పేర్లు మరియు గుర్తింపుకు సంబంధించిన విషయాలు

నీవు దేవుడికి ఉపయోగపడేలా ఉండాలనుకుంటే, నీవు తప్పక దేవుడి కార్యమును తెలుసుకోవాలి, నీవు ఆయన గతంలో చేసిన కార్యమును (కొత్త మరియు పాత నిబంధనలలోని) తప్పక తెలుసుకోవాలి, అంతేగాకుండా, నీవు ఆయన ఈనాడు చేసే కార్యమును తప్పక తెలుసుకోవాలి; ఇంకో మాటలో చెప్పాలంటే, నీవు 6,000 యేండ్లుగా దేవుడి కార్యపు మూడు దశలను తప్పక తెలుసుకోవాలి. నిన్ను సువార్తను వ్యాపింపజేయమని కోరితే, నీవు దేవుడి కార్యమును తెలుసుకోకుండా అలా చేయలేవు. బైబిల్, పాత నిబంధన మరియు ఆ కాలపు యేసు కార్యము మరియు వాక్యముల గురించి మీ దేవుడు ఏమి చెప్పాడని నిన్ను ఎవరైనా అడగవచ్చు. నీవు బైబిల్‌లోని అంతర్గత కథను గురించి మాట్లాడలేకపోతే, వారిని ఒప్పించలేవు. ఆ కాలంలో, యేసు తన శిష్యులతో ఎక్కువగా పాత నిబంధన గురించి మాట్లాడాడు. అప్పుడు వారు చదివినదంతా పాత నిబంధన నుండే; యేసుకు శిలువ వేసిన కొన్ని దశాబ్దాల తర్వాత మాత్రమే కొత్త నిబంధన రాయబడింది. సువార్తను వ్యాపింపజేయడానికి, మీరు ముఖ్యంగా బైబిల్‌లోని ఆంతరంగిక సత్యాన్ని మరియు ఇశ్రాయేలులో దేవుడి కార్యమును అంటే యెహోవా చేసిన కార్యమును గ్రహించాలి మరియు మీరు యేసు చేసిన కార్యమును కూడా అర్థం చేసుకోవాలి. ఇవే ప్రజలందరూ తెలుసుకోవాలని ఎక్కువగా ఆందోళన చెందే సమస్యలు మరియు వారు ఆ రెండు దశల కార్యపు అంతర్గత కథను ఇంతకుముందు వినలేదు. సువార్తను వ్యాపింపజేసేటప్పుడు, ముందుగా నేటి పరిశుద్ధాత్మ కార్యము గురించి మాట్లాడటం పక్కన పెట్టండి. ఈ దశ కార్యము వారికి అంతుపట్టనిది, ఎందుకంటే మీరు ఇప్పుడు అనుసరించే—దేవుడి జ్ఞానం మరియు పరిశుద్ధాత్మ కార్యపు జ్ఞానం—అన్నింటికంటే సర్వోన్నతమైనవి మరియు ఈ రెండు విషయాల కంటే గొప్పది ఏదీ లేదు. మీరు మొదట సర్వోన్నతమైన దానిని గురించి మాట్లాడితే, అది వారికి మరీ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ చేసిన అలాంటి కార్యమును ఎవరూ అనుభవించలేదు; అది అభూతపూర్వమైనది మరియు దానిని అంగీకరించడం మనిషికి అంత సులభం కాదు. వారి అనుభవాలన్నీ పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు చేసిన కార్యములతో కూడిన గతంలోని పాత విషయాలు. వారు అనుభవిస్తున్నది ఈనాటి పరిశుద్ధాత్మ కార్యము లేదా ఈనాటి దేవుడి చిత్తం కాదు. ఇప్పటికీ వారు కొత్త వెలుగు మరియు కొత్త విషయాలు లేని పాత పద్ధతుల ప్రకారమే వ్యవహరిస్తున్నారు.

యేసు కాలములో, పరిశుద్ధాత్ముడు ప్రధానంగా తన కార్యమును యేసులో చేశాడు, అదే యాజక వస్త్రాలు ధరించి ఆలయంలో యెహోవాకు సేవ చేసినవారు దానిని అచంచలమైన విశ్వాసంతో చేశారు. వారికి కూడా పరిశుద్ధాత్మ కార్యము ఉండినది, కానీ వారు దేవుడి ప్రస్తుత చిత్తాన్ని గ్రహించలేకపోయారు మరియు కొత్త మార్గదర్శకత్వం లేకుండా, పాత పద్ధతుల ప్రకారం యెహోవాకు కేవలం విశ్వాసపాత్రులుగా ఉండిపోయారు. యేసు వచ్చి కొత్త కార్యమును తెచ్చాడు, అయినప్పటికీ, ఆలయంలో సేవ చేసిన వారికి కొత్త మార్గదర్శకత్వం లేదా కొత్త కార్యము లేదు. ఆలయంలో సేవ చేయడం ద్వారా, వారు కేవలం పాత పద్ధతులను కొనసాగించగలిగారు మరియు ఆలయాన్ని వదిలి వెళ్లకపోవడం వల్ల, వారు ఏదైనా కొత్త జ్ఞానాన్ని ఏమాత్రం పొందలేకపోయారు. కొత్త కార్యమును యేసు తీసుకువచ్చాడు మరియు తన కార్యమును చేయడానికి యేసు ఆలయంలోనికి వెళ్ళలేదు. ఆయన ఆలయం వెలుపలే తన కార్యమును చేశాడు, ఎందుకంటే దేవుడి కార్యపు పరిధి చాలా కాలం క్రితమే మారిపోయింది. ఆయన ఆలయం లోపల కార్యము చేయలేదు మరియు మనిషి అక్కడ దేవుడికి సేవ చేసినప్పుడు, అది ఉన్నవాటిని అలాగే కొనసాగించడానికి మాత్రమే ఉపయోగపడింది మరియు ఏ కొత్త కార్యమును తీసుకురాలేకపోయింది. అదేవిధంగా, మతపరమైన వ్యక్తులు నేటికి ఇంకా బైబిల్‌ను ఆరాధిస్తున్నారు. నీవు వారికి సువార్తను వ్యాపింపజేస్తే, వారు బైబిల్ వాక్యములకు సంబంధించిన చిన్న చిన్న వివరాలను నీ ముందుకు విసురుతారు మరియు మీరు ఆశ్చర్యపడేలా మరియు నోరు మూతపడేలా వాటికి ఎన్నో సాక్ష్యాలను చూపిస్తారు; ఆతర్వాత వారు మీకు ఒక లేబుల్ అంటిస్తారు మరియు మీరు దేవుడి పట్ల మీ విశ్వాసంలో మూర్ఖులని భావిస్తారు. “నీకు దేవుడి వాక్యమైన బైబిల్ అంటే తెలియనే తెలియదు, అలాంటప్పుడు నీకు దేవుడిపట్ల విశ్వాసం ఉందని ఎలా చెప్పగలవు?” అని వారు అంటారు, అప్పుడు వారు నిన్ను చిన్నచూపు చూస్తారు మరియు, “మీరు విశ్వసించేవాడు దేవుడే అయితే, పాత మరియు కొత్త నిబంధనల గురించి ఆయన మీకు ఎందుకు చెప్పలేదు? అని అంటారు, ఆయన తన మహిమను ఇశ్రాయేలు నుండి తూర్పుకు తీసుకువచ్చాడు కాబట్టి, ఆయనకు ఇశ్రాయేలులో చేసిన కార్యము గురించి ఎందుకు తెలియదు? ఆయనకు యేసు చేసిన కార్యము ఎందుకు తెలియదు? ఒకవేళ మీకు తెలియకపోతే, మీకు చెప్పలేదని అది రుజువు చేస్తుంది; ఆయన యేసు రెండవ అవతారం కాబట్టి, ఆయన ఈ విషయాలను ఎందుకు తెలుసుకోలేకపోయాడు? యేసుకు యెహోవా చేసిన కార్యము తెలుసు; ఆయనకు ఎలా తెలియకుండా ఉండగలదు?” అవకాశం వచ్చినప్పుడు, వారందరూ నిన్ను ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. వారి బుర్రల నిండా అలాంటి ఆలోచనలే ఉంటాయి; వారు అడగకుండా ఎలా ఉండగలరు? ఈ ప్రవాహంలో ఉన్న మీరు బైబిల్‌పై దృష్టి పెట్టరు, ఎందుకంటే ఈ రోజు దేవుడు చేసిన అంచెలంచెల కార్యము గురించి మీకు పూర్తిగా తెలుసు, మీరు ఈ అంచెలంచెల కార్యమును స్వయంగా కళ్లతో దర్శించారు మరియు మీరు కార్యపు మూడు దశలను స్పష్టంగా చూశారు, కాబట్టి మీరు బైబిల్‌ను కింద పెట్టి, దానిని చదవడం ఆపివేయాలి. కానీ ఈ అంచెలంచెల కార్యము గురించి వారికి తెలియదు కాబట్టి వారు దానిని చదవలేరు. “శరీరధారియైన దేవుడి కార్యమునకు మరియు గత కాలపు ప్రవక్తలు మరియు అపొస్తలులు చేసిన కార్యమునకు తేడా ఏమిటి? అని కొంతమంది అడుగుతారు. డేవిడ్‌ను ప్రభువు అని కూడా పిలిచారు, అలాగే యేసును కూడా; వారు చేసిన కార్యము భిన్నమైనది అయినప్పటికీ, వారిద్దరిని ఒకేలా పిలిచారు. మీరు నాకు చెప్పండి, వారి గుర్తింపులు ఒక్కటే ఎందుకు కాకుండా పోయాయి? జాన్ చూసినది కూడా పరిశుద్ధాత్మ నుండి వచ్చిన ఒక దర్శనం, అతను పరిశుద్ధాత్మ చెప్పాలని ఉద్దేశించిన మాటలను చెప్పగలిగాడు; అలాంటప్పుడు జాన్ గుర్తింపు యేసు కంటే భిన్నంగా ఎందుకు ఉంది?” యేసు చెప్పిన వాక్యములు దేవుడికి పూర్తిగా ప్రాతినిధ్యం వహించగలిగాయి మరియు అవి పూర్తిగా దేవుడి కార్యమునకు ప్రాతినిధ్యం వహించాయి. జాన్ చూసినది ఒక దర్శనమే, అతడు దేవుడి కార్యమునకు పూర్తిగా ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. యేసు లాగే యోహాను, పేతురు మరియు పౌలు అనేక మాటలు మాట్లాడినప్పటికీ, వారికి యేసుతో సమానమైన గుర్తింపు ఎందుకు లేదు? దీనికి ప్రధాన కారణం ఏమంటే, వారు చేసిన కార్యము భిన్నమైనది. యేసు దేవుడి ఆత్మకు ప్రాతినిధ్యం వహించాడు మరియు దేవుని ఆత్మ నేరుగా పనిచేస్తూ ఉండింది. ఆయన మునుపెన్నడూ ఎవరూ చేయని కార్యమైన నూతన కాలపు కార్యమును చేశాడు. ఆయన కొత్త మార్గాన్ని తెరిచాడు, ఆయన యెహోవాకు ప్రాతినిధ్యం వహించాడు మరియు ఆయన స్వయంగా దేవుడికే ప్రాతినిధ్యం వహించాడు, అదే పేతురు, పౌలు మరియు దావీదులు ఏవిధంగా పిలువబడినప్పటికీ, వారు దేవుడు సృష్టించిన జీవి గుర్తింపుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు మరియు వారు యేసు లేదా యెహోవా ద్వారా పంపబడ్డారు. అందుచేత వారు ఎంత పని చేసినప్పటికీ, వారు ఎంత గొప్ప అద్భుతాలు చేసినప్పటికీ, వారు దేవుడు సృష్టించిన జీవులు మాత్రమే మరియు వారు దేవుడి ఆత్మకు ప్రాతినిధ్యం వహించలేరు. వారు దేవుడి పేరు మీద పని చేశారు లేదా దేవుడు పంపిన తర్వాత పని చేశారు; అంతేగాకుండా, వారు యేసు లేదా యెహోవా ప్రారంభించిన కాలాలలో పనిచేశారు, అంతేగానీ వారు మరే పని చేయలేదు. వారు కేవలం దేవుడు సృష్టించిన జీవులు మాత్రమే. పాత నిబంధనలో, ఎంతో మంది ప్రవక్తలు భవిష్యత్తులో జరిగేవాటిని చెప్పారు లేదా భవిష్యవాణిపై పుస్తకాలు రాశారు. వారిలో ఎవరూ మేము దేవుడు అని చెప్పలేదు, అయితే యేసు కార్యము ప్రారంభించిన వెంటనే, దేవుడి ఆత్మ ఆయన దేవుడని సాక్ష్యమిచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? నీకు ఇప్పటికే ఇది తెలిసి ఉండాలి! ఇంతకు ముందు, అపొస్తలులు మరియు ప్రవక్తలు వివిధ లేఖలు రాసారు మరియు అనేక భవిష్యవాణులు చెప్పారు. ఆ తర్వాత, బైబిల్‌లో చేర్చడానికి వాటిలో కొన్నింటిని ప్రజలు ఎంచుకున్నారు, మరికొన్ని కనుమరుగయ్యాయి. వారు చెప్పినవన్ని పరిశుద్ధాత్మ నుండి వచ్చనవేనని చెప్పే వ్యక్తులు ఉన్నారు, అయితే వాటిలో కొన్ని మంచివి మరియు కొన్ని చెడ్డవిగా ఎందుకు భావించబడ్డాయి? కొన్ని మాత్రమే ఎందుకు ఎంచుకోబడ్డాయి, మరికొన్ని ఎందుకు ఎంచుకోబడలేదు? అవి నిజంగా పరిశుద్ధాత్మ చెప్పిన మాటలే అయితే, ప్రజలు వాటిని ఎంచుకోవలసిన అవసరం ఉందా? ఈ నాలుగు సువార్తలు ప్రతి దానిలో యేసు చెప్పిన వాక్యములు మరియు ఆయన చేసిన కార్యపు వృత్తాంతాలు ఎందుకు భిన్నమైనవిగా ఉన్నాయి? ఇది వాటిని రాసిన వారి తప్పు కాదా? “కొత్త నిబంధనకు సంబంధించి పౌలు మరియు ఇతర రచయితలు రాసిన లేఖలు మరియు వారు చేసిన పని పాక్షికంగా మనిషి చిత్తం నుండి పుట్టాయి మరియు మనిషి అభిప్రాయాలతో కలుషితం చేయబడ్డాయి కాబట్టి, ఈనాడు నీవు (దేవుడు) మాట్లాడే మాటల్లో మానవ కల్మషం లేదా? నిజంగా వాటిలో మనిషి అభిప్రాయాలు ఏమీ లేవా?” అని కొంతమంది అడుగుతారు, దేవుడు చేసిన కార్యపు ఈ దశ పౌలు, అనేకమంది అపొస్తలులు మరియు ప్రవక్తలు చేసిన దానికంటే పూర్తిగా భిన్నమైనది. గుర్తింపులో తేడా ఉండడం ఒక్కటే కాదు, ప్రధానంగా, కొనసాగించిన కార్యములో కూడా తేడా ఉంది. పౌలు కిందకు పడదోయబడి, ప్రభువు ముందట సాగిలపడిన తర్వాత, పని చేయుటకు అతడు పరిశుద్ధాత్మచేత ముందుకు నడిపింపబడ్డాడు మరియు అతడు పంపబడిన వ్యక్తిగా మారాడు. కాబట్టే అతను చర్చిలకు లేఖలు రాశాడు మరియు ఈ లేఖలన్నీ యేసు బోధలనే అనుసరించాయి. ప్రభువైన యేసు నామముతో పని చేయడానికి పౌలు ప్రభువు ద్వారా పంపబడ్డాడు, అయితే దేవుడే స్వయంగా వచ్చినప్పుడు, ఆయన మరే పేరుతోనూ పని చేయలేదు మరియు ఆయన కార్యము దేవుడి ఆత్మకు తప్ప మరి దేనికీ ప్రాతినిధ్యం వహించలేదు. దేవుడు తన కార్యమును నేరుగా చేయడానికి వచ్చాడు: ఆయన మనిషి ద్వారా పరిపూర్ణుడు కాలేదు మరియు ఆయన కార్యము ఏ మనిషి బోధనల మీద కొనసాగించబడలేదు. కార్యపు ఈ దశలో దేవుడు ఆయన వ్యక్తిగత అనుభవాలను గురించి మాట్లాడటం ద్వారా మార్గదర్శనం చేయలేదు, దానికి బదులుగా తానేమిటో ఆవిధంగానే నేరుగా ఆయన కార్యమును కొనసాగించాడు. ఉదాహరణకు, సేవ చేసే వ్యక్తుల శ్రమలు, శిక్షాకాలం, మరణ విచారణ, దేవుడిని ప్రేమించే సమయం…. ఇదంతా ఇంతకుముందు ఎప్పుడూ చేయని కార్యము మరియు మనిషి అనుభవాలు కాకుండా ప్రస్తుత కాలానికి సంబంధించిన కార్యము. నేను చెప్పిన మాటలలో మనిషి అనుభవాలు ఏవి? అవన్నీ నేరుగా ఆత్మ నుండి వచ్చినవి కావా మరియు అవి ఆత్మ ద్వారా జారీచేయబడినవి కావా? నీ సామర్థ్యం చాలా తక్కువ ఉండడం చేత నీవు సత్యాన్ని చూడలేకపోతున్నావు! నేను మాట్లాడే జీవం యొక్క వ్యవహారిక నిజమైన మార్గాన్ని నిర్దేశించడం కోసం మరియు ఇంతకు ముందెప్పుడూ ఎవరూ దీనిని మాట్లాడలేదు లేదా ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవరూ అనుభవించలేదు లేదా ఎవరికీ ఈ వాస్తవికత గురించి తెలియదు. నేను ఈ మాటలు చెప్పడానికి ముందు, వాటిని ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. అలాంటి అనుభవాలను ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు లేదా అలాంటి వివరాలను ఎప్పుడూ మాట్లాడలేదు అంతేగాకుండా, ఈ విషయాలను బయలు పరచడానికి ఎవరూ అలాంటి స్థితులను ఎత్తి చూపలేదు. నేను ఈరోజు నడిపిస్తున్న మార్గంలో ఎవరూ ఎప్పుడూ నడిపించలేదు, ఒకవేళ మనిషి చేత అలాంటి మార్గంలో నడిపించబడి ఉంటే, అది కొత్త మార్గంగా ఉండేది కాదు. ఉదాహరణకు పౌలు మరియు పేతురును తీసుకోండి. యేసు మార్గాన్ని చూపించడానికి ముందు వారికి వారి సొంత వ్యక్తిగత అనుభవాలు లేవు. యేసు మార్గం చూపించిన తర్వాతనే వారు యేసు చెప్పిన మాటలను, ఆయన చూపిన మార్గాన్ని అనుభవించారు; దీని నుండి వారు ఎన్నో అనుభవాలు పొందారు మరియు వారు ధర్మలేఖనాలను రాసారు. అందుచేత, మనిషి అనుభవాలు దేవుడి కార్యానికి సమానం కావు మరియు దేవుడి కార్యము మనిషి అభిప్రాయాలు మరియు అనుభవాల ద్వారా వివరించబడిన జ్ఞానానికి సమానం కాదు. నేను కొత్త మార్గాన్ని చూపుతున్నానని, కొత్త కార్యము చేస్తున్నానని మరియు నా కార్యము మరియు పలుకులు యోహాను మరియు ఇతర ప్రవక్తలందరి కంటే భిన్నమైనవని నేను అనేకసార్లు చెప్పాను. నేను మొదట అనుభవాలను పొంది, ఆతర్వాత వాటిని మీకు చెప్పను—విషయం అసలు అది కాదు. ఒకవేళ అదే అయితే, అది చాలా కాలం క్రితమే మీకు ఆలస్యం కలుగజేసి ఉండేది కాదా? గతంలో, చాలామంది మాట్లాడిన జ్ఞానం కూడా ఉన్నతమైనదే, కానీ వారి మాటలన్నీ ఆధ్యాత్మికవేత్తలు అనబడే వారిపై ఆధారపడి చెప్పినవి మాత్రమే. వారు మార్గనిర్దేశనం చేయలేదు, వారి వాక్కులన్నీ వారి అనుభవాల నుండి వచ్చాయి, వారు చూసిన వాటి నుండి మరియు వారి జ్ఞానం నుండి వచ్చాయి. కొన్ని వారి అభిప్రాయాలు, మరికొన్ని వారి అనుభవాల నుండి సంగ్రహించబడ్డాయి. ఈరోజు, నా కార్యపు స్వభావం వారి స్వభావం కంటే పూర్తిగా భిన్నమైనది. నేను ఇతరుల ద్వారా నడిపించబడిన అనుభవాన్ని పొందలేదు లేదా ఇతరుల ద్వారా నేను పరిపూర్ణతను పొందడాన్ని అంగీకరించలేదు. అంతేగాకుండా, నేను మాట్లాడిన మరియు సాంగత్యము చేసినవన్నీ ఇతరుల వాటిలాగా ఉండవు మరియు మరెవరూ ఎప్పుడూ వాటిని మాట్లాడలేదు. ఈరోజు, మీరు ఎవరైనప్పటికీ, నేను మాట్లాడే మాటల ఆధారంగానే మీ కార్యము కొనసాగించబడుతుంది. ఈ పలుకులు మరియు కార్యము లేకుండా, ఈ విషయాలను (సేవ చేసే వ్యక్తుల శ్రమలు, శిక్షాకాలం…) ఎవరు అనుభవించగలరు మరియు అలాంటి జ్ఞానాన్ని ఎవరు మాట్లాడగలరు? నీవు నిజంగా దీన్ని చూడలేకపోతున్నావా? కార్యము దశ ఏదైనప్పటికీ, నా వాక్యములు పలికిన వెనువెంటనే, మీరు నా వాక్యల ప్రకారం సాంగత్యము చేయడం మరియు వాటి ప్రకారం పని చేయడం ప్రారంభిస్తారు మరియు ఇది మీలో ఎవరైనా ఊహించిన మార్గం కాదు. ఇంత దూరం వచ్చాక కూడా, ఇంత స్పష్టమైన మరియు సులువైన ప్రశ్నను నీవు చూడలేకపోతున్నావా? ఇది ఎవరైనా ఊహించిన మార్గం కాదు, ఎవరైనా ఆధ్యాత్మికవేత్తపై ఆధారపడింది కాదు. ఇది నూతన మార్గం, ఒకనాడు యేసు మాట్లాడిన అనేక మాటలు కూడా ఇకమీదట వర్తించవు. నేను మాట్లాడేది ఒక నూతన యుగాన్ని ఆవిష్కరించే కార్యము, ఇది ఒక్కటిగానే నిలబడే కార్యము; నేను చేసే కార్యము, నేను మాట్లాడే మాటలు అన్నీ కొత్తవి. ఇది ఈనాటి నూతన కార్యము కాదా? యేసు కార్యము కూడా ఇలాగే ఉండింది. ఆయన కార్యము కూడా ఆలయంలోని వ్యక్తుల కార్యమునకు భిన్నంగా ఉండినది, అది పరిసయ్యుల కార్యమునకు కూడా భిన్నంగా ఉండినది లేదా ఇశ్రాయేలులోని ప్రజలందరు చేసిన దానితో ఏమాత్రం సారూప్యతగలది కాదు. దానిని చూసిన తర్వాత, ప్రజలు ఏ నిర్ణయానికి రాలేకపోయారు: “ఇది నిజంగా దేవుడు చేసిందేనా?” యేసు యెహోవా ధర్మశాస్త్రానికి కట్టుబడలేదు; ఆయన మానవాళికి బోధించడానికి వచ్చినప్పుడు, ఆయన మాట్లాడినదంతా కొత్తది మరియు పాత నిబంధనలోని సనాతన సాధువులు మరియు ప్రవక్తలు చెప్పిన దానికి భిన్నమైనది, కాబట్టి ప్రజలు ఎటూ నిర్ణయించుకోలేక పోయారు. ఇదే మనిషి అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టమైన పని. ఈ నూతన కార్యపు దశను అంగీకరించడానికి ముందు, మీలో ఎక్కువ మంది నడిచిన మార్గం ఆ ఆధ్యాత్మికవేత్తల పునాదిపై ఆచరించడానికి మరియు చేపట్టడానికి చేసినదే. కానీ ఈరోజు, నేను చేసే కార్యము ఎంతో విభిన్నమైనది, కాబట్టి ఇది సరైనదా కాదా అని మీరు నిర్ణయించలేకపోతున్నారు. నీవు ఇంతకు ముందు ఏ మార్గంలో నడిచావు లేదా నీవు ఎవరి “ఆహారం” తిన్నావు లేదా నీవు ఎవరిని నీ “తండ్రి” గా భావించావు అనే వాటిపై నాకు ఆసక్తి లేదు. మనిషికి మార్గనిర్దేశం చేయడానికి నేను వచ్చాను మరియు నూతన కార్యమును తెచ్చాను కాబట్టి, నన్ను అనుసరించే వారందరూ తప్పక నేను చెప్పిన ప్రకారమే నడుచుకోవాలి. నీవు ఎంత శక్తివంతమైన “కుటుంబం” నుండి వచ్చినప్పటికీ, నీవు నన్ను అనుసరించే తీరాలి, నీవు నీ గతకాలపు ఆచరణల ప్రకారం నడుచుకోకూడదు, నీ “పోషకుడైన తండ్రిని” నీవు వదిలివేయాలి మరియు నీకు హక్కు ఉన్న భాగాన్ని పొందడానికి నీవు దేవుడి ఎదుటకు రావాలి. నీ సమస్తం నా చేతుల్లో ఉంది మరియు నీవు నీ పోషకుడైన తండ్రిని మరీ గుడ్డిగా నమ్మడానికి అంకితం కాకూడదు; అతను నిన్ను పూర్తిగా నియంత్రించలేడు. ఈనాటి కార్యము ఒంటిగానే నిలబడుతుంది. నేను ఈరోజు చెప్పేదంతా స్పష్టంగా గత పునాదిపై ఆధారపడింది కాదు; ఇది ఒక నూతన ఆరంభం, ఒకవేళ అది మనిషి చేతితో సృష్టించబడిందని నీవు అంటే, అప్పుడు నీవు రక్షించబడలేనంత గుడ్డివాడివి అవుతావు!

యెషయా, యెహెజ్కేలు, మోషే, దావీదు, అబ్రహం మరియు దానియేలు ఇశ్రాయేలు ప్రజలలో ఎంచుకోబడిన నాయకులు లేదా ప్రవక్తలు. వారిలో ఎవరినీ దేవుడు అని ఎందుకు పిలవలేదు? వారికి పరిశుద్ధాత్మ ఎందుకు సాక్ష్యమివ్వలేదు? యేసు తన కార్యమును ఆరంభించిన వెంటనే మరియు తన వాక్యములు చెప్పడం మొదలు పెట్టిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఎందుకు సాక్ష్యమిచ్చాడు? పరిశుద్ధాత్మ ఇతరులకు ఎందుకు సాక్ష్యమివ్వలేదు? దేహంతో మనుష్యులై ఉన్న వారందరూ “ప్రభువు” అని పిలువబడ్డారు. వారు ఏ పేరుతో పిలువబడినప్పటికీ, వారు చేసే కార్యము వారి ఉనికి మరియు గుణగణాలకు ప్రాతినిథ్యం వహిస్తుంది మరియు వారి ఉనికి మరియు గుణగణాలు వారి గుర్తింపుకు ప్రాతినిథ్యం వహిస్తాయి. వారి గుణగణాలు వారి పేర్లకు సంబంధించినవి కావు; అవి వారు వ్యక్తపరచిన మరియు వారు జీవించిన వాటి ద్వారా ఇవి సూచించబడ్డాయి. పాత నిబంధనలో, ప్రభువు అని పిలిపించుకోవడంలో అసాధారణం ఏమీ లేదు మరియు ఒక వ్యక్తిని ఏ విధంగానైనా పిలువవచ్చు, కానీ అతని గుణగణాలు మరియు సహజ గుర్తింపు స్థిరమైనవి. ఆ అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు మరియు మోసగాళ్ళలో, “దేవుడు” అని పిలువబడే వారు కూడా లేరా? అయితే వాళ్లు దేవుడు ఎందుకు కాదు? ఎందుకంటే, వారు దేవుడి కార్యమును చేసే సామర్థ్యం లేనివారు. మూలంలో వారు మానవులు, ప్రజలను మోసగించేవారు, దేవుడు కాదు, కాబట్టే వారికి దేవుడి గుర్తింపు లేదు. పన్నెండు తెగలలోని వారు దావీదును కూడా ప్రభువు అని పిలువలేదా? యేసును కూడా ప్రభువు అని పిలిచారు; యేసు ఒక్కడినే దేవుడి అవతారంగా ఎందుకు పిలిచారు? యిర్మీయా కూడా మనుష్యకుమారుడిగా గుర్తించబడలేదా? యేసు మనుష్యకుమారుడిగా గుర్తించబడలేదా? యేసు ఎందుకు దేవుడి తరపున సిలువ వేయబడ్డాడు? దానికి కారణం ఆయన గుణగణాలు భిన్నంగా ఉండటం కాదా? దానికి కారణం ఆయన చేసిన కార్యము భిన్నంగా ఉండటం కాదా? పేరే ముఖ్యమైనదా? యేసును మనుష్యకుమారుడిగా కూడా పిలిచినప్పటికీ, ఆయన దేవుడి మొదటి అవతారం, ఆయన అధికారాన్ని చేపట్టడానికి మరియు విమోచన కార్యమును పూర్తిచేయడానికి వచ్చాడు. యేసు గుర్తింపు మరియు గుణగణాలు మనుష్యకుమారుడు అని కూడా పిలువబడిన ఇతరుల కంటే భిన్నమైనవని ఇది నిరూపిస్తుంది. ఈరోజు, పరిశుద్ధాత్మ ఉపయోగించుకున్న వారు మాట్లాడిన మాటలన్నీ పరిశుద్ధాత్మ నుండే వచ్చాయని చెప్పే ధైర్యం మీలో ఎవరికి ఉంది? ఎవరికైనా అలాంటి మాటలు చెప్పే ధైర్యం ఉందా? ఒకవేళ నీవు అలాంటి మాటలు చెబితే, ఎజ్రా ప్రవచన గ్రంథం ఎందుకు తృణీకరించబడింది మరియు ఆ సనాతన సాధువులు మరియు ప్రవక్తల గ్రంథాలకు కూడా ఇదే గతి ఎందుకు పట్టింది? వారంతా పరిశుద్ధాత్మ నుండే వచ్చి ఉంటే, అలాంటి చంచలమైన ఎంపికలు చేయడానికి మీరు ఎందుకు సాహసం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కార్యమును ఎంచుకోవడానికి నీకు అర్హత ఉందా? ఇశ్రాయేలులోని అనేక కథలు కూడా పరిత్యజించబడ్డాయి. గతకాలపు ఈ రచనలన్నీ పరిశుద్ధాత్మ నుండే వచ్చాయని నీవు నమ్మితే, కొన్ని గ్రంథాలు ఎందుకు పరిత్యజించబడ్డాయి? అవన్నీ పరిశుద్ధాత్మ నుండే వచ్చి ఉంటే, వాటన్నింటినీ కాపాడి, చర్చిలో సోదరసోదరీమణులు చదవడానికి పంపి ఉండాలి. అవి మానవ చిత్తంతో ఎంచుకోబడకూడదు లేదా పరిత్యజించబడకూడదు; ఆవిధంగా చేయడం తప్పు. పౌలు మరియు యోహాను అనుభవాలలో వారి వ్యక్తిగత దృష్టికోణాలు సమ్మిళితమై ఉన్నాయని చెప్పడమంటే అర్థం, వారి అనుభవాలు మరియు జ్ఞానం సాతాను నుండి వచ్చాయని కాదు, కానీ అవి వారి వ్యక్తిగత అనుభవాలు మరియు దృష్టికోణాల నుండి వచ్చాయని మాత్రమే అర్థం. వారి జ్ఞానం ఆ కాలములో వారి వాస్తవిక అనుభవాల నేపథ్యం ప్రకారం ఉండినది మరియు అదంతా పరిశుద్ధాత్మ నుండే వచ్చిందని ఎవరు నమ్మకంగా చెప్పగలరు? నాలుగు సువార్తలన్నీ పరిశుద్ధాత్మ నుండి వచ్చినవే అయితే, యేసు చేసిన కార్యము గురించి మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకు చెప్పారు? మీరు దీనిని నమ్మకపోతే, ప్రభువును పేతురు మూడుసార్లు ఎలా తిరస్కరించాడో తెలుసుకోవడానికి బైబిల్‌లోని వృత్తాంతాలను చూడండి: వారందరూ భిన్నమైనవారు మరియు వారందరికీ వారివారి సొంత లక్షణాలు ఉన్నాయి. ఎంతోమంది అజ్ఞానంతో, “శరీరధారియైన దేవుడు కూడా మనిషే కాబట్టి ఆయన మాట్లాడే మాటలు పూర్తిగా పరిశుద్ధాత్మ నుండి రాగలవా? పౌలు మరియు యోహాను మాటలలో మానవ చిత్తం సమ్మిళితమై ఉన్నప్పుడు, ఆయన మాట్లాడే మాటలు నిజంగా మానవ చిత్తంతో మిళితం అవ్వలేదా?” అని అంటారు అలాంటి మాటలు చెప్పేవారు అంధులు మరియు అజ్ఞానులు! నాలుగు సువార్తలను జాగ్రత్తగా చదవండి; యేసు చేసిన కార్యము మరియు ఆయన చెప్పిన మాటలను గురించి వారు రాసిన వాటిని చదవండి. ప్రతి వృత్తాంతం ఎంతో సరళంగా భిన్నమైనది మరియు ప్రతిదానికి దాని సొంత దృక్పథం ఉంది. ఈ పుస్తకాల రచయితలు రాసినదంతా పరిశుద్దాత్మ నుండే వచ్చినదైతే, అదంతా సమానంగా మరియు ఏకరూపంగా ఉండాలి. అయితే ఎందుకు వైరుధ్యాలు ఉన్నాయి? మానవుడు దీనిని చూడలేనంత అతి తెలివితక్కువ వాడు కాదా? నిన్ను దేవుడికి సాక్ష్యం ఇవ్వమని కోరితే, నీవు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలవు? దేవుడిని తెలుసుకునే అలాంటి మార్గం ఆయనకు సాక్ష్యమివ్వగలదా? “యోహాను మరియు లూకా రాసిన వాటిలో మానవ చిత్తం కలిసిపోయి ఉంటే, నీ దేవుడు చెప్పిన మాటలలో మానవ చిత్తం కలిసిపోయి ఉండదా?” అని ఇతరులు నిన్ను అడిగితే, నీవు స్పష్టంగా సమాధానం ఇవ్వగలవా? లూకా మరియు మత్తయి యేసు చెప్పిన వాక్యములు విని, యేసు చేసిన కార్యమును చూసిన తర్వాత, యేసు చేసిన కార్యమునకు సంబంధించిన కొన్ని వాస్తవాలను వివరించడానికి వారు తమ సొంత జ్ఞానంతో స్మృతుల ఆధారిత విధానంలో మాట్లాడారు. వారి జ్ఞానం పూర్తిగా పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరచబడిందని నీవు చెప్పగలవా? బైబిల్‌కు బయట, వారి కంటే ఉన్నత జ్ఞానం కలిగిన ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఉండారు, అయితే వారి మాటలను తర్వాతి తరాలు ఎందుకు స్వీకరించలేదు? వారు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఉపయోగించబడలేదా? ఈనాటి కార్యములో, యేసు కార్యపు పునాదిపై ఆధారపడిన నా సొంత అంతర్దృష్టుల గురించిగానీ లేదా యేసు కార్యపు నేపథ్యానికి వ్యతిరేకంగా నా సొంత జ్ఞానం గురించిగానీ నేను మాట్లాడటం లేదని తెలుసుకోండి. ఆ కాలములో యేసు ఏ కార్యము చేశాడు? మరి ఈరోజు నేను ఏ కార్యము చేస్తున్నాను? నేను చేసే మరియు చెప్పేదానికి దృష్టాంతం లేదు. నేను ఈరోజు నడిచే మార్గాన్ని ఇంతకు ముందెన్నడూ ఎవరూ ఉపయోగించలేదు, ఆమార్గంలో గత కాలాలు మరియు తరాలలో ప్రజలు ఎన్నడూ నడవలేదు. ఈరోజు, ఇది ప్రారంభించబడింది, ఈ కార్యము పరిశుద్ధాత్మ చేసినది కాదా? ఇది పరిశుద్ధాత్మ కార్యమే అయినప్పటికీ, గతకాలపు నాయకులందరూ ఇతరుల పునాదిపై తమ కార్యమును కొనసాగించారు; అయితే, దేవుడి కార్యము దానికి భిన్నమైనది. యేసు కార్యపు దశ కూడా అదే: ఆయన ఒక నూతన మార్గాన్ని తెరిచాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన పరలోక రాజ్య సువార్తను బోధించాడు మరియు మానవుడు పశ్చాత్తాపపడాలని మరియు ఒప్పుకోవాలని చెప్పాడు. యేసు తన కార్యమును పూర్తి చేసిన తర్వాత, పేతురు మరియు పౌలు మరియు ఇతరులు యేసు కార్యమును కొనసాగించడం ప్రారంభించారు. యేసు మేకులతో సిలువపై వేలాడదీయబడి, పరలోకానికి వెళ్లిన తర్వాత, సిలువ నిజమైన మార్గాన్ని ప్రచారం చేయడానికి వారు ఆత్మ ద్వారా పంపబడ్డారు. పౌలు మాటలు చాలా గొప్పవిగా చెప్పబడినప్పటికీ, అవి కూడా యేసు చెప్పిన సహనం, ప్రేమ, దుఃఖం, తల కప్పుకోవడం, బాప్టిజం లేదా అనుసరించాల్సిన ఇతర సిద్ధాంతాల పునాదిపై ఆధారపడ్డాయి. ఇదంతా యేసు మాటల పునాదిపై ఆధారపడి చెప్పబడింది. వారు ఒక నూతన మార్గాన్ని తెరవలేకపోయారు, ఎందుకంటే వారంతా దేవుడి ద్వారా ఉపయోగించబడిన మనుషులు.

ఆకాలములో యేసు పలుకులు మరియు కార్యము సిద్ధాంతానికి కట్టుబడి లేవు, ఆయన పాత నిబంధన నియమం కార్యము ప్రకారం తన కార్యమును కొనసాగించలేదు. కృపాకాలములో చేయవలసిన కార్యము ప్రకారమే అది కొనసాగించబడింది. ఆయన తాను ముందుకు తెచ్చిన కార్యము ప్రకారం మరియు తన సొంత ప్రణాళిక ప్రకారం, తన పరిచర్య ప్రకారం శ్రమించాడు; ఆయన పాత నిబంధన నియమం ప్రకారం పని చేయలేదు. ఆయన చేసినదేదీ పాత నిబంధన నియమం ప్రకారం లేదు మరియు ఆయన ప్రవక్తల మాటలను పూర్తిచేసే పనిచేయడానికి రాలేదు. దేవుడి కార్యపు ప్రతి దశ సనాతన ప్రవక్తల భవిష్యవాణులను పూర్తిచేయడం కోసం స్పష్టంగా చేయబడలేదు మరియు ఆయన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం కోసం లేదా సనాతన ప్రవక్తల భవిష్యవాణులను ఉద్దేశపూర్వకంగా నెరవేర్చడం కోసం రాలేదు. అయినా ఆయన చర్యలు సనాతన ప్రవక్తల భవిష్యవాణులకు భంగం కలిగించలేదు లేదా ఆయన గతంలో చేసిన కార్యమునకు భంగం కలిగించలేదు. ఆయన కార్యపు ప్రధాన అంశం ఏ సిద్ధాంతానికీ కట్టుబడకుండా ఉండటం మరియు దానికి బదులుగా తాను స్వయంగా చేయవలసిన కార్యమును చేయడమే. ఆయన ఒక ప్రవక్త లేదా యోగి కాదు, కానీ వాస్తవానికి ఆయన తాను చేయవలసిన కార్యమును చేయడానికి వచ్చిన కర్త మరియు ఆయన తన నూతన శకాన్ని ఆరంభించి, తన నూతన కార్యమును కొనసాగించడానికి వచ్చాడు. నిజమే, యేసు తన కార్యము చేయడానికి వచ్చినప్పుడు, ఆయన పాత నిబంధనలోని సనాతన ప్రవక్తలు చెప్పిన అనేక మాటలను కూడా నెరవేర్చాడు. అలాగే ఈనాటి కార్యము కూడా పాత నిబంధనలోని సనాతన ప్రవక్తల భవిష్యవాణులను నెరవేర్చింది. అయితే నేను ఆ “పాత పంచాంగానికి” అసలు కట్టుబడను, అంతే. ఎందుకంటే, నేను తప్పక చేయాల్సిన కార్యము ఎంతో ఉంది, నేను తప్పక మీతో మాట్లాడాల్సిన మాటలు ఎన్నో ఉన్నాయి, ఈ కార్యము మరియు ఈ మాటలు బైబిల్‌లోని భాగాలను వివరించడాని కంటే ఎంతో ముఖ్యమైనవి, ఎందుకంటే అలా వివరించే పని మీకు గొప్ప ప్రాముఖ్యతగలది లేదా విలువగలది కాదు మరియు అది మీకు సహాయం చేయలేదు లేదా మిమ్మల్ని మార్చలేదు. నేను నూతన కార్యమును బైబిల్‌లోని ఏదైనా భాగాన్ని నెరవేర్చడం కోసం చేయాలనుకోను. బైబిల్‌లోని సనాతన ప్రవక్తల మాటలను నెరవేర్చడం కోసమే దేవుడు భూమి మీదకు వచ్చినట్లయితే, ఎవరు గొప్పవారు, అవతారధారియైన దేవుడా లేదా ఆ సనాతన ప్రవక్తలా? అసలు, దేవుడు ప్రవక్తలకు బాధ్యుడా లేక ప్రవక్తలు దేవుడికి బాధ్యులా? ఈ మాటలను నీవు ఎలా వివరిస్తావు?

మొదట్లో, యేసు తన పరిచర్యను ఇంకా అధికారికంగా నిర్వహించనప్పుడు, ఆయనను అనుసరించిన శిష్యులలాగే, ఆయన కూడా కొన్నిసార్లు సమావేశాలకు వెళ్లాడు, కీర్తనలు పాడాడు, స్తుతించాడు మరియు ఆలయంలో పాత నిబంధనను చదివాడు. ఆయన బాప్టిజం పొంది, లేచాక, పరిశుద్ధాత్మ అధికారికంగా ఆయనపైకి దిగింది మరియు ఆయన గుర్తింపును మరియు ఆయన చేయాల్సిన పరిచర్యను బయలుపరుస్తూ పని చేయడం ప్రారంభించింది. దీనికి ముందు, ఎవరికీ ఆయన గుర్తింపు తెలియదు, మేరీకి తప్ప యోహానుకు కూడా తెలియదు. యేసు బాప్టిజం పొందినప్పుడు ఆయన వయస్సు 29 సంవత్సరాలు. ఆయన బాప్టిజం పూర్తయ్యాక, ఆకాశం తెరుచుకుంది మరియు ఒక స్వరము ఇలా చెప్పింది: “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము.” యేసు బాప్టిజం పొందిన తర్వాత, ఈవిధంగా పరిశుద్ధాత్మ ఆయనకు సాక్ష్యమివ్వడం ప్రారంభించింది. 29 సంవత్సరాల వయస్సులో బాప్టిజం పొందడానికి ముందు, ఆయన ఒక సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని జీవించాడు, తినాల్సినప్పుడు తినడం, మామూలుగా నిద్రపోవడం మరియు దుస్తులు ధరించడం చేశాడు మరియు ఆయనలో ఇతరుల కంటే భిన్నమైనది ఏమీ లేదు, అయితే, ఇదంతా మానవుని భౌతికమైన కళ్లకు మాత్రమే అలా కనిపించింది. ఆయన కూడా కొన్నిసార్లు బలహీనంగా ఉన్నాడు, కొన్నిసార్లు ఆయన కూడా విషయాలను తెలుసుకోలేకపోయాడు, ఇలా బైబిల్‌లో రాసినట్లే: వయస్సుతో పాటు ఆయన వివేకం కూడా పెరిగింది. ఆయనకు ఒక సాధారణ మరియు మామూలు మానవత్వం ఉండేదని, ఆయన ఇతర మామూలు వ్యక్తులకంటే ప్రత్యేకించి భిన్నంగా ఏమీ లేడని మాత్రమే ఈ మాటలు చూపుతున్నాయి. ఆయన కూడా మామూలు మనిషిలాగే పెరిగి పెద్దవాడయ్యాడు, ఆయనలో ప్రత్యేకత ఏదీ లేదు. అయినా ఆయన దేవుడి భద్రత మరియు రక్షణలో ఉన్నాడు. బాప్టిజం పొందిన తర్వాత, ఆయన శోధించబడటం మొదలుపెట్టాడు, ఆతర్వాత ఆయన తన పరిచర్యను మరియు కార్యమును చేయడం ప్రారంభించాడు మరియు శక్తి, జ్ఞానం మరియు అధికారాన్ని పొందాడు. బాప్టిజానికి ముందు ఆయనలో పరిశుద్ధాత్మ పని చేయలేదని లేదా ఆయన లోపల లేదని చెప్పడం దీని అర్థం కాదు. బాప్టిజానికి ముందు కూడా పరిశుద్దాత్మ ఆయన లోపల నివసించింది, కానీ అధికారికంగా పని చేయడం ప్రారంభించలేదు, ఎందుకంటే దేవుడు ఆయన కార్యమును చేసినప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయి, అంతేకాకుండా సాధారణ వ్యక్తులు ఎదగడానికి ఒక సాధారణ ప్రక్రియ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఆయన లోపల నివసించింది. యేసు జన్మించినప్పుడు, ఆయన ఇతరుల కంటే భిన్నంగా ఉన్నాడు మరియు ఒక వేగుచుక్క కనిపించింది; ఆయన జననానికి ముందు, యోసేపు కలలో ఒక దేవదూత కనిపించి, మరియకు ఒక మగ శిశువు జన్మిస్తాడని మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆ శిశువు ఆమె గర్భంలో పడ్డాడని చెప్పాడు. యేసు బాప్తిస్మం పొందిన తరువాత, పరిశుద్ధాత్మ తన కార్యమును ప్రారంభించాడు, అయితే పరిశుద్ధాత్మ యేసుపై దిగివచ్చాడని మాత్రమే దీని అర్థం కాదు. పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయనపై దిగిందనడం ఆయన పరిచర్య అధికారిక ప్రారంభాన్ని సూచిస్తుంది. దేవుడి ఆత్మ అంతకుముందు కూడా ఆయనలో ఉంది, కానీ అది పని చేయడం ఇంకా ప్రారంభించలేదు, ఎందుకంటే దానికి సమయం రాలేదు మరియు ఆత్మ దూకుడుగా పనిచేయడం ప్రారంభించలేదు. బాప్టిజం ద్వారా ఆత్మ ఆయనకు సాక్ష్యమిచ్చింది. ఆయన నీటిలో నుండి లేచినప్పుడు, ఆత్మ ఆయనలో అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది, ఇది శరీరధారియైన దేవుడు ఆయన పరిచర్యను ప్రారంభించాడని, విమోచన కార్యము ప్రారంభించాడని, అంటే కృపాకాలము అధికారికంగా ప్రారంభమైందని సూచించింది. కాబట్టి, ఆయన చేసే కార్యముతో సంబంధం లేకుండా, దేవుడి కార్యానికి ఒక సమయమంటూ ఉంది. బాప్టిజం పొందిన తర్వాత యేసులో ప్రత్యేక మార్పులేవీ లేవు; ఆయన ఇంకా తన అసలు దేహంలోనే ఉన్నాడు. ఆయన తన కార్యాన్ని ప్రారంభించడం మాత్రమే జరిగింది మరియు ఆయన సంపూర్ణ గుర్తింపును బయలుపరిచాడు మరియు ఆయన పూర్తి అధికారం మరియు శక్తి పొందాడు. ఈ విషయంలో ఆయన ఇంతకుముందు కంటే భిన్నంగా ఉన్నాడు. ఆయన గుర్తింపు భిన్నంగా ఉంది, చెప్పేదేమిటంటే ఆయన హోదాలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది; ఇది పరిశుద్ధాత్మ చూపిన సాక్ష్యము, మానవుడు చేసిన పని కాదు. మొదట్లో, ప్రజలకు ఇది తెలియదు, యేసుకు పరిశుద్ధాత్మ ఈవిధంగా సాక్ష్యమిచ్చాకే వారికి కొంచెం తెలిసింది. పరిశుద్ధాత్మ ఆయనకు సాక్ష్యమివ్వడానికి ముందే, స్వయంగా దేవుడి సాక్ష్యం లేకుండా, యేసు గొప్ప కార్యము చేసి ఉంటే, ఆయన ఎంత గొప్ప కార్యము చేసినా, ఆయన గుర్తింపును ప్రజలు ఎప్పటికీ తెలుసుకొని ఉండేవారు కాదు, ఎందుకంటే మానవ నేత్రం దానిని చూడగలిగి ఉండేది కాదు. పరిశుద్ధాత్మ సాక్ష్యపు దశ లేకుండా, ఆయనను ఎవరూ అవతారధారియైన దేవుడిగా గుర్తించగలిగి ఉండేవారు కాదు. పరిశుద్ధాత్మ ఆయనకు సాక్ష్యమిచ్చిన తర్వాత, ఎలాంటి తేడా లేకుండా ఇదే విధంగా యేసు పని చేయడం కొనసాగించి ఉంటే, అప్పుడు దానికి అంత ప్రభావం ఉండి ఉండేది కాదు మరియు ఇందులో పరిశుద్ధాత్మ కార్యము కూడా ప్రధానంగా ప్రదర్శించబడుతుంది. పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చిన తర్వాత, ఆయన దేవుడని, ఆయనలో దేవుడి ఆత్మ ఉందని నీవు స్పష్టంగా చూడగలగడానికి వీలుగా పరిశుద్ధాత్మ తనను తాను చూపించుకోవలసి వచ్చింది; దేవుడి సాక్ష్యం తప్పు కాదు మరియు ఆయన సాక్ష్యం సరైనదని ఇది రుజువు చేయగలిగింది. పరిశుద్ధాత్మ సాక్ష్యమివ్వడానికి ముందు మరియు తర్వాత ఆయన కార్యము ఒకేలా ఉండి ఉన్నట్లయితే, ఆయన అవతార పరిచర్య మరియు పరిశుద్ధాత్మ కార్యము ఆవిష్కరించబడి ఉండేవి కావు, ఫలితంగా మనిషి పరిశుద్ధాత్మ కార్యమును గుర్తించగలిగి ఉండేవాడు కాదు. ఎందుకంటే, అక్కడ ఎలాంటి స్పష్టమైన తేడా ఉండి ఉండేది కాదు. సాక్ష్యమిచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ ఈ సాక్ష్యాన్ని కొనసాగించవలసి వచ్చింది, కాబట్టి అది గత కాలాలకు భిన్నంగా ఉన్న తన జ్ఞానం మరియు అధికారాన్ని యేసులో ప్రదర్శించవలసి వచ్చింది. నిజానికి, ఇది బాప్టిజం ప్రభావం కాదు—బాప్టిజం అనేది ఒక వేడుక మాత్రమే—ఆయన తన పరిచర్యను నిర్వహించడానికి సమయం వచ్చిందని చూపించడానికి బాప్టిజం అనేది ఒక మార్గం మాత్రమే. దేవుడి గొప్ప శక్తిని స్పష్టం చేయడానికి, పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని మరియు చిట్టచివరి వరకు పరిశుద్ధాత్మ ఈ సాక్ష్యానికి బాధ్యత వహిస్తాడని స్పష్టం చేయడానికి అలాంటి పని ఉద్దేశించబడింది. తన పరిచర్యను నిర్వహించడానికి ముందు, యేసు కూడా ప్రబోధాలను విన్నాడు, వివిధ ప్రదేశాలలో సువార్తను ప్రవచించాడు మరియు ప్రచారం చేశాడు. తన పరిచర్యను నిర్వహించే సమయం ఇంకా రాలేదు కాబట్టి మరియు దేవుడు విధేయతతో శరీరంలో తననుతాను దాచుకున్నాడు కాబట్టి, సరియైన సమయం వచ్చే వరకు ఏ కార్యము చేయలేదు కాబట్టి ఆయన ఏ గొప్ప కార్యము చేయలేదు. రెండు కారణాల వలన బాప్టిజానికి ముందు ఆయన పని చేయలేదు: మొదటిది, పని చేయడానికి పరిశుద్ధాత్మ అధికారికంగా ఆయనపైకి దిగలేదు (అంటే, అలాంటి పని చేయడానికి శక్తి మరియు అధికారాన్ని పరిశుద్ధాత్మ యేసుకు ప్రసాదించలేదు) మరియు యేసుకు తన గుర్తింపును గురించి తెలిసినప్పటికీ, తాను తర్వాత చేయాలనుకున్న కార్యమును చేయగలిగి ఉండేవాడు కాదు మరియు తన బాప్టిజం రోజు వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఇది దేవుడి సమయం, ఎవరూ దానిని విభేదించలేరు, స్వయంగా యేసు అయినా; తానే తన పనికి యేసు అంతరాయం కలిగించలేడు. నిజానికి, ఇది దేవుడి విధేయత మరియు దేవుడి కార్యపు ధర్మం; దేవుడి ఆత్మ పని చేయకపోతే, ఆయన పనిని మరెవరూ చేయలేరు. రెండవది, ఆయనకు బాప్టిజం ఇవ్వకముందు, ఆయన చాలా మామూలు మరియు సాధారణ వ్యక్తి, ఇతర మామూలు మరియు సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఏమీలేడు; అవతారధారియైన దేవుడు అతీంద్రియుడు కాదు అని చెప్పడానికి ఇది ఒక కోణం. అవతారధారియైన దేవుడి ఆత్మ చేసిన ఏర్పాట్లతో విభేదించలేదు; ఆయన ఒక క్రమపద్ధతిలో పనిచేశాడు మరియు ఆయన అతి మామూలుగా పనిచేశాడు. బాప్టిజం తర్వాత మాత్రమే ఆయన కార్యానికి అధికారం మరియు శక్తి వచ్చాయి. అంటే, ఆయన అవతారధారియైన దేవుడు అయినప్పటికీ, ఆయన ఎలాంటి అతీంద్రియ కార్యాలను కొనసాగించలేదు మరియు ఆయన ఇతర సాధారణ వ్యక్తులలాగే పెరిగాడు. యేసుకు తన సొంత గుర్తింపు ముందుగానే తెలిసి ఉంటే, తన బాప్టిజానికి ముందే భూవ్యాప్తంగా గొప్ప కార్యము చేసి ఉంటే, యేసు తనను తాను అసాధారణ వ్యక్తిగా చూపిస్తూ సాధారణ ప్రజల కంటే భిన్నంగా ఉండి ఉంటే, యోహానుకు తన కార్యము చేయడం అసాధ్యమై ఉండటం మాత్రమే కాకుండా, దేవుడు తన కార్యపు తదుపరి దశను ప్రారంభించడానికి మార్గం కూడా ఉండేది కాదు. కాబట్టి, అలా జరిగి ఉంటే, అది దేవుడు చేసింది తప్పు అని నిరూపించబడి ఉండేది మరియు దేవుని ఆత్మ మరియు శరీరధారియైన దేవుడు ఇద్దరూ ఒకే మూలం నుండి వచ్చినవారు కాదని మనిషికి అనిపించి ఉండేది. కాబట్టి, బైబిల్‌లో రాయబడిన యేసు కార్యము, ఆయన బాప్టిజం పొందిన తర్వాత కొనసాగించిన కార్యమే, ఈ కార్యము మూడు సంవత్సరాల కాలవ్యవధిలో చేయబడింది. ఆయన బాప్టిజం పొందడానికి ముందు చేసిన కార్యము బైబిల్‌లో రాయబడలేదు, ఎందుకంటే ఆయన బాప్టిజం పొందడానికి ముందు ఈ కార్యము చేయలేదు. ఆయన కేవలం ఒక సాధారణ వ్యక్తి మరియు ఒక సాధారణ వ్యక్తికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు; యేసు తన పరిచర్యను ప్రారంభించడానికి ముందు, ఆయన సాధారణ వ్యక్తుల కంటే ఏమాత్రం భిన్నంగా లేడు మరియు ఇతరులకు ఆయనలో ఎటువంటి తేడా కనిపించలేదు. ఆయనకు 29 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే తాను దేవుడి కార్యపు ఒక దశను నెరవేర్చడానికి వచ్చానని యేసుకు తెలిసింది; దానికి ముందు, ఆయనకు అది తెలియదు, ఎందుకంటే దేవుడు చేసిన కార్యము అతీంద్రియమైనది కాదు. ఆయన పన్నెండేళ్ల వయస్సులో యూదుల ప్రార్థనా సమాజంలో ఒక సమావేశానికి హాజరైనప్పుడు, మరియ ఆయన కోసం వెతుకుతూ ఉండింది, అప్పుడాయన ఎవరైనా ఒక మామూలు పిల్లవాడిలాగే ఒకేఒక వాక్యం అన్నాడు: “అమ్మా! నేను నా తండ్రి చిత్తాన్ని అన్నిటికంటే పైన ఉంచుతానని నీకు తెలియదా?” నిజమే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో పడ్డాడు కాబట్టి, ఏదో ఒక రకంగా యేసు విశిష్టత కలిగి ఉండలేకపోయేవాడా? కానీ ఆయన విశిష్టతకు అర్థం ఆయన అతీంద్రియుడు అని కాదు, అయితే మరెవరైనా చిన్న పిల్లల కంటే ఆయన దేవుడిని ఎక్కువగా ప్రేమించాడని అర్థం. ఆయన మనిషిగా కనిపించినప్పటికీ, ఇప్పటికీ ఆయన గుణగణాలు విశిష్టమైనవి మరియు ఇతరుల కంటే భిన్నమైనవి. అయితే, బాప్టిజం పొందిన తర్వాత మాత్రమే, ఆయనలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నట్లు వాస్తవంగా ఆయన గ్రహించాడు, తానే స్వయంగా దేవుడినని గ్రహించాడు. ఆయనకు 33 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మాత్రమే సిలువ వేయబడే పనిని తన ద్వారా కొనసాగించడాన్ని పరిశుద్ధాత్మ కోరుకుందని ఆయన వాస్తవంగా గ్రహించాడు. 32 సంవత్సరాల వయస్సులో, ఆయన కొన్ని ఆంతరంగిక సత్యాలను తెలుసుకున్నాడు, సరిగ్గా మత్తయి సువార్తలో రాసినట్టు: “అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. (మత్తయి 16:16) మరియు … అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా” (మత్తయి 16:21). ఆయనకు తాను ఏమి చేయవలసి ఉందో ముందుగా తెలియదు, ఒక నిర్దిష్ట సమయంలో తప్ప. ఆయన జన్మించిన వెంటనే ఆయనకు పూర్తిగా తెలియదు; ఆయనలో పరిశుద్ధాత్మ మెల్లమెల్లగా పనిచేసింది మరియు ఆ పనికి ఒక ప్రక్రియ ఉండింది. అతి ప్రారంభంలోనే, తాను దేవుడినని, క్రీస్తునని మరియు అవతారధారియైన మనుష్య కుమారుడినని మరియు సిలువవేయబడే కార్యాన్ని తాను నెరవేర్చాల్సి ఉందని ఆయనకు తెలిసి ఉంటే, ఆయన అంతకు ముందే ఎందుకు పని చేయలేదు? తన పరిచర్య గురించి తన శిష్యులకు చెప్పిన తర్వాతనే యేసు ఎందుకు బాధపడ్డాడు మరియు దీని కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించాడు? ఆయనకు అర్థం కాని అనేక విషయాలను అర్థం చేసుకోవడానికి ముందే ఎందుకు యోహాను ఆయనకు మార్గాన్ని తెరిచి, బాప్టిజం ఇచ్చాడు? ఇది రుజువు చేసేదేమిటంటే, అది దేహరూపంలో ఉన్న అవతారధారియైన దేవుడి కార్యమని, కాబట్టి ఆయన అర్థం చేసుకోవడానికి మరియు సాధించడానికి, ఒక ప్రక్రియ ఉంది, ఎందుకంటే ఆయన దేహరూపంలో ఉన్న అవతారధారియైన దేవుడు కాబట్టి ఆయన కార్యము పరిశుద్ధాత్మ నేరుగా చేసే కార్యము కంటే భిన్నంగా ఉంటుంది.

దేవుడి కార్యపు ప్రతి దశ ఒకేఒక ప్రవాహాన్ని అనుసరిస్తుంది, కాబట్టి దేవుడి ఆరు-వేల యేండ్ల నిర్వహణ ప్రణాళికలో, ప్రపంచానికి పునాది పడినప్పటి నుండి ఈనాటి వరకు ప్రతి దశ ఒకదాని వెంట ఒకటి రావడం జరిగింది. మార్గాన్ని వేసే వారెవరూ లేకపోతే, తర్వాత వచ్చేదానికి ఎవరూ ఉండరు; తర్వాత వచ్చేవారు ఉన్నారు కాబట్టి, మార్గం వేసేవారు కూడా ఉన్నారు. ఈ విధంగా అంచెలంచెలుగా కార్యము కొనసాగుతూ వచ్చింది. ఒక దశ తర్వాత మరొకటి వచ్చింది, మార్గం తెరిచేవారెవరూ లేకుండా, కార్యము ప్రారంభించడం అసాధ్యమయ్యేది మరియు దేవుడికి తన కార్యమును ముందుకు తీసుకెళ్లడానికి మార్గం ఉండేది కాదు. ఏ దశ మరొకదానితో విభేదించదు మరియు ఒక ప్రవాహము ఏర్పడడానికి ఒక దశ తర్వాత మరొకదశ క్రమంగా వస్తుంది; ఇదంతా చేసింది ఒకటే ఆత్మ. అయితే, ఎవరో ఒకరు మార్గాన్ని తెరుస్తారా లేదా మరొకరి కార్యాన్ని కొనసాగిస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా, ఇది వారి గుర్తింపును నిర్ణయించదు. ఇది సరైనది కాదా? యోహాను మార్గాన్ని తెరిచాడు మరియు యేసు తన కార్యాన్ని కొనసాగించాడు, కాబట్టి ఇది యోహాను గుర్తింపు కంటే యేసు గుర్తింపు తక్కువ అని రుజువు చేస్తుందా? యెహోవా తన కార్యాన్ని యేసు కంటే ముందు కొనసాగించాడు, కాబట్టి యేసు కంటే యెహోవా గొప్పవాడని నీవు చెప్పగలవా? వారు మార్గాన్ని ఏర్పరచారా లేక ఇతరుల కార్యాన్ని కొనసాగించారా అనేది ప్రధానం కాదు; ఇక్కడ వారి కార్యపు గుణగణాలు మరియు అది ప్రాతినిధ్యం వహించే గుర్తింపే అత్యంత ప్రధానమైనది. ఇదే సరైనది కాదా? దేవుడు మానవాళి మధ్య పనిచేయాలనుకున్నాడు కాబట్టి, మార్గాన్ని ఏర్పరిచే కార్యము చేయగల వారిని ఆయన మేల్కొలపవలసి వచ్చింది. యోహాను బోధించడం ప్రారంభించినప్పుడే, “ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని” “పర లోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి” అని చెప్పాడు. ఆయన ఆ విధంగా చాలా ప్రారంభంలోనే చెప్పాడు, ఆయన ఈ మాటలను ఎందుకు చెప్పగలిగాడు? ఈ మాటలు మాట్లాడిన క్రమాన్నిబట్టి, పరలోక రాజ్యం గురించి మొదట సువార్త మాట్లాడినది యోహానే, ఆతర్వాత యేసు మాట్లాడాడు. మనిషి ఆలోచనల ప్రకారం, కొత్త మార్గాన్ని తెరిచింది యోహాను, కాబట్టి యోహాను యేసు కంటే గొప్పవాడు. కానీ తాను క్రీస్తునని యోహాను చెప్పలేదు, అతను దేవుడి ప్రియమైన కుమారుడని దేవుడు అతనికి సాక్ష్యమివ్వలేదు, అయితే మార్గాన్ని తెరవడానికి, ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధం చేయడానికి అతన్ని ఉపయోగించాడు. అతడు యేసు కోసం మార్గం ఏర్పాటు చేశాడు, అంతేగానీ యేసు తరపున పని చేయలేకపోయాడు. మనిషి చేసే సమస్తమైన పని కూడా పరిశుద్ధాత్మ ద్వారానే నిర్వహించబడుతుంది.

పాత నిబంధన కాలములో, మార్గంలో ముందుకు నడిపింది యెహోవా, పాత నిబంధన మొత్తం కాలానికి మరియు ఇశ్రాయేలులో చేసిన సమస్త కార్యానికి యెహోవా కార్యము ప్రాతినిథ్యం వహించింది. మోషే కేవలం భూమిపై ఈ కార్యాన్ని కొనసాగించాడు మరియు అతను పడిన శ్రమ మనిషి అందించిన సహకారంగా పరిగణించబడింది. ఆ సమయంలో, మాట్లాడింది మరియు మోషేను పిలిచింది యెహోవానే, ఆయన ఇశ్రాయేలు ప్రజలందరిలో మోషేను లేపాడు మరియు అతడు వారిని అడవిలోకి మరియు కనానుకు నడిపించేలా చేశాడు. ఇది మోషే సొంతంగా చేసిన పని కాదు, దీన్ని యెహోవా స్వయంగా నిర్దేశించాడు, కాబట్టి మోషేను దేవుడు అనలేము. మోషే ధర్మశాస్త్రాన్ని కూడా స్థాపించాడు, అయితే ఈ ధర్మాన్ని యెహోవా స్వయంగా నిర్ణయించాడు. ఆయన కేవలం మోషే దానిని వ్యక్తపరిచేలా చేశాడు. యేసు కూడా ఆజ్ఞలు చేశాడు, ఆయన పాత నిబంధన ధర్మాన్ని రద్దు చేశాడు మరియు నూతన కాలానికి ఆజ్ఞలను ప్రకటించాడు. యేసు స్వయంగా ఎందుకు దేవుడు? ఎందుకంటే ఒక తేడా ఉంది. ఆ సమయంలో, మోషే చేసిన కార్యము ఆ కాలానికి ప్రాతినిధ్యం వహించలేదు లేదా అది నూతన మార్గాన్ని తెరవలేదు; అతను యెహోవాచే ముందుకు నడపబడ్డాడు మరియు కేవలం దేవునిచే ఉపయోగించుకోబడ్డాడు. యేసు వచ్చినప్పుడు, యోహాను మార్గాన్ని ఏర్పరిచే పని చేపట్టాడు మరియు పరలోక రాజ్య సువార్తను వ్యాప్తి చేయడం ప్రారంభించాడు (పరిశుద్ధాత్మ దీనిని ప్రారంభించింది). యేసు వచ్చినప్పుడు, ఆయన నేరుగా తన సొంత కార్యాన్ని చేశాడు, కానీ ఆయన చేసిన పనికి మరియు మోషే చేసిన పనికి ఒక గొప్ప తేడా ఉంది. యెషయా కూడా చాలా భవిష్యవాణులు చెప్పాడు, అయినా అతను స్వయంగా దేవుడు ఎందుకు కాదు? యేసు చాలా ఎక్కువ భవిష్యవాణులు చెప్పలేదు, అయినా స్వయంగా ఎందుకు దేవుడయ్యాడు? ఆ సమయంలో యేసు చేసిన కార్యమంతా పరిశుద్ధాత్మ నుండి వచ్చిందని చెప్పే సాహసం ఎవరూ చేయలేదు లేదా అది మానవుని చిత్తం నుండి వచ్చిందని లేదా అదంతా దేవుడి కార్యమేనని చెప్పే సాహసం కూడా చేయలేదు. అలాంటి విషయాలను వాటిని విశ్లేషించే మార్గం మనిషికి లేదు. యెషయా అటువంటి కార్యము చేశాడని, అలాంటి భవిష్యవాణులు చెప్పాడని మరియు అవన్నీ పరిశుద్ధాత్మ నుండే వచ్చాయని చెప్పవచ్చు; అవి నేరుగా స్వయంగా యెషయా నుండి రాలేదు, కానీ అవి యెహోవా నుండి ప్రత్యక్షత పొందాయి. యేసు ఎక్కువ మొత్తంలో పని చేయలేదు, ఎక్కువ మాటలు చెప్పలేదు లేదా అనేక భవిష్యవాణులు మాట్లాడలేదు. మనిషికి, ఆయన బోధన ప్రత్యేకించి ఉన్నతమైనదిగా అనిపించలేదు, అయినా ఆయన స్వయంగా దేవుడే మరియు దీన్ని మనిషి వివరించలేడు. యోహాను లేదా యెషయా లేదా దావీదును ఎవరూ ఎప్పుడూ విశ్వసించలేదు లేదా వారిని దేవుడనిగానీ, దేవుడైన దావీదు అనిగానీ లేదా దేవుడైన యోహాను అనిగానీ ఎప్పుడూ పిలవలేదు; ఎవరూ ఆవిధంగా మాట్లాడలేదు మరియు కేవలం యేసును మాత్రమే క్రీస్తు అని పిలిచారు. ఈ వర్గీకరణే దేవుడి సాక్ష్యము, ఆయన చేపట్టిన కార్యము మరియు ఆయన నిర్వహించిన పరిచర్య ప్రకారము చేయబడింది. బైబిల్‌లోని గొప్ప వ్యక్తుల విషయానికి వస్తే—అబ్రహం, దావీదు, యెహోషువ, దానియేలు, యెషయా, యోహాను మరియు యేసు—వారు చేసిన కార్యమునుబట్టి, ఎవరు స్వయంగా దేవుడో, ఎవరు ప్రవక్తలో మరియు ఎవరు అపొస్తలులో నీవు చెప్పవచ్చు. ఎవరిని దేవుడు ఉపయోగించాడు మరియు ఎవరు స్వయంగా దేవుడు అనేది వారు చేసిన కార్యపు గుణగణాలు మరియు రకాన్నిబట్టి వేరు చేయబడుతుంది మరియు నిర్ణయించబడుతుంది. నీవు ఆ తేడాను చెప్పలేకపోతే, దేవుడిని విశ్వసించడం అంటే అర్థమేమిటో నీకు తెలియదని అది రుజువు చేస్తుంది. యేసు ఎందుకు దేవుడంటే ఆయన అనేక వాక్యములు చెప్పాడు మరియు ఎంతో కార్యము చేశాడు, ప్రత్యేకించి అనేక అద్భుతాలను ప్రదర్శించాడు. అదేవిధంగా, యోహాను కూడా ఎంతో పని చేశాడు మరియు మోషే మాదిరే అనేక మాటలు చెప్పాడు; అయితే వారిని దేవుడని ఎందుకు పిలవలేదు? ఆదామును నేరుగా దేవుడే సృష్టించాడు; అలాంటప్పుడు అతనిని కేవలం ఒక జీవి అని పిలవడానికి బదులు దేవుడు అని ఎందుకు పిలవలేదు? “ఈరోజు, దేవుడు ఎంతో ఎక్కువ పని చేశాడు మరియు ఎన్నో మాటలు మాట్లాడాడు; ఆయనే స్వయంగా దేవుడు. అలాంటప్పుడు, మోషే కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు కాబట్టి, అతను కూడా తప్పక దేవుడే అయి ఉండాలి!” అని నీతో ఎవరైనా అంటే, దానికి ప్రతిగా నీవు వారిని ఇలా అడగాలి, “ఆ సమయంలో, యేసే స్వయంగా దేవుడని దేవుడు ఎందుకు సాక్ష్యమిచ్చాడు మరి యోహానుకు ఎందుకు ఇవ్వలేదు? యోహాను యేసు కంటే ముందు రాలేదా? ఏది గొప్పది, యోహాను చేసిన కార్యమా లేదా యేసు చేసిన కార్యమా? మనిషికి, యేసు కార్యము కంటే యోహాను కార్యము గొప్పగా కనిపిస్తుంది, అయితే పరిశుద్ధాత్మ యేసుకే ఎందుకు సాక్ష్యమిచ్చింది, యోహానుకు ఎందుకు ఇవ్వలేదు?” అదే ఈరోజు కూడా జరుగుతున్నది! ఆ సమయంలో, మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు, యెహోవా మేఘాల నుండి అతనితో మాట్లాడాడు. మోషే ప్రత్యక్షంగా మాట్లాడలేదు, దానికి బదులుగా నేరుగా యెహోవాచే నడిపించబడ్డాడు. ఇది పాత నిబంధనలోని ఇశ్రాయేలు పని. మోషే లోపల పరిశుద్ధాత్మ గానీ లేదా దేవుడుగానీ లేడు. అతను ఆ పని చేయలేకపోయాడు, కాబట్టి అతను చేసిన పనికి మరియు యేసు చేసిన పనికి మధ్య గొప్ప తేడా ఉంది. ఎందుకంటే, వారు చేసిన పని భిన్నమైనది! ఎవరైనా దేవుడిచేత ఉపయోగించబడ్డారా లేక ప్రవక్తా, అపొస్తలుడా లేదా స్వయంగా దేవుడా అనేదాన్ని అతని కార్యపు స్వభావాన్ని బట్టి గుర్తించవచ్చు మరియు ఇది నీ సందేహాలను తీర్చుతుంది. గొర్రెపిల్ల మాత్రమే ఏడు ముద్రలను తెరవగలదని బైబిల్‌లో రాయబడింది. కాలాల వ్యాప్తంగా, ఆ గొప్ప వ్యక్తులలో గ్రంథాలకు భాష్యం చెప్పినవారు చాలా మంది ఉన్నారు, కాబట్టి వారందరూ గొర్రెపిల్లలని నీవు చెప్పగలవా? వారి వివరణలన్నీ దేవుడి నుండే వచ్చాయని నీవు చెప్పగలవా? వారు కేవలం భాష్యకారులు మాత్రమే; వారికి గొర్రెపిల్లగా గుర్తింపు లేదు. ఏడు ముద్రలను తెరవడానికి వారికి ఎలా యోగ్యత ఎలా ఉండగలదు? “కేవలం గొర్రెపిల్ల మాత్రమే ఏడు ముద్రలను తెరవగలదు” అనేది సత్యం, కానీ ఆయన ఏడు ముద్రలను తెరవడానికి మాత్రమే రాలేదు; అసలు ఈ పని చేయాల్సిన అవసరమే లేదు, ఇది అనుకోకుండా చేయబడింది. ఆయనకు తన సొంత కార్యము గురించి పూర్తి స్పష్టత ఉంది; గ్రంథాలను గురించి భాష్యం చెప్పడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఆయనకు ఉందా? “గ్రంథాలను వివరించే గొర్రెపిల్ల కాలాన్ని” ఆరు వేల యేండ్ల కార్యానికి తప్పక జోడించాలా? ఆయన నూతన కార్యము చేయడానికి వస్తాడు, అయితే ఆరు వేల యేండ్ల కార్యపు సత్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తూ, ఆయన గత కాలపు కార్యము గురించి కూడా కొన్నింటికి ప్రత్యక్షత అందిస్తాడు. బైబిల్‌లోని అనేక భాగాలను వివరించాల్సిన అవసరం లేదు; ఈరోజు చేసే పనే కీలకమైనది, అదే ముఖ్యమైనది. ఏడు ముద్రలను విప్పడానికి దేవుడు ప్రత్యేకంగా రాడని, రక్షణ కార్యము చేయడానికే వస్తాడని నీవు తెలుసుకోవాలి.

అంత్యకాలములో యేసు దిగి వస్తాడని మాత్రమే నీకు తెలుసు, అయితే ఆయన ఖచ్చితంగా ఎలా దిగుతాడు? ఇటీవలే విమోచన పొందిన, మార్చబడని లేదా దేవుడిచే పరిపూర్ణుడుగా చేయబడని మీలాంటి పాపి దేవుడి హృదయాన్ని అనుసరించగలరా? నీ విషయంలో, ఇప్పటికీ నీ పాత స్వభావం కలిగి ఉన్న నీవు, యేసుచే రక్షించబడ్డావు, దేవుడి రక్షణ పొందావు కాబట్టి పాపిగా లెక్కించబడవనేది సత్యము, కానీ ఇది నీవు పాపివి కాదని మరియు కల్మషం కలవాడివి కాదని రుజువు చేయదు. నీవు మార్చబడకపోతే నీవు ఎలా పరిశుద్ధుడివి కాగలవు? లోలోపల, నీవు కల్మషం, స్వార్థం మరియు నీచత్వంతో నిండి ఉన్నావు, అయినా నీవు ఇంకా యేసుతో పాటు అవతరించాలనుకుంటున్నావు—నీవు ఎంత అదృష్టవంతుడై ఉండాలి! దేవుడిపై నీ విశ్వాసం విషయంలో నీవు ఒక్క అడుగు తప్పిపోయావు: నీవు కేవలం విమోచన పొందావు, కానీ మార్పు పొందలేదు. నీవు దేవుడి హృదయాన్ని అనుసరించాలంటే, నిన్ను పరివర్తన చెందించే, ప్రక్షాళన చేసే కార్యాన్ని దేవుడే స్వయంగా చేయాలి; నీవు కేవలం విమోచన మాత్రమే చేయబడితే, నీవు పవిత్రత పొందలేవు. ఈవిధంగా, నీవు మనిషిని నిర్వహించే దేవుడి కార్యములో పరివర్తన చెందించడానికి మరియు పరిపూర్ణుడుగా చేయడానికి కీలకమైన ఒక అడుగు తప్పిపోయావు కాబట్టి, నీవు దేవుడి మంచి ఆశీర్వాదాలను పంచుకోవడానికి యోగ్యుడవు కావు. నీవు ఇప్పుడిప్పుడే విమోచన పొందిన పాపివి కాబట్టి, నేరుగా దేవుడి వారసత్వాన్ని పొందలేవు.

కార్యపు ఈ నూతన దశ ప్రారంభం కాకుండా, సువార్తికులు, బోధకులు, భాష్యకారులు మరియు గొప్ప ఆధ్యాత్మికవేత్తలు అనబడే మీరు ఎంత దూరం వెళ్తారో ఎవరికి తెలుసు! కార్యపు ఈ నూతన దశ ప్రారంభం కాకుండా, మీరు మాట్లాడేది అవ్యవహారికంగా ఉంటుంది! అది సింహాసనాన్ని అధిరోహించడం లేదా రాజుగా మారే హోదాను సంసిద్ధం చేసుకోవడంగానీ; స్వార్థాన్ని నిరాకరించడం లేదా ఎవరైనా తన దేహాన్ని ఆధీనంలో ఉంచుకోవడంగానీ; సహనంతో ఉండటం లేదా అన్నింటి నుండి గుణపాఠాలు నేర్చుకోవడంగానీ; నమ్రత లేదా ప్రేమగానీ అవ్యవహారికం అవుతుంది. ఇది ఒకటే పాత రాగాన్ని ఆలాపించడం లాంటిది కాదా? ఇది ఒకే విషయాన్ని వేరే పేరుతో పిలవడం లాంటిదే! తలను కప్పుకోవడం మరియు రొట్టెను తుంచడంగానీ లేదా చేతులు చాచడం మరియు ప్రార్థించడం గానీ మరియు రోగులను స్వస్థతపరచడం మరియు దయ్యాలను వదిలించడంగానీ. ఇంకా ఏదైనా కొత్త కార్యము ఉండగలదా? అభివృద్ధికి ఏదైనా అవకాశం ఉండగలదా? నీవు ఈవిధంగా ముందుకు కొనసాగితే, నీవు గుడ్డిగా సిద్ధాంతాన్ని అనుసరిస్తావు లేదా సాంప్రదాయానికి కట్టుబడతావు. మీ పని ఎంతో ఉన్నతమైనదని మీరు విశ్వసిస్తారు, కానీ అదంతా కాలం చెల్లినదని, పురాతన కాలపు “వృద్ధులు” బోధించిందని మీకు తెలియదా? మీరు చెప్పేది మరియు చేసేదంతా ఆ వృద్ధులు చివరగా చెప్పిన మాటలు కావా? ఇది ఈ వృద్ధులు మరణించడానికి ముందు బోధించినది కాదా? మీ చర్యలు గత తరాల అపోస్తలులు మరియు ప్రవక్తల చర్యలను అధిగమిస్తాయని మరియు సమస్త విషయాలను కూడా అధిగమించి పోతాయని నీవు అనుకుంటున్నావా? ఈ కార్యపు దశ ప్రారంభం, మీరు కార్యపు ఈ దశలో జోక్యం కలుగజేసుకోకుండా, రాజు కావాలని మరియు సింహాసనం అధిరోహించాలని కోరుకునే సాక్షియైన లీ కార్యాన్ని మీరు ఆరాధించడానికి ముగింపు పలికింది మరియు ఇది మీ అహంకారాన్ని మరియు డంబమును ఆపివేసింది. కార్యపు ఈ దశ లేకుండా, మీరు తిరిగి విమోచన పొందలేనంత లోతుకు కూరుకుపోతారు. మీలో మరీ ఎక్కువ పాతవి ఉన్నాయి! అదృష్టవశాత్తూ, ఈనాటి కార్యము మిమ్మల్ని తిరిగి వెనక్కు తీసుకువచ్చింది; లేకుంటే, మీరు ఏ దిక్కునబడి పోయేవారో ఎవరికి తెలుసు! దేవుడు నిరంతర నూతనుడు మరియు ఎప్పటికీ పాతబడనివాడు కాబట్టి, నీవు కొత్తవాటిని ఎందుకు కోరుకోవు? ఎందుకు నీవు ఎప్పుడూ పాతవాటినే పట్టుకొని వేలాడుతావు? కాబట్టి, ఈనాటి పరిశుద్ధాత్మ కార్యమును తెలుసుకోవడమే అత్యంత ముఖ్యమైనది!

మునుపటి:  ఈరోజు వరకు సమస్త మానవాళి ఎలా అభివృద్ధి చెందిందో నీవు తెలుసుకోవాలి

తరువాత:  మీరు హోదా ఆశీర్వాదాలను పక్కన పెట్టాలి మరియు మనిషికి మోక్షం ఇవ్వడానికి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger