రక్షకుడు ఇప్పటికే “తెల్లటి మేఘం” మీద తిరిగి వచ్చాడు

అనేక వేల యేండ్లుగా, రక్షకుని ఆగమనానికి సాక్షి కావాలని మానవుడు ఆకాంక్షించాడు. రక్షకుడైన యేసు కోసం వేల యేండ్లుగా ఆరాటపడిన మరియు ఆకాంక్షించిన వారి మధ్యకు ఆయన స్వయంగా, తెల్లటి మేఘంపై స్వారీ చేస్తూ దిగడాన్ని చూడాలని మానవుడు ఆశించాడు. రక్షకుడు తిరిగి వచ్చి వారితో మళ్లీ కలిసిపోవాలని కూడా మానవుడు ఆకాక్షించాడు; అంటే, వేల యేండ్లుగా ప్రజల నుండి విడిపోయిన రక్షకుడైన యేసు తిరిగి రావాలని, యూదుల మధ్య ఆయన చేసిన విమోచన కార్యమును మళ్లీ కొనసాగించాలని, మానవుని యందు కరుణ మరియు ప్రేమను కలిగి ఉండాలని, మానవుని పాపాలను క్షమించాలని, మానవుని పాపాలను భరించాలని మరియు మానవుని సమస్త అతిక్రమణలను సైతం భరించి, మానవుడికి పాపం నుండి విముక్తి కలిగించాలని వాంఛించాడు. రక్షకుడైన యేసు ఇంతకు ముందులాగే—మానవుని పట్ల ఎప్పుడూ ఆగ్రహం చూపకుండా, మానవుడిని ఎప్పుడూ నిందించకుండా, మానవుని సమస్త పాపాలను క్షమించి, స్వీకరించి మరియు ఇంతకుముందులాగే మానవుని కోసం సిలువపై మరణించే ప్రేమాస్పదుడు, కరుణామయుడు మరియు పూజ్యుడుగా ఉండాలనేదే మానవుడు కోరుకున్నాడు. యేసు విడిపోయినప్పటి నుండి, ఆయనను అనుసరించిన శిష్యులతో పాటు, ఆయన నామంతో రక్షింపబడిన సాధుస్వభావులందరూ ఆయన కోసం ఎంతో ఆరాటపడుతున్నారు మరియు ఎదురుచూస్తున్నారు. కృపాకాలములో యేసుక్రీస్తు కృపచేత రక్షింపబడిన వారందరూ అంత్యకాలములో ప్రజలందరి యెదుట ప్రత్యక్షమవడానికి రక్షకుడైన యేసు తెల్లటి మేఘంపై దిగివచ్చే ఆ ఆనందకరమైన రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి, ఈరోజు రక్షకుడైన యేసు నామాన్ని అంగీకరించే వారందరి ఉమ్మడి కోరిక కూడా ఇదే. రక్షకుడైన యేసు రక్షణ గురించి తెలిసిన విశ్వంలోని ప్రతి ఒక్కరూ ఆయన అకస్మాత్తుగా తిరిగి రావడం కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పింది నెరవేర్చాలని కోరుకుంటున్నారు. అది: “నేను ఎలా వెళ్లానో అలాగే తిరిగి వస్తాను.” సిలువ వేయడం మరియు పునరుత్థానం తరువాత, సర్వోన్నతుని కుడి వైపున ఉన్న స్థానం గ్రహించడానికి యేసు తెల్లటి మేఘంపై పరలోకానికి వెనక్కు వెళ్లిపోతాడని మానవుడు నమ్ముతాడు. సరిగ్గా అలాగే, వేలాది యేండ్లుగా ఆయన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారి మధ్యకు యేసు మళ్లీ తెల్లటి మేఘంపై నుండి దిగుతాడు (ఈ మేఘం యేసు పరలోకానికి వెనక్కు వెళ్లినప్పుడు ఎక్కిన మేఘాన్నే సూచిస్తుంది) మరియు ఆయన యూదుల రూపంలో మరియు వారి వస్త్రాలను ధరించి ఉంటాడు. మనిషికి కనిపించిన తరువాత, ఆయన వారికి ఆహారాన్ని ప్రసాదిస్తాడు మరియు వారి కోసం జీవజలం పైకి ఎగజిమ్మేలా చేస్తాడు మరియు మానవుల మధ్య ఉజ్వలమైన మరియు నిజమైన సంపూర్ణ కృప మరియు ప్రేమతో జీవిస్తాడు. ప్రజలు ఇలాంటి ఆలోచనలనే నమ్ముతుంటారు. అయినా రక్షకుడైన యేసు ఇలా చేయలేదు; ఆయన మనిషి ఊహించిన దానికి వ్యతిరేకంగా చేశాడు. ఆయన రాక కోసం ఆరాటపడే వారి మధ్యకు ఆయన రాలేదు మరియు తెల్లటి మేఘంపై స్వారీ చేస్తూ ఆయన ప్రజలందరికీ కనిపించలేదు. ఆయన ఇప్పటికే వచ్చేశాడు కానీ, మానవాళికి ఆ సంగతి తెలియదు, వారు అజ్ఞానంలోనే ఉంటారు. ఆయన “తెల్లటి మేఘం” (ఈ మేఘమే ఆయన ఆత్మ, ఆయన మాటలు, ఆయన సంపూర్ణ స్వభావం మరియు ఆయన సమస్తం) పైనుండి ఇప్పటికే దిగాడని మరియు అంత్యకాలములో జయం సాధించే వ్యక్తులుగా ఆయన మార్చే ఒక సమూహంలో ఆయన ఇప్పుడు ఉన్నాడని తెలియక, మనిషి లక్ష్యహీనంగా ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనిషికి ఇది తెలియదు: మానవాళి పట్ల పరిశుద్ధ రక్షకుడైన యేసుకు వాత్సల్యం మరియు ప్రేమ ఉన్నప్పటికీ, అశుద్ధం మరియు అపవిత్రంతో నిండిన ఆత్మలు నివసించే ఆ “ఆలయాలలో” ఆయన ఎలా పని చేయగలడు? మనిషి ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, అవినీతి మాంసాన్ని తినే, అవినీతి రక్తాన్ని తాగే, అవినీతి వస్త్రాలు ధరించే, ఆయనను నమ్మినప్పటికీ ఆయనను ఎరుగని మరియు ఆయనను నిరంతరం దోపిడీ చేసే వారికి ఆయన ఎలా కనిపించగలడు? రక్షకుడైన యేసులో సంపూర్ణమైన ప్రేమ మరియు పొంగిపొర్లే కరుణ ఉన్నాయని మరియు ఆయన విమోచన నిండిన పాప పరిహారార్థబలి అని మాత్రమే మనిషికి తెలుసు. అయితే, నీతి, మహత్యం, ఉగ్రత మరియు తీర్పు సంపూర్ణంగా నిండి ఉన్న మరియు అధికారం, సంపూర్ణ మర్యాద కలిగిన ఆయనే స్వయంగా దేవుడని మనిషికి తెలియదు. కాబట్టి, విమోచకుడి రాక కోసం మనిషి ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పటికీ, ఆరాటపడుతున్నప్పటికీ మరియు వారి ప్రార్థనలు “పరలోకాన్ని” కూడా కదిలించినప్పటికీ, రక్షకుడైన యేసు, ఆయనను ఎరుగకుండా కేవలం ఆయనను విశ్వసించే వారికి కనిపించడు.

ఇశ్రాయేలులో నా కార్యము చేస్తున్నప్పుడు నేను ఎంచుకున్న నామము “యెహోవా” అంటే, మనిషిపై జాలి చూపగల, మనిషిని శపించగల మరియు మనిషి జీవితానికి మార్గం చూపగల ఇశ్రాయేలీయుల (దేవుడు ఎంచుకున్న ప్రజలు) దేవుడు అని అర్థం; గొప్ప శక్తి మరియు సంపూర్ణ జ్ఞానం కలిగిన దేవుడు. “యేసు” అనే ఇమ్మాన్యుయేల్ అంటే, ప్రేమతో నిండిన, కరుణతో నిండిన మరియు మనిషికి విమోచన కలిగించే పాప పరిహారార్థబలి అని అర్థం. ఆయన కృపాకాలపు కార్యమును చేశాడు మరియు ఆయన కృపాకాలానికి ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు నిర్వహణ ప్రణాళిక కార్యములోని ఒక భాగానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించగలడు. దీని అర్థం ఏమిటంటే, యెహోవా మాత్రమే ఎంచుకోబడిన ఇశ్రాయేలు ప్రజల దేవుడు, అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుకు దేవుడు, మోషేకు దేవుడు మరియు ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు. కాబట్టి, ప్రస్తుత కాలములో, యూదులతో సహా ఇశ్రాయేలీయులందరూ యెహోవాను ఆరాధిస్తున్నారు. వారు బలిపీఠం మీద ఆయనకు బలులు ఇస్తారు మరియు యాజకుల వస్త్రాలు ధరించి ఆలయంలో ఆయనకు సేవ చేస్తారు. వారు ఆశిస్తున్నదల్లా యెహోవా మళ్లీ ప్రత్యక్షమవ్వడమే. యేసు మాత్రమే మానవాళి విమోచకుడు మరియు ఆయనే పాపం నుండి మానవాళికి విమోచన కలిగించిన పాప పరిహారార్థబలి. అంటే, యేసు నామము కృపాకాలము నుండి వచ్చింది మరియు కృపాకాలములో విమోచన కార్యము వలన అస్థిత్వంలోకి వచ్చింది. కృపాకాలములోని ప్రజలు పునర్జన్మ పొందడానికి మరియు రక్షణ పొందడానికి యేసు నామము అస్థిత్వంలోకి వచ్చింది మరియు ఇది సమస్త మానవాళికి విమోచన కలిగించడానికి ఉద్దేశించిన ప్రత్యేక నామము. కాబట్టి, యేసు నామము విమోచనకు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు కృపాకాలాన్ని సూచిస్తుంది. యెహోవా అనేది న్యాయానికి లోబడి జీవించిన ఇశ్రాయేలు ప్రజల కోసం ఉద్దేశించిన ప్రత్యేక నామము. కార్యపు ప్రతి కాలములో మరియు ప్రతి దశలో, నా నామము నిరాధారమైనది కాదు కానీ, ప్రాతినిధ్యపరంగా ప్రాముఖ్యత కలిగినది: ప్రతి నామము ఒక్కో కాలాన్ని సూచిస్తుంది. “యెహోవా” అనేది న్యాయకాలమును సూచిస్తుంది మరియు ఇశ్రాయేలు ప్రజలు తాము ఆరాధించిన దేవుడిని పిలుచుకున్న గౌరవనీయమైన నామము. “యేసు” అనేది కృపాకాలాన్ని సూచిస్తుంది మరియు అది కృపాకాలములో విమోచన పొందిన వారందరి దేవుడి నామము. అంత్యకాలములో రక్షకుడైన యేసు రాక కోసం మనిషి ఇంకా ఆత్రుతగా చూస్తూ ఉంటే, మరియు ఆయన యూదయలో ఉన్నప్పటి రూపంలో వస్తాడని ఇంకా ఆశిస్తే, అప్పుడు ఆరువేల యేండ్ల నిర్వహణ ప్రణాళిక మొత్తం విమోచన కాలములోనే ఆగిపోయి ఉండేది మరియు ఏమాత్రం పురోగమించి ఉండేది కాదు. అంతేగాకుండా, అంత్యకాలము ఎప్పటికీ రాదు మరియు ఆ కాలాన్ని ఎప్పుడూ ముగించడం జరుగదు. ఎందుకంటే, రక్షకుడైన యేసు మానవాళి విమోచన మరియు రక్షణ కోసం మాత్రమే ఉన్నాడు. కృపాకాలములోని పాపులందరి కోసం మాత్రమే నేను యేసు నామమును తీసుకున్నాను, కానీ నేను సమస్త మానవాళిని అంతం చేసేందుకు ఆ నామము ఉద్దేశించబడలేదు. యెహోవా, యేసు మరియు మెస్సీయ అందరూ నా పరిశుద్ధ ఆత్మకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఈ నామములు నా నిర్వహణ ప్రణాళిక వివిధ కాలాలను మాత్రమే సూచిస్తాయి, నా సంపూర్ణత్వంతో నాకు ప్రాతినిధ్యం వహించవు. లోకంలో ఉన్న వ్యక్తులు నన్ను పిలిచే నామములు నా సంపూర్ణ స్వభావాన్ని మరియు నేను ఏమిటో అనేదాన్ని స్పష్టం చేయలేవు. అవి కేవలం వివిధ కాలాలలో నన్ను పిలిచిన వివిధ నామములు మాత్రమే. కాబట్టి, అంతిమ కాలము—అంత్యకాలము—వచ్చినప్పుడు, నా నామము మళ్లీ మారుతుంది. నేను యెహోవా లేదా యేసు అని పిలవబడను, మెస్సీయ అని అసలే పిలవబడను—నేను స్వయంగా బలమైన సర్వశక్తిమంతుడైన దేవుడు అని పిలువబడతాను మరియు ఈ నామముతో నేను ఆ సమస్త కాలాన్ని అంతం చేస్తాను. నన్ను ఒకప్పుడు యెహోవా అని పిలిచారు. నన్ను మెస్సీయ అని కూడా పిలిచారు, ప్రజలు ప్రేమ మరియు గౌరవంతో ఒకప్పుడు నన్ను రక్షకుడైన యేసు అని పిలిచారు. అయితే, ఈరోజు నేను గత కాలాలలో ప్రజలకు తెలిసిన యెహోవా లేదా యేసు ఇక ఏమాత్రం కాదు; నేను అంత్యకాలములో తిరిగి వచ్చిన దేవుడిని, ఈ కాలాన్ని అంతం చేసే దేవుడిని. భూమి అంతం నుండి పైకి లేచిన, నా సమస్త స్వభావము, సంపూర్ణ అధికారము, గౌరవం మరియు మహిమతో నిండిన దేవుడను స్వయంగా నేనే. ప్రజలు ఎప్పుడూ నాపట్ల నిబద్ధతతో లేరు, నన్ను ఎప్పుడూ ఎరుగరు మరియు నా స్వభావము గురించి ఎల్లప్పుడూ వారు అజ్ఞానులు. విశ్వం సృష్టించబడినప్పటి నుండి ఈనాటి వరకు నన్ను ఏ ఒక్కరూ చూడలేదు. ఆయన అంత్యకాలములో మానవునికి దర్శనమిచ్చే దేవుడు, కానీ మానవులలోనే దాగి ఉన్నాడు. ఆయన శక్తి మరియు అధికారం నిండిన మండుతున్న సూర్యుడు మరియు దహించే జ్వాల లాగా, సత్యంగా మరియు నిజంగా మానవుల మధ్య ఉంటాడు. నా మాటలతో తీర్పు ఇవ్వబడని ఒక్క వ్యక్తి లేదా వస్తువు కూడా లేదు మరియు మండుతున్నఅగ్ని ద్వారా శుద్ధి చేయబడని ఒక్క వ్యక్తి లేదా వస్తువు కూడా లేదు. అంతిమంగా, నా మాటల వలన సమస్త దేశాలు ఆశీర్వాదం పొందుతాయి, అలాగే నా మాటల వలన తునాతునకలుగా ధ్వంసం చేయబడతాయి. ఈవిధంగా, నేనే రక్షకుడినని మరియు మానవాళిని జయించే సర్వశక్తిమంతుడైన దేవుడినని అంత్యకాలములో ప్రజలందరూ చూస్తారు. నేను ఒకప్పుడు మానవుడి కోసం పాప పరిహారార్థబలిగా ఉన్నానని అందరూ చూస్తారు కానీ, అంత్యకాలములో నేను సమస్తాన్ని దహించే సూర్యుని జ్వాలగా, అలాగే సమస్తాన్ని బయలు పరిచే నీతిమంతమైన సూర్యునిగా మారుతాను. అంత్యకాలములో ఇదే నా కార్యము. నేను నీతిమంతుడినైన దేవుడినని, మండుతున్న సూర్యుడినని, దహించే జ్వాలనని ప్రజలందరూ చూడగలిగేలా మరియు ఒకేఒక్క నిజమైన దేవుడినైన నన్ను అందరూ ఆరాధించేలా మరియు నా నిజమైన ముఖాన్ని చూసేలా నేను ఈ నామమును తీసుకున్నాను మరియు ఈ స్వభావం పొందాను: నేను ఇశ్రాయేలీయుల దేవుడిని మాత్రమే కాదు, నేను విమోచకుడిని మాత్రమే కాదు; భూమ్యాకాశాలు మరియు సముద్రాలలోని జీవులన్నింటికి నేనే దేవుడను.

ఒకవేళ రక్షకుడు అంత్యకాలములో వచ్చి ఉండి, అప్పటికీ యేసు అని పిలవబడి ఉంటే, మరియు మళ్లీ యూదయలో జన్మించి, ఆయన అక్కడ పనిచేసి ఉంటే, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే సృష్టించాననీ మరియు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే విమోచన కలిగించాననీ మరియు నాకు అన్యులతో సంబంధం లేదని అది రుజువు చేసేది. “భూమ్యాకాశములు మరియు సమస్తమును సృష్టించిన ప్రభువును నేనే” అనే నా మాటలను ఇది ఖండించదా? నేను యూదయను వదిలి వెళ్లాను మరియు అన్యుల మధ్య నా కార్యమును చేస్తాను. ఎందుకంటే, నేను కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడిని కాను, సమస్త జీవకోటికి దేవుడను. అంత్యకాలములో నేను అన్యుల మధ్య కనిపిస్తాను. ఎందుకంటే, నేను ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాను మాత్రమే కాదు, అంతేగాకుండా అన్యులలో నేను ఎంచుకున్న వారందరి సృష్టికర్తను కూడా. నేను ఇశ్రాయేలు, ఈజిప్ట్ మరియు లెబనాన్‌ ను మాత్రమే కాకుండా, ఇశ్రాయేలును మించి అన్యదేశాలన్నింటినీ సృష్టించాను. అందువలన, నేనే సమస్త జీవులకు ప్రభువును. నేను నా కార్యానికి ప్రారంభ కేంద్రంగా మాత్రమే ఇశ్రాయేలును ఉపయోగించాను, నా విమోచన కార్యానికి యూదయా మరియు గలిలీలను బలమైన స్థావరాలుగా ఉపయోగించాను మరియు ఇప్పుడు నేను అన్యదేశాలను పునాదిగా ఉపయోగించి అక్కడినుండే మొత్తం కాలాన్ని అంతం చేస్తాను. నేను ఇశ్రాయేలులో రెండు దశల కార్యము చేశాను (ఈ రెండు దశలు కార్యపు న్యాయకాలము మరియు కృపాకాలము), నేను ఇశ్రాయేలు దాటి ప్రపంచవ్యాప్తంగా తదుపరి రెండు దశల కార్యాన్ని (కృపాకాలము మరియు దేవుని రాజ్యకాలము) కొనసాగిస్తున్నాను. అన్యదేశాలలో, నేను విజయపు కార్యము చేస్తాను మరియు ఆవిధంగా ఈ కాలాన్ని ముగిస్తాను. మానవుడు ఎల్లప్పుడూ నన్ను యేసుక్రీస్తుగా పిలుస్తూ ఉంటే, నేను అంత్యకాలములో నూతన కాలాన్ని ప్రారంభించానని మరియు నూతన కార్యమును మొదలుపెట్టానని తెలియకుండా ఉంటే మరియు రక్షకుడైన యేసు రాక కోసం మానవుడు స్థిరచిత్తంతో ఎదురుచూస్తూ ఉంటే, అలాంటి వ్యక్తులను నన్ను నమ్మనివారని; నన్ను ఎరుగనివారని మరియు నాపై వారి విశ్వాసం బూటకమని నేను అంటాను. అలాంటి ప్రజలు పరలోకం నుండి రక్షకుడైన యేసు రాకను చూడగలరా? వారు ఎదురుచూస్తున్నది నా ఆగమనం కోసం కాదు, వారు చూస్తున్నది యూదుల రాజు రాక కోసం. ఈ అశుద్ధమైన పాత ప్రపంచాన్ని నేను నాశనం చేయడాన్ని వారు కోరుకోవడం లేదు, దానికి బదులుగా వారు విమోచన పొందడానికి యేసు రెండవ ఆగమనం కోసం వారు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ కలుషితమైన మరియు అవినీతిమయమైన లోకం నుండి మానవాళికి మరోసారి విమోచన కలిగించడానికి వారు యేసు కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రజలు అంత్యకాలములో నా కార్యాన్ని నెరవేర్చేవారు ఎలా అవుతారు? మానవుని కోరికలు నా అభిలాషలను పూర్తిచేయలేవు లేదా నా కార్యాన్ని నెరవేర్చలేవు. ఎందుకంటే, మానవుడు నేను గతంలో చేసిన కార్యాన్ని మాత్రమే ప్రశంసిస్తాడు మరియు ఆదరిస్తాడు, నేను నిత్యనూతనుడైన మరియు ఎప్పుడూ పాతబడని దేవుడినే అని అతనికి తెలియదు. నేనే యెహోవాను, యేసును అని మాత్రమే మానవునికి తెలుసు, అంత్యకాలములో మానవాళిని అంతంచేసేది నేనే అనే ఆలోచన వారికి లేదు. మానవుడు కోరుకునే మరియు తెలుసుకునేవన్నీ వారి సొంత ఆలోచనల నుండి వస్తాయి, వాటిని మాత్రమే వారు తమ సొంత కళ్లతో చూడగలరు. ఇది నేను చేసే కార్యానికి అనుగుణమైనది కాదు, ఇది దానికి వ్యతిరేకమైనది. నేను నా కార్యాన్ని మానవుని ఆలోచనల ప్రకారం నిర్వహిస్తే, దీనికి అంతం ఎప్పుడు? మానవాళి ఎప్పుడు విశ్రాంతిలోకి ప్రవేశిస్తుంది? నేను సబ్బాత్ అయిన ఏడవ రోజులోకి ఎలా ప్రవేశించగలను? నేను నా ప్రణాళిక ప్రకారం మరియు నా ఉద్దేశం ప్రకారం కార్యము చేస్తాను—కానీ మానవుని ఉద్దేశాల ప్రకారం చేయను.

మునుపటి:  శరీరంతో ఉన్న వారెవరూ ఆగ్రహ దినం నుండి తప్పించుకోలేరు

తరువాత:  సువార్తను వ్యాప్తి చేయు కార్యము అనేది మనిషిని రక్షించు కార్యమైయున్నది

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger