విశ్వాసులు ఎలాంటి దృష్టి కోణం కలిగి ఉండాలి
దేవునిపై మొదట విశ్వాసం చూపించడం మొదలెట్టిన తర్వాత మనిషి సంపాదించినది ఏమిటి? మీరు దేవుని గురించి ఏమి తెలుసుకున్నారు? దేవునిపై మీకున్న నమ్మకం వల్ల మీలో ఎంత మార్పు వచ్చింది? ఈ రోజు, దేవునిపై మనిషి విశ్వాసమనేది కేవలం ఆత్మ రక్షణ మార్గానికో మరియు శరీర శ్రేయస్సు కోసమో, లేదంటే దేవుడిని ప్రేమించడం ద్వారా అతని జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడం కోసమో కాదని మీ అందరికీ తెలుసు. దాని ప్రకారం, మీరు శరీర శ్రేయస్సు కోసం లేదా క్షణిక ఆనందం కోసం దేవుని ప్రేమిస్తే, చివరికి, దేవునిపై మీ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ మీరు ఇంకేమీ కోరలేరు, మీరు కోరుకునే ఆ ప్రేమ ఇంకా చెడిపోయిన ప్రేమగానే ఉండడంతో పాటు అది దేవుని సంతోష పెట్టదు. తమ నిస్తేజమైన ఉనికిని సుసంపన్నం చేసుకునేందుకు మరియు తమ హృదయ శూన్యతను పూరించుకోవడానికి దేవుని పట్ల ప్రేమను ఉపయోగించుకునే వారు, సులభమైన జీవితాన్ని కోరుకునే దురాశాపరులు, వారు నిజంగా దేవుడిని ప్రేమించేవారు కాదు. అది బలవంతపు ప్రేమ, అది మానసిక సంతృప్తిని కోరుకునేది మరియు దేవునికి అలాంటి ప్రేమ అవసరం లేదు. అయితే, మీది ఎలాంటి ప్రేమ? మీరు దేని కోసం దేవుని ప్రేమిస్తారు? ప్రస్తుతం మీలో దేవుని పట్ల నిజమైన ప్రేమ ఎంత ఉంది? మీలోని చాలా మంది ప్రేమ అనేది పైన చెప్పిన ప్రేమ వంటిది. అలాంటి ప్రేమ యథాతథ స్థితిని మాత్రమే కొనసాగించగలదు; అది స్థిరత్వాన్ని పొందుకోలేదు, మనిషిలో వేళ్లూనుకోదు. అలాంటి ప్రేమ అనేది ఫలాన్ని ఇవ్వకుండానే వాడిపోయే పువ్వు లాంటిది. మరోవిధంగా చెప్పాలంటే, మీరు ఒక్కసారి దేవుడిని ఆ విధంగా ప్రేమించిన తరువాత, ముందుకు సాగే మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి ఎవరూ లేకుంటే, మీరు పతనం అవుతారు. మీరు దేవుడిని ప్రేమించే సమయంలోనే, దేవుడిని ప్రేమించి, ఆ తరువాత మీ జీవన విధానం మారకుండా ఉంటే, అప్పుడు మీరు అజ్ఞాన ప్రభావం నుండి తప్పించుకోలేరు, అది మీ వల్ల కాదు. సాతాను బంధనాల నుండి మరియు దాని మోసం నుండి విముక్తి పొందలేరు. ఇలాంటి వారెవరూ పూర్తిగా దేవుని దరికి చేరలేరు; చివరికి, వారి ఆత్మ, మనస్సు మరియు శరీరం ఇంకా సాతానుకు లోబడే ఉంటాయి. అదులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పూర్తిగా దేవుని దరికి చేరలేని వారందరూ తమ అసలు స్థానానికి, అంటే సాతాను వద్దకు తిరిగి వస్తారు, మరియు వారు దేవుని నుండి శిక్ష యొక్క తదుపరి దశను అంగీకరించడానికి అగ్ని మరియు గంధకపు గుండం లోనికి వెళ్లాల్సి ఉంటుంది. సాతానును వదిలి, దాని ప్రభావం నుండి తప్పించుకునే వారే దేవునిచే అక్కున చేర్చుకోబడ్డవారై ఉంటారు. వారు అధికారికంగా దేవుని రాజ్యంలోని ప్రజలుగా లెక్కించబడతారు. దేవుని రాజ్యంలోనికి ప్రజలు ఇలాగే వస్తారు. ఈ రకమైన వ్యక్తిగా మారడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని ద్వారా అక్కున చేర్చుకోబడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? సాతాను బంధకం నుండి తప్పించుకొని దేవుని వద్దకు తిరిగి చేరడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఇప్పుడు సాతాను అధీనంలో ఉన్నారా లేదా దేవుని రాజ్యంలోని ప్రజలలో లెక్కించబడ్డారా? ఈ విషయాలు ఇప్పటికే స్పష్టం అయి ఉండాలి మరియు వీటిపై మరింత వివరణ అవసరం లేదు.
గతంలో, చాలా మంది దుష్ట ఆశయం మరియు భావాలు కలిగి ఉన్నారు, వారు తమ సొంత ఆశల కోసమే ప్రార్థించారు. అటువంటి సమస్యలను ప్రస్తుతానికి పక్కన పెడదాం; ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీలో ప్రతి ఒక్కరూ దేవుని ముందు సాధారణ స్థితిని కొనసాగించడానికి మరియు సాతాను ప్రభావం సంకెళ్ల నుండి క్రమంగా విముక్తి పొందేందుకు వీలు కల్పించే ఆచరణ మార్గాన్ని కనుగొనడం, తద్వారా మీరు దేవుని ద్వారా అక్కున చేర్చుకోబడవచ్చు, మరియు దేవుడు మీ నుండి ఏమి కోరుకుంటున్నాడో ఆ విధంగా భూమిపై జీవనం కొనసాగించవచ్చు. ఈ విధంగా మాత్రమే మీరు దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలరు. చాలామంది దేవుని విశ్వసిస్తారు, అయితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడో లేదా సాతాను ఏమి కోరుకుంటున్నాడో వారికి తెలియదు. వారు గజిబిజిగా ఉండే మార్గాన్ని విశ్వసిస్తారు, కేవలం కాలానుగుణంగా జీవిస్తారు మరియు సాధారణ క్రైస్తవ జీవితాన్ని ఎన్నడూ కలిగి ఉండరు; ఇంకా చెప్పాలంటే, వారు ఎప్పుడూ సాధారణ వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉండరు, దేవునితో చాలా తక్కువ స్థాయిలోనే సాధారణ సంబంధం కలిగి ఉంటారు. దీనిని బట్టి మనిషి కష్టాలు మరియు లోటుపాట్లు మరియు దేవుని చిత్తానికి ఆటంకం కలిగించే ఇతర అంశాలు ఇంకా చాలా ఉన్నాయని మనం గమనించవచ్చు. మనిషి ఇంకా దేవునిపై విశ్వాసం ఉంచడంలో సరైన మార్గంలోకి రాలేదని లేదా మనుష్య జీవితంలోని సరైన అనుభవంలోనికి ప్రవేశించలేదని నిరూపించడానికి ఇది చాలు. మరి, దేవునిపై విశ్వాసం ఉంచడానికి సరైన మార్గం ఏమిటి? సరైన మార్గంలో వెళ్లడం అంటే, మీరు ఎల్లప్పుడూ దేవుని ముందు మీ హృదయాన్ని స్థిమిత పరచడం మరియు దేవునితో సాధారణ సహవాసాన్ని ఆస్వాదించడం, క్రమంగా మనిషిలో లోపాలు తెలుసుకోవడం మరియు నిదానంగా దేవుని గురించి లోతైన జ్ఞానాన్ని పొందడం. దీని ద్వారా, మీ ఆత్మ ప్రతిరోజూ సరికొత్త అంతర్దృష్టిని మరియు నూతన జ్ఞానాన్ని పొందుతుంది; మీలో వాంఛ పెరుగుతుంది, మీరు సత్యములోకి ప్రవేశించాలని కోరుకుంటారు మరియు ప్రతిరోజూ నూతన కాంతి మరియు సరికొత్త అవగాహన పొందుతారు. ఈ మార్గంలో, మీరు క్రమంగా సాతాను ప్రభావం నుండి బయటపడతారు మరియు జీవమును పొందుకుంటారు. అలాంటి వ్యక్తులు సరైన మార్గంలో ప్రవేశించినట్టు లెక్క. మీ స్వంత వాస్తవ అనుభవాలను అంచనా వేయండి మరియు మీరు విశ్వాసం ఉంచి, అనుసరించిన మార్గాన్ని పరిశీలించండి: పైన వివరించిన వాటికి వ్యతిరేకంగా మీరు కొనసాగుతుంటే, మీరు సరైన మార్గంలో పయనిస్తున్నట్లే భావిస్తున్నారా? మీరు ఏ విషయాలలో సాతాను బంధకాల నుండి మరియు సాతాను ప్రభావం నుండి బయటపడ్డారు? మీరు ఇంకా సరైన మార్గంలోకి రానట్లయితే, సాతానుతో మీ సంబంధాలు ముగియనట్లే. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, దేవుని ప్రేమించాలనే మీ తపన మిమ్మల్ని ప్రామాణికమైన, ఏక దృష్టిగల మరియు స్వచ్ఛమైన ప్రేమ వైపు నడిపిస్తుందా? దేవుని పట్ల మీ ప్రేమ అచంచలమైనది మరియు హృదయపూర్వకమైనది అయినప్పటికీ మీరు సాతాను సంకెళ్ళ నుండి విముక్తి పొందలేదని చెబుతున్నారు. అంటే, మీరు దేవుని మభ్యపెట్టాలని ప్రయత్నించడం లేదా? దేవుని పట్ల మీరు చూపించే ప్రేమ చెడ్డది కాకుండా ఉండాలనుకుంటే, మరియు మీరు పూర్తిగా దేవుని ద్వారా పొందుకోవాలని మరియు దేవుని రాజ్య ప్రజలలో ఒకరిగా ఉండాలని కోరుకుంటే, మొదటగా మీరు దేవునిపై విశ్వాసంతో సరైన మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి.