దేవుడు మరియు మనిషి కలిసి విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు

ఆదియందు దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు. ఆ సమయంలో భూమిపై మానవులు గానీ మరేదైనా గానీ లేదు, అప్పటికి దేవుడు ఏ పనినీ పూర్తి చేసియుండలేదు. మానవుల మనుగడ ప్రారంభమై వారు చెడు మార్గంలొ నడవటం ప్రారంభమైన తర్వాతే దేవుడు తన నిర్వహణ పనిని ప్రారంభించాడు; ఇక అప్పటి నుండి, ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకుండా మనుష్యులతో వ్యవహరించడంలోనే నిమగ్నమైపోయాడు. మానవులు చెడిపోవడం వలన మరియు ప్రధాన దూతలు తిరుగుబాటు చేయడం వలన దేవుడు తన విశ్రాంతిని కోల్పోవాల్సి వచ్చింది. దేవుడు సాతానుని ఓడించి, చెడిపోయిన మానవాళిని రక్షించకపోతే ఆయన ఎన్నటికీ తిరిగి విశ్రాంతిలోనికి ప్రవేశించలేడు. మనుష్యునికి ఎలాగైతే విశ్రాంతి ఉండటం లేదో, దేవుడికి కూడా అదే విధంగా విశ్రాంతి లేకుండా పోయింది, దేవుడు ఎప్పుడు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడో అప్పుడే మనుష్యులు కూడా విశ్రాంతిని పొందుతారు. విశ్రాంతిలో జీవించడం అంటే యుద్ధాలు, చెడు, దుర్నీతి లేకుండా జీవించడమే. అంటే సాతాను కలిగించే ఆటంకాలు, దుర్నీతి కలిగి ఉండని జీవితం మరియు దేవునికి విరుద్ధంగా ఏదీ చొరబడలేని జీవితమని చెప్పవచ్చు; ఇది సమస్తమూ దాని వంటి దానినే అనుసరించే జీవితం, ఇది సృష్టికర్తయైన ప్రభువును ఆరాధించే జీవితం, ఇందులో పరలోకం మరియు భూమి పూర్తిగా ప్రశాంతతతో నిండి ఉంటాయి—“మానవుల విశ్రాంతియుత జీవితాలు” అనే మాటకు అర్థం ఇదే. దేవుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు భూమిపై దుర్నీతి గానీ శత్రు బలగాల చొరబాట్లు గానీ ఉండవు, మానవులు కొత్త రాజ్యంలోనికి ప్రవేశిస్తారు—ఇక మనుష్యులు సాతానుచే దుష్టత్వంలోనికి దిగజారిపోరు, కానీ సాతానుచే పాడైపోయి, తిరిగి రక్షించబడిన జనాంగమే ఉంటుంది. మానవుల విశ్రాంతి దినమే దేవుని విశ్రాంతి దినము. మానవుడు విశ్రాంతి లోనికి ప్రవేశించలేకపోవడం చేతనే దేవుడు తన విశ్రాంతిని కోల్పోవాల్సి వచ్చింది, దేవుడు ముందుగా విశ్రాంతిలో ఉండలేకపోవడం వలన కాదు. విశ్రాంతిలోనికి ప్రవేశించడం అంటే అంతా స్థంభించిపోతుందనీ లేదా వృద్ధి చెందడం నిలిచిపోతుందనీ, లేదా దేవుడు తన పనిని ఆపివేస్తాడనీ లేదా మనుష్యుల జీవనం ఆగిపోతుందనీ అర్థం కాదు. సాతాను నశింపజేయబడి, దాని దుష్ట కార్యాలతో జతకలసిన దుష్టులు శిక్షించబడి, భూమిమీద లేకుండా తుడిచివేయబడి, దేవునికి విరోధముగా లేచిన శక్తులన్నీ నశించడమే మనం విశ్రాంతి లోనికి ప్రవేశించడానికి సంకేతం. దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశించడమంటే ఆయన మనుష్యుల కొరకు తన రక్షణ కార్యాన్ని ఇక కొనసాగించడని అర్థం. మానవులు విశ్రాంతిలోనికి ప్రవేశించడమంటే మానవాళి అంతయూ దేవుని వెలుగులో నివసించడం మరియు ఆయన ఆశీర్వాదాల క్రింద సాతాను దుర్నీతి, నీతిమాలినతనం లేకుండా ఉండటం అని అర్థం. దేవుని సంరక్షణలో, మానవులు ఈ భూమిపై సాధారణంగా జీవించగలుగుతారు. దేవుడు మరియు మానవులు కలిసి విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు, మానవాళి రక్షించబడి సాతాను నశింపజేయబడిందనియూ మరియు మానవులలో దేవుని పని సంపూర్తి చేయబడిందనియూ అర్థం. దేవుడు ఇక మనుష్యులలో పనిచేయడం కొనసాగించడు, అలాగే మానవులు ఇకపై సాతాను అధికారము క్రింద ఉండరు. ఏలాగైతే దేవుడు ఇకపై తీరిక లేకుండా ఉండడో, మానవులు కూడా వారి ఎడతెగని ఊగిసలాట నుండి బయటపడతారు. దేవుడు ఆయన అసలు స్థానానికి వెళ్ళిపోతాడు, మనుష్యులందరూ కూడా వారి స్థానాలకు తిరిగి వెళ్తారు. దేవుని నిర్వహణ కార్యమంతయూ సంపూర్ణమవ్వగానే దేవుడు మరియు మానవులు నివసించే స్థానాలు ఇవే. దేవుడికి దేవుడి గమ్యస్థానం ఉండగా మానవులకు మానవుల గమ్యస్థానం ఉంది. విశ్రాంతిలో ఉండగా దేవుడు భూమి మీద నివసిస్తున్న మానవులందరినీ వారి జీవితాలలో నడిపించడం కొనసాగిస్తాడు, అదే విధంగా ఆయన వెలుగులో ఉండగా మానవులందరూ పరలోకమందున్న నిజ దేవుని ఆరాధిస్తారు. దేవుడు ఇక మనుష్యుల మధ్య నివసించడు, లేదా మనుష్యులు దేవుడి గమ్యస్థానంలో దేవుడితో కలిసి జీవించలేరు. దేవుడు మరియు మానవులు ఒకే రాజ్యంలో కలిసి నివసించడం అసాధ్యం; ఇద్దరికీ వారి సంబంధిత పత్యేక జీవన విధానాలు ఉన్నాయి. మనుష్యులందరినీ నడిపించేది దేవుడే, మానవులందరూ దేవుని నిర్వహణ కార్యపు స్పష్టమైన నిదర్శనాలు. మానవులు నడిపించబడేవారు, వారు దేవునిలా నిర్మితమైన వారు కారు. “విశ్రాంతి పొందుట” అంటే ఒకని అసలు స్థాననికి వెళ్ళుట. కాబట్టి, దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశ్గించునప్పుడు, ఆయన తన అసలు ఉనికిపట్టుకు తిరిగి వెళ్ళాడని అర్థం. ఆయన ఇక భూమిపై నివాసముండడు లేదా మానవుల ఆనంద దుఃఖాలను పంచుకోవడానికి వారి మధ్య ఉండడు. మానవులు విశ్రాంతిలోనికి ప్రవేశించునప్పుడు, వారు సృష్ట్యాదిలో ఉన్నట్టు తయారయ్యారని అర్థం; వారు భూమి మీద నుండి దేవుడిని ఆరాధిస్తారు, అలాగే సాధారణ జీవితాన్ని జీవిస్తారు. ప్రజలు ఇక దేవుడికి అవిధేయులై ఉండరు, లేదా ఆయనకు ఎదురు తిరగరు, వారు ఆదాము హవ్వల నాటి వారి అసలు జీవితానికి మళ్ళుతారు. విశ్రాంతిలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు మరియు మానవుల జీవితాలు, గమ్యస్థానాలు ఇవే. సాతానుకు, దేవుడికి మధ్య జరిగే యుద్ధంలో సాతాను అపజయం అనేది తప్పనిసరి. దేవుడు తన నిర్వహణ కార్యాన్ని ముగించి విశ్రాంతిలోనికి ప్రవేశించడం లాగే, మానవుల రక్షణ కార్యం పరిపూర్ణమైన తర్వాత వారు విశ్రాంతిలోనికి ప్రవేశించడం కూడా అనివార్యములైన అంశాలే. మానవులు భూమి మీద, దేవుడు పరలోకంలో విశ్రాంతిని పొందుతారు. మానవులు విశ్రాంతిలో ఉన్న దేవుని ఆరాధించేటప్పుడు, వారు భూమిపై నివసిస్తారు, దేవుడు మిగిలిన మానవులను విశ్రాంతిలో నడిపించేటప్పుడు, ఆయన వారిని భూమి మీద నుండి కాకుండా పరలోకం నుండి నడిపిస్తాడు. దేవుడు అప్పటికీ ఆత్మరూపిగానే ఉంటాడు కాగా, మానవులు ఇంకనూ శరీరంతోటే ఉంటారు. దేవుడు మరియు మానవులు వేర్వేరు విధానాలలో విశ్రాంతిని పొందుతారు. దేవుడు విశ్రాంతిలో ఉన్నప్పుడు, ఆయన వచ్చి మనుష్యుల మధ్య అగుపరచుకుంటాడు; మనుష్యులు విశ్రాంతి పొందేటప్పుడు, వారు పరలోకాన్ని దర్శించడానికి, అక్కడ జీవితాన్ని ఆస్వాదించడానికి దేవునిచే నడిపించబడతారు దేవుడు మరియు మనుష్యులు విశ్రాంతిలోనికి ప్రవేశించిన తర్వాత, సాతాను ఇక ఉనికిని కలిగి ఉండడు; అదే విధంగా, ఆ దుర్మార్గులు కూడా తమ ఉనికిని కోల్పోతారు. దేవుడు మరియు మానవులు విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి ముందు, దేవుడిని భూమిపై హింసించిన ఆ దుష్టులు, ఆయనకు అవిధేయులుగా ఉన్న ఆయన శత్రువులు ముందుగానే నాశనం చేయబడతారు; అంత్యదినాలలో సంభవించే గొప్ప వైపరీత్యాల వల్ల వారు నిర్మూలం చేయబడతారు. అట్టి దుర్మార్గులు సమూలంగా నాశనం చేయబడిన తర్వాత, ఇక భూమిపై సాతాను వేధింపులు ఎన్నటికీ ఉండవు. అప్పుడే మానవాళి సంపూర్ణ రక్షణను పొందుకుంటుంది, మరియు దేవుని కార్యం సంపూర్తి చేయబడుతుంది. విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి దేవుడు మరియు మనుష్యులు ముందుగా పూర్తి చేయవలసినవి ఇవే.

అన్ని విషయముల అంతము సమీపించుట అనేది దేవుడి కార్యం సంపూర్ణమవ్వడాన్ని సూచించడంతో పాటు, మానవ జాతి అభివృద్ధికి ముగింపును కూడా తెలియజేస్తుంది. సాతానుచే చెడిపోయిన మానవులు, వారి పురోగతిన అంతిమ దశకు చేరుకున్నారని, ఆదాము మరియు హవ్వల సంతానము తమ విస్తరణను పూర్తి చేసుకుందనీ దీనర్థం. సాతానుచే పాడైపోయిన అట్టి మనుష్యులకు వారి విస్తరణను కొనసాగించడం అసాధ్యం అని కూడా దీనర్థం. ఆదిలో ఆదాము మరియు హవ్వలు చెడిపోలేదు, కానీ ఏదేను తోట నుండి గెంటివేయబడిన ఆదాము హవ్వలు సాతానుచే చెడిపోయారు. దేవుడు మరియు మానవులు కలిసి విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు, ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడిన ఆదాము, హవ్వలు, వారి సంతానము చివరకు అంతముకు చేరుకుంటారు. అప్పటికీ భవిష్యత్తు మానవ జాతి ఆదాము, హవ్వల సంతానాన్ని కలిగి ఉంటుంది, అయితే వారు సాతాను అధికారము క్రింద నివసించేవారై ఉండరు. బదులుగా, రక్షించబడి, శుద్ధీకరించబడిన వారుగా ఉంటారు. వీరు తీర్పునొంది, శిక్షనొందిన పరిశుద్ధులైన ప్రజలు. ఈ ప్రజలు మానవ జాతిని పోలి ఉండరు; ఆదిలోని ఆదాము హవ్వలను కూడా పోలియుండక పుర్తిగా భిన్నమైన జనాంగంగా ఉంటారని చెప్పవచ్చు. సాతానుచే చెడిపోయిన వారందరిలో నుండి వీరు ఎంపిక చేయబడినవారు, వీరు దేవుడి తీర్పు మరియు శిక్ష అమలైన సమయంలో చివరివరకు దృఢంగా నిలిచినవారు; వీరు చెడిపోయిన మానవజాతిలో మిగిలిన వారు. వీరు మాత్రమే దేవుడితో పాటు అంతిమంగా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. అంత్య దినాల్లో దేవుడి తీర్పు కార్యం మరియు శిక్ష కార్యం అమలైన సమయంలో—అంటే, అంతిమ శుద్ధీకరణ కార్యం జరిగేటప్పుడు చివరి వరకు దృఢంగా నిలిచినవారు మాత్రమే దేవునితో కూడా అంతిమ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు; విశ్రాంతిలోనికి ప్రవేశించే వారందరూ సాతాను ప్రభావం నుండి బయటపడి, దేవుని అంతిమ శుద్ధీకరణ కార్యం గుండా వెళ్ళిన తర్వాత దేవుడిచే పొందబడినవారు. దేవునిచే అంతిమంగా పొందబడిన ఈ మానవులు, అంతిమ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. జనులను శుద్ధీకరించి, వారిని అంతిమ విశ్రాంతి కొరకు సిద్ధం చేయ డం అనేది దేవుని శిక్ష మరియు తీర్పు కార్యాలకొరకు ఉద్దేశించబడినది; అట్టి శుద్ధీకరణ లేకుండా, మానవులలో ఎవరూ వారి వారి స్వభావాలను బట్టి వర్గీకరించబడలేరు, లేదా విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు. ఈ కార్యం మానవులు విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి ఏకైక మార్గం. దేవుడి శుద్ధీకరణ కార్యం మాత్రమే మనుష్యులను వారి దుర్నీతి నుండి శుద్ధి చేయగలదు, అలాగే ఆయన శిక్ష మరియు తీర్పు కార్యాలు మాత్రమే మానవులలో ఉన్న అవిధేయ శక్తులను వెలుగులోనికి తీసుకువచ్చి, తద్వారా రక్షింపబడలేని వారి నుండి రక్షింపబడగలిగే వారిని, నిలువలేని వారి నుండి నిలువగలిగే వారిని ప్రత్యేకింగలదు. ఈ కార్యం ముగిసినప్పుడు, నిలువడానికి అనుమతించబడినవారు శుద్ధీకరించబడి మానవులలో ఉన్నత స్థాయిలోనికి ప్రవేశించి, భూమిమీద మరింత అద్భుతకరమైన రెండవ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు; మరొక విధంగా చెప్పాలంటే, వారు వారి మానవ విశ్రాంతి దినాన్ని అనుభూతి చెందడం ప్రారంభించి, దేవునితో కలిసి జీవిస్తారు. నిలువడానికి అనుమతించబడని వారు శిక్షించబడి, తీర్పులోనికి వచ్చిన తర్వాత, వారి అసలు రంగులు బట్టబయలు చేయబడి, నాశనం చేయబడి, సాతాను వలె, ఇక భూమిపై జీవించడానికి అనుమతించబడరు. భవిష్యత్ మానవజాతిలో ఇలాంటి వారెవరూ ఉండబోరు; అట్టి వారు శిక్షకు గురవుతారు, వారు దుష్టులు, నీతిమాలిన వారై, అంతిమ విశ్రాంతి లోనికి ప్రవేశించడానికి అర్హులుగా ఉండరు, లేదా దేవుడు మరియు మానవులు కలిసి ఆస్వాదించే ఆ విశ్రాంతి దినంలోనికి ప్రవేశించడానికి తగిన వారు కారు. వారు ఒకప్పుడు విమోచించబడినవారు, వారు తీర్పులోనికి వచ్చి దేవునిచే శిక్షించబడినవారు; వారు ఒకప్పుడు దేవుని సేవలో ఉన్నవారు. అయితే, అంతిమ దినం వచ్చినప్పుడు, వారి దుష్టత్వం కారణంగా, అవిధేయత మరియు విమోచించబడటానికి వారి అయోగ్యత ఫలితంగా వారు నిర్మూలించబడి, నాశనం చేయబడతారు; భవిష్యత్ లోకంలో ఉండటానికి వారిక ఎన్నటికీ తిరిగిరారు, అలాగే భవిష్యత్తులోని మానవజాతిలో వారు ఎప్పటికీ నివసించరు. పరిశుద్ధులందరూ విశ్రాంతిలోనికి ప్రవేశించిన తర్వాత మరణించిన ఆత్మలైనా లేదా శరీరముతో ఇంకనూ నివసిస్తున్నవారైనా, దుష్టత్వముననుసరించు నడుచుకొను వారందరూ మరియు రక్షించబడని వారందరూ నాశనం చేయబడతారు. దుష్టత్వముననుసరించే ఆత్మలు మరియు మానవులు లేదా నీతిమంతుల ఆత్మలు మరియు వారుంటున్న శకంతో నిమిత్తం లేకుండా నీతిననుసరించి నడుచుకునే వారు, వీరందరి విషయంలో దుష్టత్వముననుసరించి నడుచుకునేవారందరూ నాశనం చేయబడతారు, కాగా నీతిమంతులు మాత్రం జీవించియుంటారు. ఒకరు రక్షణను అందుకుంటారో లేదో అనేది పూర్తిగా అంతిమ యుగంలో జరిగే కార్యంపై ఆధారపడి ఉండదు కానీ వారు దేవుడిని ఎదిరించి ఆయనకు విధేయులైన దానిపై ఆధారపడి ఉంటుంది. గత శకంలో దుష్టత్వమును జరిగించి, రక్షణను పొందుకోలేకపోయినవారు నిస్సందేహంగా శిక్షకు పాత్రులవుతారు, అలాగే ప్రస్తుత శకంలో నివసిస్తూ రక్షణను పొందలేని వారు కూడా నిస్సందేహంగా శిక్షకు పాత్రులవుతారు. మనుష్యులు వారు నివసించే కాలాన్ని బట్టి కాక వారు చేసే మంచి, చెడుల ఆధారంగా వర్గీకరించబడతారు. ఒక్కసారి ఆ విధంగా వర్గీకరించబడిన తర్వాత వారు వెంటనే శిక్షించబడరు లేదా బహుమానం పొందరు, కానీ అంత్య దినములలో తన ఆధీనములోనికి తెచ్చుకోవడం ముగించిన తర్వాతే దేవుడు దుష్టులను శిక్షించడం కానీ మంచికి బహుమానం అందించడం గానీ చేయడం జరుగుతుంది. నిజానికి, దేవుడు మానవుల రక్షణ కార్యాన్ని మొదలుపెట్టిన నాటి నుండి మంచినీ చెడులను వేరుచేస్తూనే ఉన్నాడు. ఆయన తన పనిని ముగించిన తర్వాతే నీతిమంతులకు బహుమానాన్నీ, దుష్టులకు శిక్షను అందిస్తాడు; కానీ ఆయన పనిని అంతయూ పూర్తి చేసి ముగించిన తర్వాత, అప్పుడు మనుష్యులను సమూహాలుగా వర్గీకరించి, ఆ వెంటనే దుష్టులను శిక్షించే మరియు నీతిమంతులకు బహుమానాన్నిచ్చే కార్యాన్ని తలపెట్టడు. బదులుగా, ఆయన కార్యము పూర్తిగా ముగిసిన తర్వాతే ఈ పని జరుగుతుంది. అంతిమంగా దేవుడు దుష్టులను శిక్షించి మంచివారికి బహుమానమిచ్చే ప్రక్రియ ఉద్దేశం మానవులను సమూలంగా శుద్ధీకరించడమే, తద్వారా ఆయన పూర్తిగా పరిశుద్ధులైన సమాజాన్ని మాత్రమే శాశ్వత విశ్రాంతిలోనికి తీసుకెళ్ళగలుగుతాడు. ఆయన పనిలోని ఈ దశ చాలా కీలకమైనది; ఇది ఆయన నిర్వహణ కార్యం మొత్తానికి అంతిమ దశ. దేవుడు దుష్టులను నాశనం చేసియుండక, వారిని ఉండనిస్తే, మానవులందరూ విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు, అలాగే దేవుడు మానవులందరినీ మెరుగైన రాజ్యంలోనికి తీసుకెళడం సాధ్యం కాదు. అలాంటి పని సంపూర్ణమైనది కాదు. ఆయన పని ముగిసినప్పుడు, మానవాళి అంతయూ పరిశుద్ధమైనదిగా ఉంటుంది; ఈ విధంగా మాత్రమే దేవుడు ప్రశాంతంగా తన విశ్రాంతిని అనుభవించగలుగుతాడు.

ఈ రోజుల్లో ప్రజలు శరీర కార్యాలను విడిచిపెట్టడం లేదు; వారు శరీర సుఖం, లోకం, డబ్బు, లేదా వారి చెడు స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. చాలా మంది ఆసక్తి లేకయే దేవుని వెంబడిస్తున్నారు. నిజానికి ఇలాంటి జనులు వారి హృదయాల్లో దేవుడికి స్థానాన్ని ఏ మాత్రమూ ఇవ్వరు, వారు దేవుడికి భయపడరు. వారి హృదయాల్లో దేవుడిని కలిగి ఉండరు, కాబట్టి దేవుడు చేసేవన్నీ వారు అనుసరించలేరు, అలాగే దేవుడు పలికే మాటల యందు వారు చాలా స్వల్ప విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉంటారు. అట్టి వారు అధిక శరీరానుసారులు; వారు బొత్తిగా చెడిపోయి తమయందు సత్యమును ఏ మాత్రమూ కలిగి లేనివారు. ఇంకా ఏమిటంటే, అసలు దేవుడు శరీరధారిగా మారగలడని వారు విశ్వసించరు. మానవావతారిగా వచ్చిన దేవుడిని విశ్వసించని వారందరూ—అంటే, దృశ్యరూపియైన ఉన్న దేవుడిని, ఆయన కార్యాలను మరియు మాటలను విశ్వసించకుండా పరలోకమందున్న అదృశ్యుడైన దేవుడిని మాత్రమే ఆరాధించేవారే—తమ హృదయములలో దేవుడిని కలిగి ఉండనివారు. అట్టివారు తిరుగుబాటు స్వభావము గలవారై దేవుని ఎదిరించేవారుగా ఉంటారు. వారిలో మానవత్వం మరియు సత్యం గురించి పలకడానికి హేతువేదీ ఉండదు. ఇంకా, వీరి దృష్టిలో దృశ్యుడైన, శరీరధారియైన దేవుడు విశ్వసించదగిన వాడు కాదు కానీ, అదృశ్యుడైన, శరీరరహితుడైన దేవుడే అధికంగా నమ్మదగినవాడు మరియు సంతోషాన్నిచ్చే దేవుడు. వారు అసలు సత్యాన్ని ఆశించడం లేదు, లేదా వారు నిజమైన జీవిత ఉద్దేశాన్ని ఆశించడం లేదు; దేవుని చిత్తాన్నైతే అస్సలు ఆశించడం లేదు. బదులుగా, వారు వారికి సంతోషాన్నిచ్చే దాని కోసం చూస్తున్నారు. వారి స్వీయ కోరికలను సంతృప్తిపరిచే వాటినే వారు నిస్సందేహంగా విశ్వసించి కోరుకునేవారు. వారి స్వీయ కోర్కెలను తీర్చుకోవడం కోసం మాత్రమే వారు దేవుడిని విశ్వసిస్తారు, సత్యాన్ని వెదకడం కోసం కాదు. అలాంటి వారు చెడు నడత నడిచే వారు కారా? వారు అతిగా ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండి, తమవంటి “మంచివారిని” పరలోకమందున్న దేవుడు నశింపజేస్తాడని ఏమాత్రమూ విశ్వసించరు. బదులుగా, దేవుడు వారిని బ్రతుకనిస్తాడని, దేవుడి కోసం అనేక కార్యాలు చేసినందుకు మరియు దేవుని యెడల గణనీయమైన “నమ్మకత్వాన్ని” ప్రదర్శించినందుకు దేవుడు వారికి అద్భుతమైన రీతిలో బహుమానాలు అందిస్తాడనీ విశ్వసిస్తారు. వారు దృశ్యుడైన దేవుడిని వెంబడించాల్సి వస్తే, వారి కోరికలు నెరవేరవని తెలుసుకోగానే వారు దేవునికి ఎదురుతిరుగుతారు లేదా కోపంతో మండిపడతారు. వారు తమ స్వకీయ దురాశలను తీర్చుకోవడానికి మాత్రమే ఆశిస్తూ ఉండే కుక్కపిల్లల వలె కనిపిస్తారు; వారు సత్యాన్ని అనుసరించడంలో యధార్ధవంతులైన వారు కారు. అట్టి వారు క్రీస్తును అనుసరించే దుష్టులుగా పిలువబడతారు. సత్యాన్ని ఆశించని అటువంటి వారు సత్యాన్ని విశ్వసించడం కూడా అసాధ్యం, వారందరూ దృశ్యుడైన దేవుడిని, ఆయన కార్యాలు లేదా మాటలను విశ్వసించరు కాబట్టి మానవాళి భవిష్యత్ ఫలితాన్ని అస్సలు గ్రహించలేరు—వారు మానవుల భవిష్యత్ గమ్యస్థానాన్ని కూడా విశ్వసించలేరు. కాబట్టి, వారు దృశ్యుడైన దేవుడిని అనుసరించినప్పటికీ, వారు ఇంకనూ దుష్టత్వములోనే ఉంటూ సత్యాన్ని ఆశించని వారుగా లేదా వారికి అవసరమైన సత్యాన్ని అనుసరించే వారుగా ఉండరు. తాము నశిస్తామని నమ్మని వారే, నాశనం చేయబబడే వారు. వారందరూ తమకు తాము గొప్ప వివేకవంతులని అనుకుంటారు, అంతేకాక సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారు తామేనని నమ్ముతారు. వారు అనుసరించే దుష్ట ప్రవర్తనే సత్యమని నమ్మి అందులో ఆనందిస్తూ ఉంటారు. అట్టి దుర్మార్గులు అతి ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటారు; వారు సత్యాన్ని సిద్ధాంతంగా, వారి చెడుతనాన్ని సత్యంగా వెల్లడిస్తారు, కానీ అంతములో వారు విత్తిన దానినే వారు కోయగలుగుతారు. ప్రజలు ఎంత ఎక్కువగా అతి ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటే, అంత అధికంగా దురుసైన ప్రవర్తను కలిగి ఉంటారు, వారు సత్యాన్ని పొందలేకపోయే కొద్దీ దేవుడిని ఎదిరిస్తూ ఉంటారు. ఇలాంటి వారే దేవుడిచే శిక్షించబడతారు. మానవాళి విశ్రాంతిలో ప్రవేశించడానికి ముందు, జనులు సత్యాన్ని వెదికారా, దేవుడిని తెలుసుకున్నారా, మరియు దృశ్యుడైన దేవుడికి తమను తాము సమర్పించుకున్నారా అనే అంశాలపై ఆధారపడి ఏయే వ్యక్తులు శిక్షించబడతారో, ఎవరెవరు బహుమానాన్ని అందుకుంటారో నిర్ణయించబడుతుంది. దృశ్యుడైన దేవుడిని సేవించినప్పటికీ కూడా ఆయనను ఎరుగని వారు లేదా ఆయనకు సమర్పించుకొనని వారు సత్యమును కలిగి ఉండరు. అట్టి వారు చెడుతనమును జరిగించువారు, చెడుతనమును జరిగించేవారు నిస్సందేహంగా శిక్షించబడతారు; ఇంకా, వారి చెడు ప్రవర్తనను బట్టి వారు శిక్షించబడతారు. మనుష్యులు దేవుడిని విశ్వసించాలి, ఆయన యెడల వారు విధేయతను కూడా చూపించాల్సిన యోగ్యతను దేవుడు కలిగి ఉన్నాడు. కనిపించని, అస్పష్టమైన దేవుడిని మాత్రమే విశ్వసించేవారు, దేవుడిని అసలు నమ్మని వారు, వీరు దేవునికి తమను తాము సమర్పించుకొనలేరు. దేవుడు తన ఆధీన కార్యాన్ని ముగించే సరికి, వీరు ఇంకనూ దృశ్యుడైన దేవుని యందు విశ్వాసముంచడం నేర్చుకోక, వారి అవిధేయతలోనే కొనసాగుతూ శరీరధారియైన దేవుడికి లోబడని వారుగా, ఎదిరించే వారుగా ఉంటే, “దైవ అస్పష్టావతార వాదులు” నిస్సందేహంగా నాశన పాత్రులవుతారు. తమ నోటి మాటల ద్వారా దేవుడిని గుర్తించి, శరీరావతారియైన దేవుడికి సమర్పించుకోవాలి అనే సత్యాన్ని సాధన చేయని—మీలోని కొంతమంది వలె ఉండేవారు పరిత్యజించబడి నశింపజేయబడతారు. ఇంకా, దృశ్యుడైన దేవుడిని గుర్తిస్తున్నట్లు తమ నోటి ద్వారా ఒప్పుకుంటూ, ఆయన వెల్లడి చేసిన సత్యాన్ని భుజిస్తూ, పానము చేస్తూ మరోవైపు అస్పష్టమైన, అదృశ్యుడైన దేవుడిని కూడా వెదికే వారు భవిష్యత్తులో కచ్చితంగా నాశనం చేయబడుటకు పాత్రులు అవుతారు. దేవుడి కార్యం ముగిసిన తర్వాత విశ్రాంతి సమయం వచ్చేవరకూ వీరిలో ఏ ఒక్కరూ నిలిచియుండలేరు, అలాంటి వారిని పోలిన ఏ వ్యక్తీ ఆ విశ్రాంతి సమయంలో నిలిచియుండలేడు. అపవిత్రాత్మను కలిగి ఉన్న వారు సత్యాన్ని సాధన చేయలేరు; దేవుడిని ఎదిరించడం మరియు ఆయనకు అవిధేయతను చూపించడం వారి లక్షణం, అంతేకాక దేవుడికి సమర్పించుకోవాలనే ఆలోచనను ఏ మాత్రమూ కలిగి ఉండరు. అలాంటి వారు నాశనం చేయబడతారు. మీలో సత్యమును కలిగి ఉన్నారా మీరు దేవుడిని ఎదిరిస్తున్నారా అనేది మీ బాహ్య ప్రవర్తన ద్వారా లేక అప్పుడప్పుడు మీరు మాట్లాడే లేదా ప్రవర్తించే విధానాన్నిబట్టి కాకుండా మీ ఆంతరంగిక స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి నాశనం చేయబడతాడా లేదా అనేది ఆ వ్యక్తి లక్షణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది; ఒకని ప్రవర్తన మరియు సత్యాన్వేషణను బట్టి ఈ విషయం బయటపడుతుంది. చేసే పనిలో సారూప్యత కలిగిన వారు మరియు ఒకేలాంటి పనిని చేసేవారు, మంచి మానవ లక్షణాలను కలిగి ఉన్నవారు మరియు సత్యాన్ని కలిగి ఉన్నవారు నిలిచి ఉంటారు, అదే విధంగా చెడు మానవ స్వభావాన్ని కలిగి ఉన్నవారు మరియు దృశ్యుడైన దేవుడికి అవిధేయత చూపించే వారు నాశనపాత్రులవుతారు. మానవుల గమ్యస్థానానికి సంబంధించిన దేవుడి కార్యాలు లేదా మాటలన్నీ మనుష్యుల స్వభావాన్ని బట్టి తగిన విధంగా వారితో వ్యవహరిస్తాయి; ఈ విషయంలో చిన్న దోషం కూడా ఏర్పడదు, చిన్న తప్పు కూడా దొర్లదు. మానవ భావోద్వేగాలు మరియు అర్థాలు ఒకదానికొకటి పొసిగే పనులను మనుష్యులు చేసినప్పుడే ఇలా జరుగుతుంది. దేవుడు చేసే పని చాలా ఖచ్చితంగా తగినట్లు ఉంటుంది; ఆయన ఖచ్చితంగా ఏ ప్రాణిపై అబద్ధ ఆరోపణలు చేయడు. మానవుల భవిష్యత్ గమ్యస్థానాన్ని వెంబడించలేకపోతున్న వాళ్ళు మరియు నేను చెప్తున్న మాటలను నమ్మలేని వాళ్ళు ప్రస్తుతానికి అనేకమంది ఉన్నారు. నమ్మని వారందరూ, అలాగే సత్యమును సాధకం చేయని వారందరూ దెయ్యాలే!

ఈరోజుల్లో, సత్యాన్ని కోరువారు మరియు కోరని వారు పూర్తిగా రెండు విభిన్నమైన రకాలైన ప్రజలుగా ఉన్నారు, వారి గమ్యస్థానాలు కూడా భిన్నంగానే ఉంటాయి. సత్యమును గుర్చిన జ్ఞానాన్ని కోరుతూ దానిని అనుసరించే వారందరికీ దేవుడు తన రక్షణను అందిస్తాడు. నిజమైన మార్గాన్ని ఎరుగని వారు అపవిత్రాత్మలు మరియు శత్రువులు; వరు ప్రధాన దూత సంతానము మరియు వారు నాశన పాత్రులు. అస్పష్టరూపి అయిన దేవుని యందు అధిక విశ్వాసాన్ని కలిగిన వారు—వారు కూడా అపవిత్రాత్మలు కారా? మంచి మనస్సాక్షిని కలిగి ఉండి కూడా సత్య మార్గాన్ని అంగీకరించని వారు అపవిత్రాత్మలు; దేవుడికి ఎదురు తిరగడమే వారి స్వభావం. సత్య మార్గాన్ని అంగీకరించని వారు దేవుడిని ఎదిరించే వారు అనేక శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ నాశనం చేయబడతారు. ఈ లోకాన్ని, తమ తల్లిదండ్రులను, తమ శరీర సుఖానందాలను విడిచిపెట్టలేని వారందరూ దేవుడికి అవిధేయులే, వీరందరూ నాశనమునకు పాత్రులు. శరీరావతారియైన దేవుడిని విశ్వసించని వారెవరైనా అపవిత్రాత్మ సంబంధులు మరియు నాశన పాత్రులు. విశ్వాసమును కలిగి ఉండియూ సత్యమును అనుసరించని వారు, శరీరధారియైన దేవుడిని నమ్మని వారు, మరియు దేవుడి ఉనికినే నమ్మని వారు కూడా నాశనం చేయబడతారు. శుద్ధీకరణ శ్రమలలో స్థిరంగా నిలబడిన వారే నిలిచి ఉండటానికి అనుమతించబడతారు; వీరు శ్రమలను సహించిన వారు. దేవుడిని గుర్తించని వారెవరైనా వారు శత్రువులే; అంటే శరీరావతారియైన దేవుడిని గుర్తించని వారు—వారు ఈ వర్గంలో ఉన్నవారైనా లేనివారైనా—వారు క్రీస్తువిరోధులే! సాతానెవరు, అపవిత్రాత్మలెవరు, దేవుడికి శత్రువులెవరు వీరంతా దేవుని యందు విశ్వాసముంచని తిరుగుబాటుదారులు కాకపోతే మరెవరు? వీరందరూ దేవునికి అవిధేయులైన వారు కారా? వీరంతా విశ్వాసముందని చెప్పుకొంటూ సత్యమును కలిగి ఉండక జీవిస్తున్నవారు కారా? వీరంతా దేవుడి ఆశీర్వాదాలను మాత్రమే కోరుకుంటూ దేవుడికి సాక్షిగా ఉండని వారు కారా? మీరు ఈరోజుకూ ఆ దెయ్యాలతో కలిసి వారిపై మీ మనసులో ప్రేమను కలిగి ఉంటున్నారు, కానీ ఈ సందర్భంలో మీరు సాతాను పట్ల సదుద్దేశాన్ని చూపిస్తున్నవారు కావడం లేదా? మీరు దెయ్యాలతో కూడిలేరా? ఈ రోజుల్లోని ప్రజలు దేవుడికి దుష్టత్వానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేనివారిగా ఉంటూ దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశాన్ని కలిగి లేకుండా గుడ్డి ప్రేమాకనికరాలను చూపిస్తూ ఉంటే లేదా ఏదైనా విధంగా దేవుడి తలంపులను తన స్వంత తలంపులుగా తలంచేవారుగా ఉంటే, అట్టివారి అంతం మరింత భయంకరంగా ఉంటుంది. శరీరరూపియైన దేవుడిని విశ్వసించలేనివాడెవడైనా దేవుడికి శత్రువుగానే పరిగణించబడతాడు. నీవు అట్టి ఒక శత్రువుపై నీ మనసులో ప్రేమను కలిగి ఉంటే, నీవు నీతిమాలిన వాడవు కావా? నేను హేయపడే మరియు నేను సమ్మతింపని వాటితో నీవు జతగా నడుస్తూ వారిపై ఇంకనూ ప్రేమను మరియు వ్యక్తిగత అభిమానాన్ని కలిగి ఉంటే, నీవు అవిధేయతలో ఉన్నట్టు కాదా? నీవు ఉద్దేశపూర్వకంగా దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం లేదా? అటువంటి వ్యక్త్లిలో సత్యము ఉంటుందా? జనులు, శత్రువుల పట్ల మనస్సాక్షిని, దెయ్యాల పట్ల ప్రేమను, సాతాను పట్ల కనికరాన్ని కలిగి ఉంటే, వారు ఉద్దేశపూర్వకంగా దేవుని పనికి విఘాతం కలిగించడం లేదా? అంత్యదినములలో కేవలం యేసును మాత్రమే నమ్ముతూ శరీరావతారియైన దేవుడిని నమ్మని వాళ్ళు మరియు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉన్నట్టు నోటితో పలుకుతూ చెడుతనమును జరిగించేవారందరూ క్రీస్తువిరోధులు, ఇక దేవుడిని నమ్మని వాళ్ల గురించైతే అసలు చెప్పనవసరం లేదు. వీరందరూ నశింపజేయబడతారు. ఒక మనిషి మరొక మనిషికి తీర్పు తీర్చడానికి ప్రమాణం వారి ప్రవర్తనే; మంచిని జరిగించే వారందరూ నీతిమంతులు కాగా, చెడు ప్రవర్తన జరిగించే వారందరూ దుష్టులు. దేవుడు మనుష్యులను తీర్పు తీర్చడానికి, స్వభావంలో వారు దేవుడికి సమర్పించుకున్నారా లేదా అనేదే ప్రమాణం; దేవునికి లోబడేవారు నీతిమంతులు కాగా, లోబడని వారు మాత్రం, వారి ప్రవర్తన బాగుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా మరియు వారు సరిగా మాట్లాడుతున్నారా లేదా అనే దానిపై ఆధారపడకుండా శత్రువులు మరియు దుష్టులుగా ఎంచబడతారు. కొంతమంది భవిష్యత్తులో మంచి గమ్యస్థానాన్ని పొందడానికి సత్క్రియలను ఉపయోగించాలని కోరుకుంటారు, కొంతమందేమో మంచి మాటల ద్వారా మంచి గమ్యస్థానం చేరాలని ఆశిస్తారు. మనుష్యుల ప్రవర్తనను లేదా వారు మాట్లాడే విధానాన్ని చూసిన తర్వాత దేవుడే స్వయంగా మనుష్యుల ఫలితాలను నిర్ణయిస్తాడని చాలా మంది అపార్థం చేసుకుంటారు; కాబట్టే అనేకులు దేవుడు వారికి క్షణిక కరుణను చూపించేలా దేవుడిని మోసం చేయడానికి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుందామని అనుకుంటారు. భవిష్యత్తులో, విశ్రాంతిలో నిలిచే వారందరూ శ్రమ దినాన్ని సహించి దేవునికి సాక్షులుగా నిలుస్తారు; వారందరూ తమ పనులను చక్కగా నిర్వర్తించి ఎంతో కోరికతో దేవుడికి తమను తాము సమర్పించుకొనిన వారై ఉంటారు. సత్యాన్ని అనుసరించకుండా ఉండాలనే ఉద్దేశంతో సేవ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మాత్రమే కోరుకునేవాళ్ళు విశ్రాంతిలో నిలవడానికి అనుమతించబడరు. ప్రతి వ్యక్తికీ తగిన ఫలమివ్వడానికి దేవుడికి తగిన ప్రమాణాలు ఉన్నాయి; దేవుడు కేవలం ఒకని మాటలు మరియు ప్రవర్తనను చూచి లేదా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఎలా ప్రవర్తిస్తున్నాడో అనే దానిని చూచి తన నిర్ణయాలు తీసుకోడు. ఒకడు గతంలో తనకు సేవ చేసిన కారణంగా వాడి దుష్ట ప్రవర్తనను దేవుడు చూసి చూడనట్లుగా అసలే మాత్రం ఉండడు, లేదా అతడు దేవుడి కొరకు ఎప్పుడో ఒకసారి చేసిన వ్యయాన్ని బట్టి అతడిని మరణం నుండి తప్పించడు. తమ దుష్టత్వానికి వచ్చే శిక్షను ఎవ్వరూ తప్పించుకోలేరు, అలాగే ఎవరూ తమ దుష్ట ప్రవర్తనను కప్పిపుచ్చుకొని నాశన వ్యధలను తప్పించుకోలేరు. ప్రజలు తమ స్వంత బాధ్యతలను నిజంగా నిర్వర్తించగలిగితేనే, వారు దేవుని ఆశీర్వాదములు పొందుకున్నా లేక కీడును పొందుకున్నా వాటితో సంబంధం లేకుండా వారు నిత్యకాలం నమ్మకంగా ఉంటూ బహుమతులను ఆశించని వారని అర్థం. ప్రజలు, వారు ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండి, ఆశీర్వాదాలు రానప్పుడు దేవుని నమ్మకత్వాన్ని కోల్పోతే, అంతములో, వారు దేవునికి సాక్షులుగా ఉండలేరు లేదా వారిపై ఉన్న బాధ్యతలను నెరవేర్చలేరు, ఇలాంటి వారు, వారు గతంలో దేవునికి నమ్మకమైన సేవ చేసినప్పటికీ నాశనపాత్రులుగానే ఎంచబడతారు. క్లుప్తంగా చెప్పాలంటే, దుష్టులు నిత్యత్వములో నివసించలేరు, లేదా వారు విశ్రాంతిలో ప్రవేశించలేరు; నీతిమంతులు మాత్రమే విశ్రాంతికి యాజమనులవుతారు. మానవులు సరైన పథంలో ఉన్నప్పుడు, వారు సాధారణ మానవ జీవితాలను అనుభవించగలుగుతారు. వారందరూ తమ తమ బాధ్యతలను చేస్తూ పరిపూర్ణంగా దేవునికి నమ్మకస్తులై ఉంటారు. వారు పూర్తిగా తమ అవిధేయతను, వారు చెడు స్వభావాన్ని త్యజించడమే కాకుండా అవిధేయతను మరియు ప్రతిఘటన స్వభావాన్ని మానుకొని దేవుని కొరకు జీవిస్తారు. వారందరూ దేవునికి పూర్తిగా సమర్పించుకోగలుగుతారు. ఇది దేవుడు మరియు మానవుల జీవితం; ఇదే రాజ్యములోని జీవితంలా మరియు విశ్రాంతి జీవితంగా ఉండబోతుంది.

అసలేమాత్రం దేవునిపై విశ్వాసం కలిగి ఉండని తమ పిల్లలను, బంధువులను చర్చికి లాక్కొచ్చే వారందరూ స్వార్ధపరులు, వారు కేవలం వారి దయను ప్రదర్శిస్తున్నారు. వీరు ఎదుటి వారికి దేవుని యందు విశ్వాసముందా లేదా అని చూడకుండా లేదా అది దేవుని చిత్తమా కాదా అని పట్టించుకోకుండా కేవలం వారితో ప్రేమగా మెలగటం మీదనే వారి దృష్టిని ఉంచుతారు. కొంతమంది తమ భార్యలను దేవుని యొద్దకు తీసుకువస్తారు, లేదా తల్లిదండ్రులను దేవుని దగ్గరికి లాక్కొని వస్తారు, పరిశుద్ధాత్మ ఈ పనికి సమ్మతిస్తుందా, లేక అసలు వారిలో పని చేస్తుందా అనే విషయాలతో నిమిత్తం లేకుండా వారు గుడ్డిగా దేవుడి కొరకు “తలాంతులు ఉన్న వారిని స్వీకరించడం” కొనసాగిస్తారు. ఈ అవిశ్వాసులపై దయను చూపించడం ద్వారా ఏ ప్రయోజనం కలుగవచ్చు? పరిశుద్ధాత్మ సన్నిధిని కలిగిలేని వారు దేవుడిని అనుసరించడానికి ఎంత పెనుగులాడినప్పటికి వారు దేవుని విశ్వాసులు రక్షించబడినట్లు రక్షించబడలేరు. రక్షణను పొందగలిగే వారిని పొందడం అంతా సులభమేమి కాదు. పరిశుద్ధాత్మ కార్యాన్ని, శ్రమలను అనుభవించని వారు మరియు అవతారి అయిన దేవునిచే పరిపూర్ణులుగా చేయబడని వారు, పరిపూర్ణులు కావడానికి ఏ మాత్రము సమర్ధులు కారు. కాబట్టి, వారు సాధారణంగా దేవుడిని వెంబడించడం మొదలుపెట్టిన దగ్గరి నుండి, వారిలో పరిశుద్ధాత్మ సన్నిధి ఉండదు. వారి పరిస్థితులు మరియు అసలు స్థితులను బట్టి చూసుకుంటే వారు సంపూర్ణులు కాలేరు. పరిశుద్ధాత్మ వారిపై ఎక్కువ శక్తిని వ్యయం చేయాలనుకోడు, అలాగే వారి మనోనేత్రాలు తెరవడం లేదా వారిని ఏ విధంగానైనా వారిని నడిపించడం వంటి పనులు చేయడు; ఇలాంటి వారిని ఆయన కేవలం వెంబడించడానికి మాత్రమే అనుమతిస్తాడు, ఆఖరుకి వారి ప్రతిఫలాలను బయలుపరుస్తాడు—ఇది చాలు. మనుష్యులలో ఆసక్తి మరియు వారి ఉద్దేశలు సాతాను నుండి వస్తాయి, అలాగే ఏ విధంగానూ ఈ క్రియలు పరిశుద్ధాత్మ కార్యాన్ని పూర్తిచేయలేవు. ప్రజలు ఎలాంటి వారైనా సరే, వారు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ కార్యాన్ని వారిలో కలిగి ఉండాలి. మనుష్యులే మనుష్యులను సంపూర్ణులనుగా చేయగలరా? భార్యను భర్త ఎందుకు ప్రేమిస్తాడు? భార్య తన భర్తను ఎందుకు ప్రేమిస్తుంది? పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎందుకు బాధ్యతను కలిగి ఉంటారు? తల్లిదండ్రులు వారి పిల్లలపై పిచ్చి ప్రేమను ఎందుకు కనబరుస్తారు? ప్రజలు అసలు ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉంటారు? వారి ఉద్దేశాలు, వారి స్వీయ ప్రణాళికలను మరియు స్వార్ధ కోర్కెలను తీర్చుకోవడానికి కాదా? వారు నిజంగా దేవుడి నిర్వహణ ప్రణాళిక కోసం పని చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నారా? వారు నిజంగానే దేవుని పని కోసం పని చేస్తున్నారా? వారి ఉద్దేశం సృష్టించబడిన వాటి విధులను నెరవేర్చడమేనా? దేవుడిని విశ్వసించడం మొదలు పెట్టిన క్షణం నుండి పరిశుద్ధాత్మ సన్నిధిని పొందలేకపొతున్న వారు ఎప్పటికీ పరిశుద్ధాత్మ కార్యాన్ని సాధించలేరు; వీరు నిశ్చయముగా నాశనమునకు పాత్రులు. వాటి గురించి వారు ఎంత ప్రేమను కలిగి ఉన్నప్పటికీ, అది పరిశుద్ధాత్మ కార్యాన్ని భర్తీ చేయలేదు. ప్రజలలో ఉండే ఆసక్తి మరియు ప్రేమ వారి మానవ ఉద్దేశలను మాత్రమే ప్రతిబింబిస్తాయి కానీ దేవుని ఉద్దేశాలను ప్రతిబింబించలేవు, మరియు అవి దేవుని కార్యానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉండలేవు. దేవుడిని నామమాత్రంగా విశ్వసిస్తూ, అసలు దేవుడిని విశ్వసించడమంటే ఏమిటో పూర్తిగా అవగాహన కలిగి లేకుండా పైకి మాత్రం ఆయనను వెంబడిస్తున్నట్టు నటిస్తూ ఉండే వారిపై ఎంత అవ్యాజమైన ప్రేమను చూపించినా వారు దేవుడి సానుభూతిని గానీ పరిశుద్ధాత్మ కార్యాన్ని కానీ పొందలేరు. దేవుడిని పూర్తి నిబద్ధతతో అనుసరించేవారు సరియైన సామర్థ్యాలను కలిగి లేనప్పటికీ వారు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ కార్యాన్ని పొందవచ్చు; అయితే, పరిగణించదగ్గ చక్కటి సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ, పూర్తి నిబద్ధతతో దేవుడిని విశ్వాసించని వారు పరిశుద్ధాత్మ సన్నిధిని సాధించలేరు. అటువంటి వారు రక్షణ పొందుకునే అవకాశమే లేదు. వారు దేవుడి వాక్యాన్ని చదివే వారైనా లేదా అప్పుడప్పుడూ వాక్యాలు వినేవారైనా లేదా దేవుడిని స్తుతించేవారైనా చివరికి విశ్రాంతి వరకు నిలిచి ఉండలేరు. ప్రజలు పట్టుదలతో వెదుకుతారా లేదా అనేది వారి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు లేదా వారి చుట్టూ ఉండే ప్రజలు వారిని ఎలా చూస్తున్నారు అనే దానిపై ఆధారపడి నిర్ణయించబడదు కానీ పరిశుద్ధాత్మ వారిపై పనిచేస్తుందా లేదా మరియు వారు పరిశుద్ధాత్మ సన్నిధిని పొందారా లేదా అనే దానిపై ఆధారపడి నిర్ణయించబడుతుంది. ఇంకా, వారి స్వభావాలు మారతాయా అనే దానిపై మరియు వారు కొంత కాలం పాటు పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుభవించిన తర్వాత దేవుని గురించిన జ్ఞానాన్ని ఏమైనా సంపాదించారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిపై పనిచేస్తే, ఆ వ్యక్తి స్వభావం నెమ్మది నెమ్మదిగా మారుతుండమే కాక, దేవుని విశ్వసించడంపై వారి దృక్కోణం కూడా నెమ్మదిగా పవిత్రమవుతుంది. జనులు దేవుడిని ఎంతకాలం పాటు వెంబడిస్తారు అనే దానితో సంబంధం లేకుండా, వారిలో మార్పు కనబడుతున్నంత కాలం పరిశుద్ధాత్మ వారిలో పనిచేస్తున్నట్లే. వారు ఒకవేళ మార్పు చెందకపోతే, పరిశుద్ధాత్మ వారిలో తన కార్యాన్ని జరిగించలేదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ వారు కొంత సేవ చేసినప్పటికీ, ఆశీర్వాదాలు అందుకోవాలనే కోరికతో మాత్రమే వారు ఆ సేవను చేస్తారు. వారి స్వభావాలలో మార్పు లేకుండా అప్పుడప్పుడు సేవ చేయడం అనేది నిరర్ధకమే. అంతిమంగా, రాజ్యంలో సేవలు చేసేవారితో గానీ, స్వభావం మారని వారితో గానీ లేదా పరిపూర్ణులుగా చేయబడి దేవునికి నమ్మకంగా ఉండే వారికి సేవకులుగా ఉండే స్వభావాన్ని ఇంకనూ పొందని వారితో గానీ అవసరం ఉండదు కాబట్టి వారు నశింపచేయబడతారు. “దేవుని యందు విశ్వాసముంచువానికి, తన కుటుంబమంతటిపై అదృష్టం నిలిచి ఉంటుంది” అనే గతంలో పలికిన మాటలు, కృపాకాలానికి తగినవి కానీ మానవుని అంతిమ గమ్యస్థానానికి సంబంధించినావి కావు. అవి కృపాకాలంలో కొంత కాలంపాటు మాత్రమే తగినవి. ప్రజలు అనుభవించిన సమాధానం మరియు వస్తుపరమైన ఆశీర్వాదాలను గురించి ఆ మాటల అర్థం ఉద్దేశించబడింది; దేవుని యందు విశ్వాసముంచిన వాని కుటుంబమంతా రక్షించబడుతుందని ఆ మాటల అర్థం కాదు, లేదా ఒకడు ఆశీర్వాదాలు పొందుకుంటే, అతడి కుటుంబమంతా విశ్రాంతిలోనికి తేబడుతుందని ఆ మాటల అర్థం కాదు. ఒకడు ఆశీర్వాదాలు పొందుకుంటాడా లేక కీడును పొందుకుంటాడా అనేది అతడి వ్యక్తిగత అంశమే తప్ప, అందరితో కలిసి అనుభవించగలిగే ఉమ్మడి అంశం కాదు. అలాంటి నానుడి కానీ నియమం కానీ రాజ్యంలో అసలు ఉండనే ఉండదు. ఒక వ్యక్తి అంతిమంగా నిలువగలిగితే, దానికి కారణం వారు దేవుడి ఆవశ్యకతలను కలిగి ఉండటమే, అదే విధంగా ఒక వ్యక్తి అంతిమ విశ్రాంతి సమయం వరకు నిలువలేకపోతే, దానికి కారణం దేవునికి అవిధేయులుగా ఉంటూ దేవుడికి కావలసిన ఆవశ్యకతలను నెరవేర్చకపోవడమే. ప్రతి ఒక్కరికీ వారికి తగిన గమ్యస్థానం ఉంటుంది. ఈ గమ్యస్థానాలు వారి వారి వ్యక్తిగత స్వభావాన్ని బట్టి నిర్ణయించబడతాయి కానీ, ఇతరుల స్వభావాలతో ఏమాత్రమూ సంబంధం ఉండదు. ఒక పిల్లవాని దుష్ట ప్రవర్తన, అతడి తల్లిదండ్రులకు బదిలీ కానేరదు, లేదా ఒక పిల్లవాని నీతి అతడి తల్లిదండ్రులకు బదిలీ కానేరదు. అదే విధంగా తల్లిదండ్రుల దుష్ట ప్రవర్తన వారి పిల్లలకు బదిలీ కానేరదు, లేదా వారి నీతి వారి పిల్లలకు బదిలీ కానేరదు. ప్రతి ఒక్కరూ వారి పాపములను వారే భరిస్తారు, ప్రతి ఒక్కరూ వారికి ఉద్దేశించబడిన ఆశీర్వాదాలను వారే అనుభవిస్తారు. ఏ ఒక్కరూ మరొకరి స్థానంలో ఉండలేరు; ఇదియే నీతి. తల్లిదండ్రులు ఆశీర్వాదాలను పొందుకుంటే, పిల్లలు కూడా తప్పకుండా మేలును పొందుకోగలుగుతారు, ఒకవేళ పిల్లలు చెడు నడత నడిస్తే. తల్లిదండ్రులు వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించాల్సి ఉంటుందని మనుష్యుల ఉద్దేశం. ఇది మానవ ఆలోచనా విధానం మరియు మానవ రీతిలో పనులను చేయడం; ఇది దేవుడి ఆలోచనా విధానం కాదు. ప్రతి ఒక్కరి ఫలితం వారి ప్రవర్తన నుండి వచ్చే స్వభావాన్ని బట్టి నిర్ణయించబడుతుంది మరియు అది ఎప్పుడూ సరిగానే ఉంటుంది. ఏ ఒక్కరూ వేరొకరి పాపాలను భరించలేరు; ఇంకా చెప్పాలంటే, ఏ ఒక్కరికి బదులుగా వేరొకరు శిక్షను అనుబభవించరు. ఇది ఖచ్చితం. తల్లిదండ్రులు తమ పిల్లలపై అమితమైన ప్రేమను చూపించినంత మాత్రాన పిల్లలకు బదులుగా వారు నీతి క్రియలను చేయలేరు, లేదా పిల్లలు బాధ్యతతో తమ తల్లిదండ్రులపై శ్రద్ధను కనబరచినంత మాత్రాన వారి తల్లిదండ్రుల స్థానంలో వారు నీతి క్రియలు జరిగించలేరు. “ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును.” తల్లిదండ్రులు తమ పిల్లలను అధికంగా ప్రేమించడం ద్వారా చెడుతనము జరిగిస్తున్న వారి పిల్లల్ని విశ్రాంతిలోనికి తోడుకొని పోలేరు, లేదా ఒక వ్యక్తి తన నీతి క్రియల మూలముగా తన భార్యను (లేదా భర్తను) విశ్రాంతిలోనికి తీసుకెళ్ళలేడు. ఇదొక పాలక నియమము; ఇందులో ఎవరికీ ఏ మినహాయింపు ఉండదు. అంతములో నీతిని జరిగించువారు నీతినే జరిగిస్తూ ఉంటారు, అలాగే దుష్టత్వము జరిగించువారు దుష్టత్వమునే జరిగిస్తూ ఉంటారు. పర్యవసానంగా నీతిమంతులు నిలిచి ఉండగా, దుష్టులు నశింపచేయబడతారు. పరిశుద్ధులు పరిశుద్ధులే; వారు పాతకులు కాదు. పాతకులు పూర్తిగా పాతకులే, వారులో ఒక భాగం పరిశుద్ధంగా ఉండలేదు. దుష్టుల పిల్లలు నీతిక్రియలు జరిగించినప్పటికీ, మరియు నీతిమంతుల తల్లిదండ్రులు చెడు క్రియలు జరిగించినప్పటికీ—దుష్టులందరూ నాశనం చేయబడతారు, నీతిమంతులు నిలిచి ఉంటారు. విశ్వాసి అయిన భర్తకు, అవిశ్వాసియైన భార్యకు మధ్య సంబంధం ఉండదు, అలాగే విశ్వాసులయిన పిల్లలకు, అవిశ్వాసులైన తల్లిదండ్రులకు సంబంధం ఉండదు; ఈ రెండు రకాల వారు పూర్తిగా ఒకరికొకరు సరిపడనివారు. విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి ముందు ఒకనికి శరీర సంబంధులైన బంధువులు ఉంటారు, కానీ ఒక్కసారి విశ్రాంతిలోనికి ప్రవేశించిన తర్వాత, వానికి ప్రస్తావించడానికి ఇక శరీర సంబంధులైన బంధువులెవరూ ఉండరు. తమ బాధ్యతను నెరవేర్చు వారు తమ బాధ్యతను నెరవేర్చని వారికి శత్రువులు; అలాగే దేవుని ప్రేమించేవారు దేవుని ద్వేషించేవారు ఒకరికి ఒకరు విరోధులుగా ఉంటారు. విశ్రాంతిలోనికి ప్రవేశించబోవు వారు మరియు నాశనం చేయబడబోవు వారు ఒకరికొకరు సరిపడే రకమైన జీవులు కారు. తన బాధ్యతను నెరవేర్చగలిగే వారు నిలిచి ఉండగలుగుతారు, కాగా తమ బాధ్యతను నెరవేర్చనివారు నాశన పాత్రులవుతారు; ఇంకా ఏమిటంటే, ఇది నిత్యత్వము అంతయూ కొనసాగుతుంది. నీవు ఒక సృష్టింపబడిన జీవిగా నీ బాధ్యతను నెరవేర్చడం కోసం నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీవు ఒక సృష్టింపబడిన జీవిగా నీ బాధ్యతను నెరవేర్చడం కోసం నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీవు ఒక సృష్టింపబడిన జీవిగా నీ బాధ్యతను నెరవేర్చడం కోసం నీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధను కనబరుస్తున్నావా? దేవుడిపై విశ్వాసముంచడంపై మానవుని దృక్పధం సరియైనదా, కాదా? నీవు దేవుడిని ఎందుకు విశ్వసిస్తావు? నీవు దేనిని పొందాలని ఆశిస్తున్నావు? నీవు దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు? సృష్టించబడిన వారుగా తమ బాధ్యతలను నెరవేర్చని వారు, అలాగే సంపూర్ణ ప్రయత్నం చేయలేని వారు నాశనమునకు అప్పగింపబడతారు. ఈనాటి ప్రజల మధ్య శారీరక సంబంధాలు, రక్త సంబంధాలు నెలకొని ఉంటాయి, కానీ భవిష్యత్తులో అవన్నీ చెదరిపోతాయి. విశ్వాసులకు, అవిశ్వాసులకు పొత్తు కుదరదు; వారు ఒకరికొకరు విరోధులుగా ఉంటారు. విశ్రాంతిలో ఉండేవారు దేవుడున్నాడని నమ్మి ఆయనకు తమను తాము సమర్పించుకుంటారు, దేవుడికి అవిధేయులైన వారు మాత్రం నాశనమవుతారు. భూమిపై ఇకపై కుటుంబాలు ఉండవు; ఇక తల్లిదండ్రులు లేదా పిల్లలు లేదా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండగలవు? విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య పొసగకపోవడం అనేది శరీర సంబంధ బంధవ్యాలను పూర్తిగా ఖండించివేస్తుంది!

మనుష్యులలో ఆదిలో కుటుంబాలు అనేవి ఏమాత్రమూ లేవు; రెండు రకాలైన మనుష్యులు—స్త్రీ మరియు పురుషుడు మాత్రమే ఉన్నారు. దేశాలు లేవు, కుటుంబాల గురించిన ప్రస్తావన లేదు, కానీ మానవులు చెడిపోవడం కారణంగా, అన్ని రకాలైన వారు తెగలుగా, సంతతులుగా విభజించబడి, ఆ తర్వాత దేశాలుగా, జాతులుగా ఏర్పాటయ్యారు. ఈ దేశాలు మరియు జాతులలో చిన్న కుటుంబాలు ఉండేవి, ఈ విధంగా అన్ని రకాల ప్రజలు భాషలను బట్టి మరియు సరిహద్దులను బట్టి వివిధ తెగలుగా విభజించబడ్డారు. వాస్తవానికి, ఈ లోకంలో ఎన్ని తెగలు ఉన్నప్పటికీ, ఈ మనుష్యులమదరికీ మూలం ఒక్కరే. ఆదియందు స్త్రీ మరియు పురుషుడు అనే రెండు రకాల మనుష్యులు మాత్రమే జీవించారు. అయితే, దేవుడి పనిలో పురోగతి, చరిత్రలో వచ్చిన ఉద్యమాలు మరియు భౌగోళిక మార్పుల కారణంగా ఈ రెండు రకాల మానవ జాతులు మరిన్ని రకాలుగా వృద్ధి చెందాయి. అసలు ఇంకా వెనక్కు వెళితే, మానవులలో ఎన్ని తెగలు వృద్ధి చెందినప్పటికీ మానవులంతా దేవుడి సృష్టే. మనుష్యులు ఏ తెగకు చెందిన వారైనప్పటికీ, వారందరూ ఆయన సృష్టించిన వారే; వారందరూ ఆదాము హవ్వల సంతతి వారే. వారు స్వయంగా దేవుని హస్తాలచే రూపొందించబడక పోయినప్పటికీ, వారందరూ దేవుడు తన స్వహస్తాలతో సృజించిన ఆదాము హవ్వల సంతతి వారే. ప్రజలు ఏ రకమైన వారైనప్పటికీ, వారందరూ ఆయనచే సృష్టించబడిన వారే; వారందరూ దేవుడు సృజించిన మానవ జాతికి చెందిన వారు కాబట్టి, మానవులందరికీ ఉండే గమ్యస్థానమే వారికీ ఉంటుంది, వీరందరూ మనుష్యులను క్రమపరిచే నియమాల ద్వారా విభజించబడ్డారు. దీనిని బట్టి మనం ఏమి చెప్పవచ్చంటే, దుష్టులయినా, నీతిమంతులైనా, వారెవరైనా వారందరూ దేవునిచే సృజించబడిన వారే. చెడుతనమును జరిగించే వారందరూ చివరికి నాశనం చేయబడతారు, నీతిని జరిగించే వారందరూ జీవిస్తారు. ఈ రెండు రకాల జీవులకు ఇది అత్యంత తగిన ఏర్పాటు. దుష్టులు, వారి అవిధేయతను బట్టి వారు దేవునిచే సృష్టించబడిన వారైనప్పటికీ సాతాను చేత చెరపట్టబడినవారై రక్షణను పొందలేని కారణంగా వారు జీవించి ఉండలేరు. నీతిగా ప్రవర్తించువారు వారు జీవించియుందురనే సత్యం కారణంగా వారు దేవునిచే సృష్టించబడినవారనే విషయాన్ని తిరస్కరించలేరు, ఎందుకంటే వారు సాతానుచే చెడిపోయిన తర్వాత దేవుని నుండి రక్షణను పొందుకున్నారు. దుష్టులు దేవుడికి అవిధేయులైన జీవులు; వారు సాతానుచే పూర్తిగా చెరపట్టబడి ఇక ఏమాత్రమూ రక్షణ పొందే అవకాశాన్ని కలిగిలేని వారు. దుష్టత్వము జరిగించేవారు కూడా ప్రజలే; వారు తీవ్ర స్థాయిలో చెడిపోయిన మానవులు, వీరు రక్షించబడటం అసాధ్యం. నీతి వర్తనులు కూడా సృజించబడిన వారే కాబట్టి వారు కూడా చెడిపోయినవారే, కానీ వారు వారి చెడు స్వభావాన్ని ఛేదించుకోవడానికి ఇష్టపడి దేవునికి సమర్పించుకొనే సామర్ధ్యాన్ని పొందుకున్నారు. నీతిని జరిగించి నడుచుకొనువారు పూర్తిగా నీతితో నింపబడినవారని కాదు; కానీ వారు రక్షణను అందుకొన్నవారై వారు చెడు స్వభావం నుండి బయటపడిన వారు; వారు దేవుడికి లోబడి ఉండగలరు. వారు జీవితంలో ఎప్పుడూ సాతాను మూలముగా చెడిపోలేదని చెప్పలేము కానీ అంతములో మాత్రం వారు దృఢంగా నిలిచి ఉంటారు. దేవుడి పని ముగిసిన తర్వాత, అతడి సృష్టి అంతటిలో కొంతమంది నాశనం చేయబడతారు, మరికొంతమంది సదాకాలం జీవిస్తారు. ఇది ఆయన నిర్వహణ కార్యంలో తప్పించనశక్యమైనది; దీనిని ఎవరూ తిరస్కరించలేరు. దుష్టులు జీవించడానికి అనుమతించబడరు; దేవుడికి లోబడి, అంతము వరకు ఆయనను వెంబడించువారందరూ నిశ్చయముగా జీవించి ఉంటారు. ఈ పని మానవుల నిర్వహణ కార్యములో భాగం కాబట్టి, మనుష్యులలో కొందరు నిలిచి ఉంటారు, కొందరు పరిత్యజించబడతారు. వేర్వేరు రకాలైన ప్రజలకు వేర్వేరు రకాలైన ఫలితాలు ఉంటాయి, దేవుడు సృష్టించిన వారిగా వారు అత్యంత తగినవారు. మానవులు ఒక్కడే పితరుని నుండి వచ్చారు మరియు వారంతా దేవుని సంతానమే కాబట్టి మానవులను కుటుంబాలుగా విభజించడం, కుటుంబాలు లేదా జాతులను నలుగగొట్టడం దేశాల సరిహద్దులను చెదరగొట్టడమే మానవాళికి దేవుడు ఏర్పాటు చేసిన అంతిమ ఏర్పాటు. క్లుప్తంగా చెప్పాలంటే, దుష్టత్వము ననుసరించి నడుచుకొనే వారందరూ నశింపజేయబడతారు, దేవుడికి లోబడే ప్రాణులందరూ జీవించి ఉంటారు. ఈ విధంగా, విశ్రాంతి సమయం వచ్చే సమయానికి కుటుంబాలు గానీ, దేశాలు గానీ, మరియు ప్రత్యేకించి జాతులు గానీ ఉండవు; ఈ రకమైన మానవ జాతే అత్యంత పరిశుద్ధమైన మానవ జాతి. ఆదాము, హవ్వ అనే మనుష్యులు మొదట భూమిపై ఉండే వాటిని చూసుకోవడానికి సృష్టించబడ్డారు; మానవులు మొదట అన్నింటికీ యజమానులుగా చేయబడ్డారు. మనుష్యులు భూమిమీద నివసిస్తూ దానిపై ఉన్న అన్నింటినీ చూసుకోవడమే మానవులను యెహోవా సృజించడం వెనుకున్న ఉద్దేశం, ఎందుకంటే మానవులు మొదట సృజించబడినప్పుడు వారు చెడిపోయిన వారు కారు, వారు చెడును జరిగించలేనివారిగా సృష్టించబడ్డారు. అయితే, మానవులు చెడిపోయిన తర్వాత, వారు ఇక అన్ని విషయాలను చూసుకొనే వారిగా ఉండే యోగ్యతను కోల్పోయారు. మానవులు కోల్పోయిన ఈ బాధ్యతను, మానవులు మొదట సృష్టించబడిన కారణాన్ని వారు మొదట కలిగి ఉన్న విధేయతను పునరుద్ధరించడమే దేవుడి రక్షణ కార్యపు ఉద్దేశం; తన రక్షణ కార్యం నుండి దేవుడు సాధించాలని ఆశించే ఫలితానికి ప్రతిబింబమే విశ్రాంతిలో ఉండబోయే మానవులు. ఇది ఏదేను తోటలో ఉన్నప్పటి జీవితంలా ఉండకపోయినప్పటికీ, జీవన స్వభావం మాత్రం అదే విధంగా ఉంటుంది; మానవులు ఇదివరకు ఉన్నట్లు చెడిపోయిన స్వభావాన్ని కలిగి ఉండక, చెడిపోయినప్పటికీ రక్షణను అందుకున్న మానవులుగా ఉంటారు. రక్షణను అందుకొన్న వీరందరూ చివరకు (అంటే, దేవుని కార్యం అంతా ముగిసిన తర్వాత) విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. అదేవిధంగా, శిక్షించబడిన వారందరి ప్రతిఫలం కూడా అంతములో పూర్తిగా తేటతెల్లం చేయబడుతుంది, వారు దేవుడి కార్యం ముగిసిన తర్వాత మాత్రమే నశింపజేయబడతారు. మరోవిధంగా చెప్పాలంటే, ఆయన కార్యం ముగిసిన తర్వాత, దుష్టత్వము ననుసరించి నడిచే వారందరూ మరియు రక్షించబడిన వారందరూ బహిర్గతం చేయబడతారు, ఎందుకంటే అన్ని రకాల వారిని (వారు దుష్టత్వముననుసరించి నడిచేవారైనా లేదా రక్షించబడిన వారైనా) తేటతెల్లం చేసే కార్యం, అందరి విషయంలో ఏకకాలంలో జరుగుతుంది. దుష్టత్వముననుసరించి నడుచుకునే వారందరూ నిర్మూలించబడతారు, మరియు అదే సమయంలో నిలిచి ఉండటానికి అనుమతించబడేవారు కూడా బయలుపరచబడతారు. కాబట్టి, అన్ని రకాల ప్రజల ప్రతిఫలం ఒకేసారి బహిర్గతం చేయబడుతుంది. దేవుడు దుష్టులకు తీర్పు తీర్చకుండా లేక వారిని ఒక్కసారికి కొద్దిగానైనా శిక్షించకుండా విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి రక్షణ పొందుకున్న వారిని అనుమతించడు; దేవుడు ఆవిధంగా చేస్తాడనుకోవడం సత్యము కాదు. దుష్టులు నాశనం చేయబడినప్పుడు మరియు జీవించి ఉండే వారందరూ విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు, ఈ విశ్వమంతటిలో దేవుని కార్యం సంపూర్ణమవుతుంది. ఆశీర్వాదాలను అందుకునే వారిలో మరియు కీడును పొందుకునే వారిలో, తమ ప్రతిఫలాన్ని ఎవరు ముందు అందుకుంటారనే ప్రాధాన్యతా క్రమం ఏదీ ఉండదు; ఆశీర్వాదాలను అందుకునే వారు సదాకాలము జీవిస్తారు, కీడును పొందుకునే వారు నిత్య నాశనమును పొందుతారు. దేవుడి కార్యంలోని ఈ రెండు దశలు ఏకకాలంలో సంపూర్తి చేయబడతాయి. అవిధేయులైన వారు ఉండటం వలనే దేవునికి లోబడి ఉండే వారి నీతి సరియైన విధంగా వెల్లడి చేయబడుతుంది మరియు అదేవిధంగా ఆశీర్వాదాలు అందుకున్న వారి వలనే దుష్టులు పొందుకునే కీడు కూడా వెల్లడి చేయబడుతుంది. దేవుడు దుష్టులను బహిర్గతం చేసి ఉండకపోతే, దేవునికి పూర్తి నిబద్ధతతో లోబడేవారు ఎన్నటికీ వెలుగులోనికి రారు; తనకు సమర్పించుకున్న వారిని దేవుడు వారికి తగిన గమ్యస్థానానికి చేర్చకపోతే, దేవుడికి అవిధేయులైన వారు, వారికి రావాల్సిన శిక్షా ఫలాన్ని పొందుకోలేరు. దేవుడి కార్య ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. దేవుడు దుష్టులను శిక్షించి, మంచివారికి బాహుమానమిచ్చే ఈ కార్యాన్ని చేపట్టకపోతే, వీరు ఎప్పటికీ వారి వారి గమ్యస్థానాలను చేరుకోలేరు. మానవులు విశ్రాంతిలోనికి ప్రవేశించిన తర్వాత, దుష్టులు నాశనం చేయబడి, మానవ జాతి అంతయూ సరైన క్రమం లోనికి వస్తుంది; ఆయా రకాల ప్రజలు వారు చేపట్టవలసిన విధులతో పాటు వారికి తగిన వారితో ఉంటారు. ఇది మాత్రమే మానవ జాతికి విశ్రాంతి దినము, మానవజాతి అభివృద్ధికి ఇది తప్పనిసరి, మరియు మానవజాతి విశ్రాంతి లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే దేవుడి అనాది సంకల్పం సంపూర్ణమవుతుంది; ఆయన పనిలోని ఆఖరి భాగం ఇదే. ఈ కార్యం మానవుల శరీర భ్రష్ట జీవితాన్ని మరియు చెడిన మానవాళి జీవితాన్ని అంతం చేస్తుంది. అప్పటి నుండి మానవులు కొత్త రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మానవులందరూ శరీరంతో నివసించినప్పటికీ వారి ఈ జీవితపు అసలు స్వభావానికి మరియు చెడిన మానవ జీవితానికి గణనీయమైన వ్యత్యాసంఉంటుంది. మానవుల ఉనికికుండే ప్రాముఖ్యత మరియు చెడిన మానవజాతి ఉనికికుండే ప్రాముఖ్యతలు కూడా భిన్నంగా ఉంటాయి. ఒక మార్పు చెందిన వ్యక్తి జీవితం ఇలా ఉండకపోయినప్పటికీ, ఇది రక్షణ పొందిన మానవ జీవితం అనియూ మానవత్వం మరియు హేతువును తిరిగి పొందిన జీవితం అనియూ చెప్పవచ్చు. వీరు ఒకప్పుడు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవునిచే జయించబడి రక్షించబడినవారు; వీరు దేవుడిని మొదట ధిక్కరించి, ఆ తర్వాత ఆయన గురించి సాక్ష్యమిచ్చిన వ్యక్తులు. వారు ఆయన పరీక్షకి గురి అయ్యి దాన్ని తట్టుకున్నప్పుడు వారి ఉనికి అత్యంత అర్దవంతమైన ఉనికి అవుతుంది. వారు సాతాను కంటే ముందుగా దేవుడికి సాక్షులుగా ఉన్నవారు, వారు జీవించడానికి తగినవారు. దేవుడికి సాక్షులుగా ఉండక, జీవించడానికి తగినవారు నాశనం చేయబడతారు. వారు దుష్ట ప్రవర్తనే వారి నాశనమునకు కారణం, మరియు అటువంటి నాశనమే వారికి సరియైన గమ్యస్థానం. భవిష్యత్తులో, మానవులు సుందరమైన రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు, ప్రజలు అనుకుంటున్నట్లుగా అక్కడ భార్యా-భర్త, తండ్రి-కుమార్తె, లేదా తల్లి-కొడుకు సంబంధాలు ఏవీ ఉండవు. ఆ సమయంలో, ప్రతి మనుష్యుడు తనలాంటి వారితో ఉంటాడు, కుంటుంబాలు అప్పటికే చేదిరిపోయి ఉంటాయి. పూర్తిగా విఫలమైన సాతాను ఇక ఎన్నటికీ మానవులను ఆటంకపరచదు, అలాగే మానవులు ఇకపై చెడు సాతాను స్వభావాన్ని కలిగి ఉండరు. అవిధేయులైన వారు అప్పటికే నాశనం చేయబడి ఉంటారు, దేవుడికి లోబడిన వారు మాత్రమే నిలిచి ఉంటారు. చాలా కొద్ది కుటుంబాలు మాత్రమే కుటుంబంగా కలిసి ఉండే పరిస్థితులు ఉంటాయి; అలాంటప్పుడు, శరీర సంబంధమైన బాంధవ్యాలు ఏవిధంగా నిలువగలవు? మానవుల గత శరీర జీవితం బొత్తిగా నిషేధించబడుతుంది; ఇలాంటి తరుణంలో మానవుల మధ్య శారీరక సంబంధాలు ఏవిధంగా ఉనికిని కలిగి ఉండగలవు? చెడు సాతాను స్వభావం ఉండదు కాబట్టి, మానవ జీవితం ఇక ఏ మాత్రము పాత జీవితం వలె ఉండక నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోతారు, పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోతారు. భర్తలు తమ భార్యలను కోల్పోతారు, భార్యలు తమ భర్తలను కోల్పోతారు. భౌతిక సంబంధాలు ప్రస్తుతం మానవుల మధ్యలో నెలకొని ఉన్నాయి, కానీ అందరూ విశ్రాంతిలోనికి ప్రవేశించిన తరువాత అవి ఇక ఏమాత్రమూ నిలువవు. ఈ రకమైన మానవ సమాజం మాత్రమే నీతిని, పరిశుద్ధతను కలిగి ఉంటుంది; ఈ రకమైన మానవ సమాజం మాత్రమే దేవుడిని ఆరాధించగలదు.

దేవుడు మానవులను సృజించి వారిని భూమిపై ఉంచాడు; అప్పటి నుండి ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వారిని రక్షించి, మానవాళి కొరకు పాప పరిహారార్ధ బలిగా అర్పించబడ్డాడు. అంతములో, ఆయన తప్పనిసరిగా మానవులను జయించి వారిని పూర్తిగా రక్షించి వారి అసలు స్వరూపంలోనికి వారిని మారుస్తాడు. ఆది నుండి ఆయన—మానవులను వారి మొదటి స్వరూపములోనికి తీసుకురావడమనే ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నాడు. దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపించి మానవుల మొదటి స్వరూపాన్ని తిరిగి తీసుకువస్తాడు, అంటే దేవుడు ఈ భూమిపై మరియు ఈ సృష్టి అంతటిపై తన అధికారాన్ని పునరుద్ధరించబోతున్నాడని దీనర్థం. మానవులు సాతానుచే చెరుపబడిన తర్వాత దేవుడికి భయపడే హృదయాన్ని కోల్పోవడంతో పాటు దేవుడు సృజించిన సృష్టిపై అధికారాన్ని కలిగి ఉండే బాధ్యతను కూడా కోల్పోయారు. అప్పుడు మానవులు సాతాను అధికారము క్రింద నివసిస్తూ సాతాను ఆజ్ఞలను అనుసరించారు; ఆ విధంగా దేవుడికి తను సృజించిన వారి మధ్యలో పనిచేయడం మినహా వేరే మార్గం ఏదీ లేకుండా పోయింది, తద్వారా వారి భయభక్తులను పొందుకోలేని వాడిగా తయారయ్యాడు. మానవులు దేవుడిచే సృజించబడినవారు, వారు దేవుడి ఆరాధించాల్సిందే, కానీ వారు ఆయన నుండి మళ్లీ సాతానును ఆరాధించారు. సాతానే వారి హృదయాలలో ఆరాధ్య విగ్రహమైపోయాడు. ఈ విధంగా, దేవుడు వారి హృదయంలో తన స్థానాన్ని కోల్పోయాడు, అంటే తాను మానవులను సృష్టించిన పరమార్ధాన్ని కోల్పోయాడని చెప్పవచ్చు. కాబట్టి, దేవుడు మానవులను సృష్టించిన అసలు కారణాన్ని పునరుద్ధరించడానికి, ఆయన వారి అసలు స్వరూపాన్ని వారిలో పునరుద్ధరించాలి మరియు వారిని వారి చెడు స్వభావాల నుండి తప్పించాలి. సాతాను నుండి మనుష్యులను తిరిగి పొందడానికి, ఆయన వారిని వారి పాపములనుండి రక్షించాలి. ఈ విధంగా మాత్రమే దేవుడు వారి మొదటి స్వరూపాన్ని, అధికారాన్ని పునరుద్ధరించగలిగి చివరికి ఆయన రాజ్యాన్ని పునఃస్థాపించగలడు. ఆ అవిధేయ కుమారుల అంతిమ నాశనం కూడా మానవులు దేవుడిని మెరుగ్గా ఆరాధించగలిగేలా చేయడానికి మరియు భూమిపై మెరుగైన జీవితం జీవించగలిగేలా చేయడానికి ఉద్దేశించినదే. దేవుడు మానవులను సృజించాడు కాబట్టి, వారు తనను ఆరాధించేలా ఆయన చేస్తాడు; మానవుల మొదటి అధికార బాధ్యతలను వారికి తిరిగి కట్టబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఆయన దానిని ఏ కళంకం లేకుండా పూర్తిగా పునస్థాపిస్తాడు. ఆయన అధికారాన్ని తిరిగి స్థాపించడమంటే, మనుష్యులు ఆయనను ఆరాధిస్తూ ఆయనకు లోబడి ఉండేలా చేయడమే; అంటే, దేవుడు తన ద్వారా మానవులను నివసింపజేస్తాడు మరియు తన అధికారంతో తన శత్రువులను నాశనం చేస్తాడు అని అర్థం. అంటే, దేవుడు ఆయన గురించిన సమస్తాన్ని ఎవరి నుండి, ఎటువంటి నిర్బంధం లేకుండా మానవుల మధ్య ఉండేలా చేస్తాడు. దేవుడి రాజ్యం ఆయన స్వంత రాజ్యాన్నే స్థాపించాలనుకుంటుంది. ఆయనను ఆరాధించే, ఆయనకు పూర్తిగా లోబడి ఉండే మరియు ఆయన మహిమను కనబరిచే మానవులు అంటేనే ఆయనకు ఇష్టం. చెడిపోయిన మానవాళిని దేవుడు రక్షించకపోతే, అసలు ఆయన మానవులను సృజించిన దానికి పరమార్ధమే ఉండదు; ఆయనకు మానవుల మధ్యలో అధికారం ఉండదు, ఆయన రాజ్యం ఇకపై భూమిపై ఉండదు. దేవుడు ఆయనకు ఆవిధేయులైన వారిని నాశనం చేయకపోతే, ఆయన తన పూర్తి మహిమను పొందలేడు, లేదా భూమిపై తన రాజ్యాన్ని స్థాపించలేడు. ఆయన పని సంపూర్తియైనది అనడానికి మరియు ఆయన ఘనమైన కార్య సమాప్తికి గురుతులు ఏవంటే; దేవుడికి ఆవిధేయులైన వారిని మానవులలో నుండి బొత్తిగా నాశనం చేయడం మరియు పరిపూర్ణులుగా చేయబడిన వారిని విశ్రాంతిలోనికి తేవడమే. మానవులు వారి అసలు స్వరూపానికి తిరిగి వచ్చినప్పుడు, వారు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలిగినప్పుడు, ఎవరికి తగిన స్థానాలలో వారు ఉంటూ దేవుని ఏర్పాటుకు సమర్పించుకునప్పుడు, దేవుడు ఆయనను ఆరాధించే ఆరాధికుల సమూహాన్ని తయారు చేసి వారితో భూమిపై తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన భూమిపై శాశ్వత విజయాన్ని సాధిస్తాడు, అలాగే ఆయనకు విరోధులుగా ఉన్న వారందరూ శాశ్వత నాశనం పొందుతారు. మానవాళిని సృష్టించడం వెనుక ఆయనకున్న అసలు ఉద్దేశాన్ని ఇది పునస్థాపిస్తుంది; అన్ని విషయాలను సృజించడం వెనుక ఆయనకున్న ఉద్దేశాన్ని ఇది పునస్థాపించడంతో పాటు భూమిపై అన్ని విషయాలలో మరియు ఆయన శత్రువులపై ఆయన అధికారాన్ని తిరిగి తీసుకువస్తుంది. ఇవి ఆయన సంపూర్ణ విజయానికి సంకేతాలు. అప్పటి నుండి, మానవులు విశ్రాంతిలోనికి ప్రవేశించి సరియైన పథంలోని జీవితాన్ని జీవిస్తారు. దేవుడు కూడా మానవులతో పాటు తన నిత్య విశ్రాంతి లోనికి ప్రవేశిస్తాడు, తాను మరియు మానవులు కలిసి జీవించే శాశ్వత జీవితాన్ని ప్రారంభిస్తాడు. భూమిపై ఉండే పాతకములు, ఆవిధేయత పూర్తిగా అదృశ్యమవుతాయి మరియు రోదన అంతా అదృశ్యమైపోతుంది, దేవుడిని ధిక్కరిస్తున్న ఈ లోకంలోని వారందరూ నిలిచి ఉండకుండా నాశనం చేయబడతారు. దేవుడు మరియు ఆయన రక్షణను అందుకున్న వారు మాత్రమే నిలిచి ఉంటారు; ఆయన సృష్టి మాత్రమే మిగిలి ఉంటుంది.

మునుపటి:  మనిషి యొక్క సామాన్య జీవితమును పునరుద్దరించుట మరియు అద్భుతమైన గమ్యస్థానానికి అతణ్ణి తీసుకువెళ్ళుట

తరువాత:  నీవు యేసు ఆధ్యాత్మిక శరీరాన్ని చూసే సమయానికి, దేవుడు సరికొత్త పరలోకాన్ని మరియు భూలోకాన్ని సృష్టించి ఉంటాడు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger