దేవుని నూతన కార్యాన్ని తెలుసుకొని ఆయన అడుగుజాడలను అనుసరించు

ఇప్పుడు మీరు దేవుని ప్రజలుగా తయారవ్వడానికి ప్రయత్నించాలి, దీనికి మీరు సరైన పథంలో మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి. దేవుని ప్రజగా ఉండటం అంటే రాజ్య యుగంలోనికి ప్రవేశించడమే. ఈరోజు మీరు రాజ్య శిక్షణలోనికి ప్రవేశించే మీ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నారు, మీ భవిష్యత్ జీవితాలు ఇకపై ఇదివరకటి వలె నిర్లక్ష్యంగా యథేచ్ఛమైన రీతిలో ఉండవు; ఆవిధంగా జీవిస్తే దేవునికి అవసరమైన ప్రమాణాలను అందుకోవడం అసాధ్యం. ఈ విషయంలో నీవు ఆరాటపడటం లేదంటే, నిన్ను నీవు సరిచేసుకోవాలనే ఆసక్తి నీకు లేదనీ, నీ ప్రయత్నాలన్నీ అర్థరహితంగా, అయోమయంగా ఉన్నాయనీ, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్ధుడవు కాదనీ అర్థం, రాజ్య శిక్షణలోనికి ప్రవేశించడం అంటే దేవుని జనులుగా జీవితాన్ని ప్రారంభించడం—నీవు అలాంటి శిక్షణను అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? నీవు త్వరపడటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని క్రమశిక్షణలో జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని శిక్షను అంగీకరిస్తూ జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్కులు నీ మీదికి వచ్చి నిన్ను పరీక్షించినప్పుడు, నీవు ఎలా స్పందిస్తావు? అంతేకాక, అన్ని రకాల వాస్తవాలను నీవు ఎదుర్కొన్నప్పుడు నీవేమి చేస్తావు? గతంలో, నీవు నీ దృష్టిని జీవంపై ఉంచలేదు; కానీ, ఇప్పుడు మాత్రం జీవితం యొక్క వాస్తవికతలోనికి ప్రవేశించడంపై దృష్టి సారించడమే కాకుండా, నీ జీవిత స్వభావంలో మార్పులు చేసుకోవడానికి నీవు ప్రాకులాడాలి. రాజ్యపు ప్రజలు తప్పక సాధించాల్సింది ఇదే. దేవుని జనులందరూ జీవమును కలిగి ఉండాలి, వారు రాజ్య శిక్షణను అంగీకరించడంతో పాటు వారి జీవన వైఖరిలో మార్పులు పొందడం కోసం ప్రయత్నించాలి. రాజ్యపు ప్రజల నుండి దేవుడు ఆశిస్తున్నది ఇదే.

రాజ్య ప్రజలు కలిగి ఉండాలని దేవుడు అనుకుంటున్న లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

1. వారు దేవుడి ఏర్పాట్లను అంగీకరించాలి. అంటే, అంత్య దినాల్లో దేవుని కార్యములో పలుకబడిన వాక్కులన్నిటినీ వారు అంగీకరించాలనే విధంగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు.

2. వారు తప్పక రాజ్యపు శిక్షణ లోనికి ప్రవేశించాలి.

3. వారి హృదయాలను దేవుడు తాకాలని వారు తాపత్రయపడాలి. నీ హృదయం పూర్తిగా దేవుని వైపుకు తిరిగినప్పుడు, నీవు సాధారణ ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, నీవు స్వేచ్ఛగా జీవిస్తావు, అంటే దేవుని ప్రేమ, కాపుదల క్రింద నీవు నివసిస్తావని దీనర్థం. నీవు దేవుని కాపుదల, సంరక్షణలో నివసించినప్పుడే నీవు దేవునికి చెందిన వాడవవుతావు.

4. వారు దేవుని ద్వారా పొందుకోబడాలి.

5. భూమిపై దేవుని మహిమ యొక్క ప్రత్యక్షతగా వారు తయారవ్వాలి.

ఈ ఐదు అంశాలే నేను మీకిస్తున్న ఆజ్ఞలు. నా వాక్కులు దేవుని జనులకు వినిపిస్తాను, ఈ ఆజ్ఞలను అంగీకరించడానికి నీవు ఇష్టపడకపోతే, నేను నిన్ను బలవంతపెట్టే దేవుడిని కాను—కానీ నీవు వాటిని నిజముగా అంగీకరిస్తే, దేవుని చిత్తాన్ని చేయగలుగుతావు. ఈనాడే మీరు దేవుడి ఆజ్ఞలను అంగీకరించడం ప్రారంభించి, రాజ్య ప్రజలుగా తయారవ్వడానికి మరియు రాజ్య ప్రజలవ్వడానికి కలిగి ఉండాల్సిన ప్రమాణాలను పొందడానికి ప్రయత్నించండి. ప్రవేశించడానికి ఇది మొదటి మెట్టు. నీవు దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడానికి ఇష్టపడితే, ఈ ఐదు ఆజ్ఞలను పాటించాలి, అలా నెరవేర్చగలిగితే నీవు దేవుని హృదయానుసారుడైన వాడివిగా ఉండటమే కాకుండా దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. రాజ్య శిక్షణలోనికి ప్రవేశించడమే ప్రస్తుతం ముఖ్యమైన సంగతి. రాజ్య శిక్షణలోనికి ప్రవేశించడానికి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. గతంలో, ఆత్మీయ జీవితాన్ని గురించిన ప్రస్తావనే లేనప్పటికీ, ఇప్పుడు మాత్రం రాజ్య శిక్షణలోనికి ప్రవేశించడం ప్రారంభించావు కాబట్టి, నీవు అధికారికంగా ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశిస్తున్నావు.

ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? నీవు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే నీ హృదయం పూర్తిగా దేవుని తట్టు తిరిగి ఉండి, దేవుని ప్రేమను గ్రహించగలుగుతుంది. నీవు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే దేవుని వాక్యములో జీవిస్తావు, నీ హృదయాన్ని ఏదీ ఆక్రమించలేదు, ప్రస్తుత కాలంలో దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు మరియు నీకు అప్పగింపబడిన దానిని నెరవేర్చుటకు ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ వెలుగుచే నడిపించబడతావు. మనిషికి, దేవుడికి మధ్య ఉండే ఇలాంటి జీవితాన్నే ఆత్మీయ జీవితం అంటారు. ప్రస్తుత కాలంలోని వెలుగును నీవు వెంబడించలేకపోతే, దేవుడితో నీకున్న సంబంధంలో ఎడబాటు ఏర్పడిందని గ్రహించాలి—అది ఆఖరుకి పూర్తిగా తెగిపోవచ్చు కూడా—మరియు నీవు సాధారణ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండలేవు. దేవునితో సాధారణ సంబంధం ప్రస్తుత కాలానికి సంబంధించి దేవుని వాక్కులను అంగీకరించడమనే పునాదిపై నిర్మించబడుతుంది. నీవు సాధారణ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావా? నీవు దేవుడితో సాధారణ సంబంధాన్ని కలిగి ఉన్నావా? నీవు పరిశుద్ధాత్మ కార్యమును అనుసరిస్తున్నావా? ప్రస్తుత కాలంలో నీవు పరిశుద్ధాత్మ వెలుగును అనుసరించగలుగుతూ, ఆయన వాక్కులలోని దేవుని చిత్తాన్ని గ్రహించి, ఆ వాక్కులలోనికి ప్రవేశించగలిగితే, నీవు పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని అనుసరించగలుగుతావు. నీవు పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని అనుసరించకపోతే, నీవు సత్యాన్ని వెంబడింపగోరేవాడవు కావని నిస్సందేహంగా అర్థం అవుతుంది. తమను తాము మెరుగుపర్చుకోవాలనే ఆశ లేని వారిలో పరిశుద్ధాత్మ పనిచేసే అవకాశం ఉండదు, దీని ఫలితంగా, అటువంటి వారు ఎల్లప్పుడూ తమ బలాన్ని కూడగట్టుకోలేక ఇతరులపై ఆధారపడే వారిగానే ఉండిపోతారు ఈ రోజున నీవు పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని అనుసరిస్తున్నావా? నీవు పరిశుద్ధాత్మ ప్రవాహంలో ఉన్నావా? నీవు స్తబ్ద స్థితి నుండి బయటపడ్డావా? దేవుని మాటల యందు విశ్వాసముంచుచూ, దేవుని పనిని పునాదిగా కలిగి ఉండి ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ వెలుగును అనుసరించేవారందరూ—పరిశుద్ధాత్మ ప్రవాహములో ఉన్నారు. దేవుని వాక్కులు నిస్సందేహంగా సత్యమని మరియు ఖచ్చితమని నీవు నమ్మి, దేవుడు పలికిన మాటల యందు విశ్వాసముంచితే, నీవు దేవుని పనిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నావని అర్థం, ఈ విధంగా నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవు.

పరిశుద్ధాత్మ ప్రవాహంలోకి ప్రవేశించడానికి, నీవు దేవునితో అరమరికలు లేని సంబంధం కలిగి ఉండటంతో పాటు నీవున్న స్తబ్ద స్థితి నుండి బయటకు రావాలి. కొందరైతే ఎప్పుడూ అందరూ ఎలా ప్రవర్తిస్తే అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు, వారి హృదయం దేవుని నుండి చాలా దూరంగా ఉంటుంది; అలాంటి వారికి తమను తాము వృద్ధి చేసుకోవాలనే ఆశ ఉండదు, వారు ఎంతో అల్ప ప్రమాణాలను కలిగి ఉంటారు. దేవుడిని ప్రేమించి ఆయన దేవుని సొత్తుగా మారాలనే ప్రయత్నము మాత్రమే దేవుని చిత్తమై ఉంటుంది. కొందరు దేవుడి ప్రేమను తిరిగి చెల్లించడానికి తమ మనస్సాక్షిని మాత్రమే ఉపయోగిస్తారు, కానీ ఇలా చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు; నీవు ఎంత ఉన్నత ప్రమాణాలను అనుసరిస్తే, నీవు చేసే పనులు అంత ఎక్కువగా దేవుని చిత్తంలో ఉంటాయి. సాధారణ స్థితిలో ఉండి, దేవుని ప్రేమను వెదికే వారిగా ఉంటూ, దేవుని ప్రజగా అవ్వడానికి దేవుని రాజ్యములోనికి ప్రవేశించడమే నిజ భవిష్యత్తుగా కలిగి ఉండి, ఉన్నతమైన విలువను, ప్రాముఖ్యతను కలిగిన జీవితాన్ని మీరు కలిగి ఉంటే; మీ కంటే ధన్యులు మరెవరూ ఉండరు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను? దేవుని యందు విశ్వాసముంచని వారు శరీరాశల కొరకు మరియు సాతాను కొరకు జీవిస్తారు కాబట్టి, మీరు దేవుని కొరకు జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అందుకే మీ జీవితాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని నేను చెప్తున్నాను. దేవునిచే ఎంపిక చేయబడిన ఈ సమూహానికి చెందిన వారు మాత్రమే, ఇటువంటి విలువైన జీవితాన్ని జీవించగలరు: అంతటి విలువ మరియు సార్ధకత కలిగిన జీవితాన్ని ఈ భూమిపై మరెవ్వరూ జీవించలేరు. ఎందుకంటే, మీరు దేవునిచే ఎన్నుకొనబడి, దేవుని పెంపుదలలో ఉన్నవారై, దేవుడు మీమీద కలిగి ఉన్న ప్రేమ ద్వారా నిజమైన జీవాన్ని పొందుకోగలగడంతో పాటు ప్రశస్తమైన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకున్నారు. మీరు బాగా వెంబడించారని కాదు కానీ, దేవుని కృప ద్వారానే ఇది సాధ్యమయ్యింది; ఆయన వద్దకు రావడానికి మీకు మంచి అవకాశాన్ని కలిగించడానికి దేవుడే మీ ఆత్మీయ నేత్రములు తెరిచాడు, దేవుని ఆత్మయే మీ హృదయాలను తాకింది. దేవుని ఆత్మ మీకు అట్టి జ్ఞానమును కలిగించకపోతే, దేవుని గురించి అద్భుతమైన సంగతులను చూడలేకపోయి దేవుడిని ప్రేమించడం కూడా మీకు సాధ్యమయ్యేది కాదు. ప్రజలు పూర్తిగా తమ హృదయములను దేవుని తట్టు త్రిప్పుకొనులాగున దేవుని ఆత్మ ప్రజల హృదయాలను తాకడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కొన్నిసార్లు, నీవు దేవుని మాటలను ఆస్వాదించేటప్పుడు నీ ఆత్మ తాకబడుతుంది, మరియు నీకు దేవుడిని ప్రేమించడం తప్ప మరేదీ చేతకాదన్నట్టుగా, నీలో గొప్ప బలమున్నట్టుగా, నీవు దేవుడి కోసం ప్రక్కన పెట్టలేనిది ఏదీ లేదన్నట్టుగా అనిపిస్తుంది. నీకు ఇలా అనిపిస్తే, నీవు దేవుని ఆత్మచేత తాకబడ్డావని, నీ హృదయం దేవునిచే పూర్తిగా తాకబడిందని అర్థం, అంతేకాక నీవు దేవుడికి ఈ విధంగా ప్రార్థన చేస్తావు: “దేవా! మేము నిజముగా ముందుగానే నీ ఏర్పాటులో ఉండి నీచే ఎన్నిక చేయబడిన వారము. నీ మహిమయే నా అతిశయకారణము, నీ ప్రజలలో లెక్కించబడుట నాకెంతో మహిమయుక్తంగా ఉంది. నీ చిత్తాన్ని చేయడానికి నేను దేన్నైనా వ్యయం చేయడానికి, దేన్నైనా ఇవ్వడానికి సిద్ధం, నా జీవిత సంవత్సరములన్నియూ, నా జీవితంలోని శ్రమ అంతయూ నీ కొరకే అర్పిస్తున్నాను.” నీవు ఈ ప్రార్ధన చేసినప్పుడు, నీ హృదయంలో దేవునిపై అంతము లేని ప్రేమ మరియు నిజమైన విధేయత కలుగుతాయి. నీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగిందా? ప్రజలు తరచూ దేవుని ఆత్మచే తాకబడితే, వారి ప్రార్ధనలలో తమ్మును తాము దేవునికి సమర్పించుకోవడానికి ప్రత్యేకంగా ఇష్టపడతారు: “దేవా! నీ మహిమ దినము కొరకు కనిపెట్టుకొని నీకోసం జీవించుటకు నేను ఇష్టపడుతున్నాను—నీ కొరకు జీవించడం కంటే విలువైనది, అర్థవంతమైనది మరేదీ లేదు, మరియు సాతాను కోసం, శరీరాశల కోసం జీవించడానికి నాకు ఏమాత్రము కోరిక లేదు. ఈ రోజు నుండి నీ కొరకు జీవించేలా నన్ను బలపరచి పైకి లేవనెత్తు” అని ప్రార్థిస్తారు. నీవు ఇలా ప్రార్ధించినప్పుడు, నీవు దేవునికి నీ హృదయాన్ని సమర్పించకుండా ఉండలేవనియు, తప్పనిసరిగా దేవుడిని పొందుకోవాలని మరియు నీవు దేవుని సొత్తుగా చేయబడకుండా మరణించకూడదని అనిపిస్తుంది. ఈ ప్రార్ధన చేస్తే, ఎక్కడి నుండి వస్తుందో తెలియని ఎప్పటికీ తరగని బలం నీలో నీవు అనుభవిస్తావు; నీ హృదయములో అవధులు లేని శక్తి వశిస్తుంది, దేవుడు ఎంతో అద్భుతకరుడని మరియు ఆయన నీ ప్రేమకు పాత్రుడని నీ హృదయ తలంపులలో నీకు అనిపిస్తుంది. నీవు దేవునిచే తాకబడినప్పుడే ఇదంతా జరుగుతుంది. ఈ అనుభవాన్ని పొందుకున్న వారంతా దేవునిచే తాకబడినవారే. దేవునిచే తరచూ తాకబడేవారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి, వారు హృదయంలో తీర్మానించుకొని దేవుడిని సంపూర్ణంగా స్వీకరించడానికి ఇష్టపడతారు, వారి హృదయాలలో దేవునిపై బలమైన ప్రేమ దృఢంగా ఉంటుంది, వారి హృదయాలు పూర్తిగా దేవుని తట్టు త్రిప్పబడి, కుటుంబానికి, లోకానికి, ఈ లోకముకు, ఈ లోకపు బంధాలకు, వారి భవిష్యత్తుకు వారు ఏ మాత్రమూ ప్రాధాన్యతనివ్వకుండా వారి జీవితాన్నంతయూ దేవుని కొరకు ధారపోయడానికి ఇష్టపడతారు. దేవుని ఆత్మ చేత తాకబడిన వారందరూ సత్యాన్ని వెంబడించేవారు మరియు దేవునిచే పరిపూర్ణులుగా చేయబడేందుకు నిరీక్షిస్తున్న వారుగా ఉంటారు.

నీవు నీ హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పావా? నీ హృదయం దేవుని ఆత్మచే తాకబడిందా? నీవు అలాంటి అనుభవాన్ని పొందియుండకపోతే, మరియు నీవు అలా ఎప్పుడూ ప్రార్ధన చేసియుండకపోతే, నీ హృదయంలో దేవుడికి స్థానం లేదని అర్థమవుతుంది. దేవుని ఆత్మచే నడిపించబడుచూ, ఆయన ఆత్మచే తాకబడిన వారందరూ దేవుని పని చేయాలనే తపనను కలిగి ఉంటారు, ఇది వారిలో దేవుడి మాటలు మరియు క్రియలు బలంగా నాటుకుపోయాయని రూఢిపరుస్తుంది. కొందరు ఇలా అంటారు: “నా ప్రార్ధనలలో నేను నీ అంత ఎడతెగక ఉండటం లేదు, మరియు నేను దేవుడిచే నీలా తాకబడలేదు; కొన్నిసార్లు—నేను ధ్యానించి ప్రార్ధించునప్పుడు—దేవుడు అద్భుతకరుడని నాలో బలంగా అనిపిస్తుంది మరియు నా హృదయం దేవుడిచే తాకబడుతుంది.” మానవ హృదయం కంటే ముఖ్యమైనది మరేదీ లేదు. నీ హృదయం దేవుని తట్టు తిరిగినప్పుడు, నీలోని సమస్తము దేవుని తట్టు తిరుగుతుంది, మరియు ఆ సమయంలో నీ హృదయం దేవుని ఆత్మచే తాకబడుతుంది. మీలో అనేకులు ఇటువంటి అనుభవాన్ని పొందుకున్నారు—కాకపోతే మీ అనుభవాల లోతు మాత్రం భిన్నంగా ఉంటుంది. కొందరు ఇలా అంటారు: “నేను ఎక్కువ మాటలతో ప్రార్ధన చేయను, కేవలం ఇతరుల సంభాషణను వింటానంతే, నాలో బలం అధికమవుతుంది.” నీవు నీ అంతరంగములో దేవునిచే తాకబడ్డావని దీనర్థం. దేవునిచే అంతరంగములో తాకబడినవారు ఇతరుల సంభాషణను విన్నప్పుడు దానిచే ప్రేరేపించబడతారు; ఈ ప్రేరణనిచ్చే మాటలను ఇతరుల నుండి విన్నప్పటికీ వారి హృదయం కదిలించబడకపోతే, వారిలో పరిశుద్ధాత్మ కార్యం జరగడం లేదని అర్థం. వారిలో బలమైన కోరిక లేదు, అలా లేకపోవడమనేది వారు తీర్మానం కలిగిలేరని ఋజువు చేస్తుంది, మరియు దానిని బట్టి వారు పరిశుద్ధాత్మ కార్యానికి స్థానమివ్వడం లేదని అర్థమవుతుంది. ఒకరు దేవునిచే తాకబడితే, దేవుని మాటలు విన్నప్పుడు అతను స్పందిస్తాడు; ఒకరు దేవునిచే తాకబడకపోతే, అతను దేవుని మాటలలో నిమగ్నమై ఉండలేడు, దేవుని మాటలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండడు, మరియు అతని మనో నేత్రములు తెరవబడుట సాధ్యం కాదు. దేవుడి మాటలను విని, ఎటువంటి స్పందనను కలిగి ఉండని వారు దేవునిచే ఇంకనూ తాకబడని వారు—వారు తమలో పరిశుద్ధాత్మ కార్యమును పొందుకోలేదు. నూతన వెలుగును అంగీకరించగలిగే వారందరూ తాకబడినవారు, మరియు వారు పరిశుద్ధాత్మ కార్యములచే నింపబడినవారు.

నిన్ను నీవు తెలుసుకో:

1. పరిశుద్ధాత్మ ప్రస్తుత కార్యంలో నీవు భాగంగా ఉన్నావా?

2. నీ హృదయం దేవుని వైపుకు త్రిప్పబడిందా? నీవు దేవునిచే తాకబడ్డావా?

3. దేవుని మాటలు నీలో నాటుకుపోయాయా?

4. దేవుడి ఆవశ్యకతలు అనే పునాదిపై నీ ఆచరణ నిర్మించబడిందా?

5. పరిశుద్ధాత్మ ప్రస్తుత వెలుగు చూపే మార్గదర్శనంలో నీవు నివసిస్తున్నావా?

6. నీ హృదయంలో ఇంకనూ పాత భావనలే రాజ్యమేలుతున్నాయా, లేక ప్రస్తుత కాలంలోని దేవుని వాక్కులు రాజ్యమేలుతున్నాయా?

ఈ మాటలను వింటూ ఉంటే, మీలో ఎటువంటి స్పందన కలుగుతోంది? ఇన్ని సంవత్సరాల విశ్వాసంలో, నీ జీవితంలో దేవుని వాక్కులను భాగంగా కలిగి ఉన్నావా? నీ గత దుర్మార్గపు స్వభావంలో ఏదైనా మార్పు వచ్చిందా? నీకు ప్రస్తుత కాలంలోని దేవుని వాక్కులకు తగినట్లుగా జీవమును కలిగి ఉండటం మరియు జీవము లేకుండా ఉండటం అంటే ఏమిటో అవగాహన ఉందా? ఇది మీకు స్పష్టంగా అర్థమైందా? ప్రస్తుత రోజుల్లో దేవుని వాక్కులకు తగినట్లుగా సమస్తము జరగాలి అనేదే దేవుని వెంబడించుటలో ప్రధానంగా ఉండాల్సిన అంశం: నీవు జీవములో ప్రవేశించడానికి లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చూస్తున్నట్లయితే, సమస్తము ప్రస్తుత కాలంలో దేవుని వాక్కుల ఆధారంగా జరగాలి. నీ సంభాషణలు మరియు అనుసరించే అంశాలు ప్రస్తుత కాలంలో దేవుని వాక్కుల ఆధారంగా లేకపోతే, దేవుని వాక్కులకు ఇంకా అలవాటు పడలేదని మరియు పరిశుద్ధాత్మ కార్యముపై పూర్తిగా ఆధారపడలేదని అర్థం. తన అడుగుజాడలను అనుసరించే వారే దేవుడికి అవసరం. మీరు ఇదివరకు అర్థం చేసుకున్న దానిని ఎంత అధ్భుతంగా, స్వచ్ఛంగా అర్థం చేసుకున్నప్పటికీ, దేవుడు దానిని కోరుకోవడం లేదు, మరియు నీవు ఆ విషయాలను ప్రక్కన పెట్టలేకపోతే, భవిష్యత్తులో నీ ప్రవేశానికి అవి బలమైన అవరోధాలుగా నిలుస్తాయి. పరిశుద్ధాత్మ ప్రస్తుత వెలుగును అంగీకరించగలిగే వారందరూ ధన్యులు. పూర్వ తరముల వారు కుడా దేవుని అడుగుజాడలను వెంబడించారు, అయితే వారు ఈ రోజు వరకు దేవుడిని అనుసరించలేకపోయారు; ఇది అంత్య దినములలో దేవుని ప్రజలకు లభించే గొప్ప ధన్యత. దేవుడు ఎక్కడికి నడిపించినా అక్కడికి దేవుడిని వెంబడించులాగున పరిశుద్ధాత్మ చేసే ప్రస్తుత కార్యమును ఎవరైతే అంగీకరించగలరో, దేవుని అడుగుజాడలను ఎవరైతే అనుసరించగలరో—వారు దేవునిచే ఆశీర్వదించబడినవారు. పరిశుద్ధాత్మ చేసే ప్రస్తుత కార్యమును అనుసరించనివారు, ఇంకా దేవుని వాక్కులు నిర్వర్తించే కార్యములోనికి ప్రవేశించలేదు, మరియు వారు ఎంత కష్టపడ్డా, ఎన్ని గొప్ప శ్రమలు అనుభవించినా, ఎంత ప్రాకులాడినా, దేవుడిని కదిలించలేరు, మరియు దేవుని మెప్పు పొందలేరు. ప్రస్తుత రోజుల్లో, దేవుని ప్రస్తుత వాక్కులను అనుసరించే వారందరూ పరిశుద్ధాత్మ ప్రవాహంలో ఉన్నారు; ప్రస్తుత కాలంలో దేవుని వాక్కులను ఎరుగనివారు పరిశుద్ధాత్మ ప్రవాహానికి వెలుపల ఉన్నారు, అటువంటి వారు దేవుని మెప్పును పొందలేరు. పరిశుద్ధాత్మ ప్రస్తుతం పలుకుతున్న మాటలకు భిన్నంగా చేసే సేవ శరీరానుసారమైనది, స్వీయ తలంపులలో నుండి వచ్చినది, అది దేవుని చిత్తములో ఉండటం అసాధ్యం. ప్రజలు మతపరమైన ఆలోచనలతో నివసిస్తుంటే, వారు దేనినీ దేవుని చిత్తానికి తగినట్లుగా చేయలేరు, వారు వారి ఊహలలో, భావ కల్పనలలో నివసిస్తూ దేవుని చిత్తానికి అనుగుణంగా సేవ చేయడంలో ఏ మాత్రమూ పనికిరాని వారుగా ఉంటారు. పరిశుద్ధాత్మ చేసే పనిని అనుసరించలేని వారు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు, దేవుని చిత్తాన్ని గ్రహించలేని వారు దేవుడిని సేవించలేరు. దేవుడు తన హృదయానుసారమైన సేవను కోరుకుంటున్నాడు; మనుష్యుల ఆలోచనలతో మరియు శరీరానుసారమైన సేవలను ఆయన ఆశించడం లేదు. పరిశుద్ధాత్మ కార్యపు అడుగుజాడలను ప్రజలు అనుసరించలేకపోతే, వారు తమ స్వీయ తలంపులలోనే నివసిస్తూ ఉండిపోతారు. అలాంటి వారు చేసే సేవ అంతరాయాన్ని, అలజడిని కలిగించడంతో పాటు దేవునికి విరుద్ధంగా ఉంటుంది. ఇందునుబట్టి దేవుని అడుగుజాడలను వెంబడించలేని వారు దేవుని సేవించలేరు; దేవుని అడుగుజాడలను వెంబడించలేని వారు తప్పనిసరిగా దేవుని వ్యతిరేకిస్తూ దేవునికి అనుగుణంగా ఉండలేని స్థితిలో ఉంటారు. “పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుసరించడం” అంటే, ప్రస్తుత దినాల్లో దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలగడం, దేవుని ప్రస్తుత ఆవశ్యకతలకు అనుగుణంగా నడుచుకోగలడం, ప్రస్తుత దేవునికి లోబడి ఆయనను వెంబడించగలగడం, దేవుడు తాజాగా పలికిన పలుకుల ప్రకారం ప్రవేశించడం అని అర్థం. పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుసరిస్తూ, పరిశుద్ధాత్మ ప్రవాహంలో నిలిచే వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అట్టివారు దేవుని మెప్పును పొంది దేవుని చూడగలగడమే కాక, దేవుడు ప్రస్తుతం చేస్తున్న కార్యాలను బట్టి ఆయన మనస్తత్వాన్ని, మానవుని తప్పుడు నమ్మకాలను, అవిధేయతను, మానవ స్వభావము, నైజం వంటి వాటిని తెలుసుకోగలుగుతారు; ఇంకా, వారు సేవ చేస్తుండగా నెమ్మదిగా తమ స్వభావంలో కూడా మార్పును అనుభవిస్తారు. ఇలాంటి వారు మాత్రమే దేవుని పొందుకోగలరు, వీరు నిజమైన మార్గాన్ని కనుగొన్నారు. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా వెలుపలికి గెంటివేయబడిన వారు దేవుని ప్రస్తుత కాలపు పనిని అనుసరించలేనివారు, వీరు దేవుని ప్రస్తుత కాలపు కార్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. దేవుడు నూతన కార్యం చేయడం వలన మరియు దేవుని రూపం వారి నమ్మకాలకు తగినట్లుగా లేకపోవడం వలన అలాంటి వారు దేవుడిని బహిరంగంగా వ్యతిరేకిస్తారు—దీని ఫలితంగా, వారు దేవుడిని బహిరంగంగానే వ్యతిరేకించి దేవునిపై తీర్పు వచనాలు పలుకుతారు, ఇది దేవుడు వారిపై అసహ్యపడి వారిని తృణీకరించడానికి దారితీస్తుంది. దేవుని ప్రస్తుత కార్యాలను గురించిన జ్ఞానాన్ని పొందడం అంత సులభమేమీ కాకపోయినప్పటికీ, దేవుని కార్యానికి లోబడి దేవుని కార్యాన్ని కాంక్షించే మనసును మనుషులు కలిగి ఉంటే వారు దేవుని చూచే అవకాశం పొందుతారు, అలాగే పరిశుద్ధాత్మ నుండి సరికొత్త నడిపింపును పొందగలిగే అవకాశం పొందుతారు. దేవుని పనిని ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకించేవారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను లేదా దేవుని నడిపింపును అందుకోలేరు. ఈ విధంగా మనుషులు దేవుని ప్రస్తుత కాలపు కార్యాన్ని అందుకోగలరో లేదో అనేది దేవుని కృపపై, వారు దాని గురించి ప్రాకులాడే దానిని బట్టి, వారి ఉద్దేశాలను బట్టి ఆధారపడి ఉంటుంది.

పరిశుద్ధాత్మ ప్రస్తుతం తెలిపే సంగతులకు లోబడగలిగే వారందరూ ధన్యులు. వారు ఇదివరకు ఎలా ఉండేవారు, లేదా పరిశుద్ధాత్మ వారిలో ఇదివరకు ఎలా పనిచేసే వాడో అనే వాటితో నిమిత్తం లేదు—దేవుని ప్రస్తుత కాలపు కార్యాన్ని పొందుకోగలిగిన వారు ధన్యులు, దేవుని ప్రస్తుత కాలపు కార్యాన్ని అనుసరించలేని వారు నెట్టివేయబడతారు. నూతన వెలుగును అంగీకరించే వారినే దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన ప్రస్తుత కాలపు కార్యాన్ని అంగీకరించి ఎరిగిన వారే ఆయనకు కావాలి. మీరు నిష్కళంకమైన కన్యకగా ఉండాలని ఎందుకు చెప్పబడింది? పరిశుద్ధమైన కన్యక పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆశించేదిగా, నూతన సంగతులను గ్రహించేదిగా, పాత నమ్మకాలను పక్కన పెట్టగలిగేదిగా, ప్రస్తుత కాలంలో దేవుని కార్యానికి లోబడేదిగా ఉంటుంది. ఇందును బట్టి, ప్రస్తుత కాలంలో దేవుని సరికొత్త కార్యాన్ని అంగీకరించగలిగేవారు యుగములకు పూర్వమే దేవునిచే ముందుగానే ఏర్పరచబడినవారు, వీరు అధికమైన ఆశీర్వాదమును పొందిన వారు. మీరు దేవుని స్వరాన్ని నేరుగా వింటారు, దేవుని స్వరూపాన్ని చూస్తారు కాబట్టి, భూమ్యాకాశములలో, పూర్వ యుగములలో మీ కంటే, అనగా ఈ సమూహానికి చెందిన వారి కంటే ఆశీర్వదించబడినవారు ఎవరూ లేరు. ఇదంతా దేవుని కార్యం వలన, దేవుని ముందస్తు ఏర్పాటు, ఎంపిక, దేవుని కృప మూలముగా జరుగుతుంది; దేవుడు ఏమీ మాట్లాడకపోయి ఉంటే మీ పరిస్థితి ఈరోజు ఉన్నట్లు ఉండేదా? ఈ విధంగా, దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక, ఎందుకంటే ఇదంతా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తడం ద్వారా. ఈ సంగతులను మనసులో ఉంచుకొని, మీరింకా స్తబ్ధమైన స్థితిలోనే ఉండగలరా? మీ బలం ఇంకనూ అధికం కావడం లేదా?

నీవు తీర్పును, శిక్షను, మొత్తుటను, దేవుని వాక్కుల శుద్ధీకరణ ప్రక్రియను, దేవుని ఆజ్ఞలను అంగీకరించగలిగే వాడవైతే, యుగయుగములకు ముందే నీవు దేవునిచే ఏర్పరచబడిన వాడవని గ్రహించి ఇకపై నీవు శిక్షించబడినప్పుడు విచారానికి లోను కానవసరం లేదు. మీలో జరిగిన పనిని, మీపై కుమ్మరించబడిన దీవెనలను ఎవ్వరూ, మీకు ఇవ్వబడిన దానినంతటినీ ఎవ్వరూ మీనుండి తీసివేయలేరు. మత సంబంధులైన వారు మీతో పోలికను సహించలేరు. మీకు బైబిల్‌లో గొప్ప నైపుణ్యం లేకపోయినప్పటికీ, మీకు మతపరమైన సిద్ధాంతాల పట్ల బలమైన అవగాహన లేకపోయినప్పటికీ, దేవుడు మీలో కార్యము చేసిన కారణంగా యుగయుగాలుగా మరెవ్వరూ పొందలేనంత ఎక్కువగా పొందుకున్నారని తెలుసుకోండి—ఇదే మీ అతి గొప్ప ఆశీర్వాదం. దీని కారణంగా, మీరు దేవునికి మరింత ప్రత్యేకించబడి మరింత నమ్మకంగా జీవించాలి. దేవుడు నిన్ను లేవనెత్తాడు కాబట్టి, నీవు మరింత అధికంగా ప్రయత్నిస్తూ, దేవుని ఆజ్ఞలను అంగీకరించడానికి తగ్గట్టుగా సిద్ధపడి ఉండాలి. దేవుడు నీకిచ్చిన ప్రదేశంలో నీవు ధృడంగా నిలబడాలి, దేవుని ప్రజలలో ఎంచబడటానికై ప్రయత్నించాలి, రాజ్య శిక్షణను అంగీకరించాలి, దేవునిచే స్వీకరించబడినవాడవై చివరిగా దేవునికి మహిమయుక్తమైన సాక్షిగా తయారవ్వాలి. నీవు ఇలాంటి తీర్మానాలను చేసుకున్నావా? నీవు ఇటువంటి తీర్మానాలచే నడిపించబడుతున్నట్లయితే, అంతిమంగా దేవుడు నిన్ను తప్పకుండా స్వీకరిస్తాడు, మరియు నీవు దేవునికి మహిమయుక్తమైన సాక్షిగా తయారవుతావు. దేవునిచే స్వీకరించబడి, ఆయనకు మహిమకరమైన సాక్షిగా తయారవ్వడమే దేవుడిచ్చే ప్రధానమైన ఆజ్ఞ అని నీవు అర్థం చేసుకోవాలి. ఇది దేవుని చిత్తం.

ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ పలికే మాటల ప్రకారమే, పరిశుద్ధాత్మ తన కార్యాన్ని జరిగిస్తాడు, ఈ కాలంలో పరిశుద్ధాత్మ మానవునికి నిరంతరమూ జ్ఞానయుక్తమైన సంగతులను తెలియజేయడం అనేది పరిశుద్ధాత్మ కార్యపు వైఖరియై ఉన్నది. ప్రస్తుత రోజుల్లో పరిశుద్ధాత్మ కార్యము జరిగే విధానం ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుత కాలంలో దేవుని పనిలోనికి, మరియు సాధారణ ఆత్మీయ జీవితములోనికి ప్రజల నాయకత్వము. సాధారణ ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశించడానికి అనేక దశలు ఉన్నాయి:

1. మొదట నీ హృదయాన్ని దేవుని వాక్కులలో కుమ్మరించాలి. దేవుడు గతంలో తెలిపిన వాక్కులను నీవు అనుసరించకూడదు, ధ్యానించకూడదు లేదా ప్రస్తుత కాలంలో దేవుడు తెలిపే మాటలతో వాటిని పోల్చి చూడకూడదు. దానికి బదులుగా, మొదట నీ హృదయాన్ని ప్రస్తుత కాలంలోని దేవుని వాక్కులలో కుమ్మరించాలి. దేవుని వాక్యాన్ని, ఆత్మీయ పుస్తకాలను, గతంలోని బోధలను చదవడానికి ఇష్టపడుతూ ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ పలికే మాటలను అనుసరించని వారు అత్యంత అవివేకులైన ప్రజలు; దేవునికి అటువంటి వారంటే హేయము. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ కుమ్మరించే వెలుగును అంగీకరించడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే, ప్రస్తుత కాలంలో దేవుడు పలికే మాటలలో నీ హృదయాన్ని పూర్తిగా కుమ్మరించు. మీరు సాధించాల్సిన మొదటి విషయం ఇదే.

2. నీవు దేవుడు ప్రస్తుత కాలంలో పలికిన మాటలను ఆధారం చేసుకొని ప్రార్ధించాలి, అట్టి దేవుని వాక్కులలోనికి ప్రవేశించి దేవునితో మాట్లాడాలి, నీవు ఎలాంటి ప్రమాణాలను అందుకోవాలని తలంచుచున్నావో దేవునికి తెలియజేస్తూ దేవుని యెదుట తీర్మానాలు చేసుకోవాలి.

3. ప్రస్తుత రోజుల్లో పరిశుద్ధాత్మ కార్యపు పునాదిపై నీవు సత్యములోనికి గంభీరంగా ప్రవేశించడానికి చూడాలి. గతంలోని కాలం చెల్లిన మాటలు, సిద్ధాంతాలను పట్టుకొని ఊగులాడవద్దు.

4. పరిశుద్ధాత్మ చేత తాకబడాలని నీవు ఎదురుచూస్తూ దేవుని వాక్కులలోనికి ప్రవేశించాలి.

5. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ నడిపించే మార్గంలోనికి ప్రవేశించడానికి నీవు చూడాలి.

నీవు పరిశుద్ధాత్మ చేత తాకబడాలని ఎలా కోరుకుంటావు? దేవుడు ప్రస్తుత కాలానికి పలికే వాక్కుల ప్రకారం జీవించడం, దేవుని ఆవశ్యకతలకు తగినట్లుగా ప్రార్ధించడమే ముఖ్యం. ఈ విధంగా ప్రార్ధన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పక తాకుతాడు. దేవుడు ప్రస్తుత కాలం కొరకు పలికే మాటల ఆధారంగా నీవు దేవుని వేడుకోకపోతే, అది ఫలభరితంగా ఉండదు. నీవు ప్రార్ధించి ఇలా చెప్పాలి: “దేవా! నేను నిన్ను వ్యతిరేకించడమే కాకుండా, ఎంతో ఋణపడి ఉన్నాను; నేనెంతో అవిధేయత చూపాను, ఎప్పటికీ నిన్ను సంతృప్తిపరచలేని అశక్తుడను. దేవా, నీవు నన్ను రక్షించాలని ఆశిస్తున్నాను, అంతము వరకు నీ సేవ చేయాలని ఆశిస్తున్నాను, నీకోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. నా మరణం ద్వారా ప్రజలందరూ నీ నీతి స్వభావాన్ని తెలుసుకునే విధంగా నీవు నాకు తీర్పు తీర్చి నన్ను శిక్షించుము, నాకు ఈ విషయంలో ఫిర్యాదులేవీ లేవు; నేను నీకు విరోధంగా ప్రవర్తించాను గనుక నేను మరణమునకు పాత్రుడను.” నీవు ఈ విధంగా నీ హృదయంలో ప్రార్ధిస్తే, దేవుడు నీ ప్రార్ధన ఆలకిస్తాడు, నిన్ను నడిపిస్తాడు; పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుత కాలానికి పలికే వాక్కుల ఆధారంగా ప్రార్ధించకపోతే, పరిశుద్ధాత్మ నిన్ను తాకే అవకాశమే లేదు. నీవు దేవుని చిత్త ప్రకారం, దేవుడు ప్రస్తుత కాలంలో నెరవేర్చాలనుకుంటున్న దాని ప్రకారం ప్రార్ధిస్తే, నీవు ఇలా ప్రార్ధిస్తావు: “దేవా! నేను నీ ఆజ్ఞలను అంగీకరించి వాటికి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను, నేను చేయగలిగేదంతా దేవుని ప్రజల ప్రమాణాలకు తగినట్లుగా ఉండేలా నా జీవితాన్నంతటినీ నీ మహిమ కోసం అంకితం చేయాలని అనుకుంటున్నాను. నా హృదయం నీచే తాకబడును గాక. నీ ఆత్మ నన్ను ఎల్లప్పుడూ ఆత్మీయ వెలుగులో నడిపిస్తూ, నేను అంతిమంగా నీచే స్వీకరించబడులాగున నేను చేసేదంతా సాతానును సిగ్గుపరిచేలా నన్ను తయారు చేయాలని కోరుకొంటున్నాను.” నీవు ఈ విధంగా, మరియు దేవుని చిత్తాన్ని కేంద్రంగా చేసికొని ప్రార్ధిస్తే, పరిశుద్ధాత్ముడు తప్పనిసరిగా నీలో తన కార్యాన్ని జరిగిస్తాడు. నీ ప్రార్ధనలో నీవు ఎన్ని పలుకులు పలుకుతున్నావనేది ప్రాధాన్యం కాదు కానీ—నీవు దేవుని చిత్తాన్ని గ్రహించావా లేదా అనేదే ముఖ్యమైన విషయం. మీరందరూ ఈ క్రింది అనుభవాన్ని కలిగి ఉండవచ్చు: కొన్నిసార్లు, సమూహములో ప్రార్ధించేటప్పుడు, పరిశుద్ధాత్మ కార్యాలు వాటి అత్యధిక స్థాయికి చేరుకొని ప్రతిఒక్కరినీ బలోపేతం చేస్తాయి. కొందరు ప్రార్ధించేటప్పుడు చాలా విదారకంగా ఏడుస్తారు, విలపిస్తారు. దేవుని యెదుట పశ్చాత్తాపంతో జయిస్తారు, కొందరైతే తీర్మానాలు చేసుకుంటూ దేవుని యెదుట మ్రొక్కుబడులు చేసుకుంటారు. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా మనం ఇటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజు, ప్రజలందరూ వారి హృదయాలను దేవుని మాటలలోనికి పూర్తిగా కుమ్మరించడం చాలా ముఖ్యం. ఇదివరకెప్పుడో పలుకబడిన మాటలపై లక్ష్యముంచకండి; ఇదివరకు వచ్చినదానినే పట్టుకుని ఊగిస్తలాడుతుంటే, పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం సాధ్యం కాదు. ఇది ఎంత ముఖ్యమో మీరు గ్రహించగలుగుతున్నారా?

మీరు ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ నడిపిస్తున్న పథాన్ని తెలుసుకోగలుగుతున్నారా? పై అనేక అంశాలు పరిశుద్ధాత్మ ప్రస్తుత కాలంలోనూ, భవిష్యత్ కాలములోనూ నెరవేర్చవలసినవి; అవి పరిశుద్ధాత్మ ఎంచుకున్న పథము, మానవులు ప్రవేశించడానికి కోరుకోవాల్సిన ప్రవేశం. జీవంలోనికి నీవు ప్రవేశించేటప్పుడు, కనీసం నీవు నీ హృదయాన్ని దేవుని వాక్కులలో కుమ్మరించాలి, అలాగే దేవుని వాక్కుల ద్వారా వచ్చే తీర్పును, శిక్షను అంగీకరించగలిగేలా ఉండాలి; నీ హృదయం దేవుని కొరకు ఆరాటపడేదిగా ఉండాలి, నీవు సత్యములోనికి, దేవుడు కోరుకునే ఆవశ్యకతలలోనికి గంభీరముగా ప్రవేశించడానికి చూడాలి. నీవు ఈ బలంచే నింపబడినప్పుడు, నీవు దేవునిచే స్పృశించబడి, నీ హృదయం దేవుని తట్టు తిరగడం ప్రారంభమైనట్లు ఎంచబడుతుంది.

దేవుని వాక్కులలోనికి మీ హృదయాన్ని పూర్తిగా కుమ్మరించడమే జీవములోనికి ప్రవేశించే మొదటి అడుగు కాగా, పరిశుద్ధాత్మచే తాకబడటాన్ని అంగీకరించడమే రెండవ అడుగు. పరిశుద్ధాత్మచే తాకబడటాన్ని అంగీకరించడం ద్వారా ఎలాంటి ఫలితాన్ని పొందవచ్చు? దీని ద్వారా మరింత బలమైన సత్యాన్ని ఆకాంక్షించడం, కోరడం మరియు అన్వేషించడంతో పాటు, దేవునికి సానుకూలంగా సహకరించగలుగుతాము. ఇప్పుడు నీవు దేవునికి సహకరిస్తావు, అంటే నీ ప్రాకులాటకు, ప్రార్ధనకు, మరియు నీవు దేవుని వాక్కులతో సలిపే ఉత్తరప్రత్యుత్తరాలకు ఒక లక్ష్యం ఉంది, అలాగే దేవుని ఆవశ్యకతలకు తగినట్లుగా నీవు నీ బాధ్యతలను నిర్వర్తిస్తావు—ఇది మాత్రమే దేవునితో సహకరించడం. నీవు పనిచేయడానికి దేవుడిని అనుమతించడం గురించి మాత్రమే మాట్లాడి, ఏ చర్యా తీసుకోకుండా, ప్రార్ధన చేయకుండా, ఆయనను వేడుకోకుండా ఉంటే, దానిని సహకారం అని పిలుస్తారా? సహరించడానికి సంబంధించిన లక్షణాలు నీలో ఏ కోశానా కనిపించకపోతే, అలాగే ఒక లక్ష్యం కలిగిన ప్రవేశం కొరకు శిక్షణ పొందటానికి ఆసక్తి కనబరచకపోతే, నీవు సహకరిస్తున్నట్లు కాదు. కొందరు ఇలా అంటారు: “దేవుడు ముందుగా నిర్ణయించిన దానిపై ఆధారపడి సమస్తమూ జరుగుతుంది, ఇదంతా దేవునిచే స్వయంగా జరుగుతుంది; దేవుడు దీనిని చేసి ఉండకపోతే, మనుష్యుడు ఏ విధంగా చేయగలడు?” దేవుని కార్యం సాధారణంగానే ఉంటుంది, కొద్దిగా కూడా అతీంద్రీయమైనది కాదు, నీవు ఎడతెగక అడగడం ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తుంది. ఎందుకంటే, దేవుడు మానవుని బలవంతపెట్టడు—కార్యం చేయగలగడానికి దేవుడికి నీవు అవకాశం ఇవ్వాలి, నీవు దానిని వెంబడించకపోయినా, ప్రవేశించకపోయినా, అలాగే నీ హృదయంలో కొద్ది ఆకాంక్ష లేకపోయినా, దేవుడు నీలో కార్యం చేసే అవకాశం ఉండదు. నీవు ఏ పథం ద్వారా దేవునిచే తాకబడాలని కోరుకుంటావు? ప్రార్ధన ద్వారా, మరియు దేవునికి సమీపంగా రావడం ద్వారా. కానీ అన్నిటికంటే ముఖ్యంగా, అది దేవుడు పలికిన మాటల పునాదిపైనే ఉండాలని గుర్తుంచుకోండి. మీరు తరచూ దేవునిచే తాకబడుచున్నట్లయితే, నీవు శరీరానికి లోబడిన వాడవు కాదు: భర్త, భార్య, పిల్లలు, మరియు డబ్బు—ఇవన్నీ నిన్ను కట్టిపడేయలేవు, నీవు సత్యాన్ని మాత్రమే వెంబడిస్తూ దేవునికి ఎదుట నివసించాలని చూస్తావు. ఈ సందర్భంలో, నీవు స్వేచ్ఛా రాజ్యంలో నివసించే వాడివిగా ఉంటావు.

మునుపటి:  నేటి దేవుని పనిని ఎరిగినవారే దేవుని సేవ చేయగలరు

తరువాత:  తన హృదయానుసారులను దేవుడు పరిపూర్ణులుగా చేయును

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger