దేవుని యందు మీ విశ్వాసంలో మీరు దేవునికి విధేయులై ఉండాలి
మీరు దేవుడిని ఎందుకు విశ్వసిస్తారు? అనేకమందిని ఈప్రశ్న కలవరపెడుతుంది. క్రియాత్మక దేవుని గురించి, పరలోకపు దేవుని గురించి, వారికి ఎప్పుడూ రెండు రకాల దృక్పధాలున్నాయి. అవి పూర్తిగా విభిన్నమైనవి. వారు దేవుని నుండి ఏమైనా లాభాలను పొందుకోవాలనీ, లేదా విపత్తువలన వచ్చే శ్రమల నుండి తప్పించుకోవాలనీ మాత్రమే చూస్తుంటారు కాని ఆయనకు విధేయత చూపించడానికి మాత్రం కాదని ఇది కనుపరుస్తుంది. అలా మాత్రమే వారు కొంత విధేయత చూపిస్తారు. వారి విధేయత షరతులతో కూడినది. అది కేవలం వారి స్వంత ప్రయోజనాలకు మాత్రమే ముడిపడినదై, వారి మీద బలవంతంగా రుద్దబడింది. ఇంతకీ, నువ్వెందుకు దేవుడిని విశ్వసిస్తున్నావు? కేవలం నీ ప్రయోజనాల కోసం, నీ భవిష్యత్తు కోసమే అయితే, నీవు విశ్వసించకపోవడమే శ్రేష్ఠము. అలాంటి విశ్వాసం ఆత్మ-వంచన, ఆత్మ-న్యూనత, స్వీయాభిమానంతో సమానం. ఒకవేళ దేవుని యెడల విధేయత అనే పునాది మీద నీ విశ్వాసం కట్టబడకపోతే, అప్పుడు నీవు ఆయనను వ్యతిరేకించినందుకు చివరకు శిక్షింపబడతావు. దేవుని పట్ల తమ విశ్వాసంలో విధేయతను వెదకని వారందరూ ఆయనను వ్యతిరేకించినట్లే. మనుషులు సత్యాన్ని వెదకాలనీ, ఆయన మాటల గురించి తృష్ణ చెందాలనీ, ఆయన మాటలను తిని, తాగాలనీ, వాటిని ఆచరణలో పెట్టాలనీ దేవుడు కోరుకుంటున్నాడు. ఆవిధంగా మాత్రమే వారు దేవుని పట్ల విధేయతను సాధించగలరు. ఇవే నీ నిజమైన ఉద్ధేశాలైతే, అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా లేవనెత్తి, నీ యెడల తన దయను ఖచ్చితంగా ఉంచుతాడు. ఇది నిస్సందేహము మరియు మార్చలేనిది. దేవునికి లోబడకుండా ఉండడమే నీ ఉద్దేశమైతే, నీకు ఇతర లక్ష్యాలు కూడా ఉంటే, అప్పుడు నీవు చెప్పేదంతా, చేసేదంతా—అంటే, దేవుని ముందు నీ ప్రార్థనలే కాకుండా, నీ ప్రతి పని కూడా—ఆయనకు వ్యతిరేకంగానే ఉంటుంది. నీవు మృదువుగా మాట్లాడుతూ, నెమ్మదస్తుడువై ఉండవచ్చు, నీ ప్రతి క్రియ, నీ ప్రతి హావభావం సరియైనదిగానే ఉండవచ్చు, నీవు విధేయత కలిగినవానిగానే కనబడవచ్చు, కానీ దేవుని యందు నీ విశ్వాసం గురించిన నీ ఉద్దేశాలు, నీ దృక్పధాలు చూసినప్పుడు, నీవు చేసే ప్రతి విషయమూ దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. నీవు చేసే ప్రతిదీ దుర్మార్గమే. గొఱ్ఱెల వలే విధేయతగా కనిపించే మనుషులు, తమ హృదయాల్లో దుర్మార్గపు ఉద్దేశాలు కల్గినవారు, గొఱ్ఱె బొచ్చులో ఉన్న తోడేళ్ళ వంటివారు. వారు ఉద్దేశపూర్వకంగానే దేవుణ్ణి వ్యతిరేకిస్తారు. వారిలో ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. వారిలో ప్రతి ఒక్కరిని బయలుపరచి, వేషధారులంతా పరిశుద్ధాత్ముని చేత ఖచ్చితంగా అసహ్యించుకోబడి, నిరాకరించబడతారని పరిశుద్ధాత్మ అందరికీ చూపిస్తాడు. చింతించకండి: వారిలో ప్రతి ఒక్కరినీ దేవుడు వారి వారి సమయాలకు అనుగుణంగా విసర్జిస్తాడు.
దేవుని వద్ద నుండి వచ్చే నూతన వెలుగును నీవు అంగీకరించలేకపోతే, నేడు దేవుడు చేసేదంతా అర్థం చేసుకోలేకపోతే, దానిని నీవు వెదకలేకపోతే, లేదా దానిని అనుమానించి, దానిమీద తీర్పునిచ్చి, లేదా దానిని నీవు పరిశీలించి పరీక్షించినట్లయితే, అప్పుడు నీకు దేవునికి విధేయత చూపే మనసు లేదన్నమాటే. ఇప్పుడు, ఇక్కడ అనే వెలుగు ప్రత్యక్షమైతే, నీవు ఇంకా నిన్నటి వెలుతురునే భద్రపర్చుకొని, దేవుని నూతన పనిని వ్యతిరేకిస్తే, అప్పుడు నీవు వెర్రివాడవే తప్ప ఏమీకావు—కావాలనే దేవునిని వ్యతిరేకించే వారిలో నీవూ ఒకడివిగా ఉంటావు. దేవునికి విధేయత కల్గియుండటంలో కీలకమైనది నూతన వెలుగును ఆస్వాదించటం. దానిని అంగీకరించి, ఆచరణలో పెట్టగలగటం. అదే నిజమైన విధేయత. దేవుని కోసం తపించే చిత్తశుద్ధి లేనివారు, ఉద్దేశపూర్వకంగానే ఆయనకు లోబడి యుండుట చేతకానివారు. ఉన్న పరిస్థితిలోనే వారు తృప్తి చెందుతున్న ఫలితంగానే, వారు దేవుడిని వ్యతిరేకించగలరు. అలాంటి వ్యక్తి దేవునికి విధేయత చూపలేడు. ఎందుకంటే, ముందు వచ్చిన దానితో అతను ఆవరించబడ్డాడు. ముందు వచ్చిన విషయాలు దేవుడి గురించిన అనేక రకాలైన ఆలోచనలను, ఊహలను మానవులకు అందించాయి. అవే దేవుని స్వరూపంగా వారి మనసులో ముద్రించబడినవి. అందుకనే వారు విశ్వసించేది వారి స్వంత ఆలోచనల, వారి స్వంత ఊహల ప్రామాణికాలను మాత్రమే. నిజంగా పనిచేసే నేటి దేవుడిని, నీ స్వంత ఊహలో ఉన్న దేవునితో పోలిస్తే, అప్పుడు నీ విశ్వాసం సాతాను నుండి వచ్చిందిగానే ఉంటుంది. అది నీ స్వంత ఇష్టాలతో పూతవేయబడింది—దేవునికి అలాంటి విశ్వాసం ఇష్టం లేదు. వారి యోగ్యతలు ఎంత గంభీరమైనవైననూ, వారి సమర్పణ ఎలా ఉన్ననూ—వారు తమ జీవితాన్నంతా ఆయన పరిచర్యకు అర్పించుకొని, తమను తాము హతసాక్షులు చేసుకున్ననూ—అలాంటి విశ్వాసం ఉన్నవారిని దేవుడు అంగీకరించడు. ఆయన కేవలం వారి మీద కొంత కృపను కుమ్మరించి, వారు కొంత సమయం దానిని ఆనందించేలా అనుగ్రహిస్తాడు. అలాంటి వారు సత్యాన్ని ఆచరణలో పెట్టలేరు. పరిశుద్ధాత్మ వారిలో పనిచేయడు, వారి వారి సమయాల్లో ఒకొక్కరిని దేవుడు పరిత్యజిస్తాడు. యౌవ్వనస్తులు, వృద్ధులు అనే తేడా లేకుండా, తమ విశ్వాసంలో దేవునికి విధేయత చూపక, తప్పుడు ఉద్దేశాలను కలిగి ఉన్నవారు, వ్యతిరేకించి అంతరాయం కలిగించేవారు నిస్సందేహంగా దేవుని చేత పరిత్యజించబడుతారు. కొంతమటుకైనా దేవుని పట్ల విధేయత లేని కొందరు, ఆయన నామాన్ని కేవలం గుర్తించేవారు, దేవుని కృపను గురించి, మంచితనాన్ని గురించి కొంత అవగాహన ఉండినను, పరిశుద్ధాత్ముని అడుగులతో జత కల్పక, పరిశుద్ధాత్ముని నేటి క్రియలకు, మాటలకు విధేయత చూపనివారు—అలాంటివారు దేవుని కృప మధ్య జీవిస్తారు కానీ, ఆయన వలన ఏమీ పొందుకోలేరు, ఆయన చేత పరిపూర్ణులు కాలేరు. దేవుడు ప్రజలను వారి విధేయత ద్వారా, వారు దేవుని మాటలను తినడం, త్రాగటం, ఆనందించడం ద్వారా, ఇంకా వారి జీవితాల్లో శ్రమలు దాని వలన మెరుగుపర్చబడటం ద్వారా పరిపూర్ణులుగా మారుతారు. అలాంటి విశ్వాసం ద్వారానే మనుషుల మనస్తత్వాలు మారతాయి. అప్పుడే వారు నిజమైన దేవుని జ్ఞానాన్ని కల్గియుంటారు. దేవుని కృప మధ్య జీవించడం వలన సంతృప్తి చెందక, పరితపించి, సత్యాన్ని వెతుకుతూ, దేవుని కోసం వేచి చూడటమే దేవునికి స్పృహతో లోబడియుండటమని చెప్పవచ్చు. అలాంటి విశ్వాసాన్నే ఆయన కోరుకుంటున్నాడు. దేవుని కృపను ఆనందించడం తప్ప ఏమీ చేయని వారందరూ పరిపూర్ణులుగా చేయబడలేరు, లేదా మార్చబడలేరు; ఇంకా వారి విధేయత, భక్తి, ప్రేమ, ఓర్పు, అన్నీ పైపైనవే. దేవుని కృపను మాత్రమే ఆనందించేవారు దేవుణ్ణి నిజంగా తెలుసుకోలేరు. వారు దేవుడిని తెలుసుకున్నా వారి జ్ఞానం పైపైదిగానే ఉంటుంది. “దేవుడు మానవుడిని ప్రేమిస్తాడు” లేదా “దేవుడు మానవుని పట్ల కనికరం కల్గి ఉన్నాడు” అనే మాటలను వారు మాట్లాడతారు. కానీ, ఆ మాటలు మానవుని జీవితాన్ని సూచించవు. మానవులు నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నారని కూడా అవి చూపించవు. దేవుని మాటలు వారిని మెరుగుపర్చినపుడు, లేదా ఆయన పరీక్షలు వారి మీదకు వచ్చినపుడు, మానవులు దేవునికి విధేయత చూపించలేకపోతే—అప్పుడు వారు అస్సలు విధేయులు కారు. వారి లోపల దేవునిలో విశ్వాసం గురించి అనేకమైన నియమాలు, ఆటంకాలు ఉన్నాయి. అనేక సంవత్సరాల విశ్వాసం ఫలితంగా పాత అనుభవాలు, లేదా బైబిల్ మీద ఆధారపడే వివిధ నియమాలు వారిలో ఉన్నాయి. అలాంటి వారు దేవునికి విధేయత చూపించగలరా? వీరందరూ మానవ విషయాలతో నిండియున్నారు—వారు దేవునికి ఎలా లోబడి ఉంటారు? అది విధేయత కాదు కానీ నియమాలను పాటించడమే; వారిని వారు తృప్తిపర్చుకోవడం, సంతుష్టి చెందడమే. ఇదే దేవుని పట్ల విధేయత అని నీవు అంటే, ఆయనకు వ్యతిరేకంగా నీవు దేవ దూషణ చేయడం లేదా? నీవు ఒక ఐగుప్తీయ ఫారోవి. నీవు దుర్మార్గాన్ని చేస్తావు. దేవునికి వ్యతిరేకంగా పనులు చేయడంలో నిమగ్నమయ్యావు—ఈ విధంగా నీవు సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడా? నీవు త్వరపడి పశ్చాత్తాపపడు. కొంత స్వీయ అవగాహనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించు. అది చేతకాకపోతే ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. దేవునికి సేవ చేస్తున్నానని చెప్పుకోవడం కన్నా అది చాలా మంచిది. నీవు ఆటంకపర్చవు, అంతరాయం కల్గించవు; నీ స్థానం నీకు తెలుస్తుంది, బాగా జీవిస్తావు—అది నీకు మంచిది కాదా? మరియు దేవుణ్ణి వ్యతిరేకించినందుకు నీవు శిక్షించబడవు కూడా.