అనేకులు పిలువబడుతారు, కానీ కొందరే ఎంచుకోబడుతారు
లోకములోని అనేకులను నా అనుచరులుగా ఉండాలని నేను కోరుకున్నాను. ఈ అనుచరులందరిలో, పూజారులుగా సేవ చేయువారు, నాయకత్వం వహించేవారు, దేవుని కుమారులు, దేవుని ప్రజలు మరియు సేవ చేయువారు ఉన్నారు. వారు నాపట్ల చూపు విధేయత ఆధారంగా వారిని నేను వేరుపరుస్తాను. అందరూ రకాల వారీగా వేరు చేయబడిన మీదట, అంటే, ప్రతి రకం మనుష్యుని స్వభావం స్పష్టం చేయబడిన తర్వాత, మానవజాతికి నా రక్షణ అందించే లక్ష్యం సాధించుట కోసం ప్రతి ఒక్కరికీ వారి సరియైన వర్గంలో వరుస సంఖ్య ఇచ్చెదను మరియు ప్రతివారినీ వారికి తగిన స్థానములో ఉంచుదును, నేను రక్షించాలనుకునే వారిని గుంపులుగా నా ఇంటికి పిలిచెదను మరియు ఆ పిమ్మట చివరి రోజులలో నా క్రియను వారందరూ అంగీకరించులా చేయుదును. అదే సమయంలో, రకమును బట్టి వారిని వేరు చేసెదను, తదుపరి ప్రతి ఒక్కరికీ వారి క్రియల ఆధారంగా ఫలితము లేదా శిక్ష నొసంగుదును. నా కార్యము అలాంటి చర్యలతో నిండి ఉండును.
ఈరోజు, నేను ఈ లోకమున జీవించుదును మరియు మనుష్యుల మధ్య జీవించుదును. జనులు నా కార్యమును అనుభవింతురు, నా పలుకులను వినెదరు మరియు దీనితో పాటు నేను నా అనుచరులలో ప్రతి వారికీ అన్ని సత్యములు అనుగ్రహించెదను, అంటే వారు జీవమును నా నుండి అందుకొనెదరు, ఆలాగున వారు నడువవలసిన మార్గమును పొందెదరు. ఎందుకనగా నేనే దేవుడిని, ప్రాణమును ప్రసాదించువాడిని. అనేక సంవత్సరాల నా కార్యము సమయంలో, జనులు ఎంతయో పొందిరి మరియు ఎంతయో కోల్పోయిరి, అయిననూ వారు నన్ను నిజముగా నమ్ముట లేదని నేను చెప్పుదును. ఎందుకనగా నేను దేవుడిని అని జనులు వారి నోటితో మాత్రమే ఒప్పుకొనెదరు, కానీ నేను చెప్పు సత్యములను నిరాకరించెదరు మరియు నేను వారిని కోరిన సత్యములను ఆచరణలో ఉంచరు. చెప్పాలంటే, జనులు దేవుని ఉనికిని మాత్రమే అంగీకరిస్తారు, కానీ సత్యాన్ని కాదు; ప్రజలు దేవుని ఉనికిని మాత్రమే గుర్తిస్తారు, కానీ జీవపు ఉనికిని కాదు; ప్రజలు దేవుని పేరును మాత్రమే అంగీకరిస్తారు, కానీ ఆయన సారాన్ని కాదు. నేను వారి ఉత్సాహాన్ని అసహ్యించుకుంటాను, ఎందుకంటే వారు నన్ను మోసం చేయడానికి మాత్రమే మంచి పదాలను ఉపయోగిస్తారు; వారిలో ఎవరూ నన్ను నిజంగా ఆరాధించరు. మీ పలుకులలో సర్పపు ప్రలోభం ఉంది; ఇంకా, అవి విపరీతమైన దురహంకారంతో నిండి ఉన్నవి, ప్రధాన దేవదూత చేసిన యథార్థ ప్రకటన ఇదే. ఇంకా ఏమిటంటే, మీ కార్యాలు చీలికలు పేలికలు అయ్యాయి అవమానకరమైన స్థాయిలో చినిగిపోయాయి; మీ మితిమీరిన కోరికలు మరియు లోభ ఉద్దేశాలు చెవికి అభ్యంతరకరంగా ఉన్నాయి. మీరందరూ నా ఇంటిలో చిమ్మట పురుగులుగా మారారు, అసహ్యంతో త్యజించవలసిన వస్తువులు అయ్యారు. మీలో ఏ ఒక్కరునూ సత్యమును ప్రేమించరు; బదులుగా, మీరు ఆశీర్వదించబడాలని, పరలోకమునకు అధిరోహించాలని, భూమిపై క్రీస్తు తన శక్తిని చెలాయించే మహిమాన్విత దృశ్యము చూడాలని కోరుకుంటారు. అయితే మీలాంటి వారు, అంతగా భ్రష్టుత పొందినవారు, దేవుడు అంటే ఏమిటో తెలియని వారు దేవుడిని అనుసరించడానికి ఎలా యోగ్యులు కాగలరో మీరెప్పుడైనా ఆలోచించారా? మీరు పరలోకమునకు ఎలా అధిరోహించగలరు? అలాంటి మహిమాన్విత దృశ్యాలను, ఎప్పుడూ లేనంత అద్భుతమైన దృశ్యాలను చూడగలగడానికి మీరెలా అర్హులు కాగలరు? మీ నోర్లు మోసం, అశుద్ధత, నమ్మకద్రోహం మరియు దురహంకారంతో కూడిన పలుకులతో నిండియున్నాయి. మీరెప్పుడునూ నాతో నిజాయితీతో మాటలాడలేదు, పరిశుద్ధ పదాలు లేవు, నా వాక్యమును అనుభవించిన తర్వాత నాకు విధేయత చూపే మాటలు లేవు. అంతిమముగా, మీ విశ్వాసం ఏలా ఉంది? మీ హృదయములలో దురాశ మరియు డబ్బు తప్ప మరేమియు లేదు, మీ మనస్సులో వస్తుసంపదలు తప్ప మరేమియు లేవు. అనునిత్యమూ, నా వద్ద నుండి ఎంత పొందవలయునో నీవు లెక్కించెదవు. అనునిత్యమూ, నా వద్ద నుండి నీవెంత సంపద మరియు ఎన్ని వస్తుసంపదలు పొందితివో లెక్కించెదవు. అనునిత్యమూ, మీరు ఆనందము పొందులాగున, ఇంకా అధికములుగా మరియు ఉన్నతములైన వస్తుసంపదలు పొందులాగున, నా ఆశీర్వాదములు మీపై ఉండుట కోసము మీరు ఎదురు చూచెదరు. అనుక్షణం మీ తలంపులలో నేను గానీ, నా నుండి వచ్చు సత్యము గానీ లేదు, ఉన్నదంతయూ మీ భర్త లేదా భార్య, మీ కుమారులు, కుమార్తెలు మరియు మీరు తినే, ధరించే వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎక్కువగా, ఇంకా ఉన్నతముగా ఆనందము ఎలా పొందవలయునా అని మాత్రమే మీరు ఆలోచింతురు. కానీ పగిలిపోయేలా మీ పొట్టను మీరు నింపుకున్నప్పుడు కూడా మీరు మృతదేహం కాక మరేమిటి? బయటికి, నిన్ను నీవు అలాంటి అందమైన దుస్తులతో అలంకరించుకున్నప్పుడు కూడా, మీరు జీవం లేని నడుచుచున్న శవం కాదా? మీ తల నెరిసిపోయేదాకా మీరు మీ పొట్ట కోసం ప్రయాసపడుతున్నారు, అయినను మీలో ఒక్కరు కూడా ఒక్క వెంట్రుక కూడా మీరు నా కార్యము కొరకు అర్పించనే లేదు. మీరు మీ సొంత దేహము కొరకు, మీ కుమారులు మరియు కుమార్తెల కొరకు నిరంతరము పయనింతునే ఉందురు, మీ దేహమును ప్రయాసపెడుతూ, మీ మనస్సును కలతపెడుతూ—అయినను మీలో ఏ ఒక్కరూ నా చిత్తము గురించి ఏమాత్రము చింతించరు లేదా పట్టించుకోరు. నా వద్ద నుండి మీరు ఇంకా ఏమి పొందగోరుచున్నారు?
నేను కార్యము చేయునప్పుడు నేనెప్పుడును త్వరపడను. జనులు నన్ను ఎలా అనుసరిస్తున్నారు అనేదానితో సంబంధం లేకుండా, నేను ప్రతి దశ ప్రకారము, నా ప్రణాళిక ప్రకారము నా కార్యమును చేయుదును. కావున నాకు విరుద్ధముగా మీరు సమస్త తిరుగుబాటు చేసినప్పటికీ, నేను మానకుండా ఇంకనూ పని చేయుదును, నేను తప్పక మాట్లాడవలసిన మాటలను నేను ఇంకనూ మాట్లాడుదును. నేను ముందే నిర్ణయించుకున్న వారిని నా ఇంటికి పిలుతును, వారు నా వాక్యములను వినెదరు. నా వాక్యములకు సమర్పించుకున్న వారందరినీ, నా వాక్యముల కోసం పరితపించు వారందరినీ నా సింహాసనము ఎదుటకు నేను తీసుకువచ్చెదను; నా వాక్యములను తృణీకరించిన వారందరినీ, నాకు విధేయత చూపని, బహిరంగంగా నన్ను ధిక్కరించిన వారందరినీ వారి అంతిమ దండన కోసం ఎదురు చూచుటకు ఒక పక్కన పడదోయుదును. ప్రజలందరు భ్రష్టతలో మరియు దుష్టుని చేతి కింద జీవింతురు, కావున అలాంటి వారిలో అనేకులు సత్యము కోసం నన్ను అనుసరించరు. చెప్పునదేమనగా, అత్యధికులు నన్ను నిజముగా ఆరాధించరు; వారు నన్ను సత్యముతో ఆరాధించరు, కానీ అవినీతి మరియు తిరుగుబాటు ద్వారా, కపట మార్గాలతో నా విశ్వాసమును పొందుటకు ప్రయత్నము చేయుదురు. ఈ కారణం చేతనే నేను ఇలా చెబుతున్నాను: పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడినవారు కొందరే. పిలుబడినవారు ఎంతగానో చెడిపోయారు మరియు అందరును ఒకే కాలములో జీవించుచున్నారు—కానీ వారిలో ఒక భాగము అయిన ఏర్పరచబడినవారు, సత్యమును విశ్వసించువారు మరియు ఒప్పుకొనువారు మరియు సత్యమును ఆచరించువారు. అయితే వీరు మొత్తములో ఒక చాలా చిన్న భాగము మాత్రమే మరియు వారి నుండియే నేను కీర్తిని పొందెదను. ఈ వాక్యముల ప్రకారము కొలిచినప్పడు, ఏర్పచబడినవారిలో మీరు ఒకరుగా ఉన్నారా? మీ ముగింపు ఎలా ఉండబోతోంది?
నేను చెప్పినట్లు, నన్ను అనుసరించువారు అనేకులు ఉన్నప్పటికీ, నన్ను నిజముగా ప్రేమించువారు కొద్దిమంది మాత్రమే. బహుశా కొందరు ఇలా అనవచ్చు, “నేను మిమ్ములను ప్రేమించి ఉండకపోతే ఇంత పెద్ద మూల్యం చెల్లించి ఉండేవాడినా? నేను ప్రేమించి ఉండకపోతే నేను మిమ్ములను ఇంత వరకు అనుసరించేవాడినా?” నిశ్చయముగా, నీకు అనేకములైన కారణములు ఉన్నవి మరియు ప్రేమ, నిశ్చయముగా చాలా గొప్పది, కానీ నా పట్ల నీ ప్రేమ సారాంశము ఏమిటి? “ప్రేమ” అని పిలువబడుదానికి అర్థం, పరిశుద్ధమైన మరియు కళంకము లేని ఒక భావోద్వేగం, ఇందులో ప్రేమించుటకు, అనుభూతి చెందుటకు మరియు మెలకువ కలిగి ఉండుటకు మీరు మీ హృదయమును ఉపయోగించెదరు. ప్రేమలో షరతులు ఉండవు, అడ్డంకులు ఉండవు మరియు దూరము ఉండదు. ప్రేమలో అనుమానం ఉండదు, మోసం ఉండదు మరియు కుయుక్తి ఉండదు. ప్రేమలో వ్యాపారము ఉండదు మరియు అపరిశుద్ధము ఉండదు. నీవు ప్రేమించిన యెడల, నీవు మోసపుచ్చవు, ఫిర్యాదు చేయవు, నమ్మకద్రోహం చేయవు, తిరగబడవు, నిర్భంధించవు లేదా ఏదైనా పొందాలని లేదా కొంత మొత్తం పొందాలని కోరుకోవు. నీవు ప్రేమించిన యెడల, నీవు ఆనందముతో నిన్ను నీవు సమర్పించుకొనెదవు, అనందముతో కష్టమును భరించెదవు, నీవు నాకు అనుకూలుడుగా మారెదవు, నీ కున్నదంతయు నా కొరకు త్యజింతువు, నీవు నీ కుటుంబము, నీ భవిష్యత్తు, నీ యవ్వనము మరియు నీ వివాహమును విడిచిపెట్టెదవు. లేని యెడల, నీ ప్రేమ అసలు ఎంతమాత్రము ప్రేమ కాదు, అది ఒక మోసం మరియు నమ్మకద్రోహం. నీ ప్రేమ ఎటువంటింది? అది నిజమైన ప్రేమయేనా? లేక అబద్ధమైనదా? నీవు ఎంత త్యజించితివి? నీవుఎంత అర్పించితివి? నీ యొద్ద నుండి నేను ఎంత ప్రేమ పొందితిని? మీరు ఎరుగుదురా? మీ హృదయములు చెడు, నమ్మకద్రోహం మరియు మోసంతో నిండియున్నవి—అలాంటప్పుడు, మీ ప్రేమ ఎంత అపరిశుద్ధమైనది? మీరు నాకోసం ఇప్పటికే చాలా త్వజించితిరని మీరు అనుకుంటారు; నాపట్ల మీకున్న ప్రేమ ఇప్పటికే సరిపడునంత ఉందని మీరు అనుకుంటారు. అట్లయినచో, మీ వాక్కులు మరియు కార్యములు ఎల్లవేళలా తిరుగుబాటుతో మరియు మోసపూరితంగా ఎందుకు ఉన్నవి? మీరు నన్ను అనుసరింతురు, అయినను మీరు నా వాక్యమును అంగీకరించరు. దీనినే ప్రేమని భావిస్తారా? మీరు నన్ను అనుసరింతురు, అయినను నన్ను పక్కకు తోసివేయుదురు. దీనినే ప్రేమ అని భావిస్తారా? మీరు నన్ను అనుసరింతురు, అయినను మీకు నాపై అపనమ్మకము ఉన్నది. దీనినే ప్రేమ అని భావిస్తారా? మీరు నన్ను అనుసరింతురు, అయినను మీరు నా ఉనికిని అంగీకరించరు. దీనినే ప్రేమని భావిస్తారా? మీరు నన్ను అనుసరింతురు, అయినను నెవరినో ఆలాగున నన్ను ఆదరించరు మరియు అడుగడుగునా నాకు కష్టములను కలిగించెదరు. దీనినే ప్రేమ అని భావిస్తారా? మీరు నన్ను అనుసరింతురు, అయినను నన్ను ప్రతి విషయములో మభ్యపెట్టుటకు మరియు మోసబుచ్చుటకు ప్రయత్నము చేయుదురు. దీనినే ప్రేమ అని భావిస్తారా? మీరు నన్ను సేవింతురు, అయినను నేననిన భయపడరు. దీనినే ప్రేమ అని భావిస్తారా? మీరు అన్ని విధములుగాను మరియు అన్ని విషయములలోను నన్ను ధిక్కరించెదరు. దీనినే ప్రేమ అని భావిస్తారా? మీరు చాలా సమర్పించారు, నిజమే, అయినను నేను మీ నుండి కోరుకున్నది మీరు ఎప్పుడూ ఆచరించలేదు. దీనినే ప్రేమని భావించగలమా? జాగ్రత్తగా లెక్కించినచో మీ ఆంతర్యములో నాపట్ల మచ్చుకైనా ప్రేమ లేదని తెలుస్తుంది. నేను అందజేసిన అనేక సంవత్సముల పని మరియు నా సమస్త వాక్యముల తరువాత, మీరు వాస్తముగా ఎంత పొందితిరి? వెనక్కు తిరిగి చూసుకోవడానికి ఇది చాలదా? నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను: నేను నావద్దకు పిలిచినవారు ఎన్నడునూ చెడు చేయనివారు కాదు; దానికి బదులుగా, నేను ఎంచుకున్నవారు నన్ను నిజముగా ప్రేమించువారు. గనుక, మీరు మీ మాటలు మరియు పనులలో తప్పక జాగరూకులై ఉండాలి మరియు మీ సంకల్పములు మరియు ఆలోచనలను పరిశీలించుకోవాలి, కావున అవి హద్దులు దాటకుండా ఉంటాయి. అంతిమ దినముల సమయంలో, నా సమక్షమున మీ ప్రేమను సమర్పించుట కొరకు మీకు సాధ్యమయినంత చేయండి, లేదా మీ నుండి నా ఆగ్రహం ఎప్పుడూ తొలగకపోవచ్చు.