బైబిల్ పరిచయం (4)

అనేకమంది బైబిల్‌ను అర్థం చేసుకోవడం మరియు అన్వయించగలగడం అనేది నిజమైన మార్గాన్ని కనుక్కోవడం లాంటిదని విశ్వసిస్తారు—కానీ వాస్తవానికి, ఇవి నిజంగా అంత సులభమైనవేనా? బైబిల్ వాస్తవికత గురించి ఎవరికీ తెలియదు: అంటే, ఇది దేవుని కార్యపు చారిత్రక నమోదుకు మించి మరేమీ కాదు మరియు దేవుని కార్యపు మునుపటి రెండు దశలకు సంబంధించిన బైబిల్‌లోని ఒక భాగం మరియు ఇది నీకు దేవుని కార్యపు లక్ష్యాలను గురించి ఎటువంటి అవగాహన కలిగించదు. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి ఇది ధర్మశాస్త్ర యుగము మరియు కృపా యుగములోని దేవుని కార్యపు రెండు దశలను నమోదు చేస్తుందని తెలుసు. పాత నిబంధన ఇశ్రాయేలు చరిత్రను మరియు సృష్టి కాలము నుండి ధర్మశాస్త్ర యుగము ముగిసే వరకు యెహోవా కార్యాన్ని కాలక్రమంలో వివరిస్తుంది. కొత్త నిబంధన అనేది భూమి మీద యేసు కార్యాన్ని నమోదు చేస్తుంది, ఇది నాలుగు సువార్తలతో పాటు, పౌలు కార్యములో ఉంది—ఇవి చారిత్రాత్మక నమోదులు కావా? గత విషయాలను నేడు వెలుగులోకి తీసుకురావడం అనేది వాటిని చరిత్రగా మారుస్తుంది మరియు అవి ఎంత నిజమైనవి లేదా యథార్దమైనవైనా, అవి చరిత్ర మాత్రమే—చరిత్ర అనేది వర్తమానం గురించి చెప్పదు, ఎందుకంటే దేవుడు వెనక్కు తిరిగి చరిత్రను చూడడు! కాబట్టి, నీవు బైబిల్‌ను మాత్రమే అర్థం చేసుకుంటే మరియు నేడు దేవుడు చేయాలని తలుస్తున్న కార్యము గురించి అసలేమీ అర్థం చేసుకోకపోతే, మరియు నీవు దేవుడిని విశ్వసించి, పరిశుద్ధాత్మ కార్యాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించకపోతే, అప్పుడు నీకు దేవుణ్ణి అన్వేషించడం అంటే ఏమిటో అర్థం కాదు. ఇశ్రాయేలు చరిత్రను అధ్యయనం చేయడానికి, దేవుడు ఇహ పరలోకాలన్నింటినీ సృష్టించిన చరిత్రను పరిశోధించడానికి నీవు బైబిల్‌ను చదివితే, అప్పుడు నీవు దేవుడిని విశ్వసించవు. కానీ ఈ రోజు, నీవు దేవుడిని విశ్వసిస్తున్నావు మరియు జీవితాన్ని అన్వేషిస్తున్నావు కాబట్టి, నీవు దేవుడిని గురించి జ్ఞానాన్ని అన్వేషిస్తున్నావు మరియు నీవు మృతప్రాయమైన అక్షరతః అర్థాలు మరియు సిద్ధాంతాలను లేదా చరిత్రను అర్థం చేసుకోవడాన్ని అన్వేషించడం లేదు కాబట్టి, నీవు దేవుని నేటి చిత్తాన్ని తప్పక అన్వేషించాలి మరియు నీవు తప్పక పరిశుద్ధాత్మ కార్యపు దిశ కోసం చూడాలి. నీవు ఒక పురావస్తు శాస్త్రవేత్తవు అయితే నీవు బైబిల్ చదవవచ్చు—కానీ నీవు ఆ శాస్త్రవేత్తవు కాదు, నీవు దేవుడిని విశ్వసించే వారిలో ఒకడివి కాబట్టి, నీవు దేవుని నేటి చిత్తాన్ని అన్వేషించడం అత్యుత్తమం. బైబిల్ చదవడం ద్వారా, మహా అయితే నీవు ఇజ్రాయెల్ చరిత్రను కొంచెం అర్థం చేసుకుంటావు, అబ్రాహాము, దావీదు మరియు మోషేల జీవితాల గురించి నీవు తెలుసుకుంటావు, వారు యెహోవాను ఎలా గౌరవించారు, తనను ఎదిరించిన వారిని యెహోవా ఎలా భస్మం చేశాడు మరియు ఆ కాలములో ఆయన ప్రజలతో ఎలా మాట్లాడాడు అనే వాటిని గురించి నీవు తెలుసుకుంటావు. దేవుని గత కార్యము గురించి మాత్రమే నీవు తెలుసుకుంటావు. బైబిల్ నమోదులు ఇశ్రాయేలులోని తొలి ప్రజలు దేవుడిని ఎలా గౌరవించారు మరియు యెహోవా మార్గదర్శకత్వంలో ఎలా జీవించారు అనేవాటికి సంబంధించినవి. ఇశ్రాయేలీయులు దేవుడు ఎంచుకున్న ప్రజలు కాబట్టి, యెహోవాకు విశ్వాసపాత్రులుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ, యెహోవా పట్ల విధేయతతో ఉన్న వారందరినీ ఆయన ఎలా సంరక్షించాడో మరియు ఆశీర్వదించాడో నీవు పాత నిబంధనలో చూడవచ్చు; దేవుడు ఇశ్రాయేలులో పనిచేసినప్పుడు ఆయన కరుణ మరియు ప్రేమతో నిండి ఉండేవాడనీ, అలాగే దహించే జ్వాలలతో ఉండేవాడనీ మరియు అధముల నుండి బలవంతుల వరకు ఇశ్రాయేలీయులందరూ యెహోవాను గౌరవించేవారనీ, కాబట్టి దేశం మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించాడనీ నీవు తెలుసుకోవచ్చు. పాత నిబంధనలో నమోదు చేయబడిన ఇశ్రాయేలు చరిత్ర అటువంటిది మాత్రమే.

బైబిల్ అనేది ఇజ్రాయెల్‌లో దేవుని కార్యానికి సంబంధించిన ఒక చారిత్రక నమోదు మరియు ప్రాచీన ప్రవక్తల అనేక భవిష్యవాణులను, అలాగే ఆ కాలములో యెహోవా తన కార్యములో పలికిన కొన్ని పలుకులను దస్తావేజు చేస్తుంది. కాబట్టి, ప్రజలందరూ ఈ గ్రంథాన్ని పరిశుద్ధమైనదిగా చూస్తారు (ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు మరియు గొప్పవాడు). ఇదంతా యెహోవా పట్ల వారికున్న గౌరవం మరియు దేవుని పట్ల వారికున్న ఆరాధనా భావం ఫలితంగా అనుకోవచ్చు. దేవుడు సృష్టించిన జీవులు వారి సృష్టికర్తను ఎంతో గౌరవించాయి మరియు ఆరాధించాయి కాబట్టి, ప్రజలు ఈ గ్రంథాన్ని ఈ విధంగా మాత్రమే ప్రస్తావించారు మరియు ఈ గ్రంథాన్ని పరలోకపు గ్రంథం అని పిలిచే వారు కూడా ఉన్నారు. వాస్తవానికి, ఇది కేవలం మనుష్యులు చేసిన నమోదు మాత్రమే. ఇది స్వయంగా యెహోవా పేరు పెట్టినది కాదు లేదా దాని సృష్టికి యెహోవా స్వయంగా మార్గనిర్దేశం చేయలేదు. మరో మాటలో చెప్పాలంటే, ఈ గ్రంథ రచయిత దేవుడు కాదు, మనిషే. పరిశుద్ధ బైబిల్ అనేది మనిషి దానికి ఇచ్చిన గౌరవప్రదమైన పేరు మాత్రమే. ఈ పేరు యెహోవా మరియు యేసు పరస్పరం చర్చించుకున్న తర్వాత నిర్ణయించినది కాదు; ఇది మానవ ఆలోచన తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ఈ గ్రంథాన్ని యెహోవా రాయలేదు, యేసు అసలే రాయలేదు. దానికి బదులుగా, ఇవి తరువాతి తరాల వారు పురాతన రాతల గ్రంథంగా సంగ్రహించిన, అనేకమంది ప్రాచీన ప్రవక్తలు, అపొస్తలులు మరియు జ్ఞానులు అందించిన వృత్తాంతాలు, ఇది ప్రజలకు ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథంగా అనిపించింది, దీనిలో భవిష్యత్ తరాలవారు గుట్టు విప్పుతారని ఎదురు చూస్తున్న అనేక అంతుపట్టని, లోతైన రహస్యాలు ఉన్నాయని వారు విశ్వసిస్తారు. అందుచేత, ఈ గ్రంథాన్ని పరలోకపు గ్రంథం అని ప్రజలు మరింతగా విశ్వసించడానికి కూడా ఇష్టపడతారు. నాలుగు సువార్తలు మరియు ప్రకటన గ్రంథం జోడించడంతో, దాని పట్ల ప్రజలకు ఇతర గ్రంథాల కంటే చాలా భిన్నమైన అభిప్రాయం ఉండేది, కాబట్టి ఈ “పరలోకపు గ్రంథాన్ని” శల్యపరీక్ష చేసి చూడడానికి ఎవరూ సాహసించరు, ఎందుకంటే ఇది చాలా “పవిత్రమైనది”.

ప్రజలు బైబిల్‌ను చదివిన వెంటనే, దానిలో ఆచరించడానికి వారు సరైన మార్గాన్ని ఎందుకు కనుక్కోగలుగుతారు? వారికి అర్థంకాని దానిని వారు ఎక్కువగా ఎందుకు పొందగలరు? ఈ రోజు, నేను బైబిల్‌ను ఈ విధంగా శల్యపరీక్ష చేస్తున్నాను, అంటే నేను దానిని ద్వేషిస్తున్నానని లేదా ప్రస్తావించడం కోసం దాని విలువను నేను నిరాకరిస్తున్నాననే అర్థం కాదు. నిన్ను చీకటిలో ఉంచకుండా ఆపడానికి నేను నీకు బైబిల్ సహజ విలువను మరియు మూలాలను వివరిస్తున్నాను మరియు స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు బైబిల్ గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి మరియు అవి చాలా వరకు సరైనవి కావు; ఈ విధంగా బైబిల్ చదవడం అనేది వారు పొందాల్సిన వాటిని పొందకుండా నిరోధించడమే కాకుండా, మరీ ముఖ్యంగా, నేను చేయాలనుకున్న కార్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది భవిష్యత్ కార్యములో విపరీతంగా జోక్యం చేసుకుంటుంది మరియు ప్రయోజనాలను కాకుండా లోపాలను మాత్రమే అందిస్తుంది. కాబట్టి, నేను నీకు బోధిస్తున్నది కేవలం బైబిల్ సారాంశం మరియు దానిలోని అంతర్గత కథ మాత్రమే. నిన్ను బైబిల్ చదవవద్దని లేదా నీకు మాత్రమే బైబిల్ గురించి సరైన జ్ఞానం మరియు దృక్పథం ఉందని, అది విలువ లేనిదని నీవు ప్రకటించాలని నేను కోరడం లేదు. మరీ ఏకపక్షంగా ఉండకు! బైబిల్ మనుష్యులు రాసిన చరిత్ర గ్రంథమే అయినప్పటికీ, ప్రాచీన జ్ఞానులు మరియు ప్రవక్తలు దేవుడిని సేవించిన అనేక సూత్రాలతోపాటు దేవుడిని సేవించడంలో ఇటీవలి కాలంలో అపొస్తలుల అనుభవాలు—అంటే నిజంగా వారు చూసినవి మరియు తెలుసుకున్నవన్నీ కూడా ఇది దస్తావేజు చేస్తుంది, ఇది ఈ కాలపు మనుష్యులు నిజమైన మార్గాన్ని అనుసరించడానికి సందర్భ సామాగ్రిగా ఉపయోగపడవచ్చు. కాబట్టి, బైబిలు చదవడం వల్ల ప్రజలు ఇతర గ్రంథాలలో లేని అనేక జీవన మార్గాలను కూడా పొందవచ్చు. ఈ మార్గాలు గత కాలాలలో ప్రవక్తలు మరియు అపొస్తలులు అనుభవించిన పరిశుద్ధాత్మ కార్యపు జీవన మార్గాలు మరియు ఇందులోని చాలా పదాలు అమూల్యమైనవి మరియు ఇవి ప్రజలకు అవసరమైన వాటిని అందించగలవు. అందుచేతనే, ప్రజలందరూ బైబిల్ చదవడం ఇష్టపడతారు. బైబిల్‌లో ఎన్నో నిగూఢ రహస్యాలు ఉన్నాయి కాబట్టి, దాని పట్ల ప్రజల అభిప్రాయాలు గొప్ప ఆధ్యాత్మికవేత్తల రచనల కంటే భిన్నంగా ఉంటాయి. బైబిల్ అనేది పాత మరియు కొత్త కాలాలలో యెహోవా మరియు యేసును సేవించిన వ్యక్తుల అనుభవాలు, జ్ఞానం యొక్క నమోదు మరియు సంగ్రహం, కాబట్టి తరువాతి తరాలు దాని నుండి ఎంతో జ్ఞానోదయం, ప్రకాశం మరియు ఆచరణ మార్గాలను పొందగలిగారు. ఎవరైనా గొప్ప ఆధ్యాత్మికవేత్త రచనల కంటే బైబిల్ ఉన్నతంగా నిలువడానికి కారణం వారి రచనలన్నీ బైబిల్ నుండి సంగ్రహించబడినవే, వారి అనుభవాలన్నీ బైబిల్ నుండే వచ్చాయి మరియు వారందరూ బైబిల్‌నే వివరిస్తారు. కాబట్టి, ప్రజలు ఎవరైనా గొప్ప ఆధ్యాత్మికవేత్త గ్రంథాల నుండి అనుకూలత పొందగలిగినప్పటికీ, వారు ఇంకా బైబిల్‌ను ఆరాధిస్తారు, ఎందుకంటే వారికది ఎంతో ఉన్నతమైనది మరియు లోతైనదిగా కనిపిస్తుంది! బైబిల్ అనేది పౌలు లేఖలు మరియు పేతురు లేఖలు లాంటి కొన్ని జీవన పాఠాల గ్రంథాలను ఒకచోట చేర్చినప్పటికీ, ఈ గ్రంథాలు ప్రజలకు అనుకూలత మరియు సహాయం చేయగలిగినప్పటికీ, ఈ గ్రంథాలు కాలం చెల్లినవే, అవి ఇప్పటికీ పాత కాలానికి చెందినవే మరియు అవి ఎంత మంచివైనా, అవి ఒక్క కాలానికి మాత్రమే తగినవి మరియు శాశ్వతమైనవి కావు. ఎందుకంటే, దేవుని కార్యము ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మరియు అది పౌలు మరియు పేతురు కాలములో మాత్రమే ఆగిపోలేదు లేదా యేసు సిలువ వేయబడిన కృపా యుగములో ఎల్లప్పుడూ ఉండలేదు. కాబట్టి, ఈ గ్రంథాలు కృపా యుగానికి మాత్రమే తగినవి, అంత్యకాలపు దేవుని రాజ్యకాలానికి తగినవి కావు. అవి కృపా యుగములో విశ్వసించేవారికి మాత్రమే అనుకూలమైనవి, దేవుని రాజ్యకాలములోని సాధువులకు కాదు, అవి ఎంత మంచివైనా, అవి ఇప్పుడు నిరుపయోగమైనవి. ఇది యెహోవా సృష్టి కార్యము లేదా ఇశ్రాయేలులో ఆయన కార్యము విషయంలో కూడా అంతే: ఈ కార్యము ఎంత గొప్పదైనప్పటికీ, దీనికి కాలం చెల్లింది మరియు అది కాలం గడిచేకొద్దీ ఇంకా పాతదై పోతుంది. దేవుని కార్యము కూడా అంతే: ఇది చాలా గొప్పది, కానీ ఇది అంతమయ్యే సమయం వస్తుంది; ఇది ఎల్లప్పుడూ సృష్టి కార్యములో లేదా సిలువ వేయడంలో అలాగే ఉండలేదు. సిలువ వేయడం అనే కార్యము ఎంత నమ్మదగినదైనా, సాతానును ఓడించడంలో అది ఎంత ప్రభావవంతమైనదైనా, కార్యమంటే కార్యమే మరియు కాలాలంటే కాలాలే; కార్యము ఎప్పుడూ ఒకే పునాదిపై ఉండలేదు లేదా కాలాలు ఎప్పుడూ మారలేవు, ఎందుకంటే ఒకప్పుడు సృష్టి ఉండేది మరియు దానికి తప్పక అంత్యకాలము ఉండాలి. ఇది తప్పించుకోలేనిది! ఈ విధంగా, నేడు కొత్త నిబంధనలోని జీవన పాఠాలు—అపొస్తలుల లేఖలు మరియు నాలుగు సువార్తలు—చారిత్రక గ్రంథాలుగా మారాయి, అవి పాత పంచాంగాలుగా మారాయి మరియు పాత పంచాంగాలు ప్రజలను కొత్త కాలములోకి ఎలా తీసుకుపోగలవు? ప్రజలకు జీవితాన్ని అందించడంలో ఈ పంచాంగాలు ఎంత సమర్థవంతమైనవి అయినప్పటికీ, అవి ప్రజలను సిలువ వైపు నడిపించడంలో ఎంత సమర్థవంతమైనవి అయినప్పటికీ, అవి పాతవి కావా? అవి విలువలేనివి కావా? కాబట్టి, నీవు ఈ పంచాంగాలను గుడ్డిగా నమ్మవద్దని నేను చెబుతున్నాను. అవి మరీ పాతవి, అవి నిన్ను కొత్త కార్యము లోనికి తీసుకుపోలేవు మరియు అవి నీపై భారం మాత్రమే మోపగలవు. అవి నిన్ను కొత్త కార్యము లోనికి మరియు కొత్త ప్రవేశం లోనికి తీసుకెళ్లలేకపోవడమే కాకుండా, అవి నిన్ను పాత మతపరమైన చర్చిలలోకి తీసుకెళ్తాయి—అదే జరిగితే, నీకు దేవుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ ఉండదా?

ఎంచుకోబడిన ఇశ్రాయేలు ప్రజలు చేసిన వాటిలో కొన్నింటితో సహా, ఇశ్రాయేలులో దేవుని కార్యము బైబిల్‌లో దస్తావేజు చేయబడింది. చేర్చవలసిన లేదా తొలగించవలసిన కొన్ని భాగాల ఎంపిక ఉందనేది వాస్తవమైనప్పటికీ, పరిశుద్ధాత్మ ఆమోదించనప్పటికీ, ఆయన ఎటువంటి నింద మోపలేదు. బైబిల్ అనేది పూర్తిగా ఇశ్రాయేలు చరిత్ర మాత్రమే కాకుండా, దేవుని కార్యపు చరిత్ర. నిజానికి, యెషయా, దానియేలు మరియు ఇతర ప్రవక్తల భవిష్యవాణులు లేదా యోహాను దర్శనాల గ్రంథాన్ని మినహాయిస్తే—అందులో నమోదు చేసిన వ్యక్తులు, విషయాలు మరియు పనులన్నీ వాస్తవమైనవి, వాటిలో దేనికీ ప్రతీకాత్మక అర్థం లేదు. ఇశ్రాయేలు తొలి ప్రజలు జ్ఞానవంతులు మరియు సంస్కారవంతులు, మరియు వారి పురాతన జ్ఞానం మరియు సంస్కృతి చాలా ఉన్నతమైనది, కాబట్టి వారు రాసినది ఈనాటి వ్యక్తులు రాసే దానికంటే ఉన్నత స్థాయిలో ఉండినది. ఫలితంగా, ఈ గ్రంథాలను వారు రాయగలగడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వారి మధ్యలో యెహోవా చాలా కార్యము చేశాడు మరియు వారు చాలా చూశారు. దావీదు యెహోవా చేసిన కార్యాలను స్వయంగా కళ్లారా చూశాడు, ఆయన వాటిని స్వయంగా అనుభవించాడు, ఎన్నో సంకేతాలను, అద్భుతాలను చూశాడు, కాబట్టి ఆయన యెహోవా పనులను స్తుతిస్తూ ఆ కీర్తనలన్నింటినీ రాశాడు. వారు కొన్ని పరిస్థితులలో ఈ గ్రంథాలను రాయగలిగారు, అంతేగాని, వారికి అసాధారణ ప్రతిభ ఉన్నందు వల్ల కాదు. వారు యెహోవాను చూశారు కాబట్టి ఆయనను స్తుతించారు. మీరు యెహోవాను ఏమాత్రం చూడకపోతే మరియు ఆయన అస్థిత్వాన్ని గురించి మీకు తెలియకపోతే, మీరు ఆయనను ఎలా స్తుతించగలరు? మీరు యెహోవాను చూడకపోతే, మీరు ఆయనను కీర్తిస్తూ పాటలు రాయడం మాట అటుంచి, మీకు ఆయనను స్తుతించడం లేదా ఆయనను ఆరాధించడం తెలియదు మరియు మిమ్మల్ని యెహోవా చేసిన కొన్ని పనులను కనిపెట్టమని కోరినప్పటికీ, మీరు అలా చేయలేరు. ఈ రోజు, మీరు దేవుడిని స్తుతించగలుగుతున్నారు మరియు దేవుడిని ప్రేమించగలుగుతున్నారు అంటే, దానికి కారణం మీరు ఆయనను చూశారు, ఆయన కార్యాన్ని కూడా అనుభవించారు కాబట్టి—మరియు మీ సామర్థ్యం పెరిగితే, మీరు కూడా దావీదు లాగే దేవుడిని స్తుతిస్తూ పద్యాలు రాయలేరా?

ఈ రోజు పరిశుద్దాత్మ ఏమి చేస్తున్నదో అర్థం చేసుకోకుండా, బైబిల్‌ను అర్థం చేసుకోవడం, చరిత్రను అర్థం చేసుకోవడం అనేది—తప్పు! చరిత్రను నీవు బాగా అధ్యయనం చేశావు, తద్వారా నీవు అద్భుతమైన పని చేశావు, కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ చేస్తున్న కార్యము గురించి నీవు ఏమీ అర్థం చేసుకోలేదు. ఇది మూర్ఖత్వం కాదా? ఇతరులు నిన్ను ఇలా అడుగుతారు: “ఈ రోజు దేవుడు ఏమి చేస్తున్నాడు? ఈరోజు నీవు ఎందులోకి ప్రవేశించాలి? నీ జీవిత అన్వేషణ ఎలా సాగుతుంది? నీవు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నావా?” వారు అడిగిన వాటిలో దేనికీ నీ వద్ద సమాధానం ఉండదు—అంటే నీకు ఏమి తెలుసు? నీవు ఇలా అంటావు: “నేను తప్పక దేహం గురించి ఆలోచించడం మానివేసి నన్ను నేను తెలుసుకోవాలని మాత్రమే నాకు తెలుసు.” అప్పుడు వారు “నీకు ఇంకా ఏమి తెలుసు?” అని అడిగితే, నీవు దేవుని ఏర్పాట్లన్నింటినీ అనుసరించాలని కూడా నీకు తెలుసని మరియు నీకు బైబిల్ చరిత్ర గురించి చాలా తక్కువ అవగాహన ఉందని చెబుతావు, అంతే. ఎన్ని సంవత్సరాలు దేవుడిని విశ్వసించడం వలన నీవు పొందినది అంతేనా? నీవర్థం చేసుకున్నది అంతే అయితే, నీకెంతో తెలియదు. అందుచేత, మీ ప్రస్తుత స్థాయి ప్రాథమికంగా మీ నుండి నేను ఆశించింది సాధించలేక పోయింది మరియు తేడా తెలుసుకునే మీ శక్తి సామర్థ్యాలతో సహా, మీరు అర్థం చేసుకున్న సత్యాలు మరీ అత్యల్పం—అంటే, మీ విశ్వాసం బాహ్యమైనది మాత్రమే! మీరు తప్పక ఇంకా ఎక్కువ సత్యాలతో సిద్ధమవ్వాలి, మీకు ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలి, మీరు ఇంకా ఎక్కువ చూడాలి, అప్పుడు మాత్రమే మీరు సువార్తను వ్యాప్తి చేయగలుగుతారు, ఎందుకంటే మీరు సాధించాల్సింది ఇదే!

మునుపటి:  బైబిల్ పరిచయం (3)

తరువాత:  ఆచరణ (2)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger