పేతురు యేసును ఎలా తెలుసుకున్నాడు

పేతురు యేసుతో గడిపిన కాలంలో, అతను యేసులో చాలా ప్రేమగల లక్షణాలను, అనుకరణకు అర్హమైన అనేక అంశాలను మరియు అతని అవసరతలను తీర్చిన అనేక అంశాలను చూశాడు. పేతురు యేసులో దైవమును అనేక విధాలుగా చూసినప్పటికీ, చాలా ప్రేమగల లక్షణాలను గుర్తించినప్పటికీ, అతనికి మొదట యేసును గురించి తెలియదు. పేతురు తన 20 సంవత్సరాల వయస్సులో యేసును వెంబడించుటకు ప్రారంభించాడు, అతను ఆరు సంవత్సరాలు ఆయనను వెంబడించాడు. ఆ సమయంలో, అతను ఎన్నడూ యేసును తెలుసుకోలేదు; పేతురు పూర్తిగా యేసును కేవలం అభిమానంతో వెంబడించాడు. గలిలయ సముద్రం ఒడ్డున యేసు మొదటిసారిగా తనను పిలిచినప్పుడు, ఆయన ఇలా అడిగాడు: “సిమోను బర్ యోనా, నీవు నన్ను వెంబడిస్తావా?” పేతురు ఇలా అన్నాడు: “నేను పరలోకపు తండ్రి ద్వారా పంపబడిన వానినే వెంబడించాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తినే నేను గుర్తించాలి. నేను నిన్ను వెంబడిస్తాను.” ఆ సమయంలో, పేతురు అప్పటికే యేసు అనే వ్యక్తి గురించి విని ఉన్నాడు—అతడు ప్రవక్తలలో గొప్పవాడు, దేవుని ప్రియమైన కుమారుడు అని తెలుసుకొనియున్నాడు మరియు పేతురు నిరంతరం ఆయనను కనుగొనాలని ఆశిస్తూ, ఆయనను చూసే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు (ఎందుకంటే అతను పరిశుద్ధాత్మ ద్వారా అలా నడిపించబడ్డాడు). పేతురు ఆయనను ఎన్నడూ చూడనప్పటికీ మరియు ఆయన గురించి పుకార్లు మాత్రమే విన్నప్పటికీ, క్రమంగా అతని హృదయంలో యేసుపట్ల ఆతురత మరియు ఆరాధన భావం పెరిగింది మరియు అతను ఒక రోజున యేసును చూస్తాననే ఆశను కలిగియుండేవాడు. మరి పేతురును యేసు ఎలా పిలిచాడు? “గలిలయ సముద్రానికి వెళ్లు, అక్కడ సీమోను బర్ యోనా అనే వ్యక్తి ఉన్నాడు” ఆని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశించబడినప్పటికీ ఆయన పేతురు అనే వ్యక్తి గురించి వినియుండెను. ప్రజలు సీమోను బర్ యోనా అనే వ్యక్తి యొక్క ప్రసంగాన్ని విన్నారని, అతను కూడా పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడని మరియు అతనిని విన్న ప్రజలందరూ కన్నీళ్లతో కదలింపబడ్డారని ఎవరో చెప్పడం యేసు విన్నాడు. ఇది విన్న తర్వాత, యేసు ఆ వ్యక్తిని వెదకుతూ గలిలయ సముద్రముకు వెళ్లెను; పేతురు యేసు పిలుపును అంగీకరించిన ఆ క్షణమే, అతను ఆయనను వెంబడించాడు.

అతను యేసును అనుసరించే సమయంలో, పేతురు ఆయనను గూర్చి అనేక అభిప్రాయాలను ఏర్పరచుకొని, ఎల్లప్పుడూ తన స్వంత దృష్టికోణము నుండి ఆయనను ఒక అంచనా వేసుకునేవాడు. పేతురుకు ఆత్మను గురించిన ఒక స్థాయి అవగాహనను కలిగి ఉన్నప్పటికీ, అతని అవగాహనలో కొంతమట్టుకు అస్పష్టత ఉంది, అందుకే, “నేను పరలోకపు తండ్రి ద్వారా పంపబడిన వానిని వెంబడించాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని నేను తప్పక అంగీకరించాలి” అని అతను అన్నాడు. యేసు చేసిన క్రియలు అతనికి అర్థం కాలేదు మరియు వాటిని గురించిన స్పష్టత లేదు. పేతురు కొంతకాలం ఆయనను వెంబడించిన తర్వాత, ఆయన చేసిన క్రియలపై, చెప్పిన సంగతుల విషయమై, మరియు యేసు వ్యక్తిత్వముపై ఆసక్తిని పెంచుకున్నాడు. ప్రేమ మరియు గౌరవం అనే రెండు విషయాలను యేసు పురికొల్పాడని అతను భావించాడు; అతను ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో ఉండటానికి మరియు యేసు మాటలను వినడానికి ఇష్టపడిన తరువాతే అతనికి సహాయ సహకారాలు అందాయి. అతను యేసును వెంబడించిన కాలంలో, పేతురు ఆయన జీవితం గురించిన ప్రతిదీ గమనించి, ఆయన చర్యలు, మాటలు, కదలికలు మరియు హావభావాలను హృదయానికి హత్తుకున్నాడు: యేసు సాధారణ మనుషులవలె లేడనే లోతైన అవగాహన అతనికి కలిగింది. యేసు యొక్క మానవ రూపం చాలా సాధారణమైనప్పటికీ, ఆయన మానవుని పట్ల ప్రేమ, కరుణ మరియు సహనమనే సుగుణాలతో నిండి ఉన్నాడు. ఆయన చేసిన క్రియలైన లేదా చెప్పిన ప్రతిదీ ఇతరులకు గొప్ప సహాయాన్ని చేకూరుస్తాయి, మరియు పేతురు ఇంతకు ముందెన్నడూ చూడని వాటిని, లేదా పొందని వాటిని యేసులో చూసాడు మరియు ఆయన నుండి పొందాడు. యేసుకు గొప్ప స్థితి లేకపోయినా, లేదా ఆయన అసాధారణమైన మానవునిగా ఉండకపోయినా అతను ఆయనలో చూశాడు, ఆయన గురించి అతను నిజమైన అసాధారణ తత్వాన్ని మరియు గొప్ప విశేష భావాన్ని కలిగియున్నాడు. పేతురు దానిని పూర్తిగా వివరించలేనప్పటికీ, యేసు అందరికంటే విభిన్నంగా నడుచుకున్నాడని అతను చూడగలిగాడు, ఎందుకంటే ఆయన చేసిన కార్యములు సాధారణ మనుష్యులు చేసే క్రియలకంటే చాలా భిన్నంగా ఉండేవి. పేతురుకు యేసుతో పరిచయం ఉన్నప్పటి నుండి, యేసు నడవడి లేక యేసు ప్రవర్తన సాధారణ మానవునికి భిన్నంగా ఉందని గమనించాడు. ఆయన ఎల్లప్పుడూ స్థిరంగా వ్యవహరించాడు మరియు ఎప్పుడూ తొందరపాటుతోగాని, అతిశయోక్తితోగాని లేదా ఒక విషయాన్ని తక్కువగా కనుపరచడం గాని చేయలేదు, ఆయన తన నడవడిని లేక ప్రవర్తనను సాధారణమైనదిగాను మరియు అద్భుతమైనదిగాను ప్రత్యక్షపరచుకొన్నాడు. సంభాషణలో, యేసు చాలా సాధారణంగా కృపతో మాట్లాడాడు మరియు ప్రశాంతంగా నవ్వుతూ సంభాషించేవాడు, అయినప్పటికీ ఆయన తన కార్యమును నిర్వహిస్తున్నప్పుడు ఆయన తన హుందాతనాన్ని ఎన్నడూ కోల్పోలేదు. యేసు కొన్నిసార్లు మౌనంగా ఉండేవాడని, మితభాషి అని, మరికొన్నిసార్లు ఎడతెగక మాట్లాడుతున్నాడని పేతురు చూశాడు. కొన్నిసార్లు ఆయన తుళ్ళిపడి ఉల్లాసంగా ఉండే పావురంలా ఎంతో సంతోషంగా కనిపించేవాడు, మరికొన్ని సార్లు ఆయన దుఃఖముతో నిండిన తల్లివలె వేదనతో కనిపిస్తూ, మాట్లాడకుండా ఎంతో విచారంతోను బాధతోనూ కనిపించేవాడు. కొన్నిసార్లు ఆయన శత్రువును చంపడానికి ధైర్యముతో నిండిన ఒక సైనికుడిలా కోపంతో నిండియుండేవాడు, లేక కొన్ని సందర్భాల్లో ఆయన గర్జించు సింహమువలె ఉండేవాడు. కొన్నిసార్లు ఆయన నవ్వేవాడు; ఇతర సమయాల్లో ప్రార్థించేవాడు మరియు ఏడ్చేవాడు. యేసు ఎలా ప్రవర్తించినా, పేతురు ఆయనపట్ల అపరిమితమైన ప్రేమను మరియు గౌరవాన్ని పెంచుకున్నాడు. యేసు నవ్వు అతనిని సంతోషంతో నింపింది, యేసు దుఃఖం అతనిని దుఃఖంలోకి నెట్టింది, యేసు కోపం అతనికి భయాన్ని పుట్టించింది, అయితే ఆయన కనికరము, క్షమాగుణము మరియు ఖండితమైన ప్రవర్తన అనునవి ప్రజలు యేసును నిజముగా ప్రేమించునట్లు, ఆయనపట్ల నిజమైన భక్తిని మరియు వాంఛను వృద్ధి చేసుకొనునట్లు చేశాయి. అయితే, పేతురు యేసుతో కలిసి కొన్నేళ్లు జీవించిన తర్వాతే క్రమంగా వీటన్నింటిని గ్రహించాడు.

పేతురు ప్రత్యేకించి సున్నితమైన వ్యక్తి, సహజమైన తెలివితేటలతో జన్మించాడు, అయినప్పటికీ అతను యేసును వెంబడించేటప్పుడు చాలా బుద్ధిహీనపు పనులు చేశాడు. ఆరంభంలోనే, యేసును గురించి కొన్ని ఆలోచనలు కలిగి, అతను ఇలా అడిగాడు: “ప్రజలు నీవు ప్రవక్త అని అంటున్నారు, కాబట్టి నీవు ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు, విషయాలు అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, నీవు దేవుడవని నీకు తెలుసా? నీవు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించావని నీకు తెలుసా?” ఆ ప్రశ్నలకు యేసు ఇలా జవాబిచ్చాడు: “లేదు, నాకు తెలియదు. నేను సాధారణ వ్యక్తిలా నీకు కనిపించడం లేదా? నేను అందరిలాగే సాధారణ మనిషిగానే ఉన్నాను. తండ్రి పంపే వ్యక్తి సాధారణ వ్యక్తే గాని, అసాధారణ వ్యక్తి కాదు. నేను చేసే కార్యము నా పరలోకపు తండ్రిని సూచించినా, నేను, నా వ్యక్తిత్వ౦, మరియు ఈ భౌతిక శరీరము, నా పరలోకపు తండ్రిని పూర్తిగా సూచించవు గాని ఆయనలో ఒక భాగాన్ని మాత్రమే సూచిస్తాయి. నేను ఆత్మ నుండి వచ్చినప్పటికీ, నేను సాధారణ వ్యక్తినే, మరియు నా తండ్రి నన్ను ఈ భూమికి అసాధారణమైన వ్యక్తిగా పంపలేదు కాని, సాధారణ వ్యక్తిగానే పంపాడు.” పేతురు ఇది వినిన తర్వాతే యేసును గురించి కొంత అవగాహన ఏర్పడింది. యేసు చేసిన కార్యమును గూర్చి, ఆయన బోధను గూర్చి, ఆయన కాపరత్వమును గూర్చి, మరియు ఆయన నిలదొక్కుకునే విధానమును గూర్చి లెక్కలేనంత సమయాన్ని గడిపి, వాటిని చూచిన తర్వాత మాత్రమే అతను చాలా లోతైన అవగాహనను పొందాడు. యేసు తన 30వ సంవత్సరంలో ఉన్నప్పుడు, పేతురుతో తన రాబోయే సిలువ మరణాన్ని గురించి చెప్పాడు, మరియు అతను మానవాళిని విమోచించడానికి ఒక కార్యమును చేయడానికి వచ్చానని చెప్పాడు, అనగా సిలువ కార్యమును చేయడానికి వచ్చానని చెప్పాడు. సిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత, మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడనీ, లేచిన 40 రోజుల వరకు ప్రజలకు కనిపిస్తాడని కూడా యేసు పేతురుతో చెప్పాడు. ఈ మాటలు విన్నప్పుడు, పేతురు విచారించి, ఈ మాటలను మనసుకు తీసుకున్నాడు; అప్పటి నుండి, యేసుకు మరింత దగ్గరయ్యాడు. కొంత కాలం ప్రత్యక్షానుభవము తర్వాత, యేసు చేసినదంతా దేవునికి సంబంధించినదని పేతురు గ్రహించి, యేసు అసామాన్యమైన ప్రేమగలవాడని భావించాడు. అతను ఈ అవగాహనకు వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్దాత్ముడు తన అంతరంగమును వెలిగించాడు. ఆ సమయంలో యేసు తన శిష్యుల వైపు మరియు ఇతర అనుచరులవైపు తిరిగి ఇలా అడిగాడు: “యోహాను, నన్ను గురించి నీవు ఏమని అనుకుంటున్నావు?” అందుకు యోహాను, “నీవు మోషే” అని జవాబిచ్చాడు. ఆయన లూకా వైపు తిరిగి: “లూకా, నన్ను ఏమని అని అనుకుంటున్నావు?” అని అడిగాడు, అందుకు లూకా, “నీవు ప్రవక్తలలో గొప్పవాడవు” అని జవాబిచ్చాడు. ఆయన ఒక సోదరిని కూడా ఇలా అడిగాడు, అందుకు ఆమె, “యుగయుగాలలో ప్రవచించిన ప్రవక్తలలో నీవు గొప్పవాడవు. నీ ప్రవచనాలకంటే ఎవరి ప్రవచనాలు గొప్పవి కావు, లేదా నీ కంటే ఎక్కువ జ్ఞానం ఎవరికీ లేదు; నీవు ప్రవక్తవి” అని జవాబునిచ్చింది. అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, “పేతురు, నేనెవరినని నీవు చెప్పుచున్నావు?” అని అడిగాడు. అందుకు పేతురు, “నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు. నీవు పరలోకం నుండి వచ్చావు. నీవు భూమికి చెందినవాడవు కాదు. నీవు దేవుడు చేసిన సృష్టివలె చేయబడలేదు. మేము భూమిపై ఉన్నాము మరియు నీవు మాతో ఇక్కడ ఉన్నావు, కానీ నీవు పరలోకమునకు చెందినవాడవు గాని ఈ లోకమునకు చెందినవాడవు కాదు, భూమికి చెందినవాడవు కాదు” అని జవాబునిచ్చాడు. అతను పొందిన అనుభవం ద్వారా, పరిశుద్ధాత్ముడు అతనిని వెలిగించి ఈ గ్రహింపును కలిగించాడు. అతనికి ఈ జ్ఞానోదయం కలిగిన తర్వాత, యేసు చేసిన ప్రతిదానిని మరింత ఎక్కువగా మెచ్చుకున్నాడు, ఆయన మరెక్కువగా ప్రేమించదగినవాడని భావించాడు మరియు యేసు నుండి విడిపోవడానికి అతని హృదయంలో ఎప్పుడూ ఇష్టపడలేదు. కాబట్టి, యేసు సిలువ వేయబడి పునరుత్థామైన తర్వాత మొదటిసారిగా పేతురుకు తనను తాను బయలు పరచుకొన్నపుడు, పేతురు అమితమైన ఆనందంతో ఇలా అరిచాడు: “ప్రభూ! నీవు తిరిగి లేచావు!” అప్పుడు, పేతురు ఏడుస్తూ, చాలా పెద్ద చేపను పట్టుకుని, దానిని వండి యేసుకు వడ్డించాడు. యేసు నవ్వాడు, కానీ మాట్లాడలేదు. యేసు పునరుత్థానమయ్యాడని పేతురుకు తెలిసినప్పటికీ, దానిలోని మర్మాన్ని అర్థం చేసుకోలేదు. అతను యేసుకు తినడానికి చేపను ఇచ్చినప్పుడు, యేసు దానిని తిరస్కరించలేదు, మాట్లాడలేదు మరియు తినడానికి కూర్చోలేదు. బదులుగా, ఆయన హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఇది పేతురుకు అపారమైన దిగ్భ్రాంతిని కలిగించింది మరియు పునరుత్థానమైన యేసు మునుపటి యేసుకు భిన్నమైనవాడని అప్పుడే పేతురుకు అర్థమైంది. ఒకసారి పేతురు దీనిని తెలుసుకున్నాక, దుఃఖపడ్డాడు, మరియు ప్రభువు తన కార్యమును పూర్తి చేశాడని తెలుసుకొని అతను ఎంతో ఆదరణ పొందాడు. యేసు చేయవచ్చిన తన కార్యమును పూర్తి చేశాడని, ఆయన మనుష్యులతో గడిపే సమయం ముగిసి౦దని, అప్పటి నుండి మనుష్యులు ఆయన (యేసు) దారిలో నడవాలని తెలుసుకున్నాడు. “పాత్రలో ఉన్నటువంటి చేదు పానీయాన్ని నేను త్రాగినట్లుగానే నీవు కూడా త్రాగాలి (పునరుత్థానం తర్వాత యేసు చెప్పినది ఇదే). నేను నడిచిన మార్గములో నీవు కూడా నడవాలి. నీవు నా కోసం నీ ప్రాణాలను కూడ అర్పించాలి” ఇప్పటివలె కాకుండా, ఆ కాలంలో ముఖాముఖి సంభాషణలు జరుగలేదు. కృపా యుగంలో, పరిశుద్ధాత్మ కార్యము ప్రత్యేకంగా మరుగు చేయబడినందున, పేతురు చాలా కష్టాలను అనుభవించాడు. కొన్నిసార్లు, పేతురు ఆక్రోశంగా: “దేవా! నాకు ఈ జీవితం తప్ప మరేమీ లేదు. ఇది నీకు అంతగా విలువైనది కానప్పటికీ, నేను దీనిని నీకు ప్రతిష్టించాలని అనుకుంటున్నాను. మానవులు నిన్ను ప్రేమించటానికి అనర్హులైనప్పటికి, వారి ప్రేమ, హృదయాలు నిరర్ధకములైనప్పటికీ, మానవుల హృదయాలలో కోరిక నీకు తెలుసని నేను నమ్ముతున్నాను. మరియు మానవ శరీరాలు నీ అంగీకారమునకు అనుగుణంగా లేనప్పటికీ, నీవు నా హృదయాన్ని అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను” అని చెప్పేవాడు. ఇలా ప్రార్థనలు చేయడం అతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి, “నేను నా హృదయాన్ని పూర్తిగా దేవునికి ప్రతిష్టించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను దేవుని కోసం ఏమీ చేయలేనప్పటికీ, నేను విధేయతతో దేవుని సంతృప్తి పరచడానికి మరియు హృదయపూర్వకంగా ఆయనకు ప్రతిష్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు నా హృదయాన్ని చూస్తాడని నేను నమ్ముతున్నాను” అని ఇలాంటి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసినప్పుడు మరింత ఎక్కువ ప్రోత్సాహాన్ని పొందుకోనేవాడు. “నేను నా జీవితంలో ఏమీ కోరను గాని, దేవుని పట్ల నా ప్రేమ మరియు నా హృదయ వాంఛలను దేవుడు అంగీకరించాలి. నేను చాలా కాలం ప్రభువైన యేసుతో ఉన్నాను, అయినప్పటికీ నేను ఆయనను ఎన్నడూ ప్రేమించలేదు; ఇది నాకున్న అతి పెద్ద ఋణం. నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికీ, ఆయనను తెలుసుకోలేదు, మరియు నేను ఆయన వెనుక సంగతులు కూడా మాట్లాడాను. ఈ విషయాల గురించి ఆలోచిస్తే నేను ప్రభువైన యేసుకు మరింత రుణపడి ఉంటాను” అని పేతురు చెప్పాడు. “నేను దుమ్ము ధూళికంటే అతి తక్కువవాడను. నమ్మదగిన ఈ హృదయాన్ని దేవునికి అంకితం చేయడం తప్ప నేను ఏమి చేయగలను” అని అతను ఎల్లప్పుడూ ఈ విధంగా ప్రార్థించేవాడు.

పేతురు అనుభవాలలో అంతిమ ఘట్టం ఒకటి ఉండేది, అతని శరీరము పూర్తిగా కృంగిపోయినప్పుడు యేసు అతనిని తన అంతరంగములో ధైర్యపరుస్తూ ఉండేవాడు. మరియు ఒకసారి యేసు పేతురుకు కనపడ్డాడు. అతని హృదయం వేదనతో నిండిపోయి, విపరీతమైన బాధలో ఉన్నప్పుడు, యేసు అతనితో, “నీవు భూమిపై నాతో కూడ ఉన్నావు, నేను ఇక్కడ నీతో ఉన్నాను. మరియు మనం పరలోకంలో కలిసి ఉండకముందు, ఇది కేవలం ఆధ్యాత్మిక లోకానికి చెందినది. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక లోకానికి తిరిగి వచ్చాను మరియు నీవు భూమిపై ఉన్నావు, ఎందుకంటే నేను భూమికి చెందినవాడిని కాదు, మరియు నీవు కూడా భూమికి చెందినవాడవు కానప్పటికీ, నీవు నీ విధిని నెరవేర్చాలి. దాసునిగా నీవు, నీ బాధ్యతను తప్పక నిర్వర్తించాలి” అని చెప్పాడు. తాను తిరిగి దేవుని వద్దకు వెళ్తాడని వినడం అనేది పేతురుకు ఎంతో ఓదార్పునిచ్చింది. ఆ సమయంలో, పేతురు దాదాపు మంచం పట్టిన స్థితిలో చాలా వేదనలో ఉన్నాడు; అతను ఈ విధముగా చెప్పుచూ “నేను బ్రష్టుడను నేను దేవుణ్ణి సంతృప్తి పరచలేకపోయాను” అని ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు యేసు అతనికి ప్రత్యక్షమై, “పేతురు, నీవు ఒకసారి నా వద్ద చేసిన తీర్మానాన్ని మరచిపోయావా? నేను చెప్పినవన్నీ నీవు నిజంగా మర్చిపోయావా? నీవు నాతో చేసిన తీర్మానాన్ని నీవు మర్చిపోయావా?” అని అడిగాడు. మాట్లాడుచున్నది యేసు అని చూసి, పేతురు తన మంచం మీద నుండి లేచాడు, మరియు యేసు అతనిని చూసి, “నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు, నేను ఇదివరకే నీకు చెప్పాను—ఇది నీవు అర్థం చేసుకోవాలి, కానీ నేను నీతో చెప్పిన మరొక విషయం మర్చిపోయావా? ‘నీవు కూడా భూమికి గాని, లోకానికి గాని చెందినవాడవు కాదు.’ ప్రస్తుతం, నీవు చేయాల్సిన పని ఉంది. నీవు ఇలా దుఃఖించి బాధపడకూడదు. మానవులు మరియు దేవుడు ఒకే లోకంలో కలిసి ఉండలేనప్పటికీ, నేను చేయవలసిన పని నాకు మరియు నీవు చేయవలసిన పని నీకు ఉంది, మరియు ఒక రోజు నీ పని పూర్తయినప్పుడు, మనము ఒకే రాజ్యంలో కలిసి ఉంటాము మరియు ఎప్పటికీ నాతోనే ఉండునట్లు నేను నిన్ను నడిపిస్తాను” అని ఆదరించాడు. ఈ మాటలు విన్న తర్వాత పేతురు ఆదరించబడి, ఈ బాధ తాను ఓర్చుకుని అనుభవించాల్సిందేనని తెలిసికొని, అప్పటి నుంచి స్ఫూర్తిని పొందాడు. ప్రతి కీలక సమయాల్లో యేసు అతనికి ప్రత్యక్షమవుతూ, ప్రత్యేకమైన రీతిలో అతనికి జ్ఞానోదయం కలుగజేస్తూ, మార్గదర్శకమునిస్తూ, అతని పట్ల చాలా కార్యము జరిగించాడు. మరియు పేతురు ఎక్కువగా పశ్చాత్తాపపడిన విషయం ఏమిటి? “నీవు సజీవుడైన దేవుని కుమారుడవు” అని చెప్పిన కొద్దిసేపటికే, యేసు పేతురుకు మరో ప్రశ్న వేశాడు (బైబిల్‌లో ఇదేవిధంగా వ్రాయబడనప్పటికీ). యేసు అతనితో, “పేతురు! నీవు ఎప్పుడైనా నన్ను ప్రేమించావా?” అని అడిగాడు. పేతురు ఆ ఉద్దేశ్యాన్ని గ్రహించి ఇలా అన్నాడు: “ప్రభూ! నేను ఒకప్పుడు పరలోకంలో ఉన్న తండ్రిని ప్రేమించాను, కానీ నేను నిన్ను ఎన్నడూ ప్రేమించలేదని అంగీకరిస్తున్నాను.” అప్పుడు యేసు, “ప్రజలు పరలోకంలో ఉన్న తండ్రిని ప్రేమించకపోతే, భూమిపై ఉన్న కుమారుడిని ఎలా ప్రేమించగలరు? మరియు తండ్రియైన దేవుడు పంపిన కుమారుడిని ప్రజలు ప్రేమించకపోతే, వారు పరలోకంలో ఉన్న తండ్రిని ఎలా ప్రేమించగలరు? ప్రజలు భూమిపై ఉన్న కుమారుడిని నిజంగా ప్రేమిస్తే, వారు పరలోకంలో ఉన్న తండ్రిని కూడా నిజంగానే ప్రేమిస్తారు” అని చెప్పాడు. పేతురు ఈ మాటలు విన్నప్పుడు, తన లోపమేమిటో అతడు గ్రహించాడు. “నేను ఒకప్పుడు పరలోకంలో ఉన్న తండ్రిని ప్రేమించాను, కానీ నేను నిన్ను ఎన్నడూ ప్రేమించలేదు.” యేసు పునరుత్థానుడై, ఆరోహణమైన తర్వాత, అతను ఈ మాటలను జ్ఞాపకము చేసుకొని వేదనతో మరింత ఎక్కువగా దుఃఖపడ్డాడు. అతను గతాన్ని తలచుకుంటూ మరియు ప్రస్తుత స్థితిని గుర్తుచేసుకుంటూ, అతను తరచుగా ప్రార్థనలో యేసు వద్దకు వచ్చి, దేవుని చిత్తానికి అనుగుణంగా లేనందుకు, మరియు దేవుని ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా ఎల్లప్పుడూ పశ్చాత్తాపము చెందుతూ, నేను ఆయనకు ఋణస్థుడనని అనుకునేవాడు. ఈ సమస్యలు అతనికి అతిపెద్ద భారంగా మారాయి. “ఒక రోజు నన్నూ, నా కున్నదంతా, నా వద్ద నున్న అత్యంత విలువైనదంతా నీకు ఇస్తాను” అని అతను చెప్పాడు. మరలా అతను, “దేవా! నాకు ఒకే విశ్వాసం, ఒకే ప్రేమ వున్నాయి. నా ప్రాణానికి విలువ లేదు, నా శరీరానికి విలువ లేదు. నాకు ఒకే విశ్వాసం, ఒకే ప్రేమ వున్నాయి. నా మనసులో నీపై నాకు విశ్వాసం ఉంది మరియు నా హృదయంలో నీ పట్ల ప్రేమ ఉంది; ఈ రెండూ తప్ప నీకివ్వడానికి మరేమీ లేదు” అని చెప్పాడు. పేతురు యేసు మాటల ద్వారా ఎంతో ప్రోత్సహించబడ్డాడు, ఎందుకంటే యేసు సిలువ వేయబడకముందు, అతను పేతురుతో, “నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు, మరియు నీవు కూడా ఈ లోకానికి చెందినవాడవు కాదు” అని చెప్పాడు. తర్వాత, పేతురు చాలా బాధను అనుభవిస్తున్నప్పుడు, “పేతురు, నీవు మర్చిపోయావా? నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు, నా పని కోసమే నేను ఇంతకు ముందు బయలుదేరాను. నీవు కూడా ఈ లోకానికి చెందిన వాడవు కాదు, నువ్వు ఈ విషయాన్ని మరచిపోయావా? నేను నీకు రెండుసార్లు చెప్పాను, నీకు గుర్తులేదా?” అని యేసు అతనికి జ్ఞాపకం చేశాడు. అది విన్న పేతురు: “నేను మరచిపోలేదు!” అని చెప్పాడు. అప్పుడు యేసు, “నీవు ఒకసారి పరలోకంలో నాతో సంతోషంగా గడిపావు మరియు నా పక్కన కొంత సమయం గడిపావు. నీవు నేను ఒకరికొకరు ఎడబాటు కలిగియున్నాము. సృష్టించబడినవి నా దృష్టిలో చెప్పుకోదగిన విషయాలు కానప్పటికీ, నిర్దోషమైన మరియు ప్రేమగల వ్యక్తిని నేను ఎలా ప్రేమించకుండా ఉండగలను? నీవు నా వాగ్దానాన్ని మరచిపోయావా? భూమిపై నేను ఇచ్చిన ఆదేశాన్ని నీవు అంగీకరించాలి; నేను నీకు అప్పగించిన పనిని నీవు తప్పక నెరవేర్చాలి. ఒక రోజు నేను ఖచ్చితంగా నిన్ను నా వద్దకు నడిపిస్తాను” అని చెప్పాడు. ఇది విన్న తర్వాత, పేతురు మరింత ప్రోత్సహించబడి, మరింత గొప్ప ప్రేరణ పొందాడు, అందునుబట్టియే అతను సిలువపై ఉన్నప్పుడు, “దేవా! నేను నిన్ను తగినంతగా ప్రేమించలేదు, నీవు నన్ను చనిపోవాలని కోరినప్పటికీ, చాలినంతగా ప్రేమించలేదు. నీవు నా ఆత్మను ఎక్కడికి పంపినా, నీవు నీ గత వాగ్దానాలను నెరవేర్చినా, నెరవేర్చకపోయినా, తర్వాత ఏమి చేసినా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నీయందు విశ్వాసముంచుచున్నాను” అని చెప్పగలిగాడు. అతను తన విశ్వామును మరియు నిజమైన ప్రేమనే చేపట్టాడు.

ఒక సాయంత్రం, పేతురుతో సహా అనేకమంది శిష్యులు యేసుతో కలిసి చేపలు పట్టే పడవలో ఉన్నారు, మరియు పేతురు యేసును ఒక సరళ ప్రశ్నను అడిగాడు: “ప్రభూ! నాకు చాలా కాలంగా వేధిస్తున్న ఒక ప్రశ్నను నేను నిన్ను అడగాలనుకుంటున్నాను” అందుకు యేసు “అయితే దయచేసి అడుగు!” అని జవాబిచ్చాడు. అప్పుడు పేతురు, “ధర్మశాస్త్ర యుగంలో చేసిన కార్యము నీవు జరిగించిందేనా?” అని అడిగాడు. యేసు చిరునవ్వుతో, “ఈ పిల్లవాడు ఎంత అమాయకుడో!” అని చెప్పసాగాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా, “అది నాది కాదు. అది యెహోవా మరియు మోషే చేసిన కార్యము” అని చెప్పాడు. పేతురు ఆ మాటను విని “ఓ! ఇది నీవు చేసినది కాదా” అని అన్నాడు. పేతురు ఇలా చెప్పగానే యేసు ఇక మాట్లాడలేదు. పేతురు తనలో తాను, “ఆ కార్యమును చేసింది నీవు కాదు, కాబట్టి నీవు ధర్మశాస్త్రాన్ని అంతం చేయడానికి రావడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అది నీవు చేసినది కాదు” అని తనలో తాను అనుకున్నాడు. అతని హృదయం కూడా తేలికైంది. ఆ తర్వాత, పేతురు చాలా అమాయకుడని యేసు గ్రహించి, ఆ సమయంలో అతనికి అవగాహన లేనందున, యేసు ఇంకేమీ మాట్లాడలేదు, లేదా నేరుగా అతనిని ఖండించలేదు. ఒకసారి యేసు ఒక సమాజ మందిరంలో ప్రసంగించాడు, అక్కడ పేతురుతో సహా చాలా మంది ఉన్నారు. యేసు తన ప్రసంగంలో, “కృపా యుగంలో సర్వ మానవాళిని పాపం నుండి విమోచించడానికి శాశ్వత కాలం నుండి నిత్యత్వము వరకు వున్నవాడు విమోచించును, కాని మానవుని పాపము నుండి బయటకు రప్పించుటలో ఆయన ఏ నియమాలతో నిర్బంధించబడడు. అతను ధర్మశాస్త్రము నుండి బయటికి వచ్చి కృపా యుగంలోకి ప్రవేశిస్తాడు. ఆయన సర్వ మానవాళిని విమోచిస్తాడు. ఆయన ధర్మశాస్త్ర యుగం నుండి కృప యుగంలోనికి ప్రవేశిస్తాడు, కానీ ఆయన యెహోవా యెద్ద నుండి వచ్చినవాడని ఎవరూ ఎరుగరు. మోషే చేసిన పనిని యెహోవా ఆమోదించాడు; యెహోవా చేసిన పనిని బట్టి మోషే ధర్మశాస్త్రాన్ని రూపొందించాడు” అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత, ఆయన “కృపా యుగంలో, కృపాయుగం యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించిన వారు విపత్తును ఎదుర్కొంటారు. వారు ఆలయంలో నిలబడి దేవుని ఉగ్రతను పొందుతారు, అప్పుడు అగ్ని వారిపైకి వస్తుంది”. ఈ మాటలు పేతురుపై కొంత ప్రభావం చూపింది మరియు అతని అనుభవంలో కొంత కాలం పాటు, పేతురుకు యేసు కాపరిగా ఉండి, అతనిని సంరక్షించాడు, అతనితో హృదయపూర్వకంగా మాట్లాడాడు, తద్వారా పేతురుకు యేసును గురించి మెరుగైన అవగాహన కలిగింది. ఆ రోజు యేసు ఏమి బోధించాడో మరియు వారు చేపలు పట్టే పడవలో ఉన్నప్పుడు యేసును అడిగిన ప్రశ్న, యేసు ఇచ్చిన సమాధానం, అలాగే అతను ఎలా నవ్వాడో పేతురు ఆలోచించినప్పుడు, పేతురుకు వాటన్నిటి గురించిన ఒక నిర్దిష్టమైన అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత, పరిశుద్ధాత్మ పేతురుకు గ్రహింపు కలిగించాడు, అప్పుడు మాత్రమే యేసు సజీవుడైన దేవుని కుమారుడని అతడు గ్రహించాడు. పరిశుద్ధాత్మ జ్ఞానోదయం కలిగించుట ద్వారా మాత్రమే పేతురుకు ఈ అవగాహన కలిగింది. అయితే అతను అవగాహన చేసుకోవడానికి ఒక ప్రక్రియ ఉంది. ప్రశ్నలు అడగడం ద్వారా, యేసు బోధలు వినడం ద్వారా, ఆయనతో ప్రత్యేక సహవాసం కలిగియుండడం ద్వారా, ఆయనను ప్రత్యేకమైన కాపరిగా కలిగియుండడం ద్వారా, యేసు సజీవుడైన దేవుని కుమారుడని పేతురు గ్రహించాడు. ఇది ఒక రాత్రిలో వచ్చిన అవగాహన కాదు; ఇది ఒక ప్రక్రియ, మరియు ఇది అతనికి భవిష్యత్తులో కలగబోయే అనుభవాలలో సహాయకరంగా మారింది. యేసు ఇతర వ్యక్తులలో పరిపూర్ణమైన కార్యమును ఎందుకు చేయలేదు, కేవలం పేతురులోనే ఎందుకు చేశాడు? ఎందుకంటే యేసు సజీవుడైన దేవుని కుమారుడని పేతురు మాత్రమే అర్థం చేసుకున్నాడు; ఇది మరెవరికీ తెలియదు. ఆయనను అనుసరించే కాలంలో చాలా మంది శిష్యులు ఉన్నప్పటికీ, వారి జ్ఞానం పైపూత వంటిదే. అందుకే పేతురును యేసు పరిపూర్ణుడిగా ఎంపిక చేసుకున్నాడు. యేసు అప్పుడు పేతురుతో ఏమి చెప్పాడో, ఈనాటి ప్రజలకు కూడా ఆయన అదే చెప్పుచున్నాడు, ఆ ప్రజల జ్ఞానము మరియు జీవిత వైఖరి పేతురు స్థాయికి వెళ్లాలి. దేవుడు ప్రతియొక్కరిని పరిపూర్ణులనుగా చేసే ఈ మార్గాన్నిబట్టి మరియు దానికి సంబంధించిన అవసరతనుబట్టి ఈ కార్యము జరుగుతుంది. ఈ నాటి ప్రజలు నిజమైన విశ్వాసమును మరియు నిజమైన ప్రేమను ఎందుకు కలిగియుండాలి? మీరు కూడా తప్పకుండ పేతురు యొక్క అనుభవంలోనికి రావాలి; పేతురు తన అనుభవాల నుండి పొందిన ఫలములు మీలో కూడా వ్యక్తపరచబడాలి; మరియు మీరు కూడా పేతురు అనుభవించిన బాధను అనుభవించాలి. మీరు నడుచుచున్న మార్గములోనే ఒకప్పుడు పేతురు నడిచాడు. మీరు అనుభవించే బాధ పేతురు అనుభవించినదే. మీరు కీర్తిని పొంది, మరియు మీరు నిజ జీవితాన్ని గడిపినప్పుడు, మీరు పేతురు యొక్క ప్రతిరూపంగా జీవిస్తారు. మార్గము ఒక్కటే, మరియు దానిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. ఏది ఏమైనప్పటికీ, పేతురుతో మీ సామర్ధ్యం పోల్చితే కొంత తక్కువగానే కనుబడుతుంది, ఎందుకంటే కాలం మారి౦ది, అలాగే మానవుల అవినీతి కూడా పెరిగింది, ఎందుకంటే యూదయ, పురాతన సంస్కృతితో దీర్ఘకాలంగా ఉన్న రాజ్యం. కాబట్టి, మీరు మీ సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి మీరు చేయతగినదంతా చేయాలి.

పేతురు చాలా వివేకమున్న వ్యక్తి, అతను చేసిన ప్రతి పనిలో నిపుణత ఉంది, మరియు అతను ఎంతో యథార్థవంతుడు. ఎన్నో పరాజయాలను చవిచూశాడు. అతని 14వ ఏట సమాజంతో అతని మొదటి పరిచయం జరిగింది, అతను పాఠశాలకు మరియు సమాజ మందిరానికి కూడా వెళ్ళాడు. అతను చాలా ఉత్సాహముతో, సమావేశాలకు హాజరు కావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో, యేసు ఇంకా అధికారికంగా తన పనిని ప్రారంభించలేదు; ఇది కృపా కాలము ఆరంభం మాత్రమే. పేతురు 14 సంవత్సరాల వయస్సులో మతపరమైన వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకోవడం ప్రారంభించాడు; అతను 18 సంవత్సరాల వయస్సులో, అతను మతపరమైన ప్రముఖులతో పరిచయం కలిగి ఉన్నాడు, కానీ అతను మతం యొక్క తెర వెనుక ఉన్న గందరగోళాన్ని చూసిన తర్వాత, అతను దాని నుండి వెనక్కి తగ్గాడు. ఈ వ్యక్తుల జిత్తులమారితనాన్ని, చాకచక్యపు మాటలను, కుతంత్రాలను చూసి, అతను విపరీతంగా చీదరించుకున్నాడు (ఆ సమయంలో పరిశుద్ధాత్మ ఈ విధంగా పని చేసి, అతన్ని పరిపూర్ణంగా మార్చాడు. ఆయన ప్రత్యేకంగా అతనిని కదిలించి అతని పట్ల కొంత ప్రత్యేక కార్యము చేసాడు) అతను 18 సంవత్సరాల వయస్సులో సమాజ మందిరం నుండి తనను తాను ఉపసంహరించుకున్నాడు. అతని తల్లిదండ్రులు అతనిని హింసించారు మరియు అతనిని విశ్వసించకుండ చేశారు (వారు దుష్టులు మరియు అవిశ్వాసులై ఉండిరి). చివరగా, పేతురు ఇంటిని విడిచిపెట్టి ప్రతిచోటా ప్రయాణించాడు, రెండు సంవత్సరాలు చేపలు పట్టుచూ బోధించాడు, ఆ సమయంలో అతను కొద్ది మంది వ్యక్తులను నడిపించాడు. ఇప్పుడు నీవు పేతురు అనుసరించిన ఖచ్చితమైన మార్గాన్ని స్పష్టంగా చూడగలగాలి. నీవు పేతురు యొక్క మార్గాన్ని స్పష్టంగా చూడగలిగితే, నీవు ఈ రోజు చేస్తున్న పనిని గురించి ఖచ్చితంగా తెలుసుకుంటావు, కాబట్టి నీవు ఫిర్యాదు చేయక, ఏ పనిచేయని వ్యక్తిగా ఉండక లేదా దేనికోసం ఆశించక వుంటావు. ఆ సమయంలో పేతురు కలిగియున్న స్వభావమును నీవు కూడా కలిగియుండాలి: అతను దుఃఖంతో కొట్టుమిట్టాడాడు; అతను భవిష్యత్తు కొరకు గాని ఆశీర్వాదం కోసం గాని అడగలేదు. అతను లోకంలో లాభాన్ని, సంతోషాన్ని, కీర్తిని లేదా అదృష్టాన్ని కోరుకోలేదు; అతను అత్యంత అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే ప్రయత్నించాడు, దేవుని ప్రేమకు బదులు చెల్లించి, తనకున్న అత్యంత విలువైన దానిని దేవునికి అంకితం చేయాలని కోరుకున్నాడు. అప్పుడు అతను తన హృదయంలో సంతృప్తి చెందాడు. అతను తరచుగా యేసును ఇలా ప్రార్థించేవాడు: “ప్రభువైన యేసుక్రీస్తూ, నేను ఒకప్పుడు నిన్ను ప్రేమించాను, కానీ నేను నిన్ను నిజంగా ప్రేమించలేదు. నీపై నాకు నమ్మకం ఉందని చెప్పినప్పటికీ, నేను నిన్ను నిజమైన హృదయంతో ఎప్పుడూ ప్రేమించలేదు. నేను నీ వైపు మాత్రమే చూసాను, నిన్ను ఆరాధించాను మరియు నిన్ను కోల్పోయాను, కానీ నేను నిన్ను ఎన్నడూ ప్రేమించలేదు లేదా నిజంగా నీపై నమ్మకం ఉంచలేదు.” అతను తీర్మానం చేయడానికి నిరంతరం ప్రార్థించాడు మరియు అతను ఎల్లప్పుడూ యేసు మాటల ద్వారా ప్రోత్సహించబడ్డాడు మరియు వారి నుండి ప్రేరణ పొందాడు. తర్వాత, కొంత అనుభవం తర్వాత, యేసు అతనిని పరీక్షించాడు, అతని కోసం మరింత ఆరాటపడేలా ప్రేరేపించాడు. అతను, “ప్రభువైన యేసుక్రీస్తు! నేను నిన్ను ఎలా పోగొట్టుకున్నాను? నిన్ను చూడాలని ఆశిస్తున్నాను. మరియు నీ ప్రేమను భర్తీ చేయడానికి నాకున్నది చాలా తక్కువ. నన్ను త్వరగా తీసుకెళ్ళమని నిన్ను వేడుకుంటున్నాను. నీకు నా అవసరం ఎప్పుడు ఉంటుంది? నీవు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? నేను మరోసారి నీ ముఖాన్ని ఎప్పుడు చూస్తాను? నేను ఈ దేహంలో ఎక్కువ కాలం జీవించాలని కోరుకోవడం లేదు, భ్రష్టుడనై, తిరుగుబాటు చేయాలనుకోవడం లేదు. నేను వీలైనంత త్వరగా నా వద్ద ఉన్నదంతా నీకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరియు ఇకపై నిన్ను బాధపెట్టాలని నేను కోరుకోవడం లేదు” అని ప్రార్థించాడు. అతను ఈ విధంగా ప్రార్థించాడు, అయితే అతనిలో యేసు ప్రరిపూర్ణము చేసిది అతనికి ఆ సమయంలో తెలియదు. అతని పరీక్షా సమయంలో, యేసు అతనికి మళ్లీ కనిపించి, “పేతురు, నేను ఆనందించేటట్లు, నీవు ఫలవంతంగా మారాలని నిన్నుపరిపూర్ణునిగా చేయాలనుకుంటున్నాను, ఇది నా పరిపూర్ణత యొక్క స్పష్టీకరణ. నీవు నాకు నిజమైన సాక్షిగా ఉండగలవా? నేను నిన్ను చేయమని అడిగిన దానిని నీవు చేసావా? నేను చెప్పిన మాటలను నీవు పాటించావా? నీవు ఒకప్పుడు నన్ను ప్రేమించావు, కానీ నీవు నన్ను ప్రేమించినప్పటికీ, నా కొరకై జీవించావా? నీవు నా కోసం ఏమి చేసావు? నీవు నా ప్రేమకు అనర్హుడవని అనుకొని, నా కోసం ఏమి చేసావు?” అని అడిగాడు. పేతురు యేసు కోసం ఏమీ చేయలేదని గుర్తించి, తన జీవితాన్ని దేవునికి ఇస్తానని గతంలో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి, అతను ఇకపై ఫిర్యాదు చేయలేదు మరియు అప్పటి నుండి అతని ప్రార్థనలు మెరుగయ్యాయి. అప్పుడు అతను, “ప్రభువైన యేసుక్రీస్తు! నేను ఒకసారి నిన్ను విడిచిపెట్టాను మరియు నీవు కూడా ఒకసారి నన్ను విడిచిపెట్టావు. మనము విడివిడిగా మరియు సహవాసంలో కలిసి గడిపాము. అయినా నీవు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించావు. నేను నీ మీద పదే పదే తిరుగుబాటు చేసాను, మరియు నిన్ను పదే పదే దుఃఖ పరిచాను. అలాంటి వాటిని నేను ఎలా మర్చిపోగలను? నేను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుంటాను మరియు నీవు నా కొరకు చేసిన పనిని, నీవు నాకు అప్పగించిన వాటిని ఎప్పటికీ మర్చిపోను. నీవు నా కొరకు చేసిన పనికి నేను చేయగలిగినదంతా చేసాను. నేను ఏమి చేయగలనో నీకు తెలుసు మరియు నేను ఏ పాత్ర పోషించగలనో నీకు మరింతగా తెలుసు. నీ ఏర్పాట౦తటికి నన్ను నేను సమర్పించ కోరుచున్నాను మరియు నా వద్ద ఉన్నదంతా నీకు అంకితం చేస్తాను. నేను నీ కోసం ఏమి చేయగలనో నీకు మాత్రమే తెలుసు. సాతాను నన్ను చాలా మోసం చేసినప్పటికీ, నేను నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ, ఆ అతిక్రమములను బట్టి నీవు నన్ను గుర్తుంచుకోవని మరియు వాటి ఆధారంగా నీవు ప్రవర్తించవని నేను నమ్ముతున్నాను. నా జీవితమంతా నీకు అంకితం చేయాలనుకుంటున్నాను. నేను ఏమీ అడగను మరియు నాకు ఇతర ఆశలు లేదా ప్రణాళికలు లేవు; నేను నీ ఉద్దేశం ప్రకారం పని చేయాలనుకుంటున్నాను మరియు నీ చిత్తాన్ని మాత్రమే జరిగించాలనుకుంటున్నాను. నేను నీ చేదైన పాత్రలోనిది తాగుతాను, మరియు నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను” అని ప్రార్థించాడు.

మీరు నడిచే మార్గం గురించిన స్పష్టత మీకు ఉండాలి; మీరు భవిష్యత్తులో ఎటువంటి మార్గాన్ని అనుసరించాలో, దేవుడు పరిపూర్ణము చేసే విషయము ఏమిటో, మీకు అప్పగించబడిన పని ఏమిటో అనే విషయాల గురించి మీకు స్పష్టత ఉండాలి. ఒక రోజు, బహుశా, మీరు పరీక్షించబడతారు మరియు ఆ సమయం వచ్చినప్పుడు, మీరు పేతురు అనుభవాల నుండి ప్రేరణ పొందగలిగితే, మీరు నిజంగా పేతురు మార్గంలో నడుస్తున్నారని అది చూపిస్తుంది. పేతురు కలిగియున్న నిజమైన విశ్వాసమును, ప్రేమను, మరియు దేవుని పట్ల అతనికున్న నమ్మకత్వాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. మరియు అతనికున్న యథార్థతనుబట్టి, అతని హృదయంలో దేవుని కొరకు ఆశనుబట్టి దేవుడు అతన్ని పరిపూర్ణుడిగా చేశాడు. పేతురువలె నీకు నిజంగా ప్రేమ మరియు విశ్వాసం ఉన్నట్లయితే, అప్పుడు యేసు ఖచ్చితంగా నిన్ను పరిపూర్ణునిగా చేస్తాడు.

మునుపటి:  దేవుని ఎరిగిన వారు మాత్రమే ఆయనకు సాక్షులుగా ఉండగలరు

తరువాత:  దేవుడిని ప్రేమించేవారు ఎప్పటికీ ఆయన వెలుతురులోనే జీవిస్తారు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger