచ్చించాడనీ మీరు అనుకుంటారు. ఈనాటికి రెండు వేల యేండ్ల ముందు కృపా యుగము నడిచింది మరియు తర్వాత రెండు వేల యేండ్లుగా ఆయన ఇంకనూ కృపా యుగపు మార్గాన్ని బోధిస్తున్నాడు మరియు ఇంకనూ ప్రజలు పశ్చాత్తాపపడేలా చేస్తున్నాడు. “దేవుడా, నీకు అంతమాత్రమే శక్తి ఉంది. నీవు ఎంతో వివేకవంతుడివని నేను విశ్వసించాను, కానీ నీకు సహనం మాత్రమే తెలుసు మరియు ఓర్పు గురించి మాత్రమే ఆందోళన చెందుతావు. నీకు నీ శత్రువును ప్రేమించడం మాత్రమే తెలుసు, అంతకు మించి ఏమీ తెలియదు” అని ప్రజలు అంటారు. మనిషి మనస్సులో, దేవుడు కృపా యుగములో ఉన్నట్లే ఎప్పటికీ ఉంటాడని మరియు దేవుడు ప్రేమించేవాడిగా మరియు కనికరంగల వాడిగా ఉంటాడని మనిషి ఎప్పుడూ విశ్వసిస్తాడు. దేవుడి కార్యము ఎల్లప్పుడూ పాత విధానంలోనే ఉంటుందని నీవు అనుకుంటావా? అలా అయితే, ఆయన కార్యపు ఈ దశలో ఆయన సిలువ వేయబడకూడదు మరియు మీరు చూసే మరియు స్పృశించే ఏదైనా మీరు ఊహించినట్లు లేదా విన్నట్లు ఉండకూడదు. ఈనాడు, దేవుడు పరిసయ్యులతో వ్యవహరించడం లేదు లేదా ఆయన ప్రపంచం తెలుసుకోవడాన్ని అనుమతించడు మరియు ఆయనను తెలిసినవారు ఆయనను అనుసరించేది మీరు మాత్రమే, ఎందుకంటే ఆయన మరోసారి సిలువ వేయబడడు. కృపా యుగములో, యేసు తన సువార్త కార్యము కోసం లోకమంతటా బహిరంగంగా బోధించాడు. సిలువ వేయబడే కార్యము కోసం ఆయన పరిసయ్యులతో పని చేశాడు; ఆయన పరిసయ్యులతో వ్యవహరించి ఉండకపోతే మరియు అధికారంలో ఉన్న వారికి ఆయన గురించి ఎప్పటికీ తెలిసి ఉండకపోతే, ఆయన ఎలా ఖండించబడతాడు, ఆతర్వాత నమ్మకద్రోహం చేయబడతాడు మరియు సిలువ వేయబడతాడు? కాబట్టి, ఆయన సిలువ వేయబడడం కోసం పరిసయ్యులతో వ్యవహరించాడు. ఈరోజు, ఆయన శోధనను తప్పించడానికి రహస్యంగా తన కార్యాన్ని చేస్తాడు. దేవుడు రెండుసార్లు శరీరధారిగా అవతరించడంలో, కార్యము మరియు ప్రాముఖ్యత విభిన్నంగా ఉంటాయి మరియు నేపథ్యం కూడా భిన్నంగా ఉంటుంది, కాబట్టి ఆయన చేసే కార్యము సంపూర్ణంగా అలాగే ఎలా ఉండగలదు?

యేసు—“మనతో ఉన్న దేవుడు”—నామము సంపూర్ణముగా దేవుడి స్వభావాన్ని సూచించగలదా? అది దేవుడిని సంపూర్ణంగా స్పష్టం చేయగలదా? దేవుడు తన స్వభావాన్ని మార్చుకోలేనందున దేవుడిని యేసు అని మాత్రమే పిలవగలమనీ మరియు మరే నామము ఆయనకు ఉండదనీ మనిషి అంటే, ఆ మాటలు నిజంగా దైవదూషణే! మనతో ఉన్న దేవుడైన యేసు నామము మాత్రమే దేవుడిని సంపూర్ణతతో సూచించగలదని నీవు విశ్వసిస్తావా? దేవుడిని అనేక నామములతో పిలవవచ్చు, అయితే ఈ అనేక నామములలో, దేవుడిని పరిపూర్ణంగా సంగ్రహించగలిగేది, దేవుడికి పరిపూర్ణంగా ప్రాతినిధ్యం వహించగలిగేది ఏ ఒక్కటీ లేదు. కాబట్టి, దేవుడికి అనేక నామములు ఉన్నప్పటికీ, ఆ అనేక నామములు దేవుడి స్వభావాన్ని పరిపూర్ణంగా విశదపర్చలేవు, ఎందుకంటే దేవుడి స్వభావం ఎంత సమృద్ధమైనదంటే, ఆయనను తెలుసుకోవడం అనేది మనిషి సామర్థ్యానికి మించి ఉంటుంది. మానవుడి భాషను ఉపయోగించి, దేవుడిని పరిపూర్ణంగా సంగ్రహించడానికి మనిషికి మార్గమేదీ లేదు. దేవుడి స్వభావం గురించి మానవజాతికి తెలిసినదంతా సంగ్రహించడానికి వారికి పరిమితమైన పదజాలం మాత్రమే ఉంది: గొప్ప, గౌరవనీయ, అద్భుతమైన, గంభీరమైన, సర్వోన్నత, పరిశుద్ధ, నీతిమంతమైన, వివేకవంతమైన లాంటి అనేక పదాలు ఉన్నాయి! ఈ పరిమితమైన పదజాలం మానవుడు చూసిన దేవుడి స్వభావాన్ని కొద్దిగా కూడా వివరించలేవు. కాలక్రమేణా, తమ హృదయాలలోని ప్రగాఢతను బాగా వర్ణించగలవని వారు భావించిన పదాలను అనేక మంది ఇతరులు జోడించారు: దేవుడు ఎంతో గొప్పవాడు! దేవుడు ఎంతో పరిశుద్ధుడు! దేవుడు ఎంతో ప్రేమామయుడు! నేడు మానవుడు మాట్లాడే ఇలాంటి మాటలు శిఖర స్థాయికి చేరుకున్నాయి, అయినా తనను తాను స్పష్టంగా వ్యక్తీకరించడంలో మనిషి ఇంకా అసమర్థుడుగానే ఉన్నాడు. కాబట్టి, మనిషిపరంగా, దేవుడికి అనేక నామములు ఉన్నప్పటికీ, ఆయనకు ఏకైక నామము ఏదీ లేదు, దేవుడు అంతులేని విస్తారత కలిగినవాడు కాబట్టి దానిని వివరించడానికి మనిషి భాష ఎంతో బలహీనమైనది. దేవుడికి పరిపూర్ణంగా ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం ఒక ప్రత్యేక పదానికి లేదా నామమునకు లేదు, కాబట్టి ఆయన నామమును స్థిరపర్చవచ్చని నీవు అనుకుంటున్నావా? దేవుడు ఎంతో గొప్పవాడు మరియు ఎంతో పరిశుద్ధుడు అయినప్పటికీ, ప్రతి కొత్త యుగములో ఆయన నామము మార్చుకోవడానికి నీవు ఒప్పుకోవా? అందుచేతే, స్వయంగా దేవుడే తన సొంత కార్యమును చేసే ప్రతి యుగములో తాను చేయాలనుకునే కార్యమును సంగ్రహించడానికి ఆ కాలానికి సరిగ్గా సరిపోయే నామమును ఉపయోగిస్తాడు. ఆ కాలానికి సంబంధించిన తన స్వభావానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఆయన తాత్కాలిక ప్రాముఖ్యత కలిగిన ఆ ప్రత్యేక నామమును ఉపయోగిస్తాడు. దేవుడు తన సొంత స్వభావాన్ని వ్యక్తపర్చడానికి ఇది దేవుడు ఉపయోగించే మానవజాతి భాష. అలా అయినప్పటికీ, ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన మరియు దేవుడిని స్వయంగా చూసిన అనేక మంది, దేవుడికి పరిపూర్ణంగా ప్రాతినిధ్యం వహించడానికి ఏ ఒక్క నామమునకు సామర్థ్యం లేదని భావిస్తారు—అయ్యో, దీనిని ఏమీ చేయలేము—కాబట్టే మనిషి ఇకపై ఏమాత్రం దేవుడిని ఏ నామముతో సంబోధించకుండా, ఆయనను “దేవుడు” అని మాత్రమే పిలుస్తాడు. ఇది ఎలా ఉందంటే, మనిషి హృదయం నిండా ప్రేమ ఉన్నప్పటికీ దానిలో వైరుధ్యాలు కూడా నిండుగా ఉన్నాయి, ఎందుకంటే దేవుడిని ఎలా వివరించాలో మనిషికి తెలియదు. దేవుడు ఎంత అనంతుడంటే ఆ విషయమై వర్ణించడానికి అసలు మార్గమేదీ లేదు. దేవుడి స్వభావాన్ని సంక్షిప్తంగా చెప్పగలిగే ఒకే ఒక్క నామము లేదు మరియు దేవుడిలో ఉన్నదంతా మరియు దేవుడిని వర్ణించగల ఏకైక నామము ఏదీ లేదు. “నీవు ఖచ్చితంగా ఏ నామము ఉపయోగిస్తావు?” అని ఎవరైనా నన్ను అడిగితే “దేవుడంటే దేవుడే!” అని నేను వారికి చెబుతాను. దేవుడికి అదే అత్యుత్తమమైన నామము కాదా? అది దేవుడి స్వభావాన్ని అత్యుత్తమంగా సంగ్రహించడం కాదా? ఇదిలా ఉన్నప్పుడు, దేవుడి నామమును గురించి అన్వేషిస్తూ మీరు ఎందుకంత ఎక్కువగా ప్రయత్నిస్తారు? కేవలం నామము కోసమే నిద్రాహారాలు మాని మీరు బుర్ర ఎందుకు బద్దలు చేసుకోవాలి? దేవుడిని యెహోవా, యేసు లేదా మెస్సీయ అని పిలవని రోజు ఒకటి వస్తుంది—అప్పుడాయన కేవలం సృష్టికర్త. అప్పుడు, భూమిపై ఆయన స్వీకరించిన నామములన్నీ సమసిపోతాయి, ఎందుకంటే అప్పటికి భూమిపై ఆయన కార్యము ముగిసిపోయి ఉంటుంది, ఆపైన ఆయన నామములేవీ ఉండవు. సమస్త విషయాలు సృష్టికర్త ఆదిపత్యంలోకి వచ్చినప్పుడు, అత్యంత సముచితమైనదైనప్పటికీ అసంపూర్ణమైన నామము ఆయనకు ఎందుకు కావాలి? నీవు ఇప్పటికీ దేవుడి నామము కోసం అన్వేషిస్తున్నావా? దేవుడు యెహోవా అని మాత్రమే పిలవబడతాడని చెప్పడానికి నీవు ఇప్పటికీ సాహసిస్తున్నావా? దేవుడు యేసు అని మాత్రమే పిలవబడగలడని చెప్పడానికి నీవు ఇప్పటికీ సాహసిస్తున్నావా? నీవు దేవుడికి వ్యతిరేకంగా దైవదూషణ పాపాన్ని భరించగలవా? దేవుడికి వాస్తవంగా నామమే లేదని నీవు తెలుసుకోవాలి. ఆయనకు చేయాల్సిన కార్యము ఉండింది మరియు మానవజాతిని నిర్వహించాల్సి ఉండింది కాబట్టి మాత్రమే ఆయన ఒకటి, రెండు లేదా అనేక నామములను స్వీకరించాడు. ఆయన ఏ పేరుతో పిలవబడినా—ఆయనే స్వచ్ఛందంగా దానిని ఎంచుకోలేదా? దాన్ని నిర్ణయించడానికి ఆయన సృష్టించిన జీవులలో ఒకడివైన నీ అవసరం ఆయనకుందా? మానవజాతి భాషలో దేవుడు పిలవబడే నామము మనిషి గ్రహించగలిగే దానికి అనుగుణంగా ఉండే నామమే అయినప్పటికీ, అది మనిషి సంగ్రహించగలిగినది కాదు. పరలోకంలో దేవుడు ఉన్నాడని, ఆయనను దేవుడని పిలుస్తారని, ఆయన స్వయంగా గొప్ప శక్తిగల, ఎంతో వివేకముగల, ఘనమైన, అద్భుతమైన, ఎంతో రహస్యమయుడైన, ఎంతో సర్వశక్తుడైన దేవుడని మాత్రమే నీవు చెప్పగలవు, అంతకుమించి నీవేమీ చెప్పలేవు; నీవు ఈ కొంచెం మాత్రమే తెలుసుకోగలవు. ఇదిలా ఉన్నప్పుడు, కేవలం యేసు అనే నామము దేవుడిని సూచించగలదా? అంత్యకాలము వచ్చినప్పుడు, ఇప్పటికీ తన కార్యము చేస్తున్నది దేవుడే అయినప్పటికీ, ఇది వేరే కాలము కాబట్టి ఆయన నామమూ మారాలి.

దేవుడు విశ్వమంతటిలో మరియు పరలోక రాజ్యంలో అత్యున్నతుడు అయినందున, ఆయన దేహ స్వరూపాన్ని ఉపయోగించి తననుతాను సంపూర్ణంగా వివరించగలడా? దేవుడు తన కార్యపు ఒక దశను చేయడానికి దేహాన్ని స్వయంగా ధరించాడు. దేహధారి అయిన ఆ స్వరూపానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతేమీ లేదు, కాలాలు గడిచిపోవడంతో దానికి సంబంధం లేదు లేదా దేవుడి స్వభావంతో కూడా దానికి ఎలాంటి సంబంధం లేదు. యేసు తన స్వరూపాన్ని అలాగే ఎందుకు కొనసాగించలేదు? రాబోయే తరాలకు అందజేయగలిగేలా తన స్వరూపాన్ని చిత్రీకరించడానికి ఆయన మనిషిని ఎందుకు అనుమతించలేదు? తన స్వరూపమే దేవుని స్వరూపమని ప్రజలు గుర్తించేలా ఆయన ఎందుకు చేయలేదు? మానవుడి స్వరూపం దేవుని స్వరూపంలో సృష్టించబడినప్పటికీ, మానవుని స్వరూపం సర్వోన్నతుడైన దేవుని స్వరూపానికి ప్రాతినిధ్యం వహించడం సాధ్యపడేదా? దేవుడు దేహ రూపం ధరించినప్పుడు, ఆయన కేవలం పరలోకం నుండి ఒక నిర్దిష్ట దేహంలోకి దిగివస్తాడు. దేహంలోకి దిగి వచ్చినది ఆయన ఆత్మ మాత్రమే, దాని ద్వారా ఆయన ఆత్మ కార్యాన్ని చేస్తాడు. దేహ రూపంలో వ్యక్తీకరించబడేది ఆత్మ మాత్రమే మరియు ఆయన కార్యాన్ని చేసేది దేహ రూపంలోని ఆత్మ మాత్రమే. దేహ రూపంలో చేసే కార్యము పూర్తిగా ఆత్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది, దేహమనేది కార్యము చేయడానికి మాత్రమే, అయితే దాని అర్థం దేహ రూపంలోని స్వరూపం దేవుని నిజమైన స్వరూపానికి ప్రత్యామ్నాయం అని కాదు; దేవుడు దేహ రూపంలోకి మారడానికి ఉద్దేశ్యం లేదా ప్రాముఖ్యత అది కాదు. ఆయన కార్యము చేయడానికి, దేహరూపంలో ఆయన కార్యాన్ని బాగా సాధించడానికి, తద్వారా ప్రజలు ఆయన పనులను చూడగలిగేలా, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోగలిగేలా, ఆయన మాటలను వినగలిగేలా మరియు ఆయన కార్యపు అద్భుతాన్ని తెలుసుకోగలిగేలా చేయడానికి ఆత్మ తగిన చోటులో నివసించడానికి వీలుగా మాత్రమే ఆయన దేహ రూపాన్ని ధరిస్తాడు. ఆయన నామము ఆయన స్వభావాన్ని సూచిస్తుంది, ఆయన కార్యము ఆయన గుర్తింపును సూచిస్తుంది, కానీ ఆయన దేహ రూపం ఆయన స్వరూపాన్ని సూచిస్తుందని ఆయన ఎప్పుడూ చెప్పలేదు; అది మనిషి అభిప్రాయం మాత్రమే. కాబట్టి, దేవుడు శరీరధారిగా అవతరించడంలో ఆయన నామము, ఆయన కార్యము, ఆయన స్వభావం మరియు ఆయన లింగం కీలక అంశాలుగా ఉంటాయి. అవి ఆ కాలంలో ఆయన నిర్వహణను సూచించడానికి ఉపయోగించబడతాయి. దేహ రూపంలోని ఆయన స్వరూపానికి ఆయన నిర్వహణతో సంబంధం ఉండదు, ఎందుకంటే అది కేవలం ఆ కాలంలో ఆయన కార్యము కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అయినప్పటికీ, అవతారధారియైన దేవుడికి ఏ ప్రత్యేక స్వరూపం లేకుండా ఉండటం అసాధ్యం, కాబట్టి తన స్వరూపాన్ని నిర్ణయించడానికి ఆయన అనువైన కుటుంబాన్ని ఎంచుకుంటాడు. దేవుని స్వరూపానికి ప్రాతినిధ్యపరమైన ప్రాముఖ్యత ఉంటే, ఆయన ముఖ కవళికలు ఉన్నవారందరూ కూడా దేవుడిని సూచిస్తారు. అది ఘోరమైన పొరపాటు అవ్వదా? మానవుడు యేసును ఆరాధించడానికి ఆయన చిత్తరువును చిత్రీకరించాడు. ఆ సమయంలో, పరిశుద్ధాత్మ ఎలాంటి ప్రత్యేకమైన సూచనలు చేయలేదు, కాబట్టి మానవుడు ఆ కల్పిత చిత్తరువును అందించాడు. నిజానికి, దేవుడి అసలు ఉద్దేశం ప్రకారం, మనిషి అది చేసి ఉండకూడదు. మనిషి అత్యుత్సాహమే ఈరోజు వరకు యేసు చిత్తరువు అలాగే నిలిచిపోయేలా చేసింది. దేవుడు ఆత్మ మరియు అంతిమ విశ్లేషణలో ఆయన స్వరూపం ఏమిటో పూర్తిగా ఆకళింపు చేసుకునే సామర్థ్యం మనిషికి ఎప్పుడూ ఉండదు. ఆయన స్వభావాన్ని బట్టి మాత్రమే ఆయన స్వరూపం సూచించబడవచ్చు. ఆయన ముక్కు, ఆయన నోరు, ఆయన కండ్లు మరియు ఆయన జుట్టు ఆకార విషయానికి వస్తే, వాటిని ఆకళింపు చేసుకోవడమనేది నీ సామర్థ్యానికి మించిన పని. యోహానుకు ప్రత్యక్షత కలిగినప్పుడు, ఆయన మనుష్య కుమారుడి స్వరూపాన్ని చూశాడు: ఆయన పెదవులు పదునైన రెండంచుల ఖడ్గంలా, ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా, ఆయన శిరస్సు మరియు జుట్టు ఉన్నిలా తెల్లగా, ఆయన పాదాలు మెరుగుపెట్టిన కాంస్యంలా మరియు ఆయన ఛాతీ చుట్టూ బంగారు దట్టి ఉండెను. దేవుడి స్వరూపం గురించి ఆయన మాటలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నప్పటికీ, ఆయన వర్ణించిన దేవుడి స్వరూపం ఒక సృష్టించబడిన జీవి స్వరూపం కాదు. ఆయన చూసినది ఒక దర్శనం మాత్రమే, భౌతిక ప్రపంచంలోని వ్యక్తి స్వరూపం కాదు. యోహాను ఒక దర్శనాన్ని చూశాడు, కానీ దేవుడి నిజమైన ఆకారాన్ని ఆయన చూడలేదు. శరీరధారియైన దేవుడి స్వరూపం, సృష్టించబడిన జీవి స్వరూపంగా ఉంది కాబట్టి, అది దేవుడి స్వభావాన్ని పరిపూర్ణంగా సూచించలేదు. యెహోవా మానవజాతిని సృష్టించినప్పుడు, ఆయన వారిని తన నిజ రూపంలో మరియు మగ మరియు ఆడవారిని సృష్టించానని చెప్పాడు. అప్పుడు, ఆయన దేవుడి స్వరూపంలో మగ మరియు ఆడ వారిని సృష్టించానని చెప్పాడు. మానవుడి స్వరూపం దేవుడి స్వరూపం లాగే ఉన్నప్పటికీ, మానవుడి స్వరూపం దేవుడి స్వరూపం అని భావించడానికి వీలులేదు. అదేవిధంగా దేవుడి స్వరూపాన్ని పూర్తిగా సంగ్రహించడానికి నీవు మానవ భాషను ఉపయోగించలేవు, ఎందుకంటే దేవుడు ఎంతో ఘనమైనవాడు, ఎంతో గొప్పవాడు, ఎంతో అద్భుతమైనవాడు మరియు గంభీరమైనవాడు!

యేసు తన కార్యము చేయడానికి వచ్చినప్పుడు, అది పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో జరిగింది; ఆయన పరిశుద్ధాత్మ కోరినట్లు చేశాడు, అంతేగానీ పాత నిబంధనలోని ధర్మశాస్త్ర యుగము ప్రకారం లేదా యెహోవా కార్యము ప్రకారం కాదు. యేసు చేయడానికి వచ్చిన కార్యము యెహోవా చట్టాలకు లేదా యెహోవా ఆజ్ఞలకు కట్టుబడి ఉండేందుకు కాకపోయినప్పటికీ, వాటి మూలం మాత్రం ఒక్కటే. యేసు చేసిన కార్యము యేసు నామమును సూచించింది మరియు అది కృపా యుగాన్ని సూచించింది; అదే యెహోవా చేసిన కార్యము యెహోవాను సూచించింది మరియు అది ధర్మశాస్త్ర యుగాన్ని సూచించింది. వారి కార్యము రెండు విభిన్న కాలాలలోని ఒకే ఆత్మ కార్యము. యేసు చేసిన కార్యము కృపా యుగాన్ని మాత్రమే సూచించగలిగింది మరియు యెహోవా చేసిన కార్యము పాత నిబంధనలోని ధర్మశాస్త్ర యుగాన్ని మాత్రమే సూచించగలిగింది. ఇశ్రాయేలు, ఈజిప్టు మరియు ఇశ్రాయేలు బయట ఉన్న అన్ని దేశాల ప్రజలకు మాత్రమే యెహోవా మార్గనిర్దేశం చేశాడు. కొత్త నిబంధనలోని కృపా యుగములో యేసు చేసిన కార్యము, ఆయన ఆ కాలానికి మార్గనిర్దేశం చేశాడు కాబట్టి అది యేసు నామముతో చేయబడిన దేవుడి కార్యము. యేసు కార్యము యెహోవా కార్యముపై ఆధారపడి ఉందని, ఆయన ఎలాంటి కొత్త కార్యాన్ని ప్రారంభించలేదని మరియు ఆయన చేసినదంతా యెహోవా మాటల ప్రకారం, యెహోవా కార్యము ప్రకారం మరియు యెషయా భవిష్యవాణుల ప్రకారమే అని నీవు అంటే, అప్పుడు యేసు దేహధారిగా మారిన దేవుడై ఉండేవాడు కాదు. ఒకవేళ ఆయన తన కార్యాన్ని ఆవిధంగా నిర్వహించి ఉంన్నట్లయితే, ఆయన ఒక అపొస్తలుడు లేదా ధర్మశాస్త్ర యుగపు కార్యకర్త అయ్యి ఉండేవాడు. ఇది నీవు చెప్పినట్లుగా అయితే, యేసు ఒక కాలాన్ని ప్రారంభించి ఉండేవాడు కాదు లేదా మరే ఇతర కార్యము చేసి ఉండేవాడు కాదు. అదే విధంగా, పరిశుద్దాత్మ ప్రధానంగా యెహోవా ద్వారా తన కార్యము చేయాలి మరియు యెహోవా ద్వారా తప్ప పరిశుద్ధాత్మ ఏ కొత్త కార్యము చేసి ఉండేవాడు కాదు. యేసు కార్యాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం మనిషి తప్పు. యేసు చేసిన కార్యము యెహోవా మాటల ప్రకారం, యెషయా భవిష్యవాణుల ప్రకారం చేయబడిందని మనిషి విశ్వసిస్తే, అప్పుడు యేసు అవతారధారియైన దేవుడా లేదంటే ప్రవక్తలలో ఒకడా? ఆ దృష్టి ప్రకారం చూస్తే, కృపా యుగము ఉండేది కాదు మరియు యేసు శరీరధారిగా అవతరించిన దేవుడు అయ్యేవాడు కాదు, ఎందుకంటే ఆయన చేసిన కార్యము కృపాకాలాన్ని సూచించగలిగేది కాదు మరియు పాత నిబంధన ధర్మశాస్త్ర యుగాన్ని మాత్రమే సూచించగలిగేది. కొత్త కార్యమును చేయడానికి, కొత్త యుగాన్ని ప్రారంభించడానికి, ఇశ్రాయేలులో గతంలో చేసిన కార్యమును అధిగమించడానికి మరియు ఇశ్రాయేలులో యెహోవా చేసిన కార్యముతో లేదా ఆయన పాత నియమాలతో లేదా ఏవైనా నిబంధనల ప్రకారం తన కార్యమును నిర్వహించడానికి కాకుండా, ఆయన చేయవలసిన నూతన కార్యమును చేయడానికి యేసు వచ్చినందునే కొత్త యుగము ఏర్పడగలిగింది. యుగాన్ని ప్రారంభించడానికి దేవుడు స్వయంగా వస్తాడు మరియు యుగాన్ని ముగించడానికి కూడా దేవుడే స్వయంగా వస్తాడు. యుగాన్ని ప్రారంభించే, యుగాన్ని ముగించే కార్యమును చేసే సామర్థ్యం మనిషికి లేదు. యేసు వచ్చిన తర్వాత యెహోవా కార్యమును ఆయన ముగించకపోతే, ఆయన కేవలం మనిషి అని మరియు దేవుడికి ప్రాతినిధ్యం వహించలేడనే దానికి అది రుజువుగా ఉండేది. ఖచ్చితంగా, యేసు వచ్చాడు మరియు యెహోవా కార్యానికి ముగింపు పలికాడు, యెహోవా కార్యమును కొనసాగించాడు, అంతేకాకుండా, తన సొంత కార్యమును, ఒక కొత్త కార్యమును కొనసాగించాడు కాబట్టి, అది కొత్త యుగమని మరియు యేసు స్వయంగా దేవుడని అది రుజువు చేస్తుంది. కార్యపు రెండు విశిష్టమైన భిన్న దశలను వారు చేశారు. ఒక దశ ఆలయంలో కొనసాగించబడగా, మరొకటి ఆలయం వెలుపల నిర్వహించబడింది. ఒక దశ మనిషి జీవితాన్ని న్యాయం ప్రకారం నడిపించడానికి, మరొకటి పాప పరిహారార్థబలి అర్పించడానికి జరిగింది. కార్యపు ఈ రెండు దశలు స్పష్టంగా భిన్నంగా ఉన్నాయి; ఇది పాత కాలం నుండి కొత్త కాలాన్ని వేరు చేస్తుంది మరియు అవి రెండు వేరువేరు కాలాలు అని చెప్పడం ఖచ్చితంగా సరైనదే. వారి కార్య ప్రదేశం భిన్నమైనది, వారి కార్య విషయం భిన్నమైనది మరియు వారి కార్య లక్ష్యం భిన్నమైనది. కాబట్టి, వాటిని రెండు కాలాలుగా విభజించవచ్చు: కొత్త మరియు పాత నిబంధనలు, అంటే, కొత్త మరియు పాత కాలాలు. యేసు వచ్చినప్పుడు ఆయన ఆలయం లోనికి వెళ్లలేదు, యెహోవా యుగం ముగిసిందని అది రుజువు చేస్తుంది. ఆయన ఆలయం లోనికి ఎందుకు ప్రవేశించలేదంటే, ఆలయంలో యెహోవా కార్యము ముగిసింది, మళ్లీ చేయవలసిన అవసరం లేదు మరియు మళ్లీ చేయడం అంటే దానిని పునరావృతం చేయడమే. ఆలయాన్ని విడిచిపెట్టి, కొత్త కార్యమును ప్రారంభించి, ఆలయం వెలుపల కొత్త మార్గాన్ని ప్రారంభించడం ద్వారా మాత్రమే ఆయన దేవుడి కార్యమును దాని అత్యున్నత స్థానానికి తీసుకురాగలిగాడు. ఆయన తన కార్యమును చేయడానికి ఆలయం నుండి వెలుపలకు వెళ్లి ఉండకపోతే, దేవుడి కార్యము ఆలయ పునాదులపైనే నిలిచిపోయేది మరియు ఎలాంటి కొత్త మార్పులు ఎప్పటికీ వచ్చి ఉండేవి కావు. కాబట్టి, యేసు వచ్చినప్పుడు, ఆయన ఆలయం లోనికి ప్రవేశించలేదు మరియు తన కార్యమును ఆలయంలో చేయలేదు. ఆయన తన కార్యమును ఆలయం వెలుపల చేశాడు మరియు శిష్యులను నడిపిస్తూ తన కార్యమును స్వేచ్ఛగా కొనసాగించాడు. దేవుడు తన కార్యమును చేయడానికి ఆలయాన్ని వదిలి వెళ్లడమంటే దేవుడికి ఒక కొత్త ప్రణాళిక ఉందని అర్థం. ఆయన కార్యము ఆలయం వెలుపల నిర్వహించవలసినది మరియు దాన్ని అమలు చేసే విధానంలో అవరోధాలు లేని కొత్త కార్యమై ఉండవలసినది. యేసు వచ్చీ రాగానే, పాత నిబంధన కాలములోని యెహోవా కార్యమును ముగించాడు. వారు రెండు వేరువేరు నామములతో పిలువబడినప్పటికీ, కార్యపు రెండు దశలను పూర్తి చేసింది ఒకే ఆత్మ మరియు చేసిన కార్యము నిరంతరమైనది. నామము వేరుగా మరియు కార్య విషయం వేరుగా ఉంది కాబట్టి, కాలము కూడా వేరుగా ఉంది. యెహోవా వచ్చినప్పుడు, అది యెహోవా కాలము మరియు యేసు వచ్చినప్పుడు, అది యేసు కాలము. కాబట్టి, ప్రతి రాకతో, దేవుడు ఒక నామముతో పిలువబడతాడు, ఆయన ఒక కాలానికి ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు ఆయన ఒక కొత్త మార్గాన్ని ప్రారంభిస్తాడు; ప్రతి కొత్త మార్గంలో, ఆయన ఒక కొత్త నామమును స్వీకరిస్తాడు, దేవుడు నిత్య నూతనుడని మరియు ఎప్పుడూ పాతబడనివాడని మరియు ఆయన కార్యము ముందుకు పురోగమించడం ఎప్పటికీ నిలిచిపోదని ఇది చూపుతుంది. చరిత్ర ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ ఉంటుంది మరియు దేవుడి కార్యము కూడా ఎల్లప్పుడూ ముందుకే సాగుతూ ఉంటుంది. ఆయన ఆరువేల యేండ్ల నిర్వహణ ప్రణాళిక దాని ముగింపుకు చేరుకోవాలంటే, అది తప్పక ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రతి రోజు ఆయన తప్పక కొత్త కార్యాన్ని చేయాలి, ప్రతి యేడు ఆయన తప్పక కొత్త కార్యాన్ని చేయాలి; ఆయన తప్పక కొత్త మార్గాలను ప్రారంభించాలి, కొత్త యుగాలను ప్రారంభించాలి, కొత్త మరియు గొప్ప కార్యాన్ని ప్రారంభించాలి మరియు వీటితో పాటు, కొత్త నామములు మరియు కొత్త కార్యము తీసుకురావాలి. ఎప్పుడూ పాత మార్గాలకు లేదా నియమాలకు కట్టుబడి ఉండకుండా, అనుక్షణం దేవుడి ఆత్మ కొత్త కార్యాన్ని చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆయన కార్యము ఎప్పుడూ ఆగిపోలేదు, కానీ గడిచే ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ కార్యము మార్పులేనిదని నీవంటే, ఆలయంలో తనకు సేవ చేయమని యెహోవా యాజకులను ఎందుకు కోరాడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన గొప్ప యాజకుడని, ఆయన దావీదు ఇంటి నుండి వచ్చాడని మరియు గొప్ప యాజకుడు మరియు గొప్ప రాజని కూడా ప్రజలు చెప్పినది నిజమైనప్పటికీ, యేసు ఆలయంలోనికి ఎందుకు ప్రవేశించలేదు? ఆయన బలులను ఎందుకు అర్పించలేదు? ఆలయం లోనికి ప్రవేశించడం లేదా ఆలయం లోనికి ప్రవేశించకపోవడం—ఇదంతా స్వయంగా దేవుడి కార్యము కాదా? మనిషి ఊహించినట్లుగా, యేసు మళ్లీ వస్తే, అంత్యకాలములోనూ ఆయన యేసు అని పిలువబడితే, ఇప్పుడు కూడా తెల్లటి మేఘం మీద వచ్చి, యేసు స్వరూపంలో మనుషుల మధ్య దిగితే: అది ఆయన కార్యము పునరావృతమైనట్లు కాదా? పరిశుద్ధాత్మ పాత వాటిని అంటిపెట్టుకోగలదా? మనిషి విశ్వసించేవన్నీ ఉద్దేశాలే, మనిషికి అర్థమయ్యేదంతా పదానికి పదం అర్థం ప్రకారం మరియు అతని ఊహ ప్రకారం ఉంటుంది; వారు పవిత్రాత్మ కార్య సూత్రాలకు విరుద్ధంగా ఉంటారు మరియు దేవుడి ఉద్దేశాలకు అనుగుణంగా ఉండరు. దేవుడు ఆవిధంగా కార్యమును చేయడు; దేవుడు అంత మూర్ఖుడు మరియు తెలివి లేనివాడు కాదు మరియు ఆయన కార్యము నీవు ఊహించుకున్నంత సులువైంది కాదు. మనిషి ఊహించిన ప్రతిదానిపై ఆధారపడి, యేసు మేఘం మీద స్వారీ చేస్తూ వచ్చి, మీ మధ్యలో దిగుతాడు. మీరు మేఘం మీద స్వారీ చేస్తున్న ఆయనను చూస్తారు, ఆయనే యేసు అని మీకు చెబుతాడు. మీరు ఆయన చేతులపై మేకుల గుర్తులను కూడా చూస్తారు మరియు ఆయనే యేసు అని తెలుసుకుంటారు. ఆయన మిమ్మల్ని మళ్లీ రక్షిస్తాడు మరియు మీ శక్తివంతమైన దేవుడు అవుతాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు ఒక కొత్త పేరు ప్రసాదిస్తాడు మరియు మీకందరికి ఒక తెల్లటి రాయి ఇస్తాడు, దాని తర్వాత మీరు పరలోక రాజ్యం లోనికి ప్రవేశించడానికి అనుమతించబడతారు మరియు స్వర్గంలోకి స్వీకరించబడతారు లాంటి విశ్వాసాలన్నీ మనిషి ఆలోచనలు మాత్రమే కావా? దేవుడు మనిషి ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తాడా లేదా మనిషి ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తాడా? మనిషి ఆలోచనలన్నీ సాతాను నుండి ఉత్పన్నం కాలేదా? మనుష్యులందరూ సాతానుచే చెరపబడలేదా? దేవుడు తన కార్యాన్ని మనిషి ఆలోచనల ప్రకారం చేస్తే, అప్పుడాయన సాతానుగా మారడా? తాను సొంతంగా సృష్టించిన జీవులలాగే ఆయన కూడా ఉండిపోడా? ఆయన సృష్టించిన జీవులు ఇప్పుడు సాతానుచే చెరపబడ్డారు కాబట్టి, మనిషి సాతాను స్వరూపుడుగా మారాడు, దేవుడు సాతాను పనుల ప్రకారం పని చేస్తే, అప్పుడాయన సాతాను కూటమిలో ఉన్నట్లా? మనిషి దేవుడి కార్యము లోతును ఎలా కొలవగలడు? కాబట్టి, మనిషి ఆలోచనల ప్రకారం దేవుడు ఎప్పుడూ పని చేయడు మరియు నీవు ఊహించినట్లు ఎప్పటికీ పని చేయడు. తాను మేఘం మీద వస్తానని దేవుడే చెప్పాడని చెప్పేవారు కూడా ఉన్నారు. దేవుడు స్వయంగా అలా చెప్పడం నిజమే, అయితే దేవుడి రహస్యాల లోతును ఎవ్వరూ తెలుసుకోలేరని నీకు తెలియదా? దేవుడి మాటలను ఎవ్వరూ వివరించలేరని నీకు తెలియదా? నీవు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానోదయం పొందావని మరియు వెలిగించబడ్డావని ఎలాంటి సందేహం లేకుండా ఖచ్చితంగా నీకు తెలుసా? అంత ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ నీకు చూపించాడు అనడం నిస్సందేహంగా జరగలేదు కదా? నిన్ను నిర్దేశించినది పరిశుద్ధాత్మయేనా లేదా నీ సొంత ఆలోచనలు నీవు అలా ఆలోచించేలా చేశాయా? “ఇది దేవుడే చెప్పాడు” అని నీవు అన్నావు. కానీ దేవుడి మాటలను కొలిచేందుకు మన సొంత ఆలోచనలు మరియు మనస్సులను మనం ఉపయోగించలేము. యెషయా చెప్పిన మాటల విషయానికొస్తే, నీవు ఆయన మాటలను పూర్తి ఖచ్చితంగా వివరించగలవా? నీవు ఆయన మాటలను వివరించే సాహసం చేస్తావా? యెషయా మాటలను వివరించడానికి నీవు సాహసించలేవు కాబట్టి, యేసు మాటలను వివరించడానికి నీవు ఎందుకు సాహసం చేస్తున్నావు? యేసు లేదా యెషయలో ఎవరు ఎక్కువ ఉన్నతులు? జవాబు యేసు కాబట్టి, యేసు చెప్పిన మాటలను నీవు ఎందుకు వివరిస్తావు? దేవుడు తన కార్యమును గురించి నీకు ముందుగానే చెబుతాడా? దాని గురించి ఏ ఒక్క జీవి తెలుసుకోలేదు, పరలోకంలోని దూతలుగానీ లేదా మనుష్యకుమారుడుగానీ తెలుసుకోలేరు, మరి నీవెలా తెలుసుకోగలవు? మనిషి చాలా అల్పుడు. ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన కీలమైనది ఏమిటంటే, కార్యపు మూడు దశలను తెలుసుకోవడం. యెహోవా కార్యము నుండి యేసు కార్యము వరకు, మరియు యేసు కార్యము నుండి ఈ ప్రస్తుత దశ కార్యము వరకు, ఈ మూడు దశలు దేవుడి నిర్వహణ మొత్తం సరళి యొక్క నిరంతరాయమైన గొలుసు పరిధిలోకి వస్తాయి మరియు అవన్నీ కూడా ఒకే ఆత్మ కార్యము. లోకం సృష్టించబడినప్పటి నుండి, దేవుడు ఎల్లప్పుడూ మానవజాతిని నిర్వహించే కార్యములోనే ఉన్నాడు. ఆయనే ఆది మరియు అంతం, ఆయనే తొలి మరియు చివరివాడు, ఆయనే ఒక యుగాన్ని ప్రారంభించేవాడు మరియు ఆయనే యుగాన్ని అంతం చేసేవాడు. వివిధ యుగాల్లో మరియు వివిధ ప్రదేశాల్లో, కార్యపు మూడు దశలు, నిస్సందేహంగా ఒకే ఆత్మ కార్యముగా ఉన్నాయి. ఈ మూడు దశలను వేరుచేసే వారందరూ దేవుడికి ప్రతికూలమైన వారు. ఇప్పుడు, మొదటి దశ నుండి ఈనాటి వరకు కార్యమంతా ఒకే దేవుడి, ఒకే ఆత్మ కార్యమని నీవు అర్థం చేసుకోవడమే సముచితం. దాని గురించి ఎలాంటి సందేహమూ అవసరంలేదు.

మునుపటి:  దేవుని కార్యపు దర్శనం (2)

తరువాత:  శరీరావతారపు రహస్యము (1)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger