దేవుని ఎరిగిన వారు మాత్రమే ఆయనకు సాక్షులుగా ఉండగలరు
దేవుని యందు విశ్వాసముంచుట మరియు దేవుని ఎరుగుట అనేవి పరలోకంచే ఏర్పాటు చేయబడి భూమిచే గుర్తించబడిన అంశాలు, ప్రస్తుత రోజుల్లో, అంటే మనుష్యావతారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు వ్యక్తిగా తన పనిని చేస్తూ ఉన్న ఈ కాలంలోని ఈ రోజు దేవుడిని తెలుసుకోవడానికి ప్రత్యేకమైన అనుకూల సమయం. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం అనే పునాదిపై నిర్మించబడటం ద్వారా మనము దేవుడిని సంతృప్తి పరచవచ్చు, ఇందుకోసం, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని గురించి కొంత అవగాహన కలిగి ఉండటం అవసరం. దేవుని యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ తప్పక కలిగి ఉండవలసిన దర్శనమే దేవుని గురించిన ఈ అవగాహన; దేవునిపై మానవుడు కలిగి ఉండే నమ్మకానికి ఇదే ఆధారం. ఈ అవగాహన లేకపోతే, దేవుడిపై మానవుని నమ్మకం శూన్యవాద సిద్ధాంతంలో అస్పష్టంగా ఉంటుంది. ఈ రకమైన మనుష్యులు దేవుడిని అనుసరించడానికి తీర్మానం చేసుకున్నప్పటికీ, దాని ద్వారా వారికి ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో దేన్నీ పొందుకోలేని వాళ్ళు పరిత్యజించబడతారు—వారంతా అప్రమేయంగా వచ్చినదానిని ఏమాత్రం సంకోచం లేకుండా అనుభవించేవారిగా మిగిలిపోతారు. మీరు దేవుని పనిలోని ఏ దశను అనుభవించినా, మీరు శక్తిగల దర్శనాన్ని తప్పక కలిగి ఉండాలి. లేకపోతే, ఆయన జరిగించే నూతన కార్యంలోని ప్రతి దశను అంగీకరించడం మీకు కష్టతరం అవుతుంది, ఎందుకంటే దేవుడు తలపెట్టే నూతన కార్యం మానవుని తలంపులకు మించినది మరియు ఊహలకు అతీతమైనది. కాబట్టి, మానవులను కాచే, దర్శనాల గురించి వారిని సహవాసంలో నిలిపి ఉంచే కాపరి లేకుండా, ఇట్టి నూతన కార్యాన్ని ఆకళింపు చేసుకోవడానికి మానవుని సామర్ధ్యం సరిపోదు. మానవుడు దర్శనాలను పొందుకోలేకపోతే, అతడు దేవుని నూతన కార్యాన్ని కూడా పొందలేడు, ఇంకా, మానవుడు దేవుని నూతన కార్యానికి విధేయత చూపించలేకపోతే దేవుని చిత్తాన్ని కూడా అర్థం చేసుకోలేడు, అంటే, దేవుని పట్ల అతడు కలిగి ఉండే అవగాహన శూన్యం అని దీనర్థం. మనుష్యుడు దేవుని వాక్యాన్ని వేరొకరికి చెప్పే ముందు, దేవుని వాక్యాన్ని ఎరిగినవాడై ఉండాలి; అంటే, దేవుని చిత్తాన్ని తప్పక గ్రహించినవాడుగా ఉండాలి. ఈ మార్గంలో మాత్రమే దేవుని వాక్యాన్ని దేవుని చిత్త ప్రకారంగా తీసుకువెళ్ళగలుగుతాము. సత్యాన్ని వెదికేవారందరూ ఈ మార్గాన్ని కలిగి ఉండాలి మరియు దేవుడిని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియ గుండా వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం అంటే దేవుడిని మరియు ఆయన పనిని తెలుసుకోవడమే. కాబట్టి, దర్శనాలను గురించి తెలుసుకోవడం అంటే కేవలం మనుష్యావతారిగా వచ్చిన దేవుని మానవ స్వభావం గురించి తెలుసుకోవడం కాదు కానీ దేవుని వాక్యాన్ని మరియు దేవుని పనిని తెలుసుకోవడం కూడా. దేవుని వాక్యం ద్వారా మానవులు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు, మరియు దేవుని పని ద్వారా వారు దేవుని స్వభావాన్ని మరియు అసలు దేవుడెవరనే విషయాన్ని తెలుసుకుంటారు. దేవునిపై నమ్మకం కలిగి ఉండటమే దేవుడిని తెలుసుకోవడానికి మానవుడు వేసే మొదటి అడుగు. దేవుని పట్ల కలిగి ఉన్న ఈ ప్రారంభ విశ్వాసం నుండి ఆయనపై అధిక విశ్వాసం కలిగి ఉండే స్థితికి ఎదిగే ప్రక్రియలో దేవుని తెలుసుకోవడం, దేవుని పనిని అనుభవించడం ఉంటాయి. దేవుని తెలుసుకోవడం గురించి కాక దేవుని యందు విశ్వాసముంచడం కోసం మాత్రమే మీరు దేవుని విశ్వసిస్తే, మీ విశ్వాసం వాస్తవికమైనది కాదు, మీ విశ్వాసం స్వచ్ఛమైనదిగా ఉండదు—ఈ విషయంలో ఏ సందేహమూ లేదు. మానవుడు దేవుని పనిని అనుభవించే ప్రక్రియలో, నెమ్మదిగా దేవుని గురించి తెలుసుకుంటే, అట్టి వాని స్వభావం నెమ్మదిగా మార్పు చెందటంతో పాటు అతడి నమ్మకం క్రమేపి నిజమైన విశ్వాసముగా పెంపొందించబడుతుంది. ఈ విధంగా, మనుష్యుడు తాను దేవునిపట్ల కలిగి ఉన్న నమ్మకం విషయంలో సఫలీకృతుడైతే, అతడు దేవుడిని పరిపూర్ణంగా పొందుకుంటాడు. మనుష్యుడు ఆయనను ఎరిగి ఆయనను చూడగలగాలనుకోవడమే మనుష్యులలో రెండవసారి తన కార్యాన్ని చేయడం కొరకు దేవుడు అంత త్యాగం చేసి మనుష్యరూపం దాల్చడం వెనుక ఉన్న కారణం. దేవుని పనిలో అంతిమంగా జరిగేదేమిటంటే మానవుడు దేవుడిని తెలుసుకోవడం[ఎ]; మానవాళి కొరకు దేవుడు కోరుకునే ఆఖరి ఆవశ్యకత ఇదే. ఆయన అంతిమ సాక్ష్యం కొరకే ఆయనిలా చేస్తాడు; మానవుడు చివరికి, పూర్తిగా ఆయన తట్టు తిరగాలని ఆయన ఈవిధంగా చేస్తాడు. మనుష్యుడు దేవునిని గురించి తెలుసుకోవడం ద్వారా మాత్రమే దేవుడిని ప్రేమించగలడు, దేవుడిని ప్రేమించడానికి మనష్యుడు తప్పనిసరిగా దేవుడిని ఎరిగి ఉండాలి. అతడు ఎలా వెదికినప్పటికీ, దేన్ని ఆశించినప్పటికీ, మనుష్యుడు దేవుని గురించి తెలుసుకోవాలి. ఈ విధంగా మాత్రమే మనుష్యుడు దేవుని హృదయాన్ని సంతృప్తిపరచగలడు. దేవుడిని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనుష్యుడు దేవునిపై నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలడు, మరియు దేవుడిని ఎరుగుట ద్వారా మాత్రమే ఆయనకు విధేయత చూపించగలడు. దేవుడిని ఎరుగని వారు ఎప్పటికీ దేవుని పట్ల నిజమైన విధేయతను, భక్తిని చూపించలేరు. దేవుడిని ఎరుగుటలో దేవుని స్వభావం గురించి తెలుసుకోవడం, ఆయన చిత్తాన్ని గ్రహించడంతో పాటు అసలు ఆయనెవరో తెలుసుకోవడంవంటి అంశాలు ఇమిడి ఉంటాయి. అయితే ఒకడు ఏ విషయాన్ని తెలుసుకున్నా, అట్టి ప్రతి విషయం కొరకు మనుష్యుడు వెల చెల్లించడంతోపాటు దానికి లోబడటానికి ఇష్టాన్ని కలిగి ఉండాలి, ఈ లక్షణం లేకపోతే ఏ ఒక్కరూ దేవుడిని అంతము వరకు వెంబడించలేరు. మానవుని ఉద్దేశాలకు, దేవుని పనికి ఏమాత్రము పొసగదు. దేవుని స్వభావం మరియు అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనే అంశాలు కూడా మనుష్యుడు తెలుసుకోవడం చాలా కష్టం. అంతేకాక దేవుడు చెప్పేవి మరియు చేసేవన్నీ మానవుడు అర్థం చేసుకోవడానికి అంత సులభమైన సంగతులు కావు: మానవుడు దేవుని అనుసరించాలని ఇష్టపడి, ఆయనకు లోబడటానికి మాత్రం ఇష్టాన్ని కలిగి లేకపోతే, మానవుడు సాధించేది ఏమీ ఉండదు. ఈ లోకం సృజించబడిన నాట నుండి ఈ రోజు వరకు దేవుడు ఎంతో పనిని చేస్తూ వచ్చాడు, అయితే ఈ పని మానవునికి అర్థం కాకపోగా, మానవుడు దానిని అంగీకరించలేకపోతున్నాడు. ఇంకా, దేవుడు ఎన్నో విషయాలను తెలియజేశాడు గాని మనిషి బాగు చేసుకోలేని స్థితిలో తన స్వంత ఆలోచనలను కలిగియున్నాడు. అయితే మనుష్యుడికి ఎన్నో కష్టాలు ఉన్నాయి అనే కారణంచే దేవుడు తన పనిని మాత్రం ఎప్పుడూ ఆపివేయలేదు; బదులుగా, ఆయన తన పనిని, మాటలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. మార్గమధ్యలో అనేకమంది “యోధులు” పడిపోయినప్పటికీ, ఆయన నూతన కార్యానికి లోబడి ఉండటానికి సుముఖత కలిగి ఉన్న వారిని ఒక సమూహం వెంబడి మరొక సమూహంగా ఎంపిక చేసుకోవడానికి ఆయన ఎడతెరపి లేకుండా తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా పడిపోయిన “వీరుల” విషయంలో ఆయన చింతించడం లేదు, నిజానికి ఆయన నూతన కార్యాన్ని మరియు మాటలను ఎందరు అంగీకరిస్తారో వారిని భద్రంగా పదిలపరుస్తాడు. కానీ ఆయన అడుగడుగున ఈ విధంగా ఎంత మేరకు పని చేస్తాడు? ఆయన ఎల్లప్పుడూ ఎందుకు కొంతమందిని పరిత్యజిస్తూ మరి కొందరిని ఎంపిక చేసుకుంటూ ఉంటాడు? ఆయన ఎందుకు ఎల్లప్పుడూ ఈ పద్ధతిని ఎంచుకుంటాడు? మనుష్యుడు తనను తెలుసుకునేలా చేయడం, మరియు తద్వారా వారిని ఆయన స్వీకరించడమే దేవుని పని యొక్క లక్ష్యం. దేవుడు గతంలో చేసిన పనికి మాత్రమే లోబడుతూ, ప్రస్తుతం ఆయన చేస్తున్న పనితో విభేదించే వారి పట్ల కాక, ఆయన ప్రస్తుతం చేస్తున్న పనికి లోబడగలిగే వారి పట్ల తన కార్యాన్ని జరిగించడమే ఆయన పని విధానం. ఆయన అనేకమందిని ఎందుకు పరిత్యజిస్తున్నాడో అనే దానికి కారణం ఇందులోనే ఉంది.
దేవునిని తెలుసుకొనుట అనే పాఠంలోని ప్రభావాలను ఒకట్రెండు రోజుల్లో సాధించడం అసాధ్యం: మనుష్యుడు అనుభవాలను కూడగట్టుకోవాలి, శ్రమలు అనుభవించాలి మరియు నిజముగా లోబడియుండే స్వభావాన్ని పొందుకోవాలి. మొదటగా, దేవుని పని మరియు దేవుని మాటల నుండి ప్రారంభించాలి. దేవునిని తెలుసుకోవడంలో ఏమి ఉంటుంది, ఈ జ్ఞానమును పొందటం ఎలా, మరియు నీ అనుభవాల గుండా దేవుని ఎలా చూడాలి అనే విషయాలను గ్రహించడం ఎంతో ముఖ్యం. దేవుని ఇంకా తెలుసుకోనివారందరూ తప్పకుండ చేయవలసింది ఇదే. ఏ ఒక్కరూ ఒక్కసారిగా దేవుని కార్యమును, ఆయన మాటలను గ్రహించలేరు, మరియు తక్కువ సమయములో దేవుని గురించిన సమస్త జ్ఞానాన్ని గడించలేరు. అనుభవం అనే ప్రక్రియ గుండా తప్పనిసరిగా వెళ్లాల్సిందే, ఇది లేకుండా ఎవరూ దేవుని తెలుసుకోలేరు లేదా ఆయనను నిబద్ధతతో అనుసరించలేరు. దేవుడు తన పనిని ఎంత ఎక్కువగా చేస్తే, మనుష్యుడు అంత ఎక్కువగా ఆయనను తెలుసుకుంటాడు. దేవుని పని మానవుని ఉద్దేశాలను ఎంత అధికంగా రద్దు చేస్తుంటే, ఆయనపట్ల మానవుని జ్ఞానము అంత అధికంగా నూతనపరచబడుతుంది మరియు లోతుగా నాటబడుతుంది. ఒకవేళ దేవుని పని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ ఏమాత్రం మార్పులేనిదై ఉంటే, అప్పుడు ఆయన గురించి మనుష్యులకు ఉండే అవగాహన స్వల్పంగానే ఉంటుంది. సృష్టి ఆరంభము నుండి ప్రస్తుత కాలం వరకు, అనగా ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఏమి చేశాడు, కృపాకాలంలో ఆయన ఏమి చేశాడు, మరియు దేవుని రాజ్య కాలంలో ఆయన ఏమి చేస్తాడో అనే దర్శనాలను గురించి మీరు స్పష్టమైన అవగాహనను కలిగి ఉండాలి. మీరు దేవుని పనిని ఎరిగిన వారై ఉండాలి. యేసును అనుసరించిన తర్వాత మాత్రమే పేతురు నెమ్మదిగా యేసులో జరిగిన ఆత్మ కార్యం గురించి ఎక్కువగా తెలుసుకోగలిగాడు. అతడేమన్నాడంటే, “దేవుని గురించిన పూర్తి జ్ఞానమును పొందటానికి మనుష్యుని అనుభవాలపై ఆధారపడితే చాలదు; ఆయనను మరింతగా తెలుసుకోవడంలో సహాయపడటానికి దేవుని కార్యముల నుండి అనేక నూతన సంగతులు మనకు అవసరం.” మొదట్లో, యేసు దేవునిచే ఒక అపోస్తలుడిగా పంపబడినవాడని నమ్మాడు, అందుచేత అతడు యేసును క్రీస్తుగా గుర్తించలేకపోయాడు. ఈ సమయంలో, అతడు యేసును వెంబడించడం మొదలు పెట్టిన తర్వాత, యేసు పేతురుతో “సీమోను బర్‌యోనా, నీవు నన్ను వెంబడిస్తావా?” అని అడిగాడు. అందుకు పేతురు, “పరలోకమందున్న తండ్రి పంపిన వానిని వెంబడించవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ ఎన్నుకున్న వానిని నేను గుర్తించాలి. నేను నిన్ను వెంబడిస్తాను” అని సమాధానమిచ్చాడు. అతడి మాటలను బట్టి, పేతురుకు యేసును గూర్చిన అవగాహన లేదని అర్థమవుతుంది; అతడు దేవుని వాక్కులను అనుభవించాడు, తనతో తాను వ్యవహరించాడు, దేవుని కోసం కష్టాలను అనుభవించాడు కానీ అతడికి దేవుని పనిని గూర్చిన జ్ఞానము లేదు. కొంత అనుభవ కాలం తర్వాత, పేతురు యేసులో అనేకమైన దైవ క్రియలను, దేవుని ప్రేమ స్వభావాన్ని, దేవుడిని అధికంగా చూడగలిగాడు. అంతేకాక, అతడు యేసు పలికిన మాటలను మనుష్యులెవ్వరూ పలుకలేరని, యేసు చేసిన కార్యాలను మనుష్యులెవరూ చేయలేరని గ్రహించాడు. యేసు పలికిన మాటలను, ఆయన క్రియలను చూసిన తర్వాత, పేతురు ఇంకా యేసులో దేవుని జ్ఞానాన్ని మరియు దైవ లక్షణ సహితమైన ఎంతో పనిని చూడగలిగాడు. అతడు అనుభవాల గుండా వెళ్ళే సమయంలో పేతురు తానేమితో తెలుసుకోవడమే కాకుండా, యేసు చేసే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా గమనించాడు, దాని నుండే అతడు యేసు ద్వారా దేవుడు జరిగించిన పనిలో దేవుడు తన్నుతాను అనేక విధాలుగా వ్యక్తపరచుకున్నాడనీ, యేసు పలికిన మాటలలో, చేసిన క్రియలలో, ఆయన కాపరిగా వ్యవహరించిన సంఘాల విషయంలో మరియు అతడు నిర్వర్తించిన పనులలో అతడు సాధారణ మానవునికి ఎంతో భిన్నంగా వ్యవహరించాడనే వాటి వంటి అనేక కొత్త విషయాలను కనుగొన్నాడు. కాబట్టి, యేసు నుండి పేతురు నేర్చుకోవాల్సిన అనేక పాఠాలను అతడు నేర్చుకున్నాడు, యేసు సిలువకు మేకులతో కొట్టబడే సమయానికి, అతడు యేసును గురించి కొంత నిర్దిష్ట గ్రహింపును పొందుకోగలిగాడు—ఈ గ్రహింపే పేతురు జీవితాంతం యేసుకు నమ్మకంగా జీవించి, దేవుని కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడేంతగా నిలబడటానికి కారణమయ్యింది. మొదట్లో యేసును గురించి పేతురు కొన్ని స్వంత భావనలను కలిగి ఉండి, ఆయనపై పూర్తి అవగాహనను కలిగి ఉండకపోయినప్పటికీ, అలాంటివన్నీ చెడుతనము కలిగిన మనుష్యుని జీవితంలో తప్పనిసరిగా ఉండేవే అని మనం తెలుసుకోవాలి. యేసు ఆరోహణమవ్వడానికి ముందు, తాను ఈ లోకములోనికి వచ్చింది సిలువ వేయబడటానికేనని పేతురుతో చెప్పాడు. ఈ కాలపు మనుష్యులు ఆయనను ఎడబాయటం, ఈ కలుషితమైన పాత తరం ఆయనను సిలువకు కొట్టడం తప్పనిసరి; ఆయన తన విమోచన కార్యాన్ని జరిగించడానికి వచ్చాడు, ఆయన ఈ పనిని పూర్తి చేసి తన పరిచర్యను ముగించాడు. దీనిని విన్న పేతురు, దుఃఖముతో నిండుకున్నవాడై యేసుకు మరింత సమీపంగా వచ్చాడు. యేసు సిలువకు మేకులతో కొట్టబడినప్పుడు, పేతురు ఒంటరిగా ఎంతో విలపించాడు. దీనికి ముందుగా అతడు యేసును ఇలా అడిగాడు, “నా ప్రభువా! నీవు సిలువ వేయబడబోవుచున్నావని చెప్పుచున్నావు కదా. నీవు వెళ్ళిపోయిన తర్వాత మేము నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తాము?” అతడు పలికిన మాటల్లో ఏవైనా లేని పదాలు వచ్చి చేరలేదంటారా? వాటిలో తన స్వీయ భావనలు ఏవీ లేవని అనుకుందామా? అతడి మనసులో, దేవుని పనిలో కొంత భాగాన్ని నెరవేర్చుటకు యేసు వచ్చాడని, యేసు వెళ్ళిపోయిన తర్వాత అతని స్థానంలో ఆత్మ నివసిస్తుందని పేతురుకు తెలుసు; యేసు సిలువకు కొట్టబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినప్పటికీ, దేవుని ఆత్మ తనతో ఉంటుందని పేతురుకు తెలుసు. ఆ సమయంలో, పేతురుకు యేసుపట్ల కొంత అవగాహన మాత్రమే ఉంది; యేసు దేవుని ఆత్మచే పంపబడ్డాడని, దేవుని ఆత్మ ఆయనలో ఉందని, మరియు యేసే దేవుడని, ఆయన అభిషిక్తుడని పేతురుకు తెలుసు. ఇదంతా పేతురుకు యేసుపై ఉన్న ప్రేమ ద్వారా సాధ్యమయ్యింది, మరియు అతడికి ఉన్న మానవ బలహీనత కారణంగా పేతురు అట్టి మాటలు పలికాడు. మనుష్యుడు దేవుని పనిలోని ప్రతి దశను గమనించి జాగ్రత్తగా అనుభవించగలిగితే, అట్టి మనుష్యుడు దేవుని ప్రేమ స్వభావాన్ని కనుగొనగలడు. పౌలుకు దర్శనం ఎలా కలిగింది? యేసు ప్రత్యక్షమైనప్పుడు, పౌలు యేసుతో “ప్రభువా, నీవెవడవని” అని అడిగినప్పుడు యేసు, “నేను నీవు హింసించు చున్న యేసును” అని చెప్పెను. ఇది పౌలుకు కలిగిన దర్శనం. యేసు పునరుద్ధానుడవడం, 40 దినాలు ఆయన సంచరిస్తూ కనిపించడం, యేసు తన జీవితకాలంలో చేసిన బోధలను దర్శనముగా తీసుకొని ఈ లోకంలో తన ప్రయాణాన్ని ముగించేవరకు కొనసాగాడు.
మానవుడు దేవుని పనిని అనుభవిస్తాడు, తద్వారా తన్నుతాను తెలుసుకుంటాడు, తన దుర్మార్గపు స్వభావాన్ని తీసివేసుకుంటాడు, మరియు తన జీవితంలో వృద్ధిని కోరుకుంటాడు, ఇదంతా దేవుని తెలుసుకోవడం కోసం చేస్తాడు. నీవు కేవలం నీ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుని, నీ చెడు స్వభావంతో వ్యవహరించాలనుకుంటూ మానవునిపై దేవుడు ఎలాంటి పనిని చేస్తాడు, ఆయన ఇచ్చే రక్షణ ఎంత గొప్పది, లేదా నీవు దేవుని పనిని ఎలా అనుభవిస్తావు మరియు ఆయన క్రియలకు సాక్ష్యమిస్తావు అనే విషయాలపై అవగాహనను కలిగి లేకపోతే, అప్పుడు నీవు పొందుకునే ఈ అనుభవం అర్థరహితంగా ఉండిపోతుంది. ఒకడు సత్యాన్ని ఆచరణలో పెడుతూ దానిని కలిగి ఉన్నంత మాత్రాన అతడి జీవితం పరిపక్వతను సాధించిందని నీవనుకుంటున్నట్లయితే, నీవు ఇంకా జీవితపు నిజమైన అర్థాన్ని తెలుసుకోలేదని లేదా మానవుడిని సంపూర్ణునిగా చేయడంలో దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదని గ్రహించాలి. ఒకానొక రోజున, నీవు మతపరమైన ఆచారాలు కలిగిన సంఘంలో ఉన్నప్పుడు, పశ్చాత్తాపపడే సంఘస్తుల మధ్యలో లేదా జీవము గలిగిన సంఘస్తులలో ఉన్నప్పుడు, తమ ప్రార్ధనలలో దర్శనాలను చూసేవారిని మరియు జీవమును వెంబడించుటలో వారు వాక్యము ద్వారా తాకబడి నడిపించబడుతున్న అనుభూతిని పొందిన అనేకమంది భక్తిపరులను చూస్తావు. అంతేగాకుండా, అనేక విషయాలను తట్టుకొని తమ్ముతాము రిక్తులనుగా చేసికొని శరీరాశలకు లోబడని వారుగా ఉండగలుగుతారు. ఆ సమయంలో, నీవు వ్యత్యాసాన్ని చెప్పలేవు: వారు చేసేదంతా సరియైనదేనని, వారు చేసేదంతా జీవితం యొక్క స్వాభావిక వ్యక్తీకరణయని, మరియు వారు నమ్మే నామం తప్పు కావడం ఎంతో బాధాకారం అని నీవు నమ్ముతావు. అలాంటి దృక్పధాలు అవివేకమైనవి కాదా? అనేక మంది జీవాన్ని కలిగి లేరు అని ఎందుకు అంటారు? ఎందుకంటే వారు దేవుని ఎరుగరు, తత్ఫలితంగా వారి హృదయాల్లో దేవుడు లేడు అని, జీవం లేదు అని అంటారు. నీవు దేవుని క్రియలను, దేవుని నిజతత్వమును మరియు దేవుని పనిలోని ప్రతి దశను పూర్తిగా తెలుసుకునే స్థాయికి దేవునిపై నీ నమ్మకం పెట్టుకున్నట్లయితే, నీవు సత్యాన్ని కలిగియున్నావని అర్థం. నీవు దేవుని పనిని, స్వభావాన్ని తెలుసుకోకపోతే, నీ అనుభవంలో నీవు పొందుకోవాల్సింది ఇంకా సంపూర్తి కానట్లే. తన పని యొక్క ఆ దశను యేసు ఎలా నిర్వర్తించాడు, ఈ దశ ఎలా కొనసాగించబడింది, కృపాకాలంలో దేవుడు తన కార్యమును ఎలా చేశాడు మరియు ఈ దశలో ఎటువంటి కార్యము జరిగించబడింది, ఎటువంటి కార్యము జరిగించబడుతూ ఉంది—ఈ విషయాలన్నింటిపై నీవు సంపూర్ణమైన అవగాహన కలిగి లేకపోతే, నీకు ఎప్పటికీ నిశ్చయత కలుగదు మరియు నీవు ఎల్లప్పుడూ అభద్రతా భావంతోనే ఉండిపోతావు. కొంతకాలం పాటు అనుభవం పొందిన తర్వాత, నీవు దేవుడు చేసిన పనిని, ఆయన పనిలోని ప్రతి దశను తెలుసుకోగలుగుతావు మరియు ఆయన వాక్కులను పలకడంలో ఆయనకున్న లక్ష్యాలను గురించి, మరియు ఆయన పలికిన అనేక మాటలు ఎందుకు ఇంకా నెరవేరలేదు అనే విషయాలపై పూర్తి అవగాహనను పొందితే, అప్పుడు నీవు ధైర్యంగా, ఏమాత్రమూ వెనుదీయకుండా చింత మరియు సరిదిద్దుకునే అవసరత లేని నీ ముందున్న మార్గంలో ముందుకు కొనసాగగలుగుతావు. దేవుడు తన పనిలో ఎక్కువ భాగాన్ని ఏ విధంగా సాధిస్తాడో నీవు తెలుసుకోవాలి. ఆయన తాను మాట్లాడే మాటలనే ఉపయోగిస్తూ అనేకమైన వేర్వేరు పలుకుల ద్వారా మానవుని శుద్ధీకరిస్తూ, అతడి ఉద్దేశాలను రూపాంతరం చెందిస్తాడు. నీవు సహించిన శ్రమలన్నీ, నీవు పొందిన శుద్ధీకరణ అంతయూ, నీలో నీవు అంగీకరించిన వ్యవహారం మరియు నీవు అనుభవించిన కనువిప్పు—ఇవన్నీ దేవుడు పలికిన వాక్కుల ద్వారా సాధించినవే. మానవుడు దేని ఆధారంగా దేవుడిని వెంబడిస్తాడు? దేవుని వాక్కుల ద్వారానే అతడు దేవుని అనుసరిస్తాడు! దేవుని వాక్కులు లోతైన మర్మాలను కలిగి ఉంటాయి, అవి మానవుని హృదయాన్ని కదిలించి వేయగలవు, మానవుని హృదయంలో లోతుగా పాతుకుపోయిన విషయాలను బయలుపరచగలవు, గతంలో జరిగిన సంగతులను తెలుసుకునేలా చేయగలవు, మరియు అతడు భవిష్యత్తులోనికి దూసుకువెళ్ళేలా చేయగలవు. కాబట్టి దేవుని మాటల మూలంగా మానవుడు శ్రమలను సహిస్తాడు, దేవుని వాక్కులచే అతడు పరిపూర్ణుడవుతాడు కూడా: ఈ సమయంలో మాత్రమే మానవుడు దేవుని వెంబడిస్తాడు. ఈ సమయంలో మానవుడు ఏమి చేయాలంటే, దేవుని వాక్కులను అంగీకరించాలి, అతడు పరిపూర్ణుడుగా చేయబడుతున్నాడా లేక శుద్ధీకరించబడుతున్నాడా అనే దానితో సంబంధం లేకుండా దేవుని వాక్యమే కీలకం అని తెలుసుకోవాలి. ఇది దేవుని పని, మరియు మానవుడు ఈరోజు తెలుసుకోవాల్సిన దర్శనం.
దేవుడు మానవుని పరిపూర్ణునిగా ఎలా చేయగలడు? దేవుని స్వభావం ఏమిటి? ఆయన స్వభావంలో ఏమి ఉన్నాయి? ఈ విషయాలన్నిటికీ స్పష్టత తీసుకురావాలంటే: ఒకరేమో దీనిని దేవుని నామాన్ని వ్యాప్తిచేయడం అంటారు, ఒకరేమో దేవుని గురించిన సాక్ష్యాన్ని కలిగి ఉండటం అంటారు, మరొకరేమో దీనిని దేవుని హెచ్చించడం అని అంటారు. దేవుని తెలుసుకొనుట అనే పునాదిపై మానవుడు, చివరికి తన స్వభావాన్ని మార్పు చేసుకొని రూపాంతరం చెందుతాడు. మానవుడు ఎంత ఎక్కువగా తనను తాను మార్చుకుంటూ, శుద్ధీకరణ ప్రక్రియ గుండా వెళ్తే, అంత ఎక్కువగా అతడు శక్తివంతుడవుతాడు; దేవుని పనిలోని దశలు ఎక్కువైన కొలదీ మానవుడు పరిపూర్ణం చేయబడుతుంటాడు. ప్రస్తుతం, మానవుని అనుభవంలో, దేవుని పనిలోని ప్రతి దశ మానవుని స్వంత ఉద్దేశాలను కట్టడి చేస్తూ మానవుని మేథస్సుకు అందనిదిగా మరియు అతడి అంచనాలకు చిక్కనిదిగా ఉంటుంది. మానవుని అవసరతలన్నిటినీ దేవుడు తీరుస్తాడు, అయితే ఇది అన్ని విధాలుగా ఇది మానవుని ఉద్దేశాల ప్రకారం మాత్రం ఉండదు. దేవుడు ఆయన వాక్కులను నీవు బలహీన సమయంలో ఉన్నప్పుడు పలుకుతాడు; ఈ విధంగా మాత్రమే ఆయన నీ జీవితానికి కావలసినవాటిని సమకూరుస్తాడు. నీ స్వీయ ఉద్దేశాలను కట్టడి చేస్తూ, దేవుడు నీతో వ్యవహరించే విధానాన్ని నీవు అంగీకరించేలా ఆయన చేస్తాడు; ఈ విధంగా మాత్రమే నీ దుర్మార్గత నుండి నీవు బయట పడగలవు. ప్రస్తుత రోజుల్లో, మనుష్యరూపిగా వచ్చిన దేవుడు ఒక విధంగా చూస్తే దైవత్వపు స్థితిలో పనిచేస్తాడు, కానీ మరొక రకంగా చూస్తే అతడు సాధారణ మానవరూపంలో పనిచేస్తాడు. నీవు దేవుని ఏ పనినైననూ తిరస్కరించకుండా ఉండగలిగితే, సాధారణ మానవ రూపంలో దేవుడు ఏది చెప్పినా లేక ఏది చేసినా దానికి లోబడగలిగితే, ఆయన ఎంత సాధారణంగా చేసినప్పటికీ దానికి నీవు లోబడి అర్థం చేసుకోగలిగితే, మరియు నీవు అసలైన అనుభవాన్ని పొందుకోగలిగితే, అప్పుడు మాత్రమే నీవు ఆయన దేవుడనే నిశ్చయతను కలిగి ఉంటావు, నీవు నీ స్వంత ఉద్దేశాలను వృద్ధి చేసుకోవడం ఆపివేస్తావు, మరియు అంతము వరకు ఆయనను వెంబడించగలుగుతావు. దేవుని పనికి జ్ఞానమున్నది, మానవుడు ఆయన కొరకు ఏ విధంగా బలమైన సాక్షిగా ఉండగలడో ఆయనకు తెలుసు. మానవునిలోని కీలక బలహీనతలు ఎక్కడ ఉన్నాయో ఆయనకు తెలుసు, ఆయన పలికే మాటలు నీలోని ప్రధాన బలహీనతలను తొలగించగలవు, కానీ, నిన్ను ఆయన కొరకు స్థిరమైన సాక్షిగా చేయడానికి, ఆయన తన అద్భుతమైన, జ్ఞానయుక్తమైన మాటలను కూడా ఉపయోగిస్తాడు. అవే దేవుని నుండి కలిగే అద్భుతాలు. దేవుడు చేసే పని మానవ మేథస్సుకు అందనిది. మానవుడు ఒక శరీరిగా ఏ రకమైన దుర్మార్గతను కలిగి ఉన్నాడు, మానవుడు ఏయే వాటితో తయారుచేయబడ్డాడు—ఇవన్నీ దేవుని తీర్పు ద్వారా బయల్పరచబడతాయి, ఇవి బయటపడినప్పుడు మానవుడు సిగ్గుతో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అనేకులు ఆయనను తెలుసుకొనులాగున మరియు అనేకులు ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉండులాగున జనులకు తీర్పు తీర్చువాడు, శిక్షించువాడు దేవుడే. మానవుని దుర్మార్గపు స్వభావానికి దేవుడు తీర్పు తీర్చకపోతే, మానవుడు ఏ అపరాధానికి తావు లేని దేవుడి నీతి స్వభావాన్ని తెలుసుకునే అవకాశమే ఉండదు, లేదా మానవుడు తనకు దేవుని గురించి ఉన్న పాత అవగాహనను కొత్తదిగా మార్చుకునే అవకాశమూ ఉండదు. ఆయన సాక్ష్యం కొరకు, ఆయన పాలన కొరకు, ఆతన తాను చేయు సమస్తమును బహిరంగంగా చేస్తూ, ఆయన బహిరంగంగా ప్రత్యక్షపరచబడటం ద్వారా మానవుడు దేవుని గురించి తెలుసుకునేలా, ఆయన స్వభావంలోనికి రూపాంతరం చెందేలా మరియు దేవునికి ప్రతిధ్వనించే సాక్ష్యాన్ని కలిగి ఉండేవాడిగా చేస్తున్నాడు. దేవుడు చేసే అనేక రకాలైన పనుల ద్వారా మానవుని స్వభావంలో మార్పు సాధ్యమవుతుంది; మానవుని స్వభావంలో అటువంటి మార్పులు లేకుండా మానవుడు దేవునికి సాక్షిగా, దేవుని హృదయానుసారునిగా ఉండలేడు. మానవుడు సాతాను బంధకాల నుండి మరియు అంధకార ప్రభావం నుండి విముక్తుడై నిజముగా దేవుని పనికి మాదిరిగా మరియు నమూనాగా, దేవుని సాక్షిగా మరియు దేవుని హృదయానుసారునిగా తయారయ్యాడని మానవుని స్వభావంలో చోటు చేసుకునే మార్పు తెలియజేస్తుంది. ఈరోజు, మనుష్యావతారిగా వచ్చిన దేవుడు ఈ భూమిపై తన పనిని నిర్వర్తించడానికి వచ్చాడు, మనుష్యుడు ఆయనను గురించి తెలుసుకోవాలని, ఆయనకు విధేయుడుగా మారాలని, ఆయన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలని, ఆయన ఆచరణాత్మకమైన మరియు సాధారణ పనిని గురించి మానవుడు తెలుసుకోవాలని, ఆయన మాటలన్నింటికీ లోబడుతూ మానవుని తలంపుల ప్రకారం కాక దేవుని చిత్త ప్రకారం పని చేయాలని మరియు మనుష్యుని రక్షించుటకు ఆయన చేసే పనితో పాటు మానవుని జయించడానికి ఆయన సంపూర్తి చేసే కార్యాలన్నింటికీ సాక్షిగా జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవునికి సాక్ష్యులుగా ఉండేవారు దేవుని గురించి ఎరిగిన వారై ఉండాలి; ఈ రకమైన సాక్ష్యం మాత్రమే ఖచ్చితమైనదిగా మరియు వాస్తవమైనదిగా ఉంటుంది, మరియు ఈ రకమైన సాక్ష్యం సాతానును సిగ్గుపరుస్తుంది. ఆయనకు సాక్షులుగా ఉండటానికి ఆయన తీర్పు ద్వారా మరియు శిక్ష ద్వారా, ఆయన వ్యవహరిస్తూ మానవునిలోని దుర్గుణాలను తొలగించివేయడం ద్వారా, ఆయనను తెలుసుకున్న వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. సాతాను చేత దుర్మార్గతలోనికి కొనిపోబడిన వారిని ఆయన తన సాక్ష్యం కొరకు ఉపయోగించుకుంటాడు, ఆయనకు సాక్షులుగా ఉండుట కొరకు తమ స్వభావం విషయంలో మార్పు చెంది, ఆయన ఆశీర్వాదములను పొందుకున్న వారిని కూడా ఉపయోగించుకుంటాడు. మానవుడు తన నోటిచే ఆయనను స్తుతించడానికి దేవునికి మానవుడు అక్కరలేదు, లేదా ఆయనచే రక్షించబడని, సాతాను వంటి స్వభావము కలిగిన వారి నుండి స్తుతి మరియు సాక్ష్యాన్ని దేవుడు ఆశించడం లేదు. దేవుడిని ఎరిగిన వారు మాత్రమే మరియు వారి స్వభావములో మార్పు చెందినవారు మాత్రమే ఆయన కొరకు సాక్షులుగా ఉండటానికి అర్హులుగా ఉంటారు. ఆయన నామానికి అవమానము తెచ్చుకోవడానికి దేవుడు ఉద్దేశపూర్వకంగా అయితే మనుష్యుని అనుమతించడు.
ఫుట్‌నోట్:
ఎ. మూల వాచకములో “దేవుడిని తెలుసుకునే కార్యం” అని ఉంది.