12 వ అధ్యాయము
తూర్పున మెరుపు మెరిసిన సమయంలో, అది కూడా సరిగ్గా నేను నా వాక్యములు ఉచ్చరించిన అదేసమయంలో—ఆ మెరుపు మెరియగానే, మొత్తం విశ్వం ప్రకాశవంతమవుతుంది, మరియు నక్షత్రాలన్నిటిలోనూ ఒక పరివర్తన సంభవిస్తుంది. మానవ జాతి క్రమబద్ధీకరించబడిన పక్షంలో ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది. తూర్పు నుండి దూసుకొచ్చిన ఈ కాంతి కిరణపు ప్రకాశంలో, సమస్త మానవజాతి దాని అసలు రూపం బహిర్గతం చేస్తుంది, వారి చూపు చెదిరిపోతుంది, ఏమి చేయాలో వారికి పాలుపోదు, అలాగే, వారి అసహ్యకరమైన వైఖరులను ఎలా దాచిపెట్టాలో వారికి అస్సలు తెలియదు. అంతేగాక, వారు అప్పటివరకు నా వెలుగు నుండి పారిపోయి పర్వత గుహల్లో తల దాచుకునే జంతువుల్లాగా ఉంటారు—అయినప్పటికీ, వారిలో ఒక్కరు కూడా నా వెలుగు నుండి తప్పించుకోలేరు. మనుష్యులందరూ దిగ్భ్రాంతికి గురవుతారు, అందరూ నిరీక్షిస్తున్నారు, అందరూ చూస్తున్నారు; నా వెలుగు రాకతో, వారందరూ వారి పుట్టినరోజు నాటి ఆనందాన్ని చవిచూస్తారు, మరియు అదే స్థాయిలో వారందరూ వారి పుట్టిన రోజుని నిందిస్తారు. పరస్పరం వైరుధ్య భావోద్వేగాలను వెల్లడి చేయడం వారికి అసాధ్యంగా మారుతుంది; స్వీయ-నిందలతో ఉప్పొంగిన కన్నీళ్లు నదులుగా మారుతాయి, మరియు ఆ ప్రవాహంలో వాళ్లు దూరంగా కొట్టుకుపోతారు, క్షణాల్లోనే వారి జాడ సైతం కనుమరుగవుతుంది. మళ్లీ ఒకసారి, నా దినము సర్వ మానవాళికి దగ్గరగా వస్తుంది, మళ్లీ ఒకసారి మానవాళికి ఉత్తేజం నింపుతుంది, మానవాళికి మరొక సరికొత్త ప్రారంభాన్ని అందిస్తుంది. నా గుండె కొట్టుకుంటూ ఉండగా, నా హృదయ స్పందన లయలకు పర్వతాలు సంతోషంతో గంతులు వేస్తాయి, నీళ్లు సంతోషంతో నాట్యం చేస్తాయి, నీటి కెరటాలు రాతి దిబ్బలను బలంగా ఢీకొంటాయి. నా హృదయంలో ఏముందో చెప్పడం చాలా కష్టం. నా దృష్టి పరిధిలోని మలినమై ఉన్న వాటన్నింటినీ నేను కాల్చి బూడిద చేయాలనుకుంటున్నాను; అవిధేయులైన కుమారులందరూ నా కన్నుల ఎదుట లేకుండా, మరెప్పటికీ ఉనికిలోకి రాకుండా చేయాలనుకుంటున్నాను. ఎర్రని మహా ఘట సర్పపు నివాస స్థలంలో నూతన ఆరంభాన్ని మొదలు పెట్టడమే కాకుండా, విశ్వంలోనూ నేను కొత్త పనిని ప్రారంభించాను. త్వరలోనే, భూమి మీది రాజ్యాలన్నీ నా సామ్రాజ్యమవుతాయి; త్వరలోనే, నా సామ్రాజ్యం కారణంగా భూమి మీది రాజ్యాలన్నీ ఉనికిలో లేకుండా పోతాయి, ఎందుకంటే నేను ఇప్పటికే విజయం సాధించాను, ఎందుకంటే నేను దిగ్విజయంతో తిరిగి వచ్చాను. భూమి మీద నా కార్యాన్ని చెరిపి వేసే ఆశతో నా ప్రణాళికకు ఆటంకం కలిగించేందుకు మహా ఘట సర్పం ప్రతి ఆలోచనా చేసి అలసిపోయింది. కానీ, దాని మోసపూరితమైన తంత్రాలకు నేను నిరుత్సాహ పడుతానా? దాని బెదిరింపులకు భయపడి నేను ఆత్మస్థైర్యం కోల్పోతానా? పరలోకంలోనే కాకుండా, భూమి మీద సైతం నా చేతిలో లేకుండా, స్వతంత్రంగా ఉన్న జీవి ఒక్కటీ లేదు; అదే నాకు మెరుపు కాగితంలా పని చేస్తుందనేది ఎర్రని మహా ఘట సర్పం విషయంలోనూ అత్యంత గొప్ప స్థాయిలో నిజం కాదా? అది సైతం నా చేతుల్లోనే ఆడవలసిన అంశం కాదా?
మానవ ప్రపంచంలో నేను శరీరధారిగా ఉన్నప్పుడు, మానవజాతి అనాలోచితంగానే, నా మార్గదర్శకంలో, ఈరోజు వరకు వచ్చింది. నా గురించి తెలియకుండానే వచ్చింది. అయితే, ముందున్న మార్గంలో ఎలా నడవాలో ఎవరికీ అంతుచిక్కడం లేదు, ఎవరికీ అవగాహన కూడా లేదు—మరియు ఆ దారి వారిని ఏ దిశలో తీసుకెళ్తుందనే విషయమై ఎవరికీ ఎలాంటి ఆచూకీ కూడా లేదు. పై నుండి వారిని గమనిస్తున్న సర్వశక్తిమంతుని తోడుతో మాత్రమే వారు ఆ మార్గంలో చివరి వరకు నడవగలరు; తూర్పున మెరిసే మెరుపు మార్గనిర్దేశంలోనే ఎవరైనా సరే, నా రాజ్యములోకి నడిపించే గుమ్మాన్ని దాటగలరు. మనుష్యుల్లోని ఎవరు కూడా ఇప్పటివరకు నా ముఖం చూడలేదు, తూర్పున మెరిసే మెరుపును చూసిన వారు కూడా ఇప్పటివరకు ఎవరూ లేరు; నా సింహాసనం నుండి వచ్చే ఉచ్చారణలను కనీస స్థాయిలోనైనా ఎవరైనా విన్నారా? నిజానికి, ప్రాచీనకాలం నుండి, నాతో వ్యక్తిగత బంధం కలిగిన మనిషి ఒక్కరైనా లేరు; ఈరోజే, ఇప్పుడే నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను కాబట్టే, నన్ను చూసే అవకాశం మనుష్యులకు లభించింది. అయితే, ఇప్పటికీ, మనుష్యులెవరూ నన్ను ఎరుగరు, వారు నా ముఖం మాత్రమే చూస్తారు, మరియు నా స్వరం మాత్రమే వింటారు కానీ, నా భావం వారికి అర్థం కాదు. మనుష్యులందరూ ఇలాగే ఉంటారు. నా ప్రజల్లో ఒకరిగా, నా ముఖం చూసినప్పుడు మీరు అత్యంత గర్వంగా భావించరా? అలాగే, మీరు నన్ను ఎరుగలేని పక్షంలో అది మీకు అత్యంత అవమానంగా అనిపించదా? నేను శరీరం ధరించి, ఈ మానవ ప్రపంచంలోకి వచ్చాను కాబట్టే, నేను మనుష్యుల మధ్యలో సంచరిస్తాను మరియు మనుష్యుల మధ్యలో నివసిస్తాను. మానవజాతికి నా దేహాన్ని చూపడం ఒక్కటే నా లక్ష్యం కాదు; అంతకంటే ముఖ్యంగా, మానవజాతి నన్ను తెలుసుకునేలా చేయడమే నా లక్ష్యం. అదిమాత్రమే కాకుండా, నేను నా దేహం ద్వారా, మానవజాతిని వారి పాపాల విషయంలో ఒప్పింపజేస్తాను; నేను నా దేహం ద్వారా, ఎర్రని మహా ఘట సర్పాన్ని నాశనం చేసి, దాని నివాసాన్ని నిర్మూలిస్తాను.
భూమ మీద విస్తరించిన మానవులు సంఖ్యాపరంగా నక్షత్రాల లాగా అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ, నా అరచేతిలో ఉన్న వాటి గురించి తెలిసినంత స్పష్టంగా వారి గురించి నాకు తెలుసు. అలాగే, నన్ను “ప్రేమించే” మానవుల సంఖ్య కూడా సముద్రములోని ఇసుక రేణువుల్లా లాగా అసంఖ్యాకంగానే ఉన్నప్పటికీ, నా ద్వారా ఎంచుకోబడిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువే: ప్రకాశవంతమైన కాంతిని అనుసరించే వారు మాత్రమే, నన్ను “ప్రేమించే” వారి నుండి వేరుగా ఉండగలరు. నేను మానవుని గురించి అతిగా అంచనా వేయను, అలాగే తక్కువగా కూడా అంచనా వేయను; బదులుగా, అతని సహజ గుణగణాలను అనుగుణంగా కొన్ని డిమాండ్లు చేస్తాను, ఎందుకంటే, వ్యక్తులను ఎన్నుకొనే నా లక్ష్య సాధనలో నాకు కావలసింది మనఃపూర్వకంగా నాకోసం అన్వేషించే వ్యక్తకి మాత్రమే. పర్వతాల్లో లెక్కలేనన్ని క్రూరమృగాలు ఉండవచ్చు కానీ, నా ముందు అవన్నీ మచ్చిక చేయబడిన గొర్రెలు మాత్రమే; కెరటాల కింద అంతుపట్టని రహస్యాలు ఉన్నప్పటికీ, భూమి మీది అన్ని వస్తువుల్లాగే అవి కూడా స్పష్టంగా తమను తాము నా ముందు ప్రదర్శించుకుంటాయి; మానవుడు ఎన్నడూ ప్రవేశించలేని అనేక రాజ్యాలు పైలోకాల్లో అనేకం ఉన్నప్పటికీ, నేను మాత్రం ఆ రాజ్యాల్లో స్వేచ్ఛగా తిరుగుతాను. కాంతిలోని నన్ను మనిషి గుర్తు పట్టలేడు, కానీ అంధకారపు లోకంలోనే నన్ను చూస్తాడు. నేడు మీరు సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నారా? ఎర్రని మహా ఘట సర్పపు విధ్వంసాల ముగింపులో నా కార్యాన్ని చేయడానికి నేను లాంఛనంగా దేహాన్ని ధరించాను. ఎర్రని మహా ఘట సర్పం దాని నిజ స్వరూపాన్ని మొదటిసారి బయట పెట్టినప్పుడు, నేను నా నామానికి సాక్ష్యమిచ్చాను. మానవజాతి రోడ్ల మీద నేను నడిచినప్పుడు, ఒక్క జీవి గానీ ఒక్క వ్యక్తి గానీ ఉలిక్కిపడి మేల్కొనలేదు, కాబట్టే శరీరధారునిగా నేను మానవ లోకానికి వచ్చినప్పుడు, ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ, దేహం ధరించి నేను నా కార్యాన్ని చేపట్టడం ప్రారంభించినప్పుడు, ఉరుములాంటి నా స్వరం విని మానవజాతి దాని కలల నుండి ఉలిక్కిపడి లేచింది, మరియు ఆ క్షణం నుండి, వారు నా నడిపింపులో తమ జీవితాలను ప్రారంభించారు. నా ప్రజల్లో, నేను మరోసారి నూతన కార్యాన్ని ప్రారంభించాను. భూమ్మీద నా కార్యం పూర్తి కాలేదని చెప్పడమంటే, నేను మాట్లాడిన నా ప్రజలెవ్వరూ నా హృదయమందు నేను ఆశించిన వారు కాదని చూపించడానికి సరిపోతున్నప్పటికీ, వారిలో కొందరిని నేను ఎన్నుకుంటాను. శరీరధారి అయిన దేవుడిని నా ప్రజలు తెలుసుకునేలా చేయడమే కాకుండా, వారిని శుద్ధి కూడా చేస్తున్నానని చెప్పేందుకు ఇదే సాక్ష్యం. నా పరిపాలనా విధుల తీవ్రత కారణంగా, అనేకమంది ప్రజలు ఇప్పటికీ, నా ద్వారా వెలివేయబడే ప్రమాదంలోనే ఉన్నారు. మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి, మీ దేహాన్ని మీరు లోబర్చుకోడానికి, మీరు ప్రతి ప్రయత్నం చేయకపోతే—మీరు ఇదే గనుక చేయకపోతే, నేరుగా నా హస్తాల నుండి పౌలు దండన పొందినట్లు, నరకంలో పడవేయబడటానికి, నిశ్చయంగా నేను అసహ్యపడే మరియు విసర్జించే ఒక అంశంగా మీరు మారుతారు, దాని నుండి తప్పించుకునే అవకాశమే ఉండదు. నా మాటల నుండి మీరు ఏమైనా గ్రహించారా? ఇదివరకు లాగానే, సంఘాన్ని శుద్ధి చేసి, నాకు కావలసిన ప్రజలను పరిశుద్దపరచి కొనసాగించడమే నా ఉద్దేశం. ఎందుకంటే, సకల పరిశుద్ధుడు మరియు నిష్కళంకుడనైన నేనే దేవుడను. నేను నా మందిరాన్ని ఇంద్రధనుస్సు రంగులతో అలంకరించడమే కాకుండా, చిన్న మరకైనా లేకుండా దాన్ని శుభ్రం చేయడంతో పాటు వెలుపలి భాగాన్ని చేసినట్లుగానే లోపలి భాగాన్ని కూడా నిర్మలంగా శుభ్రపరుస్తాను. నా సన్నిధిలో, మీరు, అందరూ, గతంలో చేసిన దాని గురించి ఆలోచించి, నేడు నా హృదయంలో నాకు సరైన సంతృప్తి అందించగలరా అని నిర్ణయించుకోండి.
శరీరధారుడైన నన్ను గ్రహించడంలోనే మనిషి విఫలం కాలేదు; అంత కంటే ఎక్కువగా, తన స్వీయ దేహాన్ని అర్ధంచేసుకోవడంలోనూ అతడు విఫలమయ్యాడు. చాలా ఏళ్లుగా, మానవులు నన్ను మోసం చేస్తూనే ఉన్నారు, బయటి నుండి వచ్చిన అతిధిలాగే నా పట్ల ప్రవర్తిస్తున్నారు. అనేకసార్లు, వారు నన్ను వెలుపలే ఉంచేసి “వారి గృహాల తలుపులు” మూసేశారు; అనేకసార్లు, వారు, నా ఎదుట, నిలబడినప్పటికీ, నా పట్ల శ్రద్ధ చూపలేదు; అనేకసార్లు ఇతర మనుష్యుల మధ్య వారు నన్ను త్యజించారు; అనేక సార్లు, దెయ్యం యెదుట నన్ను నిరాకరించారు; మరియు అనేక సార్లు, వారు తమ కలహ ప్రియమైన నోళ్లతో నా మీద దాడి చేశారు. అయినప్పటికీ, నేను మనిషి బలహీనతలను పట్టించుకోను, మరియు అతని అవిధేయతను నేను లెక్క అడగను, పంటికి పన్నును అడగను. నేను చేసినదల్లా నయం చేయలేని రోగాలకు, అతని జబ్బుకు మందు వేయడం, తద్వారా అతని ఆరోగ్యాన్ని బాగుచేయడం, అలా అతడు నన్ను తెలుసుకునేలా చేయడమే. నేను చేసినదంతా మానవజాతి మనుగడ కోసం, మానవజాతికి జీవితంలో ఒక అవకాశాన్ని కల్పించడం కోసం కాదా? మనిషి కోసం నేను అనేక సార్లు లోకానికి వచ్చాను, కానీ మనుష్యులు రాలేదు, నేను నా సొంత వ్యక్తిత్వంతో లోకానికి వచ్చాను, నిజానికి వాళ్లు నన్ను గౌరవించాలి; కానీ, ప్రతి ఒక్కరూ వారికి తగినట్టుగా తాము బయట పడే మార్గాన్ని వెతుకున్నారు. ఆకాశం కింద ప్రతి ఒక్క మార్గం నా చేతుల్లో నుండే వస్తుందని వారికి తెలియదు! ఆకాశం క్రిందున్న ప్రతి ఒక్కటీ నా ఆజ్ఞకు లోబడుతుందని వారికి తెలియదు! మీలో ఎవరు మాత్రం మీ హృదయంలో ప్రతీకారం పెంచుకునే సాహసం చేస్తారు? మీలో ఎవరు అంత తేలికగా పరిష్కారానికి రావడానికి సాహసిస్తారు? మానవజాతి మధ్య నేను నా కార్యాన్ని నిశ్శబ్దంగా చేస్తూనే ఉన్నాను—అంతే. నా శరీరధారణ సమయంలో, మనిషి బలహీనత పట్ల నేను దయ చూపకపోతే, అప్పుడు మానవ జాతి మొత్తం కేవలం నా శరీరధారణను బట్టి, వారి బుద్ధి మూలంగా భయపడి, దాని ఫలితంగా, పాతాళంలో పడిపోతారు. నన్ను నేను తగ్గించుకుని నన్ను నేను మరుగు చేసుకున్నందు వల్లే మానవజాతి విపత్తు నుండి తప్పించుకుని, నా దండన నుండి విడుదల పొందింది. కాబట్టే, ఈరోజు ఇలా ఉంది. ఈరోజుకి రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో గుర్తుంచుకుని, ఇప్పటికింకా రావాల్సి ఉన్న రేపటి కోసం మీరు మరింత జాగ్రత్తతో ఉండరా?
మార్చి 8, 1992