నీకు దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు, నీవు సత్యం కోసం జీవించాలి
మనుష్యులందరిలో ఉండే సర్వసాధారణమైన సమస్య ఏమిటంటే, వారందరూ సత్యాన్ని అర్థం చేసుకోగలరు కానీ, దానిని ఆచరించడంలో విఫలం అవుతుంటారు. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఒక పక్క, వారు అందుకు మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉండరు, ఇంకా మరో పక్క, వారిలో విచక్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది; అలా ఉన్నందువల్ల తమ దైనందిన జీవనంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను వారు చూడలేకపోతున్నారు, అందువల్ల సత్యాన్ని ఎలా సాధన చేయాలో తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజల అనుభవాలు చాలా పేలవమైనవి, వారి సామర్థ్యం కూడా చాలా తక్కువ, ఇంకా సత్యాన్ని అర్థం చేసుకోగల స్థాయి కూడా వారికి పరిమితంగా ఉంటుంది. అందువల్ల తమ దైనందిన జీవితాలలో ఎదురయ్యే కష్టాలను పరిష్కరించుకునే మార్గాలను వారు తెలుసుకోలేకపోతున్నారు. వారు దేవుడిని కేవలం మాటలలోనే నమ్ముతున్నారు, కానీ దేవుడిని తమ దైనందిన జీవితాలలోకి తీసుకురావడంలో విఫలం అవుతున్నారు. సరిగ్గా చెప్పాలంటే, దేవుడు దేవుడే, జీవితం జీవితమే, ఈ మనుష్యులు తమ జీవితాలలో దేవునితో ఎటువంటి సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విధముగానే ఆలోచిస్తున్నారు. దేవుడిని నమ్మినంత మాత్రమున, వాస్తవముగా, మనుషులు ఏమీ సాధించలేరు ఇంకా ఆయన చేత పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడలేరు. వాస్తవానికి, దేవుడి వాక్యానికి పూర్తి వ్యక్తీకరణ దొరకడం లేదని కాదు, కానీ ఆయన వాక్యాన్ని గ్రహించగల సమర్థత మనుషులలో చాలా తక్కువగా ఉందని అర్థం అవుతుంది. దేవుని అసలు సంకల్పానికి అనుగుణంగా ఏ ఒక్కరూ వ్యవహరించడం లేదని చెప్పవచ్చు; అందుకు భిన్నంగా, దేవుడి పట్ల వారి నమ్మకము వారి సొంత సంకల్పాలకు అనుగుణంగా ఉంటున్నది. గతంలో వారు పాటించిన మతాలకు చెందిన నమ్మకాలు, ఇంకా వారి సొంత ఆలోచనలకు అనుగుణంగా వారి నమ్మకాలు ఉంటున్నాయి. దేవుడి వాక్యాన్ని అంగీకరించి ఆయన సంకల్పానికి అనుగుణంగా వ్యవహరిస్తూ తమలో మార్పును పొందే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకు భిన్నంగా, వారు తమ తప్పుడు నమ్మకాలతోనే కొనసాగుతుంటారు. మనుష్యులు దేవుడిని నమ్మడం ప్రారంభించినప్పుడు, వారు మతపరమైన సాంప్రదాయ నియమాల ఆధారంగా తమ నమ్మకాలను కలిగి ఉంటారు. ఇంకా వారు కేవలం తాము జీవించడం కోసం ఏర్పరుచుకున్న సొంత సిద్ధాంతాల ఆధారంగా వారు ఇతరులతో వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఈ విధముగానే వ్యవహరిస్తూ ఉంటారు. చాలా కొద్దిమంది మాత్రమే వేరే ప్రణాళికని రూపొందించుకుని, దేవుడిని నమ్మడం ప్రారంభించడం ద్వారా సరికొత్త జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. దేవుడి వాక్యాన్ని సత్యంగా పరిగణించడంలో మానవమాత్రులు విఫలం అవుతున్నారు, ఒకవేళ, ఆ సత్యాన్ని గ్రహించగలిగినా, దానిని అమలు చేయడంలో విఫలం అవుతున్నారు.
ఉదాహరణకు, జీసెస్ పట్ల నమ్మకం గురించి చర్చిద్దాము. కొందరు కొత్తగా ఆయనను నమ్మడం ప్రారంభించి ఉండచ్చు లేదా చాలా కాలంగా నమ్ముతూ ఉండవచ్చు. అయితే, వారంతా తమకు ఉన్న నైపుణ్యాలను ఉపయోగిస్తూ తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ మనుషులు చాలా మామూలుగా “దేవుడి పట్ల నమ్మకం” ఉందంటూ, ఆ మూడు పదాలను తమ సాధారణ జీవితాలకు జోడిస్తూ ఉంటారు, కానీ వారి స్వభావాలను ఏ విధముగానూ మార్చుకోవడం లేదు. అలాగే దేవుడి పట్ల వారి విశ్వాసము కొద్దిమాత్రముగా కూడా పెరగడం లేదు. వారి సత్యాన్వేషణలో తీవ్రత ఉండదు, అలాగే, అది నిస్తేజముగానూ ఉండదు. దేవుడి పట్ల తాము విశ్వాసాన్ని వదులుకుంటున్నాము అని వారు చెప్పడం లేదు, అలాగని వారు పవిత్ర కార్యమునకు తమని తాము సంపూర్ణముగా సమర్పించుకోవడం లేదు. వారు దేవుడిని నిజముగా ఎప్పుడూ నమ్మలేదు లేదా ఆయనను అనుసరించలేదు. దేవుడి పట్ల వారికి గల నమ్మకము కొంత నిజాయితీతో కూడుకున్నదీ ఇంకా కొంత కలుషితమైనది అన్నట్లు మిశ్రమముగా ఉంటున్నది. వారు ఒక కన్ను తెరిచి, మరొక కన్ను మూసి దేవుడిని ఆశ్రయిస్తున్నారు, అంతే కాకుండా, విశ్వాసమును ఆచరించడంలో వారు దృఢసంకల్పము కలిగి ఉండరు. వారు ఈ అయోమయ స్థితిలోనే జీవిస్తూ, చివరకు గందరగోళపు మరణాన్ని పొందుతున్నారు. ఇటువంటి అవస్థను పొందడంలో అర్థం ఏం ఉంది? ఈ రోజు, మీరు ఆచరణాత్మకంగా దేవుడిని నమ్మడం కోసం, సరైన బాటలో అడుగు ముందుకు వేయాలి. మీరు దేవుడిని నమ్ముతున్నట్లయితే, మీరు కేవలం ఆయన ఆశీస్సులు మాత్రమే కోరుకోకుండా, దేవుడిని ప్రేమించాలి ఇంకా దేవుడిని తెలుసుకోవాలి. ఆయన ఇచ్చే జ్ఞానపు వెలుగుతో, మీరు సొంతంగా తెలుసుకోవడం ద్వారా, ఆ దేవుడి వాక్యమును మీరు ప్రతి కార్యములోనూ ఆస్వాదిస్తారు, ఆ దేవుడి గురించిన నిజమైన అవగాహనను పెంపొందించుకుంటారు, ఇంకా మీ హృదయపు లోతుల నుండి ఏర్పడే నిజమైన ప్రేమను మీరు ఆ దేవుడి పట్ల కలిగి ఉంటారు. స్పష్టంగా చెప్పాలంటే, ఆ దేవుడి పట్ల మీ ప్రేమ గనుక నిజాయితీతో కూడినది అయితే, దానిని ఎవ్వరూ అంతం చేయలేరు, అలాగే ఆయన పట్ల మీకు ఉన్న ప్రేమకు ఎవ్వరూ అడ్డుపడలేరు. ఈ సమయములో మీరు దేవుడిని నమ్మడములో సరైన మార్గములో ఉన్నారు. మీరు దేవుడికి చెందిన వారు అని ఇదే రుజువు చేస్తున్నది, ఎందుకంటే మీ హృదయము ఇప్పటికే దేవుని ఆధీనములో ఉంది. కావున, మిమ్మల్ని మరేదీ స్వాధీనములోకి తీసుకొనలేదు. మీ అనుభవము ద్వారా, మీరు చెల్లించిన మూల్యము ద్వారా, దేవుని కార్యము ద్వారా, మీరు దేవుడి పట్ల అచంచలమైన ప్రేమను పెంచుకొనబడి ఉన్నారు. అటువంటి పనిని మీరు సాధించినప్పుడు, మీరు సైతాను ప్రభావము నుండి విముక్తులు అవుతారు, దేవుడి వాక్యము వెలుగులో జీవించడం ప్రారంభిస్తారు. చీకటి ప్రభావము నుండి మీరు బయటపడి స్వేచ్ఛను పొందినప్పుడు మాత్రమే మీరు దేవుడిని పొందగలరని చెప్పబడుతున్నది. దేవుడి మీద మీకు ఉన్న నమ్మకము ద్వారా, మీరు ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మీలో ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతము ఉన్న స్థితి పట్ల మీలో ఎవ్వరూ సంతృప్తిని పొందకూడదు. దేవుని కార్యము పట్ల మీరు రెండు విధాలుగా ఆలోచనలు చేయరాదు, అలాగే దీనిని తేలికగా తీసుకొనరాదు. మీరు అన్ని విషయాలలోనూ, అన్ని సమయాలలోనూ దేవుడి గురించి మాత్రమే ఆలోచన చేయాలి, ఆయన పనులలో మాత్రమే నిమగ్నం కావాలి. మీ ప్రతి మాటలో, ప్రతి కార్యములో దేవుడి నివాసము యొక్క ప్రయోజనాలను మాత్రమే ముందు నిలపాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ దేవుడి హృదయాన్ని చేరుకోగలరు.
దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండే విషయంలో, మనుషులు చేసే పెద్ద తప్పిదము ఏమిటంటే, వారి విశ్వాసము మాటలకు మాత్రమే పరిమితమై ఉంటుంది, కానీ వారి దైనందిన జీవితాలలో దేవుని ఉనికి పూర్తిగా లోపించి ఉంటుంది. మనుషులు అందరూ, వాస్తవంగా, దేవుని ఉనికి పట్ల విశ్వాసము కలిగి ఉంటారు, కానీ తమ దైనందిన జీవితాలలో దేవుడిని భాగం చేసుకోరు. మనుషుల పెదవులు దేవుడి కోసం ఎన్నో ప్రార్థనలు పలుకుతాయి, కానీ వారి హృదయాలలో దేవుడికి స్థానం కొద్దిగా కూడా ఉండదు. అందువల్ల, దేవుడు వారిని పదే పదే పరీక్షిస్తూ ఉంటారు. మనుష్యులు కల్మషులై ఉన్నారు గనుకనే దేవుడు తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఏదో ఒక రోజు వారు ఈ విషయములో సిగ్గుపడి ఆ దేవుడి ప్రయత్నాల ఫలితంగా ఒకానొక సందర్భంలో తమని తాము తెలుసుకొనగలుగుతారు. లేని పక్షంలో, మానవజాతి మొత్తం ప్రధాన దేవదూత వారసులుగా మారిపోయి, మరింత అవినీతిమయులు అయిపోతారు. దేవుడి పట్ల విశ్వాసము కలిగి ఉండటము వల్ల, దేవుడి నిరంతర పరిశుద్ధ ప్రక్రియ కారణంగా ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత ఆలోచనలను, లక్ష్యాలను విడనాడుతూ ఉంటాడు. అలా కాని యెడల, దేవుడు ఎవ్వరినీ ఉపయోగించుకొనలేడు, ఇంకా మనుషుల కోసం ఆయన సంకల్పించిన కార్యమును నిర్వర్తించలేడు. దేవుడు మొదట మనుషులను శుద్ధి చేసి, ఆ తరువాత ఈ ప్రక్రియ ద్వారా, మనుష్యులు తమను తాము తెలుసుకొనేలా చేసి, వారిలో మార్పును తీసుకువస్తాడు. అప్పుడు మాత్రమే మనుష్యులలో ఆయన తన జీవమున నింపగలడు, తద్వారా వారి హృదయాలు పూర్తిగా దేవుడితో నిండిపోవును. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే, దేవుడిని విశ్వసించడం అనేది మనుషులు చెప్పినంత సులువైనది కాదు. దేవుని దృష్టిలో, మీకు జ్ఞానము ఉన్నా కూడా ఆయన వాక్యమును మీ జీవితంలో ఆచరించకున్నా, మీరు మీ జ్ఞానమునకు మాత్రమే పరిమితమైపోయి సత్యాన్ని సాధన చేయలేకున్నా, దేవుని వాక్యమును విస్మరించినా, దేవుడి పట్ల మీ హృదయములో ప్రేమ లేదు అనడానికి అవే నిదర్శనాలు అవుతాయి. మీ హృదయాలు దేవునికి చెందవు అని రుజువు చేస్తాయి. దేవుడిని తెలుసుకోవాలి అంటే ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. ఇదే అంతిమ లక్ష్యము, ఇంకా మనిషి అన్వేషించవలసిన గమ్యము అదే. దేవుని వాక్యములను ఆచరణలో పెట్టడం కోసం మీకు ప్రయత్నము చేయాలి. ఆ ప్రయత్నాల ఫలితంగా మాత్రమే ఆయన వాక్యములను మీరు ఆచరించగలుగుతారు. మీకు కేవలము సిద్ధాంతపరమైన జ్ఞానము మాత్రమే ఉంటే, అప్పుడు దేవుడి పట్ల మీలో విశ్వాసము నిరుపయోగము. మీరు గనుక ఆయన వాక్యమును ఆచరణలో పెట్టి, అందుకు అనుగుణముగా జీవించినప్పుడే, దేవుడి పట్ల మీ విశ్వాసము సంపూర్ణము అనీ, దేవుని సంకల్పమునకు అనుగుణముగా ఉన్నదని భావించబడుతుంది. ఈ మార్గములో, చాలామంది తమకు ఎంతో జ్ఞానం ఉన్నట్లు మాట్లాడతుంటారు, కానీ వారు మరణించే సమయములో, వారి కళ్లు కన్నీళ్లతో నిండిపోతాయి, తమ జీవితకాలాన్ని పూర్తిగా వృథాగా గడిపినందుకు వారు తమని తాము ద్వేషించుకుంటారు. తమ వృద్ధాప్యము వరకూ నిస్సారముగా జీవించినందుకు చింతిస్తారు. అటువంటి మనుష్యులు కేవలము సిద్ధాంతాలను మాత్రమే అర్థం చేసుకోగలరు, కానీ సత్యాన్ని ఆచరించలేరు, దేవుడి సాక్షులు కాలేరు. దానికి బదులు, వారు దిక్కులు తెలియకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటారు, ఒక తేనెటీగ మాదిరిగా సంచరిస్తూ ఉంటారు, కానీ చివరకు మరణించే సమయంలో మాత్రమే తుదకు తమకు అసలైన అర్హత లేదని తెలుసుకోగలుగుతారు. తమకు దేవుని గురించి ఏమీ తెలియదని అప్పుడు గ్రహిస్తారు. అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది కదా? మీరు ఈ రోజును వెంటనే ఎందుకు అందిపుచ్చుకోరు, ఇంకా మీరు ప్రేమించే సత్యాన్ని ఎందుకు వెంటనే అన్వేషించరు? రేపటి కోసం ఎందుకు వేచి ఉంటారు? సత్యము కోసం మీరు జీవితములో కష్టాలు అనుభవించని యెడల, దానిని పొందాలని కోరుకోని యెడల, మీరు చనిపోయే సమయంలో ఆ సత్యము గురించి బాధపడాలని కోరుకుంటున్నారా? అదే నిజమైతే, అప్పుడు దేవుడిని విశ్వసించడం దేనికి? వాస్తవంగా, దేవుడిని సంతృప్తి పర్చే విధంగా, ప్రజలు అతి స్వల్పమైన ప్రయత్నంతో సత్యాన్ని అమలు చేయగల విషయాలు చాలానే ఉంటాయి. కానీ కేవలము మనుష్యుల హృదయాలు దుష్టశక్తుల స్వాధీనములో ఉంటాయి గనుక వారు దేవుడి కోసం కార్యాలు చేయలేరు, ఇంకా తమ శరీరాల కోసము నిత్యమూ ఆరాటపడుతూ, చివరికి దానిని కూడా కాపాడుకోలేని స్థితిలోకి వెళతారు. ఈ కారణంగానే, మనుషులు సమస్యలు, కష్టాలతో నిత్యము సతమతం అవుతుంటారు. ఇవన్నీ సైతాను పెట్టే హింసలు కావంటారా? శరీరము కల్మషము కావడం అంటే ఇది కాదా? కేవలము పెదవులను ఆడించడము ద్వారా దేవుడిని మీరు మోసపుచ్చే ప్రయత్నం చేయకండి. దానికి బదులుగా, ఒక సదర్శనీయమైన కార్యమును చేపట్టండి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. అలా చేయడంలో ఇంక అర్థం ఏముంది? మీ శరీరం కోసం, లాభాల కోసము, పేరు కోసము బతకడం వల్ల మీరు ఏమి పొందగలుగుతారు?