ప్రార్థనా అభ్యాసము గురించి
మీరు మీ అనుదిన జీవనంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వరు. ప్రార్థన విషయములో మనిషి నిర్లక్ష్యం వహిస్తాడు. ప్రార్థనలనేవి దేవుని ఎదుట మనిషి ఆచరించే ఒక ప్రక్రియగా మాత్రమే ఉంటున్నాయి. ఏ మనిషి తన హృదయాన్ని దేవునికి సంపూర్ణముగా సమర్పించి, నిజమైన ప్రార్థనలో నిమగ్నమై లేడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనిషి దేవుడిని ప్రార్థిస్తాడు. మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా దేవుడిని నిజముగా ప్రార్ధించారా? మీరు ఎప్పుడైనా దేవుని ముందు బాధతో కన్నీళ్లు కార్చిన సమయమున్నదా? మిమ్మల్ని మీరు తెలుసుకొనేందుకు మీరు ఎప్పుడైనా దేవుని యెదుట సమయము వెచ్చించారా? మీరు ఎప్పుడైనా దేవునితో హృదయపూర్వకమైన ప్రార్థనలో ఉన్నారా? ప్రార్థన అభ్యాసము ద్వారా వస్తుంది: మీరు సాధారణంగా ఇంట్లో ప్రార్థించకపోతే, సంఘములో ఎంతమాత్రమూ ప్రార్థించలేరు, మీరు సాధారణముగా చిన్న కూడికలో ప్రార్థించకపోతే, పెద్ద కూటములలో ప్రార్థించటం మీ వల్ల కాదు. మీరు క్రమం తప్పకుండా దేవుని దగ్గర సమయము గడపకపోతే, దేవుని వాక్యములు గుర్తు చేసుకోకపోతే, ప్రార్థించే సమయము వచ్చినప్పుడు మీరు చెప్పడానికి ఏమీ ఉండదు, ఒకవేళ మీరు ప్రార్ధించినప్పటికీ, అది పెదవులు చేసే పని మాత్రమే అవుతుంది; నిజమైన ప్రార్థన కాదు.
నిజమైన ప్రార్థన అంటే ఏమిటి? మీ హృదయంలో ఉన్నది దేవునికి చెప్పటం, దేవుని చిత్తం గ్రహించి ఆయనతో సంభాషించటం, వాక్యము ద్వారా దేవునితో మాట్లాడడం, ముఖ్యముగా ఆయనతో సన్నిహితముగా ఉన్నట్లుగా భావించటం, అయన మీ ఎదుట ఉన్నట్లుగా స్పృహించి, ఆయనతో మీరు ఎదో చెప్పాలని నమ్మటమే నిజమైన ప్రార్థన అవుతుంది. మీ హృదయం వెలుగుతో నిండుకొనుటతో పాటు దేవుడు ఎంతటి ప్రేమ స్వరూపుడో మీరు అనుభూతి చెందగలరు. మీరు ప్రత్యేకముగా ప్రేరేపించబడి, మీ మాటలు వినే సోదరి సోదరులకు అది ప్రోత్సాహము కలిగజేస్తుంది. మీరు మాట్లాడే మాటలు వారి హృదయములోని మాటలుగా అనిపించి వారు పలకాలనుకున్న మాటలే మీ నోట వచ్చినట్లుగా భావిస్తారు. ఇదే నిజమైన ప్రార్థన. మీరు నిజమైన ప్రార్థనలో పాల్గొన్నప్పుడు మీ హృదయం సమాధానంతో నిండుకొని సంతృప్తి చెందుతారు. దేవుడిని ప్రేమించే సామర్ధ్యం పెరిగి, దేవుడిని ప్రేమించటం కంటే విలువైనది ఏదీ లేదని మీరు గ్రహిస్తారు. ఇవన్నీ మీ ప్రార్థనలు ప్రభావవంతముగా ఉన్నవననుటకు రుజువులు. మీరు ఈ విధముగా ఎప్పుడైనా ప్రార్థించారా?
ప్రార్థనలోని విషయాల సంగతేమిటి? మీ ప్రార్థన పరిశుదాత్మ కార్యము ద్వారా మీ హృదయ పరిస్థితికి అనుగుణంగా ఒక్కొక మెట్టుగా సాగాలి. మీరు దేవుని చిత్తమును అనుసరించి అయన మనిషి వద్ద నుంచి ఆశిస్తున్నదాని ప్రకారము సంభాషించుటకు అయన దగ్గరకు రావాలి. మీరు ప్రార్థించుట ప్రారంభినపుడు మొదటిగా మీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నించక, కేవలము మీ హృదయములోని మాటలను దేవుని వద్ద పలకాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ఈ విధముగా పలకాలి: “ఓ దేవా నేను నీకు అవిధేయునిగా ఉన్నానని ఈ రోజే తెలుసుకున్నాను. నేను నిజముగా అవినీతిపరుడను, తుచ్చమైనవాడను. నేను కేవలము నా జీవితము వ్యర్ధము చేసికొనుచున్నాను. ఈ రోజు మొదలుకొని నేను నీకోసమే జీవిస్తాను. నేను ఒక అర్ధవంతమైన జీవితము జీవించి, నీ చిత్తమును సంతప్తిపరుస్తాను. నిత్యము నీ ఆత్మ కార్యము నాలో జరిగించి నీ వెలుగులో, నీ ప్రత్యక్షతలో నన్ను ఉంచుము. నీ ఎదుట బలముగా మారుమ్రోగే సాక్ష్యమును నన్ను కలిగి ఉండనిమ్ము. సాతాను నీ మహిమను, నీ సాక్ష్యమును చూడనిమ్ము మరియు నీ విజయము రుజువును మాలో ప్రత్యక్షపరచుము.” ఈ విధముగా ప్రార్దించినప్పుడు మీ హృదయము సంపూర్ణముగా స్వతంత్రించబడుతుంది. ఈ విధముగా ప్రార్థించినప్పుడు మీ హృదయము దేవునికి సమీపముగా ఉంటుంది మరియు ఈ విధముగా తరచూ ప్రార్థించినప్పుడు పరిశుద్దాత్మ తప్పనిసరిగా నీలో పనిచేసారు. నీవు ఎల్లపుడు ఈ విధముగా దేవునికి మొఱ్ఱపెట్టి అయన ముందు తీర్మానం చేసుకొన్నపుడు, నీ తీర్మానం దేవుని యొద్ద స్వీకరించబడే రోజు వస్తుంది. అప్పుడు నీ హృదయమును, నీ సమస్తమును దేవుని చేత స్వీకరించబడి నీవు సర్వ సంపూర్ణత లోనికి మారుతావు. ఏలయనగా నీ ప్రార్థన చాల ప్రాముఖ్యమైనది. పరిశుదాత్మ కార్యములు పొందాలని నీవు ప్రార్థించినప్పుడు, నీ హృదయము దేవుని చేత కదల్చబడి దేవుడిని ప్రేమించుటకు శక్తి ప్రవహిస్తుంది. నీవు నీ హృదయములో నుండి దేవుడిని ప్రార్థించకపోతే, నీ హృదయము తెరచి దేవునితో సంభాషించకపోతే, దేవుడు నీలో కార్యము చేయుటకు ఏ మార్గమూ ఉండదు. ఒకవేళ నీవు హృదయములో నుండి వచ్చే మాటలతో ప్రార్థించిన తరవాత కూడా పరిశుదాత్మాడు కార్యము మొదలుపెట్టకపోతే మరియు మీరు ప్రేరేపణ పొందకపోతే అది నిజాయితీ లేని నీ హృదయాన్ని, అసత్యమైన, అపవిత్రమైన నీ మాటలను సూచిస్తుంది. నీవు ప్రార్థించిన తరువాత సంతృప్తికరమైన అనుభవము నీకు కలిగితే అప్పుడు నీ ప్రార్థనలు దేవుని చేత స్వీకరించబడ్డాయి మరియు పరిశుద్ధాత్ముడు నీలో కార్యము చేస్తున్నాడు. దేవుని యెదుట పరిచర్య చేయువారిగా, ప్రార్థన లేకుండా నీవు ఉండకూడదు. నీవు దేవునితో సహవాసమును ఒక అర్థవంతమైన, విలువైన దానిగా చూచినపుడు నీవు పార్థనను విడిచి పెట్టగలవా? దేవునితో సహవాసం లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ప్రార్థన లేకపోతే నీవు సాతానుకు బానిసవై శారీరకంగానే జీవిస్తావు, నిజమైన ప్రార్థన లేకపోతే నీవు అంధకారపు ప్రభావంలో జీవిస్తావు. సోదరి సోదరులైన మీరు నిజమైన ప్రార్థనలో నిమగ్నమై ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇది నియమాలను అనుసరించటం కానప్పటికీ, ఒక నిర్దిష్టమైన ఫలితాన్ని సాధించడంగా ఉంటుంది. నీవు ఉదయకాలపు ప్రార్థనలను మరియు దేవుని వాక్యము ఆనందించుటకును కొంచెం నిద్రను మరియు సుఖాన్ని వదులుకోవడానికి సుముఖంగా ఉన్నావా? నీవు పవిత్రమైన హృదయముతో ప్రార్థిస్తూ, ఈ విధముగా దేవుని వాక్యమును తినుచు త్రాగుతూ ఉంటే, నీవు దేవునికి మరింత అంగీకార యోగ్యముగా ఉంటావు. నీవు అయనలో నిమగ్నమై, ఆయనతో సంభాషిస్తూ ప్రతి ఉదయం నీవు ఇలా చేసి, ప్రతి రోజు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చుట అనే అభ్యాసము చేసినప్పుడు నీలో దేవుని జ్ఞానము ఖచిత్తముగా పెరిగి నీవు దేవుని చిత్తాన్ని బాగా గ్రహించగలుగుతావు. నీవు ఇలా పలకాలి: “ఓ దేవా! నేను నా బాధ్యతను నెరవేర్చుటకు ఇష్టపడుతున్నాను. నీవు నా ఈ సముహూము యొక్క సాక్ష్యములో ఆనందించాలని, నా ద్వారా నీవు మహిమ పొందాలని మాత్రమే నేను నా సర్వమును సంపూర్ణముగా నీ మీద కేంద్రీకరించగలుగుతున్నాను. నేను నిన్ను నిజంగా ప్రేమించేలా, నిన్ను సంతృప్తి పరచేలా మరియు నిన్నే నా లక్ష్యముగా వెంబడించేలా నీవు నాలో కార్యము చేయాలన బ్రతిమాలుకొనుచున్నాను.” ఇటువంటి భారమును నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఖచ్చితముగా నిన్ను పరిపూర్ణం చేయును. నీవు నీ ప్రయోజనము కొరకు మాత్రమే ప్రార్థించక, దేవుని చిత్తమును తెలుసుకొనుటకును మరియు ప్రేమించుటకు కూడా ప్రార్థించవలెను. ఇదే అసలైన ప్రార్థన. దేవుని చిత్తమును వెంబడించుటకు ప్రార్థించే వాళ్ళల్లో నీవూ ఒకనివై యున్నావా?
ఇదివరకు మీకు ఎలా ప్రార్థించాలో తెలియదు, మరియు మీరు ప్రార్థన అను అంశమును నిర్లక్ష్యము చేసారు. ఇపుడు మీరు ప్రార్ధనను అభ్యసించుటకు మీ చేతనైన కృషి చేయాలి. నీవు దేవుడిని ప్రేమించుటకు నీలో ఉన్న బలాన్ని కూడగట్టుకోలేకపోతే నీవు ఎలా ప్రార్థించగలవు? నీవు ఇలా ప్రార్థించాలి: “ఓ దేవా, నా హృదయము నిజముగా నిన్ను ప్రేమించుటకు అసమర్ధమైనది. నేను నిన్ను ప్రేమించాలి, కానీ నాకు బలము లేదు మరి నేనేమి చేయాలి? నీవు నా ఆత్మీయ నేత్రములను తెరచి, నీ ఆత్మ నా హృదయమును కదిలించనివ్వు. నేను నీ ఎదుటకు వచ్చినప్పుడు, ప్రతికూలమైన వాటినన్నిటిని విసిరిగొట్టి, ఏ వ్యక్తియు, ఏ విషయము మరియు ఏ వస్తువు చేత నేను కట్టబడక నా హృదయమును నీ ఎదుట కుమ్మరించ గల్గునట్లు చేయుము, మరియు నా సర్వమును నీకు సమర్పించునట్లు చేయుము. ఆ తర్వాత కూడా నన్ను పరీక్షించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఇప్పుడు నేను నా భవిష్యత్తు గురించి యోచించుట లేదు లేక మరణ కాడి క్రిందను లేను. నిన్ను ప్రేమించే హృదయముతో జీవ మార్గమును వెదకుటకు ఆశపడుచున్నాను. ప్రతి విషయము, ప్రతి వస్తువు నీ చేతిలో ఉన్నవి; నా భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది మరియు నా ప్రాణమే నీ చేతిలో ఉన్నది. ఇప్పుడు నిన్ను ప్రేమించుటకు వెతుకుచున్నాను, నాకు నీవు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, లేక సాతాను ఎంత అడ్డుకొన్నను, నేను నిన్ను ప్రేమించుటకు నిర్ణయించుకున్నాను.” ఈ విధమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటే ఇలా ప్రార్థించండి. ప్రతి రోజు ఈ విధముగా మీరు ప్రార్థించగలిగితే, దేవునిని ప్రేమించే శక్తి నెమ్మదిగా పెరుగుతుంది.
నిజమైన ప్రార్థనలోనికి ఎలా ప్రవేశిస్తారు?
ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని ముందు మౌనముగా ఉండే హృదయాన్ని మీరు కలిగి ఉండాలి మరియు నిజాయితీగల హృదయాన్ని కలిగి ఉండాలి. నిజముగా నీవు దేవునితో సంభాషిస్తున్నావు మరియు ప్రార్థిస్తున్నావు—కావున నీవు మంచి పదజాలంతో దేవునిని ఆకట్టుకొనే ప్రయత్నము చేయకూడదు. నీ ప్రార్థన దేవుడు ప్రస్తుతము ఏమి జరిగించాలని కోరుకుంటున్నాడో దాని మీద కేంద్రీకృతమై ఉండాలి. దేవుడు నీకు గొప్ప వెలుగును, ప్రత్యక్షతను దయచేయునట్లు ప్రార్థించండి, నీవు ప్రార్థించినప్పుడు నీవు తీసుకొన్న తీర్మానాలతో పాటు, నీ అసలైన స్థితిని మరియు నీ సమస్యలను అయన సన్నిధికి తీసుకు రావాలి. ప్రార్థన అనేది ఆచరించే ప్రక్రియ కాదు, హృదయపూర్వకముగా దేవుడిని వెతికే ప్రక్రియ అది. దేవుడు నీ హృదయాన్ని కాపాడాలని అడగండి, తద్వారా అయన ఎదుట నీ హృదయానికి నెమ్మది కలిగి, దేవుడు నిను ఉంచిన పరిస్థితులలో నిన్ను నీవు తెలుసుకుంటావు, తృణీకరిస్తావు, నిన్ను నీవు విడిచిపెడతావు, తద్వారా, నీవు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండుటకు వీలు కలుగుతుంది మరియు నీవు నిజముగా దేవుడు ప్రేమించే వ్యక్తి అవుతావు.
ప్రార్థన ప్రాముఖ్యత ఏంటి?
ప్రార్థన అనేది మనిషి దేవునితో కలిసి పనిచేసే మార్గాలలో ఒకటి, అది దేవుని ఆత్మ చేత మనిషి ప్రేరేపించబడే ఒక ప్రక్రియ. ప్రార్థన చేయని వారు ఆత్మ లేక చనిపోయిన వారని చెప్పవచ్చు, అట్టి వారు దేవుని చేత ప్రేరేపించబడే అనుభవము లేనివారని రుజువు అవుతుంది. ప్రార్థన లేకుండా, పరిశుద్దాత్మ కార్యములు కాదు కదా, సాధారణ ఆత్మీయ జీవితం కొనసాగించడం కూడా అసాధ్యమే. ప్రార్థన లేకుండా ఉండటమంటే, దేవునితో సంబంధాలను తెంచుకోవటమే, అప్పుడు దేవుని మెప్పును పొందటం అసాధ్యం. దేవుని యందు విశ్వాసిగా ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే, అనగా ఎంత ఎక్కువగా దేవుని చేత ప్రేరేపించబడితే, అంత బలముగా మరియు స్పష్టముగా దేవుని యొద్ద నుండి నూతనమైన ప్రత్యక్షతలను పొందగలుగుతాడు. అందువల్ల, అటువంటి వ్యక్తి చాలా త్వరగా పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణుడిగా చేయబడతాడు.
ప్రార్థన ఎటువంటి ప్రభావము సాధించగలగాలి?
జనులు ప్రార్థనను అభ్యసించగలరు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకోగలరు, కానీ ప్రభావవంతమైన ప్రార్థన అంత సులువైన విషయం కాదు. ప్రార్థన అనేది కేవలం ఒక ఆచార బద్ధమైన ప్రక్రియో, ఒక పద్దతిని అనుసరించటమో లేక దేవుని వాక్యమును ఉచ్చరించటమో కాదు. అనగా, ప్రార్థన అనేది కొన్ని చిలక పలుకులు వల్లించటం కాదు మరియు ఇతరులను అనుకరించటం కాదు. ప్రార్థనలో ఒక వ్యక్తి తన హృదయాన్ని తెరచి ఉంచి దేవునికి సమర్పించగలిగిన స్థితికి చేరుకోవటం ద్వారా ఆ హృదయము దేవుని చేత ప్రేరేపించబడుతుంది. ప్రార్థన ప్రభావంతముగా ఉండాలంటే, అది దేవుని వాక్య పఠనంపై ఆధారపడి ఉండాలి. ఒకడు దేవుని వాక్యము ఆధారంగా ప్రార్థించడం ద్వారా మాత్రమే గొప్ప ప్రత్యక్షతను మరియు వెలుగును చూడగలడు. నిజమైన ప్రార్థన ఇలా అభివ్యక్తమవుతోంది: దేవుని చిత్తం తెలుసుకోవాలనే హృదయ వాంఛ కలిగి ఉండటం, అంతేగాక దేవుడు బయలుపర్చిన దానిపై జ్ఞానమును, స్పష్టతయు కలిగినవాడై దానిపై గ్రహింపు పెంచుకుంటూ, దేవునికి హేయమైన దానిని అసహ్యించుకుంటూ దేవుని ఆజ్ఞలను జరిగించాలని తపించటం. ఎక్కడైతే ప్రార్థన చేసిన తరువాత తీర్మానం, విశ్వాసము, జ్ఞానము మరియు అభ్యాస మార్గం ఉంటుందో, అదే నిజమైన ప్రార్థన అనబడుతుంది మరియు ఈ విధమైన ప్రార్థన మాత్రమే ప్రభావవంతముగా ఉంటుంది. అయినను ప్రార్థననేది దేవుని వాక్యమును ఆస్వాదించడము మరియు దేవునితో సంభాషణ అనే పునాదిపై కట్టబడి ఉండాలి, మరియు హృదయమందు నెమ్మది పొందుకొని ఆయనను కనిపెట్టుకోగలగాలి. ఈ విధమైన ప్రార్థన దేవునితో నిజమైన సహవాసము అనే దశలోకి ప్రవేశిస్తుంది.
ప్రార్థన గురించి ప్రాథమిక జ్ఞానం:
1. నీ మనసులో వచ్చింది గుడ్డిగా పలకవద్దు. నీ హృదయములో ఒక భారము కలిగియుండాలి అనగా, నీవు ప్రార్థించినప్పుడు ఒక లక్ష్యము కలిగియుండాలి.
2. ప్రార్థనలో దేవుని వాక్యముండాలి; అది దేవుని వాక్యము మీదే స్థిరపర్చబడాలి.
3. ప్రార్థిస్తున్నప్పుడు, పాత విషయాలను మరల మరల చెప్పకూడదు. ప్రార్థనలు దేవుని యొక్క ప్రస్తుత మాటలకు సంబంధించినవిగా ఉండాలి మరియు ప్రార్థన చేసినప్పుడు, అంతరంగములోని ఆలోచనలను దేవునికి చెప్పాలి.
4. సామూహిక ప్రార్థన ఒక విషయంపై కేంద్రీకృతమై ఉండాలి అది కూడా పరిశుదాత్మ కార్యమై ఉండాలి.
5. ప్రతి ఒక్కరు విజ్ఞాపన ప్రార్థన నేర్చుకోవాలి. ఇది కూడా దేవుని చిత్తానికి లోబడుటలో ఒక భాగమే.
వ్యక్తిగత ప్రార్థనా జీవితము, ప్రార్థనపై ఉన్న కనీస అవగాహన మరియు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలిసియుండుటపై ఆధారపడియుంటుంది. దైనందన జీవితంలో తరచుగా మీ యొక్క లోపాల కొరకు ప్రార్థించండి, మీ స్వభావంలో మార్పు రావాలని ప్రార్థించండి, మరియు దేవుని వాక్యముపై మీకున్న జ్ఞానము ఆధారంగా ప్రార్థించండి. ప్రతి వ్యక్తి తన స్వంత ప్రార్థనా జీవితం స్థాపించుకోవాలి, వారు దేవుని మాటలు తెలుసుకోవడానికి ప్రార్థించాలి, దేవుని కార్యములు తెలుసుకొనుటకై ప్రార్థించాలి. మీ వ్యక్తిగత పరిస్థితులను దేవుని ఎదుట తెరిచియుంచి, ప్రార్థించే విధానంపై కాక అసలైన గ్రహింపు పొందుట మరియు దేవుని వాక్యము యొక్క నిహమైన అనుభభము సంపాదించుట అనే కీలకమైన అంశాలపై ప్రార్థించాలి. ఆత్మీయ జీవితములో ప్రవేశం కోరుకొనే ప్రతివ్యక్తి అనేక విధాలుగా ప్రార్థించగలగాలి. మౌన ప్రార్థన, దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని కార్యములు తెలుసుకొనుటకు ప్రార్థించుట—దేవుని ఎదుట ఒకని స్థితిని మెరుగుపరచి, అతను జీవితంలో మరింత గొప్పగా పురోగతి సాధించుటకు నెట్టేవి ఏవైనా, అవన్నియు సగటు ఆత్మీయ జీవితములో ప్రవేశము సాధించుటకు, ఉద్దేశపూర్వకముగా చేసే ఆత్మీయ సహవాసము యొక్క ఉదాహరణలు. క్లుప్తముగా చెప్పాలంటే, నీవు చేసేది ప్రతీది, అది దేవుని వాక్యమును భుజించి, సేవించుటేగాని, లేక మౌనముగా ప్రార్ధించుటేగాని, లేక బిగ్గరగా ప్రకటించుటేగాని, అది నీవు దేవుని వాక్యమును స్పష్టముగా చూచుటకు, అయన కార్యమును మరియు అయన నీలో నెరవేర్చాలనుకొన్నిది నీవు చేయగలుగుటకే. మరి ముఖ్యముగా, నీవు చేసేది ప్రతీది నీవు నీ జీవితములో ఉన్నతముగా ఎదిగి, దేవుడు కోరుకొనే స్థాయికి నీవు చేరటానికే. దేవుడు మనిషి వద్ద కనీసం కోరుకొనేది, మనిషి అయన యొద్ద తన హృదయాన్ని తెరవాలనే. మనిషి తన హృదయాన్ని నిజముగా దేవునికిచ్చి, తన హృదయములో ఉన్నది నిజముగా దేవుని వద్ద చెప్పగలిగితే, దేవుడు అతనిలో కార్యము చేయుటకు సిద్ధముగాయున్నాడు. దేవుడు కోరుకొనేది మనిషి యొక్క వక్ర హృదయం కాదు, స్వచ్ఛమైన మరియు నిజాయితీ గల హృదయం. మనిషి తన హృదయంలో నుండి దేవునితో మాట్లాడకపోతే, దేవుడు అతని హృదయాన్ని ప్రేరేపించలేడు, అతనిలో కార్యము చేయలేడు. అందువలన, ప్రార్థన యొక్క మూలాంశము ఏంటంటే, హృదయములోనుండి దేవునితో మాట్లాడటం, నీ యొక్క తిరుగుబాటుతనాన్ని లేక లోపాలను ఆయనకు చెప్పటం, అయన ఎదుట నిన్ను నీవు పూర్తిగా తెరిచియుంచటం; అప్పుడే దేవుడు నీ ప్రార్థనలపై ఆసక్తి చూపుతాడు లేదా తన ముఖమును నీ నుండి చాటేస్తాడు. ప్రార్థనకుండవలసిన కనీస ప్రమాణం ఏంటంటే, నీ హృదయాన్ని దేవుని ఎదుట మౌనముగా ఉంచగలగాలి మరియు అది దేవుని యొద్ద నుండి తొలగిపోకూడదు. ఈ దశలో నీవు క్రొత్తదైన లేక ఉన్నతమైన దర్శనం పొందకపోవచ్చు, కానీ నీవు ఆ స్థితిని కొనసాగించుటకు ప్రార్థనను ఉపయోగించాలి వెనక్కు వెళ్ళకూడదు. కనీసం ఇదైనా సాధించాలి. నీవు ఇది కూడా సాధించలేకపోతే, నీ అత్మియ జీవితం సరైన మార్గంలో లేదని రుజువవుతోంది. దాని పరియవసానంగా, నీవు నీ మొదటి దర్శనముపై పట్టు కోల్పోతావు, నీవు దేవునిలో విశ్వాసము కోల్పోతావు తర్వాత నీ తీర్మానం చెదిరిపోతుంది. నీవు ఆత్మీయ జీవితంలోకి ప్రవేశించావా లేదా అనేదానికి ఒక సంకేతం నీ ప్రార్థన సరైన మార్గంలో ఉన్నదో లేదో చేసుకోవడమే. మనుషులందరూ ఈ వాస్తవికతలోనికి ప్రవేశించాలి, వారందరు తమను తాము కావాలని ప్రార్థనలో తర్ఫీదు పొందే పనిలో ఉండాలి. ఎదో ఎదురు చూడటం కాదు, పరిశుదాత్మ చేత ప్రేరేపించబడుటకు కనిపెట్టుకోవాలి. అప్పుడే వారు నిజముగా దేవుని వెదుకు జనులవుతారు.
ప్రార్థించడం మొదలు పెట్టిన వెంటనే ఒక్కసారిగా అన్ని సాధించాలనే ఆశతో అతిగా ప్రయాస పడవద్దు. నీవు మొదటిలోనే విపరీతమైన కోరికలు కోరకూడదు. ప్రార్థనలో నోరు తెరచిన వెంటనే పరిశుదాత్మచే ప్రేరేపించబడతారనో లేక పరిశుదాత్మ వెలుగును ప్రత్యక్షతను పొందాలనో లేక దేవుడు తన కృపను కుమ్మరిస్తాడనో ఆశించకూడదు. అలా జరగదు, దేవుడు ఆవిధముగా సహజాతీత క్రియలు చేయడు. దేవుడు తన సమయములో అయన జనులు చేసే ప్రార్థనలకు ప్రతిఫలమిస్తాడు. మరియు కొన్నిసార్లు నీవు ఆయన ముందు నమ్మకంగా ఉన్నవో, లేదో తెలుసుకోవడానికి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ప్రార్థించేటప్పుడు, నీవు విశ్వాసం, పట్టుదల మరియు దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. చాలా మంది సాధన చేయడం ప్రారంభించినప్పుడు, వారు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను అనుభవించలేనప్పుడు వారు నిరుత్సాహపడతారు, ఇది ఆమోదయోగ్యం కాదు! నీవు పట్టుదలగా ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క కదలికను కనిపెట్టుటకు, తెలుసుకొనుటకు, అయన స్పర్శను అనుభవించటంపై శ్రద్ధవహించాలి. కొన్నిసార్లు నీవు ఆచరించే విధానం సరికాదు, కొన్నిసార్లు నీయొక్క ఉద్దేశాలు మరియు ఆలోచనలు దేవుని ముందు సరైనవిగా నిలబడలేవు, కాబట్టి దేవుని ఆత్మ నిన్ను కదిలించదు మరియు కొన్నిసార్లు నీవు విశ్వాసయోగ్యముగా ఉన్నావా లేదా అని దేవుడు చూస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే, నీ సాధనలో నీవు మరింత విలువైనది చెల్లించాలి. నీవు అభ్యాస మార్గం నుండి తప్పిపోతున్నావని గ్రహించగలిగితే నీవు మరొక విధంగా ప్రార్థించవచ్చు, నీవు హృదయపూర్వకంగా వెతుకుతున్నంతకాలం మరియు పొందుకోవాలనే ఆశలున్నంతకాలం, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఈ నిజస్వరూపములోనికి నడిపిస్తాడు. కొన్నిసార్లు నీవు హృదయపూర్వకముగా ప్రార్థించినప్పటికీ ప్రేరేపించబడినట్లు అనిపించదు. ఈ సమయంలో, నీవు విశ్వాసముపై ఆధారపడాలి, దేవుడు నీ ప్రార్థనలను ఆలకిస్తాడని విశ్వసించాలి మరియు పట్టుదలతో ప్రార్థించాలి.
నిజాయితీ గల వ్యక్తిగా ఉండి, నీ హృదయంలోని మోసమును వదిలించుకొనుటకు ప్రార్థించు, అన్ని వేళల ప్రార్థించుట ద్వారా నిన్ను నీవు పరిశుద్ధపరచుకొనుము, ప్రార్థనలో పరిశుదాత్మ ద్వారా ప్రేరేపించబడి నీయొక్క స్వాభావము క్రమముగా మారుతుంది. నిజమైన ఆత్మీయ జీవితం ప్రార్థన జీవితమే, పరిశుద్ధాత్మ ద్వారా కదిలించబడే జీవితం. పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడే ప్రక్రియ మానవ స్వభావాన్ని మార్చే ప్రక్రియ. పరిశుదాత్మ చేత ప్రేరేపించబడని జీవితం ఆత్మీయ జీవితమే కాదు, మతపరమైన ఆచారం మాత్రమే. పరిశుద్ధాత్మచే తరచుగా ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షతను, వెలుగును పొందినవారు మాత్రమే ఆత్మీయ జీవితంలోకి ప్రవేశించినవారు. ఒక వ్యక్తి ప్రార్థిస్తుండగా నిరంతరం అతని యొక్క స్వభావము మారుతుంది. అతడు ఎంతగా పరిశుదాత్మ ద్వారా ప్రేరేపించబడితే అంత మెరుగ్గా మరియు విధేయునిగా ఉంటాడు. అదేవిధముగా ఆవ్యక్తి యొక్క హృదయం క్రమంగా పరిశుద్ధపరచబడుతుంది మరియు వాని స్వభావం కూడా క్రమంగా మారుతుంది. నిజమైన ప్రార్థన యొక్క ప్రభావము అటువంటిదై ఉంటుంది.