శ్రమలను అనుభవించుట ద్వారానే మీరు దేవుని ప్రేమానురాగాలు తెలుసుకోగలరు
ఈ రోజున నీవు దేవుని ఎంతగా ప్రేమించావు? దేవుడు నీ యందు చేసిన కార్యాలన్నిటిలో నీకు ఎన్ని తెలుసు? ఈ సంగతులన్నీ మీరు తప్పక నేర్చుకోవాలి. మనుష్యుడు ఆయనను ప్రేమించునని మరియు దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు, మనుష్యుల కొరకు ఆయన చేసినదంతయూ మనుష్యుడు చూడడం ద్వారా, మనుష్యుడు ఆయనను ప్రేమించుటకు మరియు ఆయనను నిజముగా తెలుసుకొనుటకు అనుమతించెను. మనుష్యుడు దేవుని కొరకు కష్టపడుటకు మరియు ఇంత దూరము వచ్చుటకు గల కారణం దేవుని ప్రేమ అయినట్లయితే, దేవుని రక్షణ మరియొక కారణమైయున్నది; అంత మాత్రమే కాకుండా, మనుష్యునిలో దేవుడు చేసిన క్రమ శిక్షణకు సంబంధించినది మరియు ఆయన ఇచ్చేటువంటి తీర్పు కూడా ఇందుకు కారణమైయున్నది. మీకు దేవుని పరీక్షలు, క్రమశిక్షణ, తీర్పు అనేవి లేకుండా, దేవుడు మీకు శ్రమలు కలిగించకపోతే, మీరు అన్ని విషయాలలో యథార్థముగా దేవునిని ప్రేమించలేరు. మనిషిలో దేవుడు ఎంత ఎక్కువగా పని చేస్తాడో, అంతే ఎక్కువగా మనిషి శ్రమలకు గురవుతాడు, దేవుని కార్యములోని అర్థము ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, అంతే ఎక్కువగా మనిషి హృదయము దేవునిని ప్రేమించగలుగుతుంది. బాధాకరమైన పరిక్షలు, హింస మరియు శుద్ధి చేయడం అనేవి లేకుండ దేవుణ్ణి ప్రేమించడాన్ని మీరు ఎలా నేర్చుకుంటారు? దేవుడు మనిషికి కృప, ప్రేమ మరియు కరుణ అనేవి మాత్రమే చూపిస్తే, నిజంగా దేవుణ్ణి ప్రేమించాలనే స్థితికి నీవు చేరుకుంటావా? ఒక విధంగా, దేవుడు అనుగ్రహించే పరీక్షలలో మనుష్యుడు తన లోపాలను తెలుసుకుంటాడు. అంతేగాకుండా, అతను ఎంత అల్పుడో, ఎంత దిక్కార స్వభావముగలవాడో, ఎంత నీచమైనవాడో గ్రహించడంతో పాటు అతని వద్ద ఏమీ లేదని మరియు అతనే ఏమీ కాదని తెలుసుకుంటాడు; మరొకవైపు, దేవుడు తన శ్రమల సమయంలో, మనిషి కోసం పలు విధాల వాతావరణాలు సృష్టిస్తాడు. దేవుని ప్రేమను మనిషి మరింత అనుభవించడానికి అవి కారణమవుతాయి. బాధ చాలా గొప్పదైనప్పటికీ, కొన్నిమార్లు అణచివేసుకోలేని దుఃఖముతో కూడిన ఆ బాధను అనుభవిస్తూ, దానిని జయించలేకపోయినప్పటికీ, తనలో జరిగించబడుచున్న దేవుని కార్యము ఎంత అందమైనదో మనిషి చూడగలగుతాడు. ఇటువంటి అనుభవ ఆధారము మీదనే దేవుని కొరకు నిజమైన ప్రేమ మనిషిలో పుడుతుంది. ఈ రోజున దేవుని కరుణ, ప్రేమ మరియు కృప ద్వారా మాత్రమే మనిషి తనను గూర్చి తాను తెలుసుకోగలుగుచున్నాడు మరియు మానవ స్వభావమును గూర్చి అంతగా తెలుసుకోలేకపోవుచున్నాడు. దేవుని తీర్పు మరియు శుద్ధీకరణ ద్వారా మాత్రమే, శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా మాత్రమే మనిషి తన లోపాలను మరియు అతని వద్ద ఏమీ లేదన్న సంగతిని తెలుసుకోగలడు. అందుచేత, దేవుని పట్ల మానవుని ప్రేమ దేవుడు చేసే శుద్ధీకరణ మీదను మరియు ఆయన తీర్పు మీదను ఆధారపడియుంటుంది. మీరు కేవలము దేవుని కృపను అనుభవిస్తూ, శాంతికరమైన సమాధానకరమైన కుంటుంబాన్ని కలిగియుంటూ లేక భౌతిక ఆశీర్వాదాలను మాత్రమే కలిగియున్నట్లయితే, మీరు దేవునిని సంపాదించుకోలేదన్నమాట. దేవుని యందు నీవు కలిగియున్న విశ్వాసము, విజయవంతమైన విశ్వాసముగా పరిగణించబడదు. దేవుడు ఇప్పటికే శరీరమందు ఒక స్థాయిలో కృప యొక్క కార్యమును జరిగించాడు, అంతమాత్రమే గాకుండా ఇప్పటికే మానవుల మీద భౌతికపరమైన ఆశీర్వాదాలను కుమ్మరించియున్నాడు. అయినప్పటికీ, మానవుడు ప్రేమ, కృప మరియు కరుణ అనేవాటి ద్వారా పరిపూర్ణుడుగా చేయబడలేదు. మనుష్యుడు కలిగియున్న అనుభవాలలో కొంతమట్టుకు దేవుని ప్రేమను ఎదుర్కొని, దేవుని ప్రేమ, ఆయన కరుణ ఎలా ఉంటుందోనని చూసినప్పటికీ, కొంత కాలములో దేవుని ప్రేమ, కృప మరియు కరుణలనేవీ ఒక మనుష్యున్ని పరిపూర్ణునిగా చేయలేవని, మనుష్యునిలో ఉన్నటువంటి భ్రష్టత్వము ఎట్టిదో చూపించలేవని, మనుష్యుడు తాను కలిగియున్న భ్రష్టత్వాన్ని బట్టి విముక్తి చెందలేడని, తనలోని ప్రేమ విశ్వాసములను పరిపూర్ణతలోనికి నడిపించలేవని అతను చూడగలుగుతాడు. దేవుని కృపా కార్యమనేది ఒక్క నిర్దిష్టమైన కాలములో జరిగించబడేదే గానీ మనుష్యుడు దేవునిని తెలుసుకునే క్రమములో దేవుని కృపను సంతోషంగా అనుభవిస్తూ, అతను దాని మీద ఆధారపడిపోకూడదు.
మానవుడిలో దేవుని పరిపూర్ణత దేని ద్వారా సంపూర్ణము కాగలదు? అతని నీతీయుతమైన స్వభావము ద్వారానే అది సాధ్యము కాగలదు. దేవుని స్వభావములో ప్రాథమికముగానే నీతి, ఉగ్రత, ఘనత, తీర్పు మరియు శాపము అనేవి ఉంటాయి. దేవుడు తన తీర్పు ద్వారా ప్రాథమికంగా మనుష్యున్ని పరిపూర్ణునిగా చేస్తాడు. కొంతమంది ఈ విషయాన్ని అర్థము చేసుకొనకపోగా, తీర్పు మరియు శపించుట ద్వారా మాత్రమే దేవుడు మనుష్యున్ని పరిపూర్ణునిగా ఎందుకు చేయాలని అడుగుతుంటారు. “దేవుడు మనిషిని శపిస్తే, ఆ మనుష్యుడు చనిపోడా? దేవుడు మనిషికి తీర్పు తీరిస్తే, మనుష్యుడు శిక్ష పొందడా? అప్పుడు అతను ఎలా పరిపూర్ణుడవుతాడు?” అని వారు అంటుంటారు. దేవుని కార్యము గురించి తెలియనివారే ఇటువంటి మాటలను మాట్లాడుతారు. దేవుడు మనిషి చూపించే అవిధేయతను శపిస్తాడు, ఆయన మనిషి చేసిన పాపాలకు తీర్పు తీరుస్తాడు. ఆయన కఠినంగాను మరియు కరుణలేని విధంగా మాట్లాడుచున్నప్పటికీ, ఆయన సమస్త విషయాలను ఆ మనిషి లోపలే బయలుపరుస్తాడు, ఇటువంటి కఠిన మాటల ద్వారా మనిషిలోని వాస్తవికతను బయలుపరచినప్పుడు, అటువంటి తీర్పు తీర్చినప్పటికీ, రక్త మాంసములతో కూడిన ఈ శరీరమును గూర్చిన లోతైన జ్ఞానాన్ని మనిషికి దేవుడు అనుగ్రహిస్తాడు. తద్వారా, మనిషి తనను తాను దేవుని ఎదుట సమర్పించుకుంటాడు. మానవుని శరీరము పాపము చేస్తుంది మరియు అది సాతానుకు సంబంధించింది, అది అవిధేయత చూపిస్తుంది, మరియు అది దేవుని శిక్షకు గురియైనది. అందుచేత, మనిషి తనను గూర్చి తాను తెలుసుకునే క్రమములో, దేవుని తీర్పుకు సంబంధించిన మాటలన్నీ అతని మీద పడతాయి మరియు శుద్ధీకరణకు సంబంధించిన అన్ని రకాల పద్ధతులు వినియోగించబడతాయి; అప్పుడు మాత్రమే దేవుని కార్యము ప్రభావ పూరితముగా ఉంటుంది.
దేవుడు పలికిన మాటలను గమనించినట్లయితే, ఆయన ఇప్పటికే మానవ శరీరాన్ని శపించినట్లుగా చూడగలము. మరయితే, ఈ మాటలు శపించే మాటలు కాదా? దేవుడు పలికిన మాటల ద్వారా మనిషి నిజమైన రంగులు బయలుపరచబడతాయి మరియు అటువంటి మంచి ప్రత్యక్షత ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడు, మరియు దేవుని చిత్తాన్ని అనుసరించి, ఆయనను తృప్తిపరచలేనని మనిషి గ్రహించినప్పుడు, అతను తనలో తాను దుఃఖిస్తాడు మరియు పశ్చాత్తాపపడతాడు, అతను దేవునికి చాలా ఋణపడియున్నాడని మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుంటాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని మీలోనే క్రమశిక్షణ చేసే కొన్ని సందర్భాలు ఉంటాయి మరియు ఈ క్రమశిక్షణ దేవుని తీర్పు నుండి వస్తుంది; దేవుడు మిమ్మల్ని తప్పు పట్టి, మీకు తన ముఖమును చూపించకుండ ఉండే సందర్భాలు ఉంటాయి, అలా చేసినప్పుడు ఆయన మిమ్మల్ని పట్టించుకోడు మరియు మీలో ఎటువంటి కార్యము చేయడు. మిమ్మల్ని శుద్ధీకరణ చేసే క్రమములో నిశ్శబ్దంగా మిమ్మల్ని క్రమపరుస్తాడు. ఒక మనిషిలో దేవుని కార్యము అనేది ప్రాథమికముగా దేవుని నీతి స్వభావము కలుగజేయునదిగా ఉంటుంది. అంతిమంగా మనిషి దేవుని పట్ల ఎలాంటి సాక్ష్యాన్ని కలిగియుండాలి? దేవుడు నీతిమంతుడైన దేవుడని, ఆయన స్వభావము నీతియుతమైనదని, ఉగ్రతతో కూడినదని, శిక్షించేదని మరియు తీర్పు తీర్చేదని మనిషి సాక్ష్యము చెప్పాలి; దేవుని నీతి స్వభావము విషయమై మనిషి సాక్ష్యము చెప్పాలి. మనుష్యులను పరిపూర్ణులుగా చేయు నిమిత్తము దేవుడు తన తీర్పును వినియోగిస్తాడు, ఆయన మనుష్యులను ఎంతగానో ప్రేమించాడు, రక్షించాడు. అయితే, ఆయన ప్రేమలో ఎన్నెన్ని విషయాలు దాగియున్నాయి? తీర్పు, మహిమ, ఉగ్రత మరియు శాపములు అందులో దాగియున్నాయి. గతములో దేవుడు మనిషిని శపించినప్పటికీ, ఆయన మనిషిని పూర్తిగా అగాధములోనికి నెట్టివేయలేదు గానీ, దేవుని పట్ల మనిషికున్న విశ్వాసమును శుద్దీకరించుటకు ఆయన ఎన్నో విధానాలను ఉపయోగించాడు; ఆయన మనిషిని చంపలేదు గానీ, మనిషి పరిపూర్ణుడయ్యే దిశగా నడుచుకున్నాడు. శరీరములోని రక్త మాంసములు సాతానుకు సంబంధించినవి, ఈ విషయాన్ని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు గానీ దేవుడు చెప్పిన వాస్తవ విషయాలన్నీ ఆయన వాక్యముల ప్రకారముగా ఇంకా పూర్తి చేయబడలేదు. ఆయన మిమ్మల్ని శపించినందున మీరు ఆయనను ప్రేమించవచ్చు, తద్వారా, మీరు మీ శరీరములను గురించి తెలుసుకోగలుగుతారు; ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు, తద్వారా మీరు మేల్కొని ఉండవచ్చు, అప్పుడు మీలోని లోపాలను తెలుసుకోగలుగుతారు మరియు మనిషి అయోగ్యత ఎటువంటిదో తెలుసుకుంటారు. అందుచేత దేవుడు శపిస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు మరియు ఆయన ఔన్నత్యమును, ఉగ్రతను కనుపరుస్తాడు. ఇవన్నీ మనిషిని పరిపూర్ణునిగా చేయు దిశగానే జరుగుతాయి. ఈ రోజున దేవుడు చేసే ప్రతీది మరియు మీలో నీతి స్వభావమును పుట్టించేదంతయు మనిషిని పరిపూర్ణునిగా చేసే క్రమములో జరిగించే కార్యములైయున్నవి. దేవుని ప్రేమ ఇలాగే ఉంటుంది.
మనిషి ఆచారప్రదమైన నియమ నిబంధనలలో దేవుడు ప్రేమ అంటే ఆయన కృప చూపించువాడని, కరుణించువాడని మరియు మనిషి బలహీనతల పట్ల జాలి చూపించువాడని నమ్ముచున్నాడు. ఇవన్నీ దేవుని ప్రేమగానే పరిగణించబడినప్పటికీ, అవన్నీ ఒక వైపు మాత్రమే మరియు మనుష్యుని పరిపూర్ణునిగా చేయుటకు ఇవేవీ ప్రాథమిక సాధనాలు కావు. కొంతమంది మనుష్యులు తమకున్న రోగాల్ని బట్టి దేవుని యందు నమ్మికయుంచియున్నారు. ఆ రోగమే మీ కొరకు దేవుడు చూపించే కృపయైయున్నది; ఆ రోగమే లేకపోతే, మీరు దేవుని యందు నమ్మిక ఉంచేవారు కాదు కదా, మరియు మీరు దేవుణ్ణి నమ్మకపోయినట్లయితే, మీరు ఇంత దూరము వచ్చేవారు కాదు కదా. అందుచేత ఈ కృప కూడా దేవుని ప్రేమయైయున్నది. యేసునందు నమ్మిక ఉంచే సమయములో మనుష్యులు సత్యమును అర్థము చేసుకోనందున, దేవునికి ఇష్టులు కానివారందరూ ఏమోమో చేశారు, అయినప్పటికీ దేవుడు ప్రేమను మరియు కనికరమును కలిగియున్నాడు మరియు ఆయన మనిషిని ఇంత దూరము తీసుకువచ్చియున్నాడు. మనిషి దేనినీ అర్థం చేసుకోలేక పోయినప్పటికీ దేవుడు తనను అనుసరించే భాగ్యాన్ని మనిషికి ఇచ్చాడు. అంతేగాకుండా, ఆయన మనుష్యులను ఈ రోజు వరకు నడిపించాడు. ఇది దేవుని ప్రేమ కాదా? అదే దేవుని స్వభావములో దాగియున్న దేవుని ప్రేమయైయున్నది. ఇది ఖచ్చితమైన విషయం! సంఘము ఇటువంటి తారా స్థాయికి చేరుకున్నప్పుడు, సేవ చేసేవారి విషయములో దేవుడు కార్యము జరిగించి, మనుష్యులను అగాధ కూపములో పడవేస్తాడు. సేవ చేయువారి సమయపాలన మాటలన్నీ శాప వచనాలే; మీ శరీరానికి సంబంధించిన శాపాలు, భ్రష్టుపట్టిన సాతాను స్వభావపు శాపాలు మరియు దేవుని చిత్తాన్ని జరిగించలేని మీకు సంబంధించిన శాపాలవి. ఆ విషయములో జరిగించబడిన దేవుని కార్యము మహిమకరమైనదిగా ఉండెను, ఆ తరువాత వెనువెంటనే దేవుడు శిక్షకు సంబంధించిన పనిని అమలు చేశాడు, అక్కడ మరణ శోధన వచ్చింది. అటువంటి కార్యములో మనుష్యుడు దేవుని ఉగ్రతను, మహిమను, తీర్పును మరియు శిక్షను చూశాడు, అయినప్పటికీ అతడు దేవుని కృపను, ఆయన ప్రేమను మరియు ఆయన కనికరమును కూడా చూసియున్నాడు. దేవుడు చేసిందల్లా, దేవుడు చూపించిందల్లా మనిషి కొరకు దేవుని ప్రేమనే గానీ మరొకటి కాదు. దేవుడు చేసిందల్లా మనుష్యుల అవసరతలను తీర్చడమే. మనిషిని పరిపూర్ణునిగా చేసే క్రమములోనే ఆయన వీటినన్నిటిని చేశాడు. మనిషికున్న స్థాయిని బట్టే, ఆయన వీటినన్నిటినీ జరిపించాడు. దేవుడు ఇలా చేయకపోయినట్లయితే, మనుష్యుడు దేవుని వద్దకు వచ్చి ఉండేవాడు కాదు మరియు నిజమైన దేవుని ముఖాన్ని తెలుసుకొని ఉండేవాడు కాదు. మనిషి దేవునిలో విశ్వాసము పెట్టిన రోజు నుండి నేటి వరకు మనిషి కలిగియున్న స్థితిని బట్టి దేవుడు మనిషి కొరకు క్రమంగా అందించుకుంటూ వచ్చాడు. తద్వారా, మనిషి తన అంతరంగములో క్రమేపి దేవుని గురించి తెలుసుకుంటాడు. ఈ రోజున మనుష్యుడు దేవుని తీర్పు ఎంత అద్భుతమైనదో తెలుసుకోవలసిన అవసరత ఉంది. సృష్టి ఆరంభము నుండి నేటి వరకు సేవ చేయువారిని ఈ కార్యములో శపించు పని జరగడం ఇదే మొదటి సంఘటన. అగాధ కూపములోనికి వెళ్లునట్లుగా మనిషి శపించబడ్డాడు. ఒకవేళ దేవుడు అలా చేయకపోతే, దేవుని గూర్చిన నిజమైన జ్ఞానము ఈ రోజున మనిషికి లభించేది కాదు; దేవుడు పెట్టిన ఆ శాపము ద్వారానే మనిషి అధికారికంగా దేవుని స్వభావమును తెలుసుకోగలిగాడు. సేవ చేయువారి శోధనల మూలముగానే మనిషి బయలుపరచబడ్డాడు. మనిషి తాను కలిగియున్న నమ్మకము అంగీకార యోగ్యమైనది కాదని, తను కలిగియున్న స్థాయి చాలా తక్కువైనదని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడములో తాను అసమర్థుడని మరియు అన్ని సమయాలలో దేవుడిని సంతోష పెడతాననే తన పలుకులు కేవలము మాటలకు మాత్రమే పరిమితమని తను గురించి తాను తెలుసుకున్నాడు. సేవ చేయువారి పరిచర్యలో దేవుడు మనిషిని శపించినప్పటికీ, వెనక్కి తిరిగి చూసినట్లయితే, దేవుని కార్యము అద్భుతమని చెప్పక తప్పదు: అది మనిషికి గొప్ప మలుపును తీసుకొని వచ్చింది మరియు తన స్వభావములో గొప్ప మార్పుకు కారణమయ్యింది. సేవ చేయువారి కాలానికి మునుపు మనిషి తన జీవితాన్ని గురించి, దేవుని యందు విశ్వాసముంచడం గురించి, దేవుని కార్యము యొక్క అద్భుత విషయమును గురించి అర్థము చేసుకోలేదు. అంత మాత్రమే కాకుండా దేవుని కార్యము మనిషిని పరీక్షిస్తుందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేదు. సేవ చేయువారి కాలము నుండి నేటి వరకు దేవుని కార్యమును అద్భుతమైన కార్యముగా చూస్తున్నాడు, ఇది మనిషికి అంతుపట్టనిది. దేవుడు మనిషి బుర్రను ఉపయోగించుకొని ఎలాంటి కార్యాలను చేస్తాడో మనిషి ఊహకు అందదు. దేవుడు మనుష్యుని మెదడులో చేయబోవు కార్యమునైనను, దేవునికి అవిధేయునిగా ఉండుట ద్వారా అతని స్థాయి తగ్గిపోతుందని లేక అతడు చిన్నబోవుచున్నాడని మనుష్యుడు ఊహించలేకపోవుచున్నాడు. దేవుడు మనిషిని శపించినప్పుడు, అతను ఒక ఉన్నత పరిణామాన్ని సాధించే క్రమములోనే శపించడం జరిగింది మరియు ఆయన మనిషిని మరణానికి గురి చేయలేదు. ఆయన మనిషిని శపించినప్పటికీ ఆయన మాటల ద్వారానే శపించాడు, ఆ శాపాలు మనిషికి నాశనం కలుగజేయవు. అయితే, దేవుడు మనిషి చూపిన అవిధేయతనే శపించాడు. అందుచేత, ఆయన శపించిన మాటలు మనుష్యుడు పరిపూర్ణుడవ్వడానికి కూడా చెప్పబడ్డాయి. దేవుడు మనిషికి తీర్పు తీర్చినా, లేక మనిషిని శపించినా అవన్నీ మనుష్యుడిని పరిపూర్ణునిగా చేయడానికే: ఈ రెండు కార్యాలు మనిషిలో దాగియున్న మలినాన్ని తొలగించి, పరిశుద్ధునిగా చేయు క్రమములో ఉపయోగపడుతాయి. ఈ విధంగా మనుష్యుడు శుద్ధి చేయబడతాడు మరియు దేవుని మాటల ద్వారా, ఆయన కార్యము ద్వారా, మనిషిలోని కొరతగా ఉన్నవన్నీ పరిపూర్ణమవుతాయి. దేవుని కార్యములోని ప్రతి మెట్టు, అంటే, అది కఠిన వాక్యములైనా, లేక తీర్పైనా, లేక శిక్షయైనా అది మనిషిని పరిపూర్ణునిగా చేస్తుంది మరియు ఆయన జరిగించు కార్యము మనిషికి తప్పకుండా కావాలి. ఇటువంటి కార్యమును గడచిన ఇన్నీ యుగాలలో దేవుడు జరిగించలేదు; ఈ రోజున ఆయన మీలో ఈ కార్యమును జరిగించుచున్నాడు కాబట్టి, ఆయన జ్ఞానమును బట్టి మీరు ఆయనను స్తుతించాలి. మీలో మీరు కొంత బాధను అనుభవించినప్పటికీ, మీ హృదయాలు చాలా భద్రముగాను మరియు శాంతి సమాధానాలను కలిగినవిగాను ఉంటాయి. ఇటువంటి స్థాయిలో దేవుని కార్యమును మీరు ఆనందంగా అనుభవించడానికి మీకు దొరికిన గొప్ప ఆశీర్వాదమిది. మీరు భవిష్యత్తులో ఎటువంటి లాభాన్ని పొందుకుంటారన్న దానితో సంబంధము లేకుండా ఈ రోజున మీలో జరిగించబడుచున్న దేవుని కార్యమంతయు ప్రేమయైయున్నది. దేవుని తీర్పును మరియు ఆయన శిక్షను మనిషి అనుభవించకపోయినట్లయితే, మనిషి క్రియలు మరియు తనకున్న అత్యుత్సాహము బయటకు రాకుండా లోపలి భాగములోనే ఉండిపోతాయి. అంతేగాకుండా, తన స్వభావము మారకుండా అలాగే ఉండిపోతుంది. దీనిని దేవుని ద్వారా పొందుకొనిన భాగ్యంగా పరిగణించబడుతుందా? ఈ రోజున, మనిషిలో దురహంకారము మరియు గర్వము అనేవి ఎక్కువగా ఉన్నప్పటికినీ, మనిషి స్వభావమనేది ముందున్న దానికంటే ఎక్కువ స్థిరముగా ఉన్నది. మిమ్మల్ని రక్షించే దిశగానే దేవుడు మీతో వ్యవహరించడం జరుగుతుంది. ఆ సమయములో మీరు కొంత బాధను అనుభవించినప్పటికీ, మీ ధోరణిలో మార్పు వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. ఆ సమయములో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే, దేవుని కార్యము ఎంతో జ్ఞానము కలదని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు దేవుని చిత్తాన్ని నిజంగా అర్థం చేసుకుంటారు. ఈ రోజున కొంతమంది దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నామని చెప్పి, క్రియలలో మాత్రం అదేమీ వారికి అర్థం కాలేదన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. వాస్తవానికి వారు అబద్ధాలు చెబుతారు, ఎందుకంటే, దేవుని చిత్తము మనిషిని రక్షిస్తుందా లేక మనిషిని శపిస్తుందా అనే విషయము ప్రస్తుతము వారికి అర్థమవ్వాల్సిన అవసరత ఉంది. బహుశః ఇప్పుడు దీనిని మీరు స్పష్టంగా చూడకపోవచ్చు గానీ దేవునికి మహిమ తీసుకువచ్చే రోజును మీరు చూచే రోజు వస్తుంది మరియు దేవుణ్ణి ప్రేమించడం ఎంత అర్థవంతమైనదో మీరు చూస్తారు, తద్వారా, మానవ జీవితాలు మరియు మీ శరీరాలు దేవుని ప్రేమించు లోకములో ఉంటాయి. అప్పుడు మీ ఆత్మ స్వాతంత్ర్యము పొందినదై, మీ జీవితము సంతోషముగా ఉంటుంది. అంతేగాకుండా, మీరు ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉంటారు మరియు మీరు ఆయన వైపే ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. అప్పుడు, ఈ రోజున జరిగే దేవుని కార్యము ఎంత విలువైనదో మీరు నిజంగా తెలుసుకుంటారు.
ఈ రోజున అనేకమందికి ఇటువంటి జ్ఞానము లేదు. ఇటువంటి వారు శ్రమలు విలువైనవి కావని నమ్ముతారు, వారు లోకము చేత వెలివేయబడుతుంటారు. వారి ఇంటి జీవితము చాలా సమస్యాత్మకముగా ఉంటుంది, వారు దేవునికి ప్రియులైనవారు కారు మరియు వారి ఉద్దేశాలు భరోసా లేనివి. కొంతమంది పడే శ్రమలు చాలా తారా స్థాయిలో ఉంటాయి, వారి ఆలోచనలు మరణానికి దారి తీస్తుంటాయి. అటువంటి పరిస్థితి దేవునికి నిజమైన పరిస్థితిని కనుపరచవు; అటువంటి ప్రజలు పిరికివారు, వారికి ఎటువంటి పట్టుదల ఉండదు, వారు చాలా బలహీనులుగాను మరియు శక్తిలేనివారుగాను ఉంటారు! మనిషి తనను ఎప్పుడెప్పుడు ప్రేమిస్తాడా అని దేవుడు ఎదురుచూస్తుంటాడు. అయితే, మనిషి ఆయనను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా శ్రమలను ఎదుర్కొంటాడు మరియు మనిషి ఎంత ఎక్కువగా ఆయనను ప్రేమిస్తాడో అంత ఎక్కువగా హింసలను ఎదుర్కొంటాడు. మీరు ఆయనను ప్రేమించినట్లయితే, ప్రతి విధమైన శ్రమను మీరు ఎదుర్కొంటాడు. మీరు ఆయనను ప్రేమించకపోతే, ప్రతీది మీకు చాలా సానుకూలంగా ఉంటుంది మరియు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతీది సమాధానకరంగా ఉంటుంది. మీరు దేవుణ్ణి ప్రేమించినప్పుడు మీ చుట్టూ ఉండే ప్రతీది జయించలేని విషయాలుగా ఉంటాయి. ఎందుకంటే, మీకున్న స్వభావము చాలా సంకుచితమైనది, మీరు మరింత శుద్ధి చేయబడాలి; అంతేగాకుండా, దేవుణ్ణి సంతోషపరచడానికి అసమర్థులుగా ఉంటారు మరియు దేవుని చిత్తము చాలా ఉన్నతమైనదని, దేవుని చిత్తమును మనిషి జరిగించడం అసాధ్యమని మీరు భావిస్తుంటారు. ఈ విషయాలన్నిటి కొరకే మీరు శుద్దీకరించబడతారు, ఎందుకంటే, మీలో ఎక్కువ బలహీనతలు ఉన్నాయి మరియు దేవుని చిత్తాన్ని జరిగించలేని అసమర్థత ఎక్కువగా మీలో ఉంది, మీరు అంతర్గతంగా శుద్ధి చేయబడినప్పటికీ, శుద్ధీకరణ ద్వారానే పవిత్రీకరణ సాధ్యమనే విషయాన్ని మీరు స్పష్టంగా చూడాలి. అందుచేత, ఈ అంత్యకాలపు రోజులలో మీరు దేవునికి సాక్ష్యులుగా ఉండాలి. మీరు ఎన్ని ఘోరమైన శ్రమలగుండా వెళ్లినప్పటికీ, మీరు అంతము వరకు నడవవలసి ఉంటుంది, మీ తుది శ్వాసను విడిచే సమయములోనైనా మీరు దేవునికి మరియు దేవుడు చూపించే కరుణకు నమ్మకస్తులుగా ఉండాలి; అప్పుడు అది నిజమైన దేవుని ప్రేమ అని, బలమైన ప్రతిధ్వనించే సాక్ష్యమని నిరూపించబడుతుంది. మీరు సాతాను ద్వారా శోధించబడినప్పుడు, “నా హృదయము దేవునికి సంబంధించినది మరియు ఇప్పటికే దేవుడు నన్ను సంపాదించుకున్నాడు. నేను నిన్ను సంతోషపరచలేను, నేను దేవుణ్ణి సంతోషపరచడానికి నా సమస్తముతో భక్తి చేయవలసి ఉంటుంది” అని మీరు తప్పకుండా సాతానుతో చెప్పాలి. మీరు ఎంత ఎక్కువగా దేవుణ్ణి సంతోష పెడుతారో అంత ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుణ్ణి ప్రేమించడానికి మీరు గొప్ప బలాన్ని కలిగియుంటారు; అప్పుడు మీరు కూడా విశ్వాసమును, సంకల్పాన్ని కలిగియుంటారు. దేవుణ్ణి ప్రేమించడానికి జీవితము గడిపే దానికంటే విలువైనది లేదని లేక ప్రాముఖ్యమైనది లేదని భావిస్తారు. దేవుణ్ణి ప్రేమించాలంటే మనిషికి దుఃఖం ఉండకూడదని చెబుతుంటారు. మీ శరీరము బలహీనముగా ఉండే సందర్భాలు మరియు మీరు అనేక సమస్యలలో ఇరుక్కుపోయిన సందర్భాలు ఉన్నప్పటికీ, అటువంటి పరిస్థితులలో మీరు నిజంగా దేవుని మీద ఆధారపడతారు, మీ ఆత్మలో మీరు ఆదరణ కలిగియుంటారు, మీలో నిశ్చయతను కలిగియుంటారు, మీరు ఆధారపడడానికి మీకు ఏదైనా ఒకటి ఉంటుంది. ఈ విధంగా మీరు అనేకమైన వాటిని అధిగమించగలుగుతారు, అప్పుడు మీరు అనుభవించే శ్రమల వేదనను బట్టి దేవుని మీద ఫిర్యాదు చేయరు. దానికి బదులుగా, మీరు పాట పాడాలనుకుంటారు, నృత్యం చేయాలనుకుంటారు, ప్రార్థించాలనుకుంటారు, సహవాసము చేసి ప్రభు భోజనములో పాల్గొనాలనుకుంటారు, దేవుని ఆలోచనను అనుసరించాలనుకుంటారు. మీ చుట్టూ దేవుడు ఏర్పరచిన ప్రజలను, విషయాలను మరియు పరిస్థితులను మీరు చూసినప్పుడు ఆ ప్రజలు, ఆ విషయాలు మీకు తగినవని మీరు భావిస్తారు. మీరు దేవుణ్ణి ప్రేమించకపోతే, మీరు చూసేదంతా కూడా మీకు సమస్యాత్మకముగా ఉంటుంది మరియు మీ కన్నులకు ఏదీ ఇంపుగా అనిపించదు; మీ ఆత్మలో మీకు స్వాతంత్ర్యము ఉండదు గానీ, అణగద్రొక్కబడినట్లుగా ఉంటారు, మీ హృదయము ఎల్లప్పుడూ దేవుని మీద ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది మరియు మీరు ఎల్లప్పుడూ ఎక్కువ శ్రమలను అనుభవిస్తున్నారని ఇది చాలా అన్యాయమని భావిస్తూనే ఉంటారు. మీరు కేవలము సంతోషము కొరకు మాత్రమే వెదకకుండా, దేవుణ్ణి సంతోషపెట్టాలని వేదకుచున్నట్లయితే, సాతాను ద్వారా ఆరోపించబడకూడదని ఆశపడినట్లయితే అటువంటి ఆశ దేవుణ్ణి ప్రేమించడానికి గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. దేవుని ద్వారా చెప్పబడిన ప్రతి మాటకు మనిషి బాధ్యత వహించగలడు మరియు అతను చేసే క్రియల ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలడు. దీనినే నిజాయితీగా బ్రతకడం అని అంటారు. దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే దేవునిపట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరిచి, ఆయన చెప్పిన మాటలను ఆచరణలో పెట్టడం; సమయముతో నిమిత్తం లేకుండా, ఇతరులు బలాన్ని కోల్పోయినప్పటికీ, మీలో దేవుని ప్రేమించే హృదయము ఉంది, ఆ హృదయాన్ని బట్టి దేవుని కొరకు ప్రగాఢంగా ఆరాటపడతారు మరియు ఆయనను స్మరిస్తూ ఉంటారు. ఇదే నిజమైన స్వభావము. మీరు పరీక్షించబడినప్పుడు ఎంత వేగముగా నిలబడతారో లేదో, కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఆవరించినప్పుడు మీరు బలహీనంగా ఉంటారో లేదో, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు మీ కాళ్ళ మీద నిలబడతారో లేదో అనే దాని మీద మరియు మీరు దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారన్న దాని మీదనే మీకున్న స్వభావము ఎంత గోప్పదనేది ఆధారపడి ఉంటుంది; దేవుని కొరకు మీరు ఎటువంటి ప్రేమను కలిగియున్నారని చూపడానికి కొన్ని వాస్తవ సంఘటనలు సంభవిస్తాయి. దేవుడు ఒక మనిషిని నిజంగా ప్రేమించినప్పుడు ఆ దేవుని కార్యము నుండి ఈ సంఘటనలన్నియు కనిపిస్తాయి. మనిషి ఆత్మ నేత్రాలు పూర్తిగా తెరవబడనందున అతను దేవుని చిత్తాన్ని మరియు దేవుని కార్యాన్ని మరియు దేవుని గురించిన చాలా అందమైన విషయాలను అంత ఎక్కువగా స్పష్టంగా చూడలేకపోవుచున్నాడు; మనిషి దేవుని పట్ల నిజమైన ప్రేమను చాలా తక్కువగా కలిగియున్నాడు. ఇప్పటివరకు మీరు దేవునియందు విశ్వాసముంచియున్నారు. ఈ రోజున తప్పించుకునే సమస్త మార్గాలను తీసివేశాడు. వాస్తవంగా మాట్లాడాలంటే, సరియైన మార్గమును ఎన్నుకోకుండా మీకు వేరొక అవకాశం లేదు, మీరు నడిచే సరియైన మార్గము దేవుని కఠినమైన తీర్పు ద్వారాను మరియు దేవుని అత్యున్నతమైన రక్షణ ద్వారాను అనుగ్రహించబడింది. కఠినత్వాన్ని మరియు శుద్ధీకరణను అనుభవించిన తరువాత మాత్రమే దేవుడు ప్రేమించువాడని మనిషి అర్థము చేసుకోగలుగుతాడు. ఈ రోజు వరకు మనిషి కలిగియున్న అనుభవములో దేవుని ప్రేమను కొంతమట్టుకు మాత్రమే తెలిసికొనియున్నాడని చెప్పగలము. అయితే ఇది సరిపోదు, ఎందుకంటే, మనిషి ఇంకా కొరత కలిగియున్నాడు. దేవుని అద్భుతమైన కార్యమును మరి ఎక్కువగా అనుభవించాలి మరియు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన శ్రమల శుద్ధీకరణను మరి ఎక్కువగా అనుభవించాలి. అప్పుడు మాత్రమే మనిషి జీవన విధానము మార్పు చెందుతుంది.