సంఘ జీవితమును గూర్చి మరియు నిజమైన జీవితమును గూర్చి చర్చించుట
మనుష్యులు సంఘములో మాత్రమే మార్పు చెందగలరని భావిస్తారు. వారు సంఘ జీవితంలో లేకపోయినట్లయితే మార్పు చెందలేరని అనుకుంటారు, అయితే నిజ జీవితంలో పరివర్తన అసాధ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తూ మార్పు చెందలేమన్నట్లుగా భావిస్తుంటారు. మీరు ఇందులో ఏమైనా సమస్యను చూడగలుగుతున్నారా? దేవునిని నిజ జీవితములోకి రావడం గురించి ఇంతకుముందే చర్చించాను; ఎవరైతే దేవునిని నమ్ముతారో, వారికిది దేవుని మాటల నిజతత్వములోనికి ప్రవేశించడానికి మార్గమైయున్నది. నిజానికి, సంఘ జీవితము అనేది వ్యక్తులను పరిపూర్ణం చేయడానికి ఉండే పరిమిత మార్గం మాత్రమే. మనుష్యులు పరిపూర్ణులవడానికి ఇప్పటికీ ప్రధాన వాతావరణం నిజ జీవితమే. ఇటువంటి నిజమైన ఆచరణను గూర్చి మరియు నిజమైన తర్ఫీదును గూర్చి నేను మాట్లాడియున్నాను, తద్వారా ప్రజలు సాధారణ మానవత్వ జీవితాన్ని పొందుకుంటారు మరియు తమ దైనందిన జీవితములో నిజమైన వ్యక్తివలె జీవిస్తారు. ఒక వైపు, దేవుని మాటలను అవగాహన స్థాయిని పెంచుకునే క్రమములో ఒక వ్యక్తి అధ్యయనాన్ని తప్పకుండ చేయాలి, మరియు గ్రహించే సామార్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి. మరొక వైపు, ఆ వ్యక్తి సాధారణ మానవ జీవిత పరమార్థమును మరియు వివేకమును కలిగియుండె క్రమములో మనిషిగా బ్రతకడానికి ప్రాథమిక జ్ఞానము తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటేమనుష్యులు ఇటువంటి అంశాలలో చాలామట్టుకు అవగాహన లేకయున్నారు. అంతేగాకుండా, ఒక వ్యక్తి సంఘ జీవితము ద్వారా దేవుని మాటలను కూడా రుచి చూడాలి, ఆ తరువాత క్రమేపి సత్యాన్ని స్పష్టంగా అర్థము చేసుకొనే స్థితికి రావాలి.
దేవునియందు విశ్వాసముంచిన వ్యక్తి తన జీవితములోనికి దేవుణ్ణి తప్పకుండ తీసుకురావాలని ఎందుకు చెప్పబడింది? సంఘ జీవితం మాత్రమే ప్రజలలో మార్పు తీసుకురాలేదు, మరి ముఖ్యంగా ప్రజలు నిజ జీవితంలోని వాస్తవిక పరిస్థితులోనికి ప్రవేశించాలి. మీరు నిజ జీవితములోని అనేక విషయాలను ఆచరించడానికి, వాటిలో ప్రవేశించడానికి నిర్లక్ష్యం చేస్తూ మీ ఆధ్యాత్మిక స్థితిని గూర్చి మరియు ఆధ్యాత్మిక విషయాలను గూర్చి ఎల్లప్పుడూ మాట్లాడుతుంటారు. నీవు ప్రతీ రోజు వ్రాశావు, ప్రతి రోజు విన్నావు, ప్రతి రోజు చదివావు. ఇంకా వంట చేస్తూ ప్రార్థన చేశావు: “ఓ, దేవా! నీవు నాలో జీవము అవుదువు గాక. ఈ దినము ఏలాగు జరిగినను దయచేసి నన్ను ఆశీర్వదించి జ్ఞానోదయం కలిగించుము. ఈ రోజున నాకు జ్ఞానోదయం కలిగించిన ప్రతి విషయన్ని ఈ క్షణములో అర్థము చేసుకోవడానికి నాకు సహాయము చేయుము, తద్వారా నీ మాటలు నా ప్రాణముగా పనిచేయునుగాక.” నీవు రాత్రి భోజనము చేయునపుడు కూడా ఈ విధముగా ప్రార్థించావు: “ఓ, దేవా! నీవు ఈ ఆహారముతో మమ్మును ఆశీర్వదించావు. నీవు మమ్మును ఆశీర్వదించుము. ఆమెన్! నీ ద్వారా మేము జీవించుదుము గాక. నీవు మాకు తోడై ఉందువు గాక. ఆమెన్!” మీరు మీ రాత్రి భోజనమును ముగించుకొని, పాత్రలను కడుగుచు, “ఓ, దేవా! నేను ఈ పాత్రను. మేము సాతాను వలన చెరపబడియున్నాము, వాడిన పాత్రలవలె ఉన్నాము. మేము నీటితో శుభ్రపరచబడవలెను. నీవు నీటివంటి వాడవు, నీ మాటలు నా ప్రాణమునకు సేదదీర్చే జీవజలములైయున్నవి” అంటూ నీలో నీవు అంటూ అంటావు. అది నీవు తెలుసుకొనే సరికి, పడుకొనే సమయం అవుతుంది, మళ్లి నీలో నువ్వు మాట్లాడుకుంటూ: “ఓ దేవా! నీవు నన్ను ఆశీర్వదించావు, ఈ రోజంతా నన్ను నడిపించావు. నేను నిజముగా నీకు కృతజ్ఞుడను. …” అని చెప్తావు. ఇలా మీరు మీ రోజును గడిపి, నిద్రలోకి జారుకుంటారు. చాలా మంది ప్రతిరోజూ ఇలాగే జీవిస్తున్నారు, ఇలా వారు అసలైన ప్రవేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వారి ప్రార్థనలలో మాట వరుసకు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు. ఇది వారి గత జీవితము—వారి పాత జీవితము. చాలా మంది ఇలాగే ఉంటారు; వారికి ఏ నిజమైన తర్ఫీదు ఉండదు. వారు చాలా తక్కువ రూపాంతరము పొందియుంటారు. వారు కేవలము నోటితో మాత్రమే ప్రార్థనలు చేస్తారు, వారు నోటిమాటల్లో మాత్రమే దేవునికి దగ్గర అవుతారు, కానీ వారికి దేవుని పట్ల లోతైన అవగాహన ఉండదు. మనము ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము—మీ ఇంటిని చక్కబెట్టుకోవడం. మీ ఇల్లు గజిబిజిగా ఉందని మీరు చూస్తూ, అక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నారు: “ఓ, దేవా! ఈ సాతాను నా మీద తీసుకొచ్చిన అవినీతిని చూశావా. ఈ ఇంటిలో ఉన్న చెత్తవలె నేనున్నాను. ఓ, దేవా! నిన్ను నిజముగా స్తుతిస్తూ వందనాలు చెపుతున్నాను. మీ యొక్క రక్షణ మరియు జ్ఞానోదయం లేకపోతే, నేను ఈ వాస్తవాన్ని గ్రహించి ఉండేవాడిని కాదు.” నీవు అక్కడే కూర్చొని సరదాగా గడుపుతూ, చాలా సేపు ప్రార్థనలో గడుపుతూ, ఆ తరువాత ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తావు, ఏలాగంటే నీవు తనలో తాను గొణుగుతూ మాట్లాడుకునే వృద్దురాలివలే ఉంటావు. నిజతత్వపు జీవితములోనికి ప్రవేశించకుండానే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇలా గడుపుతూ ఉంటావు, అనేకమైన ఆచారప్రదమైన అలవాట్లతో జీవిస్తుంటావు! వాస్తవ తర్ఫీదులోనికి ప్రవేశించుటలో వ్యక్తుల నిజ జీవితాలు మరియు వారి ఆచరణాత్మక ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇదొక్కటే వారు మారే మార్గం. నిజమైన జీవితము లేకుండా, ప్రజలు మార్పు చెందలేరు. పైపై పెదవులతో చేసే ప్రార్థనల వలన కలిగే ప్రయోజనము ఏమిటి? మానవ స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే, మనం చేసే ప్రతిదాని ద్వారా సమయం వృధా చేసుకోవడమే అవుతుంది, ఆచరించడానికి మార్గమనేది లేకపోతే, మన ప్రయాసంతా వృధా అవుతుంది! సాధారణ ప్రార్థన ప్రజలు తమ సాధారణ స్థితిని కొనసాగించడంలో సహాయపడుతుంది, కానీ నిజమైన మార్పును వారిలో తీసుకురాదు. మానవుని స్వనీతి, అహంకారం, మోసము, అతి గర్వము, మనిషి యొక్క అవినీతి స్వభావాలను తెలుసుకోవడం—ఈ విషయాల గురించిన అవగాహన ప్రార్థన ద్వారా కలగదు గాని వారు దేవుని మాటలను ఆస్వాదించడం ద్వారానే, వారు నిజ జీవితంలో పరిశుద్ధాత్మ కలిగించే జ్ఞానోదయం ద్వారా తెలుసుకుంటారు. ఈ రోజుల్లో మనుష్యులు చక్కగా మాట్లాడుతారు, వారు ఉన్నతమైన బోధలను వింటారు—ఎన్నో తరాల నుండి ఉన్నతమైన బోధలు వింటారు—కానీ వాటిలో కొన్ని మాత్రమే వారి జీవితాలలో అన్వయించుకుంటారు. ఇంకా చెప్పాలంటే, వారి నిజ జీవితాలలో దేవుడు లేడు; పరివర్తన తర్వాత వారు నూతన జీవం కలిగి ఉండరు. వారు నిజ జీవితంలో యదార్థంగా జీవించరు లేదా నిజ జీవితంలోకి దేవుణ్ణి తీసుకురారు. వారు నరకానికి చెందిన పిల్లలుగా జీవిస్తారు. ఇది స్పష్టముగా దేవుని నుంచి తొలగిపోవడం కాదా?
సాధారణ మనిషి యొక్క రూపమును పునరుద్ధరించడానికి, అంటే, సాధారణ మానవత్వాన్ని సాధించడానికి, మనుషులు తమ మాటలతో దేవుణ్ణి సంతోషపెట్టలేరు. అలా చేయటం వలన వారికి వారే హానిని తలపెట్టుకుంటున్నారు, అలా చేయటం వలన వారి ప్రవేశానికి లేదా వారి రూపాంతరమునకు ఎటువంటి ప్రయోజనం కలుగదు. కాబట్టి, రూపాంతరము చెందడానికి, మనుషులు కొద్దికొద్దిగా సాధన చేయాలి. వారు క్రమేణా దానిలోకి ప్రవేశించి, కొంచెము కొంచెముగా పరిశోధించి, సానుకూలముగా దానిలో ప్రవేశించి, సత్యసంబంధమైన ఆచరణాత్మక జీవితాన్ని జీవించాలి; పవిత్ర జీవితమును జీవించాలి. ఆ తరువాత, నిజమైన విషయాలు, నిజమైన సంఘటనలు, నిజమైన వాతావరణాలు మనుషులు ఆచరణాత్మక తర్ఫీదును పొందేందుకు సహకరిస్తాయి. మనుషులు ఊరికే పైపై మాటలు చెప్పనక్కరలేదు; దానికి బదులుగా, వారు నిజమైన పరిస్థితుల మధ్య శిక్షణ పొందగలగాలి. మనుషులు మొదట వారి శక్తిలేమిని గ్రహించాలి. అప్పుడు వారు దేవుని వాక్యమును సాధారణముగా తిని త్రాగుతారు, అప్పుడు అందులో ప్రవేశించి సులువుగా సాధన చేయగలుగుతారు; ఈ విధముగా మాత్రమే వారు వాస్తవికతను పొందకోగలరు, ఈ విధంగానే వారి ప్రవేశం మరింత వేగముగా జరుగుతుంది. మనుష్యులను రూపాంతరములోనికి నడిపించే క్రమములో, వారు కొంత ఆచరణాత్మకత జీవితాన్ని ఉండాలి; వారు నిజమైన సంఘటనలు, మరియు నిజమైన వాతావరణములో నిజముగా సాధన చేయగలగాలి. ఒక వ్యక్తి కేవలము సంఘ జీవితముపై ఆధారపడి మాత్రమే నిజమైన తర్ఫీదును పొందుకోగలడా? మనుషులు ఈ విధముగా వాస్తవ స్థితిలోనికి ప్రవేశించగలరా? ప్రవేశించలేరు! మనుషులు నిజ జీవితంలోకి ప్రవేశించలేకపోతే, వారు తమ పాత జీవనశైలిని మరియు పనులు చేసే విధానాలను మార్చుకోలేరు. ఇది పూర్తిగా మనుషుల సోమరితనమునుబట్టి, అధిక స్థాయిలో ఆధారపడటం వల్ల వచ్చింది కాదు కానీ మనుషులకు జీవించే సామర్థ్యం లేకపోవడం వల్లనే వచ్చింది, అంతేకాకుండా, ఒక సాధారణ మనిషిని గూర్చిన దేవుని విలువ గురించి అవగాహన ఉండదు. గతములో మనుషులు ఎల్లప్పుడు మాట్లాడుతూ, చెపుతూ, సమాచారము తెలియపర్చుకుంటూ ఉండేవారు—మరియు వారు “వక్తలు” కూడా అయ్యారు—అయినప్పటికీ వారిలో ఎవరును తమ జీవన విధానములో మార్పును కోరుకోలేదు; దానికి బదులుగా, వారు గుడ్డిగా లోతైన సిద్ధాంతాలను కోరుకున్నారు. కాబట్టి, ఈ తరము మనుషులు తమ జీవితాల్లో దేవునిపై మతపరమైన విశ్వాసాన్ని మార్చుకోవాలి. వారు ఒక సంఘటన, ఒక విషయం, ఒక వ్యక్తిపై దృష్టి పెట్టడం ద్వారా ఆచరణలోకి ప్రవేశించాలి. వారు దానిపై దృష్టి కేంద్రీకరించాలి—అప్పుడే వారు ఫలితాలను సాధించగలరు. మనుషుల రూపాంతరము వారి స్వభావ మార్పుతో ప్రారంభమవుతుంది. మనుషుల జీవనశైలి, వారి సోమరితనము, ఆధారపడటము, బానిసత్వము అనేటువంటి అంశాలపై స్వభావ మార్పు లక్ష్యంగా పని చేయగలిగితేనే మనుషులలో పరివర్తన కలుగుతుంది.
సంఘ జీవితము కొన్ని భాగాలలో ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దాని తాళపు చెవి మనుష్యులు తమ నిజమైన జీవితము రూపాంతరము చెందుటలోనే ఉంది. నిజ జీవితము లేకుండా ఒకని పాత స్వభావము రూపాంతరము చెందదు. మనము ఉదాహరణకు తీసుకున్నట్టయితే, కృపా కాలములో యేసుప్రభువు వారు చేసిన కార్యమే. యేసు ప్రభువు వారు మునుపటి చట్టాలను రద్దు చేసి, కొత్త యుగపు ఆజ్ఞలను స్థాపించినప్పుడు, అయన నిజ జీవితములో జరిగే ఉదాహరణలు తీసుకొని మాట్లాడారు. యేసు ప్రభువు తన శిష్యులను సబ్బాతు దినమున గోధుమ పొలములో తీసుకు వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యులు ఆకలి వేసినప్పుడు తినడానికి ధాన్యపు గింజలను తెంచుకున్నారు. పరిసయ్యులు ఇది చూసి వీరు సబ్బాతు దినమును ఆచరించుట లేదు అని మాట్లాడుకున్నారు. వారు సబ్బాతు దినమున గోయ్యిలో పడిన లేగదూడను రక్షించడానికి మనుషులకు అనుమతి లేదని చెప్పి, సబ్భాతు దినమున ఏ పనియు చేయరాదని అన్నారు. యేసు ప్రభువు కొత్త యుగపు ఆజ్ఞలను క్రమముగా ప్రకటించడానికి ఈ సంఘటనలను ఉదహరించాడు. ఆ సమయములో అనేకమైన వాస్తవ పద్దతులను ప్రజలు అర్థము చేసుకోడానికి, పరివర్తన తీసుకురావడానికి ఉపయోగించాడు. పరిశుద్ధాత్మ ఈ సూత్రము ద్వారా తన పనిని జరిగిస్తారు, కేవలము ఇలానే మనుషులు రూపాంతరము చెందుతారు. ఆచరణాత్మక పద్ధతులు లేకుండా, మనుషులు సైద్ధాంతిక మరియు మేధోపరమైన అవగాహనను మాత్రమే పొందగలరు గాని ఇది ఏ మాత్రము ఫలభరితమైన రూపాంతరము కాదు. కాబట్టి తర్ఫీదు ద్వారా ఒకరు జ్ఞానమును, వివేకమును ఎలా పొందగలరు? మనుషులు వినడము, చదవడము, వారి తెలివిని అభివృద్ధి పరుచుకోవడము ద్వారా తమ జ్ఞానమును వివేకమును సంపాదించుకోగలరా? ఇది ఎలా సాధ్యము? మనుషులు అర్థము చేసుకొని తమ నిజ జీవితములో అనుభవాన్ని గడించాలి! అందుకే ఒకడు తర్ఫీదు పొంది, తన నిజమైన జీవితము నుండి తొలగిపోకూడదు. మనుషులు వివిధ అంశాలలో శ్రద్ధ వహిస్తూ వాటిలో ప్రవేశాన్ని కలిగి ఉండాలి: విద్య స్థాయి, భావవ్యక్తీకరణ, సంగతులను చూసే సామర్థ్యం, వివేచన, దేవుని మాటలను అర్థము చేసుకోగల సామర్థ్యం, మానవాళికి సంబంధించిన ఇంగితజ్ఞానము వాటి నియమాలు మరియు మానవాళికి సంబంధించిన ఇతర విషయాలను మనుషులు తప్పనిసరిగా సిద్ధపరచుకోవాలి. వాటిపై అవగాహన వచ్చిన తరువాత, మనుషులు ప్రవేశంపై దృష్టి పెట్టాలి, అపుడే రూపాంతరమును పొందుకోగలరు. ఎవరైనా ఆ అవగాహనలోకి వచ్చి, వారు ఆచరణను నిర్లక్ష్యము చేసినట్లయితే, రూపాంతరము ఎలా జరుగుతుంది? ప్రస్తుతము, వారు అర్థము చేసుకొని, నిజమైన జీవితములో అలా జీవించడములేదు; అందుచేత, వారు దేవుని ముఖ్యమైన మాటల గురించి తక్కువ అవగాహన కలిగి ఉన్నారు. నీకు స్వల్పముగా మాత్రమే జ్ఞానోదయమైంది; నీవు పరిశుద్ధాత్మ నుండి కొంచెము ప్రకాశాన్ని పొందగలిగావు, కానీ నిజ జీవితములో ఆచరణాత్మక మార్గములో ప్రవేశమును పొందలేదు—లేక నీవు ఆచరణాత్మకమైన ప్రవేశమును గూర్చి పట్టించుకోవట్లేదు—కాబట్టి నీవు రూపాంతరము చెందే ప్రక్రియ తగ్గిపోతుంది. ఇలా చాలా కాలము అయిపోయిన తరువాత, మనుషులకు చాలా అర్థము అవుతుంది. వారు తమకు తెలిసిన సిద్ధాంతాలను గురించి చాలా మాట్లాడుతారు, కానీ వారి బాహ్య వైఖరి అలాగే ఉంటుంది, వారి అసలైన సామర్థ్యము అలాగే ఉంటుంది, కొంచము కూడా ముందుకు సాగలేరు. ఇటువంటి పరిస్థితులలో చివరకు నీవెప్పుడు ఆచరణాత్మక మార్గములోనికి ప్రవేశిస్తావు?
సంఘ జీవితము అనేది దేవుని మాటలను ఆస్వాదించడానికి మనుషులు కూడుకొను ఒక రకమైన జీవితము మాత్రమే, అది వారి జీవితములో ఒక చిన్న భాగము మాత్రమే. మనిషి నిజ జీవితము కూడా వారి సంఘ జీవితములాగా ఉంటే—సాధారణ ఆధ్యాత్మిక జీవితంతో సహా, సాధారణముగా దేవుని మాటలను ఆస్వాదించడము, సాధారణ రీతిలో ప్రార్థించడము, ఆయనకు దగ్గరగా వుండడము, దేవుని చిత్తానికి అనుగుణముగా ప్రతీది నిర్వహించబడే నిజమైన జీవితాన్ని గడపడం, ప్రతీది సత్యానికి అనుగుణముగా నిర్వహించబడే నిజ జీవితాన్ని గడపడము, ప్రార్థనను అభ్యసించి దేవుని ముందు నిశ్శబ్దముగా ఉండటము అనే సాధన చేయడం ద్వారా నిజ జీవితాన్ని గడపడం, కీర్తనలు పాడటం మరియు నృత్యం చేయడం—ఇలాంటి జీవితము మాత్రమే దేవుని మాటల జీవితములోనికి తీసుకువస్తాయి. చాలా మంది మనుషులు సంఘములో ఎన్ని గంటలు ఉన్నామనే దానిపై మాత్రమే దృష్టి సారిస్తారు, వారి బాహ్య జీవితము గురించి ఏ మాత్రమును “పట్టించుకోరు”, ఇది వారికి ఏ మాత్రమును పట్టింపులోనికి రాదు. దేవుని మాటలను తినేటప్పుడు మరియు త్రాగేటప్పుడు మాత్రమే పరిశుద్ధుల జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, పాటలు పాడుతూ లేక ప్రార్థన చేస్తూ, ఆపై వారు ఆ సమయానికి వెలుపల తమ పాత స్వభావాలకు తిరిగి వెళ్తారు. ఇలా జీవించడము వలన ఏ మాత్రమును రూపాంతరము చెందరు, వారికి దేవుడు చాలా తక్కువగా తెలుసు, దేవుణ్ణి నమ్మడములో, వారు తమ స్వభావమును రూపాంతరము పొందుకోవాలని అనుకుంటే, అప్పుడు వారు తమ నిజ జీవితము నుండి తొలగిపోకూడదు. నిజమైన జీవితములో, నీ గురించి నీవు తెలుసుకోగలగాలి, నిన్ను నీవు విడిచి పెట్టుకోవాలి, సత్యాన్ని అనుసరించాలి, అలాగే నీవు క్రమంగా పరివర్తన సాధించడానికి ముందు అన్ని నియమాలను పాటిస్తూ, ఇంగితజ్ఞానం, స్వీయ ప్రవర్తన నియమాలను నేర్చుకోవాలి. నీవు కేవలము సైద్ధాంతిక జ్ఞానముపై దృష్టి ఉంచి, వాస్తవానికి లోతుగా వెళ్లకుండా మతపరమైన వేడుకల మధ్య మాత్రమే జీవిస్తే, నిజమైన జీవితములోకి ప్రవేశించకుండా నీవు ఎప్పటికీ వాస్తవికతలోకి ప్రవేశించలేవు; నిన్ను నీవు తెలుసుకోలేవు, సత్యాన్ని గాని లేక దేవుణ్ణి గాని తెలుసుకోవడం అసంభవం, అంతేగాకుండా నీవు ఎప్పటికీ గుడ్డితనములోను, అజ్ఞానములోనే ఉండిపోతావు. మనుషులను రక్షించే దేవుడి పని ఏమిటంటే, వారిని కొంతకాలం తర్వాత సాధారణ మానవ జీవితాలను గడపడానికి అనుమతించడం కాదు, లేదా వారి తప్పుడు ఆలోచనలు మరియు సిద్ధాంతాలను మార్చడం కాదు. అలా కాకుండా, మనుషుల పాత జీవన విధానాన్ని పూర్తిగా మార్చడం, అలాగే వారి పాత ఆలోచనా విధానాలను మరియు మానసిక దృక్పథాన్ని మార్చడం, తద్వారా వారి పాత స్వభావాలను మార్చడమే దేవుని ఉద్దేశం. కేవలము సంఘ జీవితము మార్పు చెందడముపై దృష్టి పెట్టినట్టైతే మనుషుల పాత జీవన అలవాట్లు మారవు, ఇంకా వారు చాలా కాలముగా జీవించిన పాత పద్ధతులలో మార్పు ఉండదు. ఏది ఏమైనప్పటికి, మనుషులు వారి నిజ జీవితములో నుంచి వెళ్లిపోకూడదు. కేవలము సంఘజీవితములోనే కాకుండా, నిజ జీవితంలో మనుషులు సాధారణ మానవత్వంతో జీవించాలని దేవుడు కోరుకుంటాడు; కేవలము సంఘ జీవితములోనే కాదు; వారి నిజజీవితములో సత్యాన్ని బయలుపర్చాలి, అలాగే వారు నిజ జీవితంలో తమ విధులను నిర్వర్తించాలి. వారు వాస్తవ స్థితిలోనికి ప్రవేశించడానికి, ప్రతిదానిని నిజ జీవితము వైపుకు మరల్చుకోవాలి. ఒకవేళ, దేవుణ్ణి విశ్వసించడము వలన, నిజ జీవితంలోకి ప్రవేశించడము ద్వారా ప్రజలు తమను తాము తెలుసుకోలేకపోతే, వారు నిజ జీవితంలో సాధారణ మానవత్వంతో జీవించలేకపోతే, వారు ఓడిపోయినవారుగా మిగిలిపోతారు. ఎవరైతే దేవునికి అవిధేయత చూపుతారో వారు నిజమైన జీవితములోకి ప్రవేశించలేరు. వారందరు మానవత్వము గురించి మాట్లాడుతారు కానీ దయ్యాల స్వభావముతో జీవిస్తారు. వారందరూ సత్యాన్ని గురించి మాట్లాడుతారు కానీ సిద్ధాంతాల ప్రకారము జీవిస్తారు. సత్యమైన జీవితాన్ని ఎవరైతే నిజ జీవితములో జీవించలేరో వారు, దేవుణ్ణి నమ్ముతారు కానీ దేవుని చేత అసహ్యించబడి, తిరస్కరించబడుతారు. నీవు నిజ జీవితంలో ఆచరణాత్మక మార్గమున ప్రవేశించి, సాధన చేయాలి, నీ బలహీనతలను తెలుసుకోగలగాలి, నీ అజ్ఞానమును మరియు నీ అసాధారణ మానవత్వపు బలహీనతలను తెలుసుకోగలగాలి. ఈ విధముగా, నీకున్న అవగాహన వాస్తవ స్థితి మరియు క్లిష్ట పరిస్థితులతో ఏకీకృతమవుతుంది. కేవలము ఇలాంటి జ్ఞానము మాత్రమే నిజమైనది, మరియు నీ స్వంత స్థితిని నిజముగా గ్రహించడానికి, స్వభావపరమైన రూపాంతరమును పొందడానికి ఈ జ్ఞానము సహాయపడుతుంది.
ఇప్పుడు మనుష్యులను పరిపూర్ణులుగా చేయడం అధికారికంగా మొదలైంది కనుక నీవు నిజ జీవితంలోకి తప్పక ప్రవేశించాలి. తద్వారా, రూపాంతరము చెందడానికి, నీవు నిజ జీవితములోనికి ప్రవేశించిన క్షణము నుండి ఆరంభించాలి. ఆ తరువాత క్రమేపి పరివర్తన చెందాలి. నీవు సాధారణ మానవ జీవితాన్ని తప్పించుకుని, ఆధ్యాత్మిక అంశాల గురించి మాత్రమే మాట్లాడితే, అప్పుడు విషయాలు పొడిగా, ఏ మాత్రం పస లేకుండా ఉంటాయి; అవి అవాస్తవం అవుతాయి; అప్పుడు మనుష్యులెలా రూపాంతరం చెందుతారు? నిజమైన అనుభవం పొందేందుకు పునాదిగా, నీవు సాధన చేసేందుకు నిజ జీవితంలోకి అడుగు పెట్టాలి. దీనిని మనుష్యులు తప్పనిసరిగా చేయాలి. పరిశుద్ధాత్ముని ముఖ్యమైన కార్యము ఏమనగా మార్గదర్శకం చేయడం వరకే, మిగిలినది మనుష్యుల ప్రవేశం, సాధనపై ఆధారపడి ఉంటుంది. అందరూ వేర్వేరు మార్గాల ద్వారా నిజ జీవితంలోకి ప్రవేశించి, తద్వారా వారు దేవునిని నిజ జీవితంలోకి ఆహ్వానించి, నిజమైన సాధారణ మానవత్వ జీవితాన్ని జీవిస్తారు. ఇది మాత్రమే అర్థవంతమైన జీవితం అనిపించుకుంటుంది.