దేవుడు నివసించే దేహము స్వభావము

భూమిపై తన మొదటి శరీర ధారణలో దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు, అన్ని సంవత్సరాలలో కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన తన పరిచర్యను జరిగించాడు. ఆయన కార్యము చేసిన సమయములో, మరియు ఆయన తన కార్యము చేసే ముందు, ఈ రెండు సమయాల్లోనూ ఆయన సాధారణ మనిషిగానే ఉన్నాడు; ఆయన తన ముప్పై మూడున్నర సంవత్సరాలు సాధారణ మనిషిగానే నివసించాడు. చివరి మూడున్నర సంవత్సరాలలోనే, తాను శరీరధారియైన దేవునిగా ప్రత్యక్ష పరచుకొన్నాడు. ఆయన తన పరిచర్యను జరిగించడము ప్రారంభించే ముందు, ఆయన తన దైవత్వానికి చెందిన ఏ సూచనా చూపకుండా, సౌమ్యముగా మరియు సాధారణ మనిషిగానే కనిపించాడు, ఆయన తన పరిచర్యను జరిగించడం అధికారికముగా ఆరంభించిన తరువాత మాత్రమే ఆయన దైవత్వము స్పష్టముగా అగుపడింది. ఆయన పరిచర్య ఇరవై తొమ్మిదేళ్ల వయస్సు తరువాత మాత్రమే నిజముగా ప్రారంభమైంది కాబట్టి, ఆ మొదటి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన స్వచ్చమైన మానవుడని, మనుష్య కుమారుడని, మరియు రక్తమాంసములు నిండిన దేహమని నిరూపించాడు. “శరీరధారణ” అనేది శరీరమందు దేవుని ప్రత్యక్షత; సృజించబడిన మానవజాతి మధ్య శరీర స్వరూపములో దేవుడు కార్యము చేస్తాడు. కాబట్టి దేవుడు శరీరధారి అవ్వాలంటే, ఆయన మొదట శరీరము కలిగి, సాధారణ మానవత్వము కలిగిన శరీరుడై ఉండాలి; ఇది ప్రప్రథమమైన అవసరము. నిజానికి, దేవుని శరీరధారణ తాత్పర్యము ఏమిటంటే, దేవుడు శరీరమందు జీవిస్తాడు మరియు కార్యము చేస్తాడు, తన స్వభావమందే దేవుడు శరీరముగా మారతాడు, మానవునిగా మారతాడు. ఆయన శరీరధారణ జీవితము మరియు కార్యము రెండు భాగములుగా విభజించవచ్చు. మొదటిది తన పరిచర్యను జరిగించే ముందు ఆయన జీవించిన జీవితము. ఆయన ఒక సాధారణ మానవ కుటుంబములో, పూర్తిగా సాధారణ మానవ స్వభావముతో, సాధారణ మానవ అవసరాలతో (ఆహారము, దుస్తులు, నిద్ర, ఆశ్రయము), సాధారణ మానవ బలహీనతలు మరియు సాధారణ మానవ భావోద్వేగాలతో, సాధారణ మానవ నీతి నియమాలకు కట్టుబడి జీవిస్తాడు. మరొక మాటలో చెప్పాలంటే, ఈ మొదటి దశలో ఆయన సమస్త సాధారణ మానవ కార్యకలాపాల్లో నిమగ్నమై, దైవికము కాని, సంపూర్ణ సాధారణ మానవత్వములో జీవిస్తాడు. తన పరిచర్యను ప్రారంభించిన తరువాత ఆయన జీవించే జీవితమే రెండవ దశ. అతీత స్వభావము యొక్క బాహ్య సూచన కనుపరచకుండా, మానవ కవచమైన సాధారణ మానవ స్వభావములోనే జీవిస్తున్నాడు. అయినప్పటికీ, ఆయన పూర్తిగా తన పరిచర్య కొరకే జీవిస్తున్నాడు, ఈ సమయములో ఆయన దైవత్వపు సాధారణ కార్యమును కొనసాగించడానికి తన సాధారణ మానవత్వము పూర్తిగా జీవించి ఉన్నది, ఎందుకంటే అప్పటికీ ఆయన సాధారణ మానవత్వము ఆయన పరిచర్యను జరిగించగలిగే స్థాయికి పరిపక్వత చెందినది. కాబట్టి, సాధారణ మానవత్వము మరియు సంపూర్ణ దైవత్వము అనే రెండూ ఒకే జీవితముగా ఉన్నపుడు, సాధారణ మానవత్వమందు ఆయన పరిచర్యను జరిగించడము అనేది ఆయన జీవితపు రెండవ దశ. ఆయన జీవితపు మొదటి దశలో, ఆయన మానవత్వము అప్పటికీ దైవికమైన కార్యమును పూర్తిగా నిర్వర్తించకపోవడము, అప్పటికీ పరిపక్వత చెందకపోవడమే, ఆయన పూర్తిగా సాధారణ మానవత్వములో జీవించడానికి కారణమై ఉన్నది; ఆయన మానవత్వము పరిపక్వత చెంది, తన పరిచర్యను భుజానికెత్తుకున్న తరువాత మాత్రమే, ఆయన చేయవలసిన పరిచర్యను నిర్వహించగలడు. ఆయన, శరీరునిగా ఎదగడము మరియు పరిపక్వత చెందడము అవసరము కాబట్టి, ఆయన జీవితములో మొదటి దశలో ఆయన సాధారణ మనిషిగా—రెండవ దశలో మానవజాతి కోసం ఆయన కార్యమును చేపట్టి మరియు ఆయన పరిచర్యను చేయగలిగే సామర్థ్యమును కలిగి ఉన్నందున, శరీరధారి అయిన దేవుడు తన పరిచర్య జీవితములో జీవించే జీవితములో మానవత్వము మరియు సంపూర్ణ దైవత్వము రెండూ ఒకటిగా ఉంటుంది. ఒకవేళ, తాను పుట్టిన క్షణము నుండి, శరీరధారి అయిన దేవుడు నిష్టగా తన పరిచర్యను ప్రారంభించి, అసాధారణ సూచనలు మరియు అద్భుతాలు కనుపరచి ఉంటే, ఆయన శారీరక స్వభావము కలిగి ఉండేవాడు కాదు. కాబట్టి, ఆయన మానవ స్వభావము ఆయన శారీరక స్వభావము కొరకు జీవించి ఉన్నది; మానవ స్వభావం లేకుండా శరీరము ఉండదు, అలాగే శరీరము లేకుండా మానవుడే లేడు. ఈ విధముగా, దైవికమైన శరీరపు మానవత్వము అనేది దేవుని అవతార దేహపు అంతర్గత స్వభావమై యున్నది. “ఆయన దైవత్వము మాత్రమే కలిగి ఉన్నాడు, మరియు ఆయన మానవత్వము కలిగి లేదు,” అని అనడము దైవ దూషణ అవుతుంది, ఎందుకంటే ఈ ఉద్ఘాటనకు అస్థిత్వము లేదు, అలాగే శరీరధారణ నియమాన్ని అది ఉల్లంఘిస్తుంది. ఆయన తన పరిచర్యను జరిగించడం ప్రారంభించిన తరువాత, ఆయన తన కార్యము చేస్తున్నప్పుడు కూడా మానవుడనే బాహ్య కవచమును కలిగి తన దైవత్వములో జీవిస్తున్నాడు; ఆ సమయములో, ఆయన దైవత్వము, సాధారణ శరీరములో కార్యము చేయడం కోసం అనుమతించడమే ఉద్దేశ్యముగా, ఆయన మానవత్వము పని చేస్తుంది. కాబట్టి, ఆయన మానవ రూపంలో నివసించే దైవత్వమే కార్యపు ప్రతినిధిగా ఉన్నది. పని చేస్తోంది, ఆయన మానవత్వము కాదు, ఆయన దైవత్వము, అయినప్పటికీ దైవత్వము ఆయన మానవత్వములోనే దాగి ఉన్నది; స్వభావం రీత్యా, ఆయన కార్యము ఆయన సంపూర్ణ దైవత్వము ద్వారానే జరిగించబడుతుందేతప్ప, ఆయన మానవత్వముతో కాదు. ఆయన మానవుడు అలాగే ఆయన దేవుడు కూడా అని ఎవరైనా చెప్పవచ్చు, ఎందుకంటే దేవుడు మానవ స్వభావము, దైవ స్వభావము కూడా కలిగిన మానవ కవచముతో శరీరమందు జీవించుచున్న దేవునిగా మారాడు. ఆయన దైవ స్వభావము కలిగిన మానవుడు కాబట్టి, దేవుని కార్యము జరిగించే ఏ మానవుని కన్నా, సృజించబడిన మానవులందరి కన్నా ఆయన ఉన్నతమైన వాడు. కాబట్టి, ఆయన కలిగి ఉన్నటువంటి మానవ కవచము లాంటిది కలిగియున్న వారందరిలో, అలాగే మానవత్వము కలిగిఉన్న వారందరిలో, ఆయన మాత్రమే శరీరధారి అయిన దేవునిగా—మిగిలిన వారందరూ సృజించబడిన మానవులుగా ఉన్నారు. వారందరూ మానవత్వము కలిగి ఉన్నప్పటికీ, సృజించబడిన మానవులకు మానవత్వము తప్ప మరేమీ లేకుండా ఉండగా, దేవుని శరీరధారణ మాత్రం భిన్నముగా ఉన్నది; ఆయన శరీరములో ఆయన మానవత్వమును మాత్రమే కాక, మరి ప్రాముఖ్యముగా, దైవత్వమును కూడా కలిగి ఉన్నాడు. ఆయన మానవత్వమును ఆయన శరీర బాహ్య స్వరూపమందు మరియు ఆయన దైనందిన జీవితములో చూడవచ్చు, కానీ ఆయన దైవత్వమును గ్రహించడం మాత్రము కష్టతరము. ఎందుకంటే, ఆయన మానవత్వము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన దైవత్వము వెల్లడి అవుతుంది, అలాగే ఇది ప్రజలు ఉహించినంత అసాధారణమైనది కాదు, ప్రజలు దీనిని చూడటము బహు కష్టతరము. ఈ నాటికీ, శరీరధారి అయిన దేవుని స్వభావమును గ్రహించడము ప్రజలకు బహు కష్టతరముగా ఉన్నది. నేను ఇంత సుదీర్ఘముగా దీని గురించి మాట్లాడిన తరువాత కూడా, మీలో అనేక మందికి ఇది ఇంకా మర్మముగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. నిజానికి, ఇది చాలా చిన్న వివాదం; దేవుడు శరీరునిగా మారినందున, ఆయన స్వభావము మానవత్వపు మరియు దైవత్వపు సమ్మేళనంగా ఉన్నది. ఈ సమ్మేళనమే దేవుడనీ, భూమిపైన దేవుడన పిలువబడుతుంది.

యేసయ్య భూమి మీద జీవించిన జీవితము శరీర సంబంధమైన సాధారణ జీవితము. ఆయన తన శరీరపు సాధారణ మానవత్వములో జీవించాడు. ఆయన కార్యము చేయడం మరియు తన వాక్యము మాట్లాడటం, లేదా రోగులను స్వస్థపరచడం మరియు రోగాలను వెళ్ళగొట్టడం, వంటి అసాధారణమైన వాటిని చేసే—ఆయన అధికారమును, ఆయన తన పరిచర్యను ప్రారంభించే వరకు, ఎక్కువ భాగము దానికదే వెల్లడి పరచబడలేదు. ఇరవై తొమ్మిది సంవత్సరాలకు ముందు, ఆయన తన పరిచర్యను జరిగించక మునుపున్న ఆయన జీవితము, ఆయన సాధారణ శరీరుడనుటకు సరైన ఆధారముగా ఉన్నది. ఇందుమూలముగా, ఆయన ఇంకా తన పరిచర్యను ప్రారంభించలేదు గనుక, ఆయనను ఒక సామాన్య మానవునిగా, సాధారణ మానవునిగా తప్ప, ఆయనలో దైవత్వమేమీ ప్రజలు చూడలేదు—ఆ సమయానికి, కొంతమంది ప్రజలైతే, ఆయన యోసేఫు కుమారుడని నమ్మారు. ఆయన శరీరధారి అయిన దేవుని శరీరము అని చెప్పడానికి వారికి దారి లేనందున, ప్రజలు ఆయన ఒక సామాన్య మానవుని కుమారుడు అనుకున్నారు; ఆయన తన పరిచర్యలో, అనేకమైన అద్భుతాలు చేసినప్పటికీ, ఆయన బాహ్య కవచముగా సాధారణ మానవ రూపం కలిగిన క్రీస్తుగా ఉన్నందున, ఇంకా అనేకమంది ప్రజలు ఆయనను యోసేఫు కుమారుడని అన్నారు. ఆయన సాధారణ మానవ రూపము మరియు ఆయన కార్యము అనే రెండూ మొదటి శరీరధారణ ప్రాముఖ్యతను నెరవేరుస్తూ, దేవుడు సంపూర్ణ శరీరునిగా వచ్చి, ఆయన సంపూర్ణమైన సామాన్య మానవునిగా మారాడని నిరూపించడానికి ఉన్నాయి. తన కార్యము ఆరంభించడానికి ముందున్న ఆయన సాధారణ మానవత్వము ఆయన సామాన్య శరీరుడు అనుటకు ఒక నిదర్శనము; ఆయన అనేక సూచనలు మరియు అద్భుతాలు చేసి, సాధారణ మానవత్వముతో రోగాలు స్వస్థపరచి మరియు శరీరములో ఉన్న దయ్యాలు వెళ్లగొట్టాడు, ఆయన కార్యము చేసిన పిమ్మట కూడా ఆయన సామాన్య మానవుడని నిరూపించాడు. ఆయన శరీరము దేవుని అధికారమును కలిగి, దేవుని ఆత్మను ధరించిన దేహముగా కలిగి ఉండటమే ఆయన అద్భుతాలు చేయగలగడానికి గల కారణమై ఉన్నది. దేవుని ఆత్మను బట్టి ఆయన అధికారము కలిగి ఉన్నాడు అంటే, ఆయన శరీరుడు కాదని దాని అర్ధము కాదు. రోగులను స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్లగొట్టడం అనేది ఆయన తన పరిచర్యలో చేయవలసిన కార్యముగా, అది ఆయన మానవత్వములో దాగియున్న ఆయన దైవత్వపు వ్యక్తీకరణగా ఉన్నది, మరియు ఆయన ఎటువంటి సూచనలు చూపించినా లేక తన అధికారాన్ని కనుపరచినా, ఆయన ఇప్పటికీ సాధారణ మానవత్వములోనే జీవించి, ఇంకా సాధారణమైన శరీరునిగానే ఉన్నాడు. ఆయన సిలువపై చనిపోయి పునరుత్థానము చెందేంతవరకు, ఆయన సాధారణ శరీరములోనే నివశించాడు. కృపను అనుగ్రహించడం, రోగులను స్వస్థ పరచడం, దయ్యాలు వెళ్లగొట్టడం వంటివన్నీ ఆయన పరిచర్యలో భాగమే, అవన్నీ కూడా ఆయన సాధారణ శరీరము నుండి చేసిన కార్యమై ఉన్నది. ఆయన సిలువ యొద్దకు వెళ్ళేముందు వరకు, ఆయన అవన్నీ చేస్తున్నప్పటికీ, తన సాధారణ మానవ దేహమును ఆయన విడిచిపెట్టలేదు. ఆయన స్వయముగా దేవుడే, దేవుని స్వంత కార్యము చేస్తున్నాడు, అయినప్పటికీ ఆయన శరీరధారి అయిన దేవుని దేహముగా ఉన్నాడు కాబట్టి, ఆయన భోజనము చేసి వస్త్రాలు ధరించాడు, సాధారణ మానవ అవసరాలు, సాధారణ మానవ కారణాలు, మరియు సాధారణ మానవ మనస్సును కలిగి ఉన్నాడు. ఇదంతా ఆయన సాధారణ మానవుడని రుజువు చేసి, అది శరీరధారి అయిన దేవుని దేహము సాధారణ మానవత్వము గల దేహమని మరియు అసాధారణమైనది కాదని నిరూపించింది. ఆయన పని శరీరధారణ మొదటి కార్యమును పూర్తి చేయడము, మొదటి అవతారము చేయవలసిన కార్యమును నెరవేర్చడమై ఉన్నది. ఒక సామాన్యమైన, మామూలు మనిషి దేవుని కార్యమును నిర్వహించడమే, శరీరధారణ ప్రాముఖ్యతై ఉన్నది; అనగా, దేవుడు మానవరూపంలో దైవిక కార్యము నిర్వహించుట ద్వారా సాతానును జయిస్తాడు. శరీరధారణ అనగా దేవుని ఆత్మ శరీరముగా మారడం, అంటే, దేవుడే శరీరముగా మారడం; శరీరము చేసే కార్యము శరీరము ద్వారా గుర్తించబడి, శరీరము ద్వారా వెల్లడి చేయబడే, ఆత్మ కార్యమై ఉన్నది. దైవ శరీరమే గాక మరెవ్వరూ శరీరధారి అయిన దేవుని పరిచర్యను నెరవేర్చలేరు; అనగా, శరీరధారి అయిన దేవుని దేహము తప్ప—మరెవ్వరూ—దైవికమైన కార్యాన్ని వెల్లడి చేయలేరు. ఒకవేళ, ఆయన మొదటి రాకడ సమయములో, ఇరవై తొమ్మిదేళ్లకు ముందు దేవుడు సాధారణ మానవరూపం కలిగి ఉండకపోతే—ఒకవేళ, ఆయన పుట్టిన వెంటనే అద్భుతాలు చేసి ఉంటే, ఆయన మాట్లాడటము నేర్చుకున్న వెంటనే పరలోక భాషను మాట్లాడగలిగి ఉంటే, ఆయన భూమిపై అడుగు పెట్టిన క్షణమున, ప్రతి వ్యక్తి ఆలోచనలు మరియు ఉద్దేశ్యాలు గుర్తించి, భూలోక సంబంధమైన సంగతులన్నీ ఆయన గ్రహించగలిగి ఉంటే—అటువంటి వ్యక్తిని సామాన్య మానవుడని పిలవలేము మరియు అటువంటి శరీరము మానవ శరీరముగా పిలువబడనేరదు. క్రీస్తు విషయములో కూడా అదే జరిగి ఉంటే, దేవుని శరీరధారణ భావము మరియు స్వభావము నాశనమవుతుంది. ఆయన సాధారణ మానవత్వము కలిగి ఉన్నాడని, ఆయన శరీరమందు ఉన్న అవతార మూర్తి అయిన దేవుడని రుజువు చేస్తుంది; ఆయన సాధారణ మానవ ఎదుగుదల ప్రక్రియకు గురవుతాడనే వాస్తవము ఆయన సాధారణ శరీరమని ఎక్కువగా వెల్లడి పరుస్తుంది; అంతేగాక, ఆయన దేవుని వాక్యమని, శరీరముగా మారిన, దేవుని ఆత్మ అనుటకు ఆయన కార్యము తగిన రుజువుగా ఉన్నది. ఆయన కార్యపు అవసరాల నిమిత్తము దేవుడు శారీరముగా మారాడు; మరో మాటలో, కార్యపు ఈ దశ శరీరము ద్వారానే జరిపించబడాలి, అది సాధారణ మానవరూపంలోనే నిర్వహించబడాలి. అది “వాక్యము శరీరమాయెను” అనుటకు, “శరీరమందు వాక్య ప్రత్యక్షత” అనుటకు ముందున్న ఆవశ్యకత, మరియు అది దేవుని రెండు శరీర ధారణల నేపథ్యము. తన జీవితం అంతటా యేసు అద్భుతాలు చేశాడని, భూమిపై ఆయన కార్యము అయ్యేవరకు మానవత్వమునకు చెందిన సూచనలేవి ఆయన కనుపరచలేదని, సాధారణ మానవ అవసరతలు లేక బలహీనతలు లేదా మానవ భావోద్వేగాలేవి ఆయనకు లేవని, జీవితపు ప్రాధమిక అవసరతలు అవసరము లేదని మరియు మానవ తలంపులను గ్రహించనవసరము లేదని ప్రజలు నమ్ముతారు. ఆయన కేవలము మానవాతీతమైన మనస్సు, విశేషమైన మానవత్వము గల వాడని వారు ఊహించుకుంటారు. ఆయన దేవుడు కాబట్టి, సాధారణ మానవుల వలె ఆలోచించకూడదని మరియు జీవించకూడదని, ఒక సామాన్య వ్యక్తి, స్వచ్చమైన మానవుడు మాత్రమే, సాధారణ మానవ ఆలోచనలను గురించి ఆలోచించగలదు మరియు సాధారణ మానవ జీవితాన్ని జీవించగలడని వారు నమ్ముతారు. ఇవన్నీ మానవ ఆలోచనలు మరియు మానవ అభిప్రాయాలు, మరియు ఈ తలంపులన్నీ దేవుని మూల ఉద్దేశ్యాలకు విరుద్ధముగా ఉన్నాయి. సాధారణ మానవ ఆలోచన అనేది సాధారణ మానవ హేతువు మరియు సాధారణ మానవత్వముతో నిండి ఉంటుంది; సాధారణ మానవత్వము శరీరపు సాధారణ విధులను కొనసాగిస్తుంది; అలాగే శరీరపు సాధారణ జీవితాన్ని సంపూర్ణముగా అనుకూల పరుస్తాయి. అలాంటి శరీరమందు కార్యము చేయడం ద్వారా మాత్రమే దేవుడు తన శరీరధారణ ఉద్దేశ్యాన్ని నెరవేర్చగలడు. ఒకవేళ, శరీరధారి అయిన దేవుడు బాహ్య కవచముగా శరీరాన్ని కలిగి, సాధారణ మానవ ఆలోచనలను ఆలోచించకపోతే, అప్పుడు ఆ శరీరము మానవ హేతువును మరియు స్వచ్ఛతను కలిగి ఉండదు. శరీరధారి అయిన దేవుడు నిర్వహించవలసిన పరిచర్యను, మానవత్వము లేని ఆ దేహము ఎలా నెరవేర్చగలదు? ఓకే సాధారణమైన మనస్సు మానవ జీవితములోని అన్ని విషయాలను స్థిర పరుస్తుంది; సాధారణమైన మనస్సు లేకుండా, ఎవడూ మనిషి కాలేడు. మరో విధముగా చెప్పాలంటే, సాధారణ ఆలోచనలను ఆలోచించలేని ఒక వ్యక్తి మానసిక రోగి అవుతాడు, కేవలము దైవత్వమును మాత్రమే కలిగి మానవత్వము లేని క్రీస్తును శరీరధారి అయిన దేవుని శరీరమని చెప్పలేము. మరియు, శరీరధారి అయిన దేవుని దేహమునకు సాధారణ మానవత్వము ఎలా ఉండదు? క్రీస్తుకు మానవత్వము లేదని పలుకడము దైవదూషణ కాదా? సామాన్య ప్రజలు నిమగ్నమయ్యే కార్యకలాపాలన్నీ సాధారణ మానవ మనస్సు పనితీరును బట్టి ఉంటాయి. అదే లేకపోతే, ప్రజలు అనైతికముగా ప్రవర్తిస్తారు; నలుపు మరియు తెలుపు, మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని కూడా వారు చెప్పలేరు; అలాగే వారికి మానవ నైతికత మరియు నీతి సూత్రాలు వంటివి ఉండవు. అదే విధముగా, శరీరధారి సాధారణ మానవునిగా ఆలోచించకపోతే, అప్పుడు ఆయన ఒక స్వచ్చమైన శరీరుడు, సామాన్య మానవుడు కానేరడు. అలాంటి అనాలోచితమైన శరీరము దైవిక కార్యమును చేపట్టలేదు. సాధారణ శరీరపు కార్యకలాపాలలో ఆయన సామాన్యముగా పాల్గొనలేడు, మనుష్యులతో కలిసి ఆయన భూమిపై జీవించలేడు. కాబట్టి, దేవుని శరీరధారణ ప్రాముఖ్యత, దేవుడే శరీరునిగా రావడము ఒక్క వాస్తవ భావాన్ని కోల్పోయి ఉండేది. శరీరమందు సాధారణ దైవిక కార్యమును నిర్వహించడానికి శరీరధారి అయిన దేవుని మానవత్వము నిలిచి ఉన్నది; ఆయన సాధారణ మానవ ఆలోచనా విధానము ఆయన సాధారణ మానవత్వమును మరియు ఆయన సమస్త సాధారణ భౌతిక కార్యకలాపాలను కొనసాగిస్తుంది. శరీరమందు దేవుని సమస్త కార్యమును కొనసాగించడానికి ఆయన సాధారణ మానవ ఆలోచన ఉనికిలో ఉన్నదని ఒకరు చెప్పవచ్చు. ఒకవేళ, ఈ శరీరము సాధారణ మానవ మనస్సును కలిగి లేకపోతే, అప్పుడు దేవుడు శరీరమందు కార్యము చేయలేడు, అలాగే ఆయన శరీరమందు చేయవలసినది ఎన్నటికీ పరిపూర్ణమవ్వదు. శరీరధారి అయిన దేవుడు సాధారణ మానవ మనస్సును కలిగి ఉన్నప్పటికీ, మానవ ఆలోచనలతో ఆయన కార్యము మలినము కాదు; సాధారణ మానవ ఆలోచన అభ్యాసముతో కాకుండా, మనస్సుతో మానవత్వము కలిగి ఉండాలనే ముందస్తు నియమాన్ని బట్టి ఆయన మానవత్వములోని కార్యమును సాధారణ మనస్సుతో చేపట్టాడు. ఆయన శరీరానుసారమైన ఆలోచనలు ఎంత ఉన్నతమైనప్పటికీ, యుక్తి లేక యోచనతో ఆయన కార్యము కల్మషము కాలేదు. మరో మాటలో చెప్పాలంటే, ఆయన కార్యము ఆయన శరీరానుసారమైన మనస్సు బట్టి కాక, ఆయన మానవత్వములోని దైవిక కార్యపు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఉద్భవించింది. ఆయన సమస్త కార్యము ఆయనే తప్పక నెరవేర్చవలసిన పరిచర్య అయ్యున్నది, మరియు అదేది ఆయన మెదడు నుండి ఉద్భవించినది కాదు. ఉదాహరణకు, రోగులను స్వస్థ పరచడం, దయ్యాలు వెళ్లగొట్టడం, మరియు సిలువ వేయబడటము వంటివి ఏవీ మానవ ఉత్పాదితాలు కావు, మరియు మానవ మనస్సుతో ఏ వ్యక్తి సాధించలేకపోయాడు. అదే విధముగా, ఈనాటి విజయ కార్యము శరీరధారి అయిన దేవుడు అనివార్యముగా జరిగించవలసిన పరిచర్యే గానీ, మానవ చిత్తానుసారమైన కార్యము కాదు, అది ఆయన దైవత్వము చేయవలసిన కార్యము, ఏ శరీర సంబంధమైన మనుష్యుడు చేయదగిన కార్యము కాదు. మానవత్వమందు ఆయన తన కార్యమును సాధారణ మనస్సుతో జరిగించాలి, కాబట్టి శరీరధారి అయిన దేవుడు సాధారణ మానవ మనస్సును కలిగి, సాధారణ మానవత్వాన్ని కలిగి ఉండాలి. శరీరధారి అయిన దేవుని కార్యపు స్వభావమూ, అలాగే శరీరధారి అయిన దేవుని మూల సారాంశము ఇదే.

యేసయ్య కార్యము జరిగించే ముందు, ఆయన తన సాధారణ మానవత్వములో మాత్రమే జీవించాడు. ఆయనే దేవుడని ఎవ్వరూ చెప్పలేకపోయారు, ఆయనే శరీరధారి అయిన దేవుడని ఎవ్వరూ కనుగొనలేదు; ప్రజలు ఆయనను ఒక సంపూర్ణమైన సాధారణ వ్యక్తిగానే ఎరిగియున్నారు. ఆయన అతి సామాన్యమైన, సాధారణ మానవత్వమే దేవుడు శరీరమందు అవతరించాడని, మరియు కృపా కాలము అనేది శరీరధారి అయిన దేవుని కార్యపు కాలమని, ఆత్మ కార్యపు కాలము కాదనుటకు రుజువుగా ఉన్నది. దేవుని శరీరధారణ కాలములో ఆయన దేహము ఆత్మ యొక్క సమస్త కార్యమును జరిగించుచున్నందున, దేవుని ఆత్మ శరీరమందు పూర్తిగా సాక్షాత్కారమైనది అనుటకు అది రుజువుగా ఉన్నది. సాధారణ మానవత్వము కలిగి ఉన్న క్రీస్తు, ఆత్మ సాక్షాత్కారముగా, మరియు సాధారణ మానవత్వము, సాధారణ స్పృహ మరియు మానవ ఆలోచన కలిగియున్న దేహమై యున్నాడు. “సాక్షాత్కారముగా ఉండటము” అనగా దేవుడు మానవునిగా మారడము, ఆత్మ దేహముగా మారడము; ఇంకా స్పష్టముగా చెప్పాలంటే, దేవుడు సాధారణ మానవత్వము కలిగియున్న దేహములో నివసించి, దాని ద్వారా తన దైవిక కార్యమును వెల్లడి చేసినప్పుడు—అది సాక్షాత్కారమై ఉండటము లేక అవతరించడము అర్ధమై ఉన్నది. ఆయన మొదటి శరీరధారణ సమయములో విమోచనమే ఆయన కార్యమై ఉన్నందున, దేవుడు రోగులను స్వస్థ పరచడము, మరియు దయ్యాలు వెళ్లగొట్టడము అవసరమై ఉన్నది. సమస్త మానవజాతిని విమోచించడానికి, ఆయన కరుణామయునిగా మరియు క్షమాశీలిగా ఉండాలి. ఆయన సిలువ వేయబడటానికి మునుపు ఆయన చేసిన రోగులను స్వస్థ పరచడము మరియు దయ్యాలు వెళ్లగొట్టడము, పాపము మరియు దుర్మార్గత నుండి మానవునికి కొరకైన ఆయన రక్షణ కార్యమును సూచించుచున్నది. యేసు నందు ప్రజలు కలిగియున్న విశ్వాసమునకు చిహ్నాలుగా ఉన్నవన్నీ శాంతి, సంతోషము, మరియు భౌతిక ఆశీర్వాదములకు సాదృశ్యమై, కృప అనుగ్రహము చుట్టూ కృపా కాలము కేంద్రీకృతమై—అప్పుడు కృపా కాలము కాబట్టి, ఆ కాలములో కృపకు ప్రాతినిథ్యము వహించిన సూచనలు మరియు అద్భుతాలు కనుపరచుట ద్వారా రోగులను స్వస్థ పరచడము ఆయనకు అవసరమై ఉన్నది. చెప్పాలంటే, రోగులను స్వస్థ పరచడము, దయ్యాలను వెళ్లగొట్టడము, మరియు కృపను అనుగ్రహించడం అనేవి కృపా కాలములోని యేసయ్య దేహపు స్వాభావికమైన తలాంతులుగా, శరీరములో అవి ఆత్మ సాక్షాత్కారమైన కార్యముగా ఉన్నాయి. ఆయన అటువంటి కార్యమును జరిగిస్తున్నప్పుడు, ఆయన శరీరమందు జీవిస్తున్నాడు, కానీ శరీరమును అధిగమించలేదు. ఆయన ఎంతటి స్వస్థత కార్యాలు చేసినప్పటికీ, ఆయన ఇంకా సాధారణ మనుష్యుడిగానే ఉండి, ఇంకా సామాన్య మానవ జీవితాన్నే జీవించాడు. దేవుని శరీరధారణ కాలములో దేహము సమస్త ఆత్మ కార్యమును జరిగించినదని నేను చెప్పడానికి గల కారణము ఏమిటంటే, ఆయన ఎంతటి కార్యము చేసినా, అది ఆయన శరీరమందే చేసాడు. కానీ ఆయన కార్యమును బట్టి, ఈ దేహము అద్భుత కార్యాలు చేయగలదు, మరియు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో శరీరమును మించిన కార్యాలు చేయగలిగినందున, ప్రజలు ఆయన శరీరము సంపూర్ణ భౌతిక స్వభావము కలిగి ఉన్నట్లుగా భావించలేదు. నిజానికి, ఆయన నలభై రోజులు శోధించబడటము, లేక కొండమీద రూపాంతరము చెందడము వంటి, ఈ సంఘటనలన్నీ ఆయన పరిచర్యను ఆరంభించిన తరువాత సంభవించాయి. కాబట్టి, దేవుని శరీరధారణ తాత్పర్యము యేసు ద్వారా పాక్షికముగానే నెరవేరింది గానీ, సంపూర్ణము కాలేదు. తన కార్యము ఆరంభించే ముందు దేహముగా ఆయన జీవించిన జీవితము, అన్ని విధాలుగా అతి సామాన్యమైనది. ఆయన కార్యమును ఆరంభించిన తరువాత, తన దేహపు బాహ్య కవచాన్ని మాత్రమే ఆయన ధరించాడు. ఆయన కార్యమే దైవత్వమును తెలియజేయుట అయినందున, అది శరీరపు సాధారణ పనులను మించిపోయింది. అన్నింటికంటే, శరీరధారి అయిన దేవుని దేహము మానవ దేహమునకు భిన్నముగా ఉంటుంది. నిజానికి, ఒక సామాన్య మానవుని స్వభావాన్ని కలిగియుండి, ఒక సాధారణ మానవునిలా ఆలోచించాడు కాబట్టి, ఆయన దైనందిన జీవితములో, ఆయనకు ఆహారము, వస్త్రాలు, నిద్ర మరియు ఆశ్రయము కావలసి వచ్చాయి, సాధారణ అక్కరలన్నీ ఆయనకు అవసరము యున్నాయి. ఆయన చేసిన కార్యము అసాధారణమైనదనే అయినప్పటికీ, ప్రజలు ఇంకా ఆయనను సామాన్యమైన వ్యక్తిగానే ఎంచారు. వాస్తవానికి, ఆయన ఏ కార్యము చేసినప్పటికీ, ఒక సామాన్యమైన మరియు సాధారణ మానవునిగానే ఆయన జీవించాడు, ఆయన కార్యము జరిగించినంత వరకు, ఆయన జ్ఞానము బహు సాధారణమైనది, ఆయన ఆలోచనలు ఇతర సామాన్య మనిషి కంటే మరింత స్పష్టముగా ఉన్నాయి. దైవికమైన కార్యమును శరీరము ద్వారా వ్యక్త పరచవలసి ఉన్నది, ఆయన జ్ఞానము అత్యంత సాధారణమైనది మరియు తలంపులు చాలా స్పష్టముగా ఉన్నాయి కాబట్టి, శరీరధారి అయిన దేవునికి ఆలోచనా జ్ఞానము కలిగి ఉండటము అవసరమై ఉన్నది—ఈ విధముగా మాత్రమే ఆయన దేహము దైవికమైన కార్యమును వెల్లడిపరచగలదు. భూమిపై యేసు గడిపిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో, తన సాధారణమనుష్య స్వభావాన్నే ఆయన కనుపరిచాడు, కానీ తన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలములోని ఆయన కార్యాన్ని బట్టి, ఆయనను మరో లోకానికి చెందినవాడు, మునుపటి కంటే అత్యంత ఆసాధారణమైన వాడనీ ప్రజలు భావించారు. నిజానికి, తన పరిచర్యను ప్రారంభించక మునుపు మరియు తరువాత ఆయన సాధారణ మానవత్వము మారలేదు; ఆయన మానవత్వము ఎప్పుడూ ఒకేలా ఉన్నది, కానీ ఆయన తన పరిచర్యను ప్రారంభించక ముందు మరియు తరువాత ఉన్న వ్యత్యాసాన్ని బట్టి, ఆయన దేహానికి చెందిన రెండు అభిప్రాయాలు ఉద్భవించాయి. దేవుడు శరీరధారి అయినప్పటి నుండి, సాధారణ మానవత్వము కలిగి ఉన్న శరీరములో, ఆయన శరీరునిగా జీవించాడు కాబట్టి, ప్రజలు ఏమనుకున్నా, శరీరధారి అయిన దేవుడు తన నిజమైన సాధారణ మానవత్వాన్ని చివరి వరకు నిలబెట్టుకున్నాడు. ఆయన తన పరిచర్యను జరిగిస్తున్నాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మానవత్వము అనేది దేహపు ప్రాథమిక స్వభావము కాబట్టి, ఆయన శరీరపు సాధారణత చెరిపివేయబడలేదు. యేసు తన పరిచర్యను జరిగించక మునుపు, ఆయన శరీరము పూర్తిగా సాధారణమైనదిగా, సమస్త కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నది; ఎటువంటి అద్బుతమైన సూచనలు కనుపరచలేదు, కనీసము ఆయన అసాధారణముగా కూడా కనబడలేదు. ఆ సమయములో, ఆయన కేవలం దేవుని ఆరాధించే అత్యంత సామాన్యమైన ఒక మానవుడు మాత్రమే, కానీ ఇతరులకన్నా, ఆయన అన్వేషణ నీతిగా, నిజాయితీగా ఉన్నది. ఈ విధముగా అయన సాధారణ మానవత్వము స్వయముగా వెల్లడి అయ్యింది. తన పరిచర్యను చేపట్టే ముందు ఆయన ఏ కార్యమూ చేయలేదు కాబట్టి, ఆయన ఉనికిని గురించి ఎవరికీ అవగాహన లేదు, ఆయన ఒక్క అద్భుతము కూడా చేయలేదు, దేవుని స్వంత కార్యములో కొంచెము కూడా చేయలేదు కాబట్టి, ఆయన శరీరము మిగిలిన వారందరి కంటే భిన్నమైనదని ఎవరూ చెప్పలేరు. ఏదేమైనా, ఆయన తన పరిచర్యను ఆరంభించిన తరువాత, ఆయన సాధారణ మానవత్వపు బాహ్య కవచాన్ని కలిగి మరియు సాధారణ మానవ హేతువుతోనే జీవించాడు, కానీ ఆయన స్వయముగా దేవుని కార్యమును చేయడం ప్రారంభించి, క్రీస్తు పరిచర్యను చేపట్టి, క్షయమైన వారు, రక్త మాంసాలు కలిగిన మానవులు చేయలేని కార్యాన్ని ఆయన చేయుచున్నందున, ఆయన సాధారణ మానవత్వము కలిగి లేదని, మరియు ఆయనది సంపూర్ణ దేహము కాదని, అసంపూర్ణమైన దేహమని ప్రజలు భావించారు. ఆయన చేసిన కార్యమును బట్టి, సాధారణ మానవ స్వభావం లేని దేహములో ఉన్న దేవుడని ప్రజలు చెప్పుకున్నారు. ఆ విధముగా అర్ధంచేసుకోవడం పొరబాటు, ఎందుకంటే ప్రజలు దేవుని శరీరధారణ ప్రాముఖ్యతను గ్రహించలేదు. శరీరమందు దేవుడు వెల్లడి చేసిన కార్యము దైవికమైన కార్యమనీ, అది సాధారణ మానవత్వము కలిగిన శరీరమందు వెల్లడి చేయబడినది అనే వాస్తవం నుండి ఉత్పన్నమైనది. దేవుడు శరీరమును ధరించి, ఆయన దేహములో నివసించాడు, మరియు ఆయన మానవత్వములోని ఆయన కార్యము ఆయన మానవత్వపు సాధారణతను కప్పేసింది. ఇందును బట్టి, దేవుడు కేవలము దైవత్వమును తప్ప, మానవత్వమును కలిగియుండలేదని ప్రజలు విశ్వసించారు.

దేవుడు తన మొదటి శరీర ధారణలో శరీరధారణ కార్యమును పూర్తి చేయలేదు; దేవుడు శరీరమందు చేయవలసిన కార్యపు ఒక్క మొదటి దశను మాత్రమే పూర్తి చేశాడు. కాబట్టి, శరీరానికి చెందిన సమస్త సాధారణత మరియు వాస్తవికతలో జీవించడం, అంటే, అత్యంత సాధారణముగా మరియు సామాన్యమైన శరీరమందు దేవుని వాక్యాన్ని వెల్లడిపరిచేలా చేయడం, తద్వారా ఆయన శరీరమందు పూర్తిచేయకుండా విడిచిపెట్టిన కార్యాన్ని ముగించడం వంటి శరీరధారణ కార్యమును సంపూర్తి చేయడానికి, మరోసారి దేవుడు దేహముగా తిరిగి వచ్చాడు. స్వాభావికముగా, రెండవ శరీరధారణ మొదటి దానివలె ఉంటుంది, కానీ ఇది మొదటి దానికంటే చాలా నిజమైనది మిరు చాలా సాధారణమైనది. ఫలితముగా, రెండవ అవతార దేహము భరించే శ్రమ మొదటి దాని కంటే ఎక్కువ, కానీ ఈ శ్రమ దుర్నీతిమయమైన మానవుని శ్రమ కంటే భిన్నముగా ఉండి, ఆయన శరీరమందు ఆయన చేసిన పరిచర్య ఫలితముగా ఉన్నది. ఇది కూడా ఆయన శరీరరపు సాధారణత మరియు వాస్తవికత నుండి వచ్చిన కొమ్మలే. ఆయన తన పరిచర్యను పూర్తిగా సాధారణమైన మరియు నిజమైన దేహముతో జరిగిస్తాడు కాబట్టి, దేహము అనేకమైన కష్టాలను భరించవలసి ఉన్నది. ఈ శరీరము ఎంత సాధారణముగా మరియు నిజమైనదిగా ఉంటుందో, ఆయన తన పరిచర్యను నిర్వర్తించడంలో అంతగా బాధపడతాడు. దేవుని కార్యము అత్యంత సాధారణమైన శరీరమందు వెల్లడి చేయబడినదే గానీ, అసాధారణమైన దానిలో ఎంతమాత్రమూ కాదు. ఆయన శరీరము సాధారణమైనది మరియు మానవ రక్షణ కార్యమును కూడా భుజానికెత్తుకోవాలి కాబట్టి, ఆయన అసాధారణమైన శరీరము కంటే చాలా ఎక్కువగా బాధపడతాడు—ఈ బాధలన్నీ ఆయన శరీరపు వాస్తవికత మరియు సాధారణతల నుండి ఉత్పన్నమయ్యాయి. తమ పరిచర్యలను జరిగిస్తున్నప్పుడు రెండూ అవతార శరీరాలు అనుభవించిన బాధ నుండి, శరీరధారి అయిన దేహము స్వభావాన్ని ఎవరైనా చూడవచ్చు. దేహము ఎంత సాధారణమైనదైతే, కార్యము జరిగించేటప్పుడు ఆయన అంత గొప్ప శ్రమను భరించాలి; కార్యమును చేపట్టే శరీరము ఎంత వాస్తవముగా ఉంటుందో, ప్రజల తలంపులు అంత క్రూరముగా ఉంటాయి, మరియు ఆయనకు ప్రమాదము సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా, శరీరము ఎంతగా నిజమైనదై, మరియు శరీరము ఎంతగా సామాన్య మానవ అవసరాలు మరియు పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉంటుందో, శరీరమందు దేవుని కార్యమును చేపట్టడానికి ఆయన అంత సమర్ధుడు. ఇది సిలువకు దిగగొట్టబడిన యేసు శరీరము, తాను పాపపరిహారార్ధ బలిగా విడిచి పెట్టిన ఆయన శరీరము; అనగా సాధారణ మానవత్వము కలిగియున్న శరీరంతో ఆయన సాతానును ఓడించి సిలువ నుండి మానవుని సంపూర్ణముగా రక్షించాడని భావము. మరియు ఇది ఒక సంపూర్ణ దేహముగా, దేవుడు తన రెండవ శరీర ధారణలో సాతనును ఓడించడము మరియు విజయ కార్యము జరిగిస్తాడు. పూర్తిగా సాధారణమైన మరియు వాస్తమైన శరీరము మాత్రమే విజయ కార్యమును సంపూర్ణముగా జరిగించి శక్తివంతమైన సాక్ష్యమివ్వగలదు. అనగా, మానవుని విజయము అసాధారణమైన అద్భుతాలు మరియు ప్రత్యక్షతల కంటే, శరీరమందున్న దేవుని వాస్తవికత మరియు సాధారణతల బట్టి ఎక్కువ ప్రభావితముగా ఉంటుంది. మాట్లాడుట ద్వారా మానవుని జయించి పరిపూర్ణునిగా చేయడమే, శరీరధారి అయిన ఈ దేవుని పరిచర్య అయి ఉన్నది; మరో మాటలలో చెప్పాలంటే, మాట్లాడటము తద్వారా మానవుని జయించడం, బయలు పరచడము, పరిపూర్ణము చేయడం, మరియు పూర్తిగా పరిత్యజించడం అనేది శరీరములో సాక్షాత్కారముగా ఉన్న ఆత్మ కార్యము, శరీరపు కర్తవ్యమై ఉన్నది. కాబట్టి, విజయ కార్యమందే, శరీరమందు దేవుని కార్యము సంపూర్ణముగా నెరవేరుతుంది. శరీరధారి కార్యము విమోచన కార్యపు ఆరంభము మాత్రమే; విజయ కార్యము జరిగించే దేహమే శరీరధారి కార్యమంతటినీ సంపూర్తి చేస్తుంది. లింగ పరముగా, మానవ తలంపులను నిర్ములించి, దేవుని యొక్క శరీరధారణ ప్రాధాన్యతను సంపూర్తి చేయవలసినది, ఒకరు పురుషుడు మరొకరు స్త్రీయే కాబట్టి; దేవుడు పురుషుడు మరియు స్త్రీ ఇరువురిగా మారగలడు, అయితే స్వభావములో శరీరధారి అయిన దేవుడు లింగరహితుడు. ఆయన పురుషుని మరియు స్త్రీ ఇరువురినీ చేశాడు, మరియు ఆయనకు లింగ బేధము లేదు. కార్యపు ఈ దశలో, కార్యము మాటల ద్వారా దాని ఫలితాలను సాధిస్తుంది గనుక, దేవుడు సూచనలు మరియు అద్భుతాలు కనుపరచడు. దీనికి కారణము, ఈసారి శరీరధారి అయిన దేవుని కార్యము మాట్లాడటము ద్వారా జయించడమే గానీ, రోగులను స్వస్థ పరచడం మరియు దయ్యాలు వెళ్లగొట్టడము కాదు, అంటే శరీరధారి అయిన దేవుని సహజమైన సామర్థ్యము మాటలు మాట్లాడటము మరియు మానవుని జయించడమే గానీ, రోగులను బాగుచేయడం మరియు దయ్యాలు వెళ్లగొట్టడం కాదు. సాధారణ మానవత్వములో ఆయన కార్యము మాట్లాడటమే గానీ, రోగులను బాగుచేయడం మరియు దయ్యాలు వెళ్లగొట్టడం కాదు, కాబట్టి ప్రజలకు మొదటి దానికంటే రెండవ అవతార దేహము చాలా సాధారణమైనదిగా కనబడుతుంది. దేవుని శరీరధారణ కల్పితము కాదని ప్రజలు చూస్తారు; కానీ శరీరధారి అయిన దేవుడు యేసు శరీరధారణకు బినామీగా ఉంటాడు, మరియు వారిద్దరూ దేవుని శరీరధారణ అయినప్పటికీ, వారు పూర్తిగా ఒకేలా ఉండరు. యేసు సాధారణ మానవత్వము మరియు సామాన్యమైన మానవత్వము కలిగి ఉన్నప్పటికీ, ఆయనలో అనేక సూచనలు మరియు అద్భుతాలు ఇమిడి ఉన్నాయి. శరీరధారి అయిన ఈ దేవునిలో, సూచనలు మరియు అద్భుతాలేవి మానవ నేత్రాలకు కనబడవు, రోగులను బాగుచేయడు, దయ్యాలను పారద్రోలడు, సముద్రముపై నడవడము ఉండదు, నలభై రోజుల ఉపవాసము ఉండదు…. యేసు చేసిన కార్యాన్నే దేవుడు చేయడు, స్వభావమందు, ఆయన దేహము యేసు కంటే భిన్నముగా ఉన్నదని కాదు, కానీ రోగులను బాగు చేయడము మరియు దయ్యాలు పారద్రోలడము ఆయన పరిచర్య కాదు కాబట్టి. ఆయన తన స్వంత కార్యాన్ని కూల్చుకోడు, తన స్వంత కార్యాన్ని భంగ పరచుకోడు. తన నిజమైన వాక్యాల ద్వారా ఆయన మానవుని జయిస్తాడు కాబట్టి, అతడిని అద్భుతాలతో లోబరచుకోవాల్సిన అవసరం ఉండదు, కాబట్టి శరీరధారణ కార్యమును ఈ దశ సంపూర్తి చేస్తుంది. ఈనాడు నీవు చూస్తున్న శరీరధారి అయిన దేవుడు పూర్తిగా శరీరమే, మరియు ఆయన యందు అసాధారణమైనది ఏదీ లేదు. ఇతరుల మాదిరిగా, ఆయన కూడా అనారోగ్యము పాలవుతాడు, ఇతరులకు లాగా ఆయనకూ ఆహారము మరియు వస్త్రాలు అవసరం; ఆయన సంపూర్ణ శరీరమై ఉన్నాడు. ఒకవేళ, ఇప్పుడు, దేవుడు శరీరధారిగా, సాధారణమైన సూచనలు మరియు అద్భుతాలను జరిగిస్తే, ఒకవేళ ఆయన రోగులను బాగుచేసి, దయ్యాలను వెళ్లగొట్టి, లేక చంపగలిగితే, విజయ కార్యము ఎలా కొనసాగించబడుతుంది? అన్యజనుల మధ్య ఆయన కార్య వ్యాప్తి ఎలా జరుగుతుంది? రోగులను బాగుచేయడం, మరియు దయ్యాలు వెళ్లగొట్టడం అనేది కృపా కాలపు కార్యము, విమోచన కార్యములో ఇది మొదటి మెట్టుగా ఉన్నది, కాబట్టి ఇప్పుడు దేవుడు సిలువ నుండి మానవుని రక్షించాడు గనుక, ఇకపై ఆయన ఆ కార్యము చేయడు. ఒకవేళ, అంత్య దినాల్లో, రోగులను బాగుచేసి, దయ్యాలను వెళ్లగొట్టి, మరియు మానవుని కోసము సిలువ వేయబడిన యేసు వంటి “దేవుడు” ప్రత్యక్షమైతే, ఆ “దేవుడు,” బైబిల్ లోని దేవుని వర్ణణతో సమతుల్యముగా మరియు సరళముగా ఉన్నప్పటికీ, మానవుడు అంగీకరించడానికి, దాని స్వభావమందు ఉన్నది, ఒక దురాత్మయే గానీ, దేవుని ఆత్మచే కప్పబడిన శరీరము కాదు. ఎందుకంటే, ఆయన ఇదివరకే సంపూర్తి చేసిన వాటిని ఎన్నడూ పునరావృతం చేయకూడదనేది దేవుని కార్యపు నియమమై ఉన్నది. కాబట్టి, దేవుని రెండవ శరీరధారణ కార్యము మొదటి దాని కార్యముకంటే భిన్నముగా ఉంటుంది. అంత్య దినాల్లో, దేవుడు ఒక సామాన్యమైన, సాధారణ శరీరమందు విజయ కార్యమును సఫల పరుస్తాడు; ఆయన రోగులను స్వస్థ పరచడు, మానవుని కొరకు సిలువ వేయబడడు, కానీ శరీరమందు మాత్రమే మాట్లాడుతూ శరీరమందు మానవుని జయిస్తాడు. అటువంటి శరీరమే దేవుని అవతార దేహము; అలాంటి దేహము మాత్రమే శరీరమందు దేవుని కార్యమును సంపూర్తి చేయగలదు.

ఇది దేవుని అంతిమ శరీర ధారణ కాబట్టి, ఈ దశలో దేవుడు కష్టాలు ఎదుర్కొన్నా లేక తన పరిచర్యను జరిగిస్తున్నా, ఆయన శరీరధారణ అర్ధాన్ని నెరవేర్చడానికే చేస్తాడు. దేవుని శరీరధారణ రెండుసార్లు మాత్రమే ఉంటుంది. మూడోసారి ఉండదు. మొదటి శరీరధారణ పురుషుడు, రెండవది స్త్రీ, కాబట్టి మానవుని మనస్సులో దేవుని భౌతిక స్వరూపము పూర్తయింది; అంతేగాక, ఇప్పటికే రెండు శరీరధారణలు శరీరమందు దేవుని కార్యాన్ని పూర్తి చేశాయి. మొదటిసారి, శరీరధారణ అర్ధాన్ని సంపూర్తి చేయడానికి శరీరధారి అయిన దేవుడు సాధారణ మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. ఈసారి ఆయన సాధారణ మానవత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు కానీ, ఈ శరీరధారణ అర్ధము మాత్రము వేరుగా ఉన్నది; ఇది లోతైనది మరియు ఆయన కార్యము అత్యంత లోతైన ప్రాధాన్యతను కలిగి ఉన్నది. శరీరధారణ భావాన్ని సంపూర్తి చేయడమే దేవుడు శరీరునిగా వచ్చుటకు కారణమై ఉన్నది. తన కార్యపు ప్రస్తుత దశను దేవుడు పూర్తిగా ముగించాక, శరీరధారణ సంపూర్ణ భావము, అనగా, శరీరమందు దేవుని కార్యము, సంపూర్ణము అవుతుంది, మరియు ఇకమీదట శరీరమందు చేయవలసిన కార్యమేదీ ఉండదు. అంటే, ఇకమీదట తన కార్యమును జరిగించడానికి దేవుడు శరీరముగా ఎన్నడూ తిరిగి రాడు. కేవలం మానవ జాతిని రక్షించడానికి మరియు పరిపూర్ణ పరచడానికి దేవుడు శరీరధారణ కార్యాన్ని చేస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, కార్యము నిమిత్తము తప్ప, దేవుడు శరీరునిగా రావడము అనేది, అంత సామాన్యమైన విషయము కాదు. కార్యము చేయడానికి శరీరము లోనికి రావడము ద్వారా, దేవుడు శరీరుడై ఉన్నాడని, సామాన్యమైన వ్యక్తి అని, ఒక సామాన్యమైన మానవుడని, ఆయన సాతానుకు కనుపరుస్తాడు—అలాగే ఇప్పటికీ ఆయన లోకాన్ని జయించగలడు, సాతానును చిత్తు చేయగలడు, మానవజాతిని విమోచించగలడు, మానవాళిని జయించగలడు! దేవుని లక్ష్యము మానవాళిని రక్షించడమైతే, సాతాను కార్యపు లక్ష్యము మానవాళిని పాడు చేయడము. సాతాను మానవుని అగాధములో పడేస్తాడు, అయితే దేవుడు అతడిని దాని నుండి రక్షిస్తాడు. మనుష్యులందరూ తనను ఆరాధించేలా సాతాను చేస్తాడు, అయితే దేవుడు సృష్టికి ప్రభువు కాబట్టి, ఆయన వారిని తన ఆధిపత్యమునకు లోబడేలా చేస్తాడు. ఈ కార్యమంతా దేవుని రెండు శరీర ధారణల ద్వారా నెరవేర్చబడుతుంది. స్వాభావికముగా, ఆయన దేహము అనేది మానవత్వము మరియు దైవత్వము కలయికగా, మరియు సాధారణ మానవత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, శరీరధారి అయిన దేవుని దేహము లేకుండా, దేవుడు మానవజాతిని రక్షించే ఫలితాలను సాధించేవాడు కాదు, మరియు ఆయన శరీరమందు సాధారణ మానవత్వము లేకుండా, శరీరమందు ఆయన కార్యము ఈ ఫలితాలను ఇప్పటికీ సాధించలేక ఉండేది. ఆయన సాధారణ మానవత్వాన్ని కలిగి ఉండటమే దేవుని శరీరధారణ సారాంశము; అదే కాకపోతే శరీరాన్ని ధరించడంలో దేవుని అస్సలు ఉద్దేశ్యం ప్రతికూలముగా పోతుంది.

యేసయ్య కార్యములో శరీరధారణ భావము సంపూర్ణము కాలేదు అని నేను ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే, వాక్యము సంపూర్ణ శరీరముగా మారలేదు. యేసయ్య చేసింది శరీరమందున్న దేవుని కార్యములోని ఒక భాగము మాత్రమే; ఆయన విమోచన కార్యమును మాత్రమే చేశాడు, మరియు మానవుని పూర్తిగా సంపాదించగల కార్యాన్ని చేయలేదు. ఇందును బట్టి, అంత్య దినాల్లో దేవుడు మరోసారి శరీరధారి అయ్యాడు. కార్యపు ఈ దశ సాధారణ దేహములో కూడా జరుగుతుంది; మానవత్వము కాస్తయినా అతీతముగా లేని వాడైన, సాధారణ మానవునిచే ఇది పూర్తిగా జరిగించబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు సంపూర్ణ మానవునిగా మారాడు; ఆయన దేవుడినే గుర్తింపు కలిగిన వ్యక్తిగా, సంపూర్ణ మానవునిగా, పూర్తి దేహముగా, కార్యము జరిగిస్తున్నాడు. మానవ నేత్రాలు అతీతము కాని భౌతిక దేహాన్ని చూస్తాయి, అన్య భాషను మాట్లాడగలిగి, అద్భుత సూచనలు కనుపరచలేని, అద్భుతాలు చేయలేని, అతి సామాన్య మానవుడు మహాసభ మందిరాలలో మతము అంతర్గత సత్యాన్ని బట్టబయలు చేయలేడు. ప్రజలకు, రెండవ అవతార దేహపు కార్యము మొదటి దానికంటే పూర్తి భిన్నముగా కనబడుతుంది, ఎంతగా అంటే రెండింటికి ఉమ్మడిగా ఏదీ ఉన్నట్టు కనబడదు మరియు ఈసారి మొదటి కార్యమునకు చెందినది ఏదీ కనబడదు. రెండవ అవతార దేహపు కార్యము మొదటి దాని కంటే భిన్నముగా ఉన్నప్పటికీ, వాటి మూలము ఒకే విధము మరియు ఒకటి కాదని నిరూపించదు. వాటి మూలము ఒకటేనా అనేది, వాటి బాహ్య కవచాల మీద కాదు గానీ, శరీర ధారణలు చేసిన కార్యపు స్వభావము మీద ఆధారపడి ఉంటుంది. ఆయన కార్యపు మూడు దశలలో, దేవుడు రెండుసార్లు శరీరధారి అయ్యాడు, ఆ రెండుసార్లు దేవుని శరీరధారణ కార్యము నూతన కాలాన్ని ప్రారంభించి, నూతన కార్యాన్ని ఆహ్వానిస్తుంది; శరీర ధారణలు ఒకదానికొకటి అనుబంధమై ఉన్నాయి. నిజానికి రెండూ శరీర ధారణలు ఒకే చోటునుండి వచ్చినవి అని చెప్పడము మానవ నేత్రాలకు అసాధ్యము. ఇది మానవ నేత్రానికి లేక మానవ ఆలోచనా సామర్థ్యానికి అందనిది అని చెప్పనవసరము లేదు. కానీ వారి స్వభావమందు, వారు ఒకేలా ఉంటారు, ఎందుకంటే వారి కార్యము ఒకే ఆత్మ నుండి ఉత్పన్నమైనది. శరీర ధారణలైన రెండు దేహాల ఒకే మూలము నుండి ఉద్భవించాయా అనేది వారి ద్వారా వెల్లడి చేయబడిన దైవ కార్యము ద్వారానే గానీ, వారు పుట్టిన కాలము మరియు ప్రదేశము లేదా ఇతర అంశాల బట్టి నిర్ణయించబడదు. శరీరధారి అయిన రెండవ దేహము యేసయ్య చేసిన కార్యమేదీ చేయదు, ఎందుకంటే దేవుని కార్యము ప్రతిసారి ఒక నూతన మార్గానికి తెర తీస్తుంది గానీ, ఆచారానికి కట్టుబడి ఉండదు. రెండవ అవతార దేహము ప్రజల మనస్సులలో మొదటి అవతార దేహమును గురించిన అభిప్రాయాన్ని లోతుగా చేయడమో లేక పటిష్ట పరచడమో చేయదు, కానీ దానిని అభినందిస్తూ మరియు పరిపూర్ణము చేస్తుంది, దేవుని గురించిన మానవ జ్ఞానాన్ని మరింత లోతుగా చేసి, ప్రజల హృదయాలలో ఉన్న బంధకాలన్నీ విరుగగొట్టి, దేవుని గూర్చిన లేనిపోని రూపాలన్నీ వారి హృదయాలలో తుడిచి వేస్తుంది. దేవుని కార్యమును గూర్చిన ఏ ఒక్క దశ మాత్రమే ఆయన గురించి పూర్తి జ్ఞానాన్ని ఇవ్వదు అని చెప్పవచ్చు; ఒకొక్కటి కొంత భాగము మాత్రమే ఇస్తుంది, పూర్తిగా కాదు. దేవుడు తన స్వభావమును సంపూర్ణముగా వెల్లడి చేసినప్పటికీ, మానవుని పరిమిత అవగాహనా సామర్థ్యమును బట్టి, దేవుని గురించిన తన జ్ఞానము ఇప్పటికీ అసంపూర్ణముగానే ఉన్నది. మానవ భాషను ఉపయోగించి, దేవుని స్వభావమంతటినీ తెలియజేయడం, అసాధ్యము; అంతేగాక, ఆయన కార్యపు ఒక్క దశ దేవుని సంపూర్ణముగా ఎలా వ్యక్తపరచగలదు? ఆయన శరీరమందు సాధారణ మానవత్వము చాటున కార్యము చేస్తాడు, మరియు ఎవరైనా ఆయనను శారీరక కవచము ద్వారా కాక, ఆయన దైవత్వపు వ్యక్తీకరణలను బట్టి మాత్రమే తెలుసుకోగలరు. వివిధమైన ఆయన కార్యము ద్వారా మానవుడు ఆయనను తెలుసుకునేందుకు వీలుగా దేవుడు శరీరములోనికి వస్తాడు, మరియు ఆయన కార్యములో ఏ రెండు దశలు ఒకేలా ఉండవు. ఈ విధముగా మాత్రమే మానవుడు ఒకే దృష్టికి పరిమితము కాకుండా శరీరమందున్న దేవుని కార్యమును గురించి పూర్తి జ్ఞానాన్ని పొందుకుంటారు. శరీర ధారణలైన రెండు దేహాల కార్యము వేరైనప్పటికీ, దేహముల స్వభావము మరియు వాటి కార్యపు మూలము, ఒకటిగా ఉంటాయి; వారు రెండ వేర్వేరు దశల కార్యము జరిగించడానికి జీవించి ఉన్నారు, మరియు వేర్వేరు కాలాల్లో ఉద్భవిస్తారు. ఏదేమైనా, దేవుని శరీరాధారణ దేహాలు ఒకే స్వభావాన్ని మరియు ఒకే మూలాన్ని పంచుకున్నాయి—ఇది ఎవరు కాదనలేని సత్యము.

మునుపటి:  భ్రష్టుపట్టిన మానవాళికి శరీరధారియైన దేవుని రక్షణ ఎంతో అవసరమైయున్నది

తరువాత:  దేవుని కార్యము మరియు మానవుని ఆచరణ

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger