మూడు హెచ్చరికలు

దేవునిలో ఒక విశ్వాసిగా, ప్రతి విషయంలో ఆయనకు తప్ప ఇంకెవరికీ లోబడక, అన్ని విషయాలలో ఆయన చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ ఉండగలగాలి. అందరూ ఈ సందేశాన్ని అర్థంచేసుకోగలిగినా, మానవుని కష్టాల వలన—ఉదాహరణకు, అతని అజ్ఞానం, అసమంజసత, అనైతికత వలన—అన్నిటికంటే అత్యంత స్పష్టమైనవి, ప్రాథమికమైనవి అయిన ఈ సత్యాలు, అతనిలో సంపూర్ణంగా సాక్షాత్కరించవు. మీ అంతము నిర్ణయించబడక ముందే నేను మీకు ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని చెప్పాలి. నేను చెప్పడానికి ముందు, మీరు దీనిని అర్థం చేసుకోవాలి: నేను చెప్పే మాటలన్నీ మానవాళికి ఉద్దేశించిన సత్యాలే; అవి ఒక నిర్దిష్ట వ్యక్తిని లేదా ఒక నిర్దిష్ట రకానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించినవి కాదు. అందుకనే, నా మాటలను సత్యమనే దృక్కోణం నుండి అర్థం చేసుకోవడానికి మీరు మీ మనసును లగ్నం చేయాలి. అలాగే మరే ఇతర ధ్యాస లేకుండా, నిజయతీ వైఖరిని కలిగి ఉండాలి; నేను మాట్లాడే ఒక్క మాటను గానీ, ఒక్క సత్యాన్ని గానీ విస్మరించవద్దు. నేను మాట్లాడే మాటలన్నిటిని తేలికగా తీసుకోవద్దు. మీ జీవితాల్లో, సత్యానికి సంబంధించని అనేక విషయాలను మీరు చేసారని నేను చూస్తున్నాను. అందుకనే మీరు దుర్మార్గానికి, వికారానికి దాసులవ్వక, సత్యానికి దాసులయ్యి, సత్యాన్ని అణచక లేదా దేవుని ఆలయంలోని ఏ మూలను కూడా అపవిత్ర పర్చవద్దని నేను ప్రత్యేకంగా మిమల్ని అడుగుతున్నాను. మీకిదే నా హెచ్చరిక. ఇప్పుడు నేను చెప్పాలని అనుకున్న అంశాన్ని గూర్చి మాట్లాడతాను.

మొదటిగా, మీ తలరాత గురించి మీరు దేవుని అనుగ్రహాన్ని వెతకాలి. అంటే, మీరు దేవుని ఇంటిలో సభ్యులుగా మిమల్ని మీరు అంగీకరిస్తున్నారు గనుక, మీరు దేవుని వద్దకు నిశ్చలమైన మనసును తీసుకొని రావాలి, అలాగే అన్ని విషయాలలో ఆయనను తృప్తిపర్చాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, మీ క్రియల్లో నమ్మకంగా ఉంటూ, వాటిలోని సత్యానికి అనుగుణంగా ఉండాలి. ఇది నీకు చేతకాకపోతే, అప్పుడు నీవు దేవుని చేత అసహ్యించుకోబడి, విసర్జించబడతావు. అలాగే మనుష్యులందరి చేత తృణీకరించబడతావు. అలాంటి స్థితిలోకి గనుక నీవు పడిపోతే, దేవుని ఇంటివారిలో ఒకనిగా నీవు ఎంచబడవు. దానికర్థం ఏమిటంటే, దేవుని చేత నీవు అంగీకరించబడవు.

రెండవదిగా, నిజాయితీగా ఉండేవారంటే దేవునికి ఇష్టమని మీరు తెలుసుకోవాలి. సారాంశం ఏమిటంటే, దేవుడు నమ్మదగినవాడు, అందుకనే ఆయన మాటలను ఎప్పటికీ నమ్మగలం; ఇంకా, ఆయన క్రియలు దోషరహితం, ప్రశ్నించదగనవి. అందుకనే, దేవునితో పూర్తి నిజాయతీగా ఉండేవారంటే ఆయనకు ఇష్టం. నిజాయితీ అంటే, దేవునికి మీ హృదయాన్ని ఇవ్వడం, అన్ని విషయాల్లో దేవునితో యదార్థంగా ఉండటం, అన్ని విషయాల్లో ఆయనతో దాపరికం లేకుండా ఉండటం, వాస్తవాలన్నిటినీ దాచిపెట్టకుండా, మీకంటే పైనున్న, మీకు కిందున్నవారిని మీరు మోసం చేయకుండా, కేవలం దేవుని నుండి దయ పొందటానికి మాత్రమే పనులు చేస్తూ ఉండకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే, నిజాయితీగా ఉండటమంటే మీ మాటాల్లో మీ క్రియల్లో పవిత్రంగా ఉండాలి, దేవుణ్ణి గానీ మానవుని గానీ మోసం చేయకూడదు. నేను చెప్పేది చాలా సులభం, కాని మీకది రెండింతలు కష్టం. అనేకమంది నిజాయితీగా మాట్లాడలేక, పనులు చేయలేక నరకానికి వెళ్తారు. నిజాయితీలేని వారికి ఇంకో రకమైన వ్యవహారం నా వద్ద ఉంది. నిజమే, మీకు నిజాయితీగా ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, మీ స్వల్ప బుద్ధితో జనాలను కొలవడంలో మీరు చాలా దిట్ట. దీని వలన నా పని చాలా సులభమవుతుంది. మీరందరూ మీ రహస్యాలను మీ మనసులో భద్రంగా దాచుకుంటారు గనుక నేను మిమ్మల్ని, ఒకరి తర్వాత ఒకరిని, అగ్ని అనే పాఠశాలలో నేర్చుకోవడానికి విపత్తులోకి పంపిస్తాను. అటు తర్వాత మీరు నా మాటలను సంపూర్ణంగా నమ్ముతారు. తుదకు, మీ నోటి నుండే “దేవుడు నమ్మకమైన దేవుడు” అని పలికిస్తాను. అటు తర్వాత మీరు మీ రొమ్మును కొట్టుకుంటూ, “మనిషి హృదయం వక్రమైనది” అని విలపిస్తారు. ఈ సమయంలో మీ మనసు ఎలాంటి స్థితిలో ఉంది? మీరు ఇప్పుడున్న విజయోత్సవంలో ఉండరని నేను అనుకుంటున్నాను. ఇంకా, ఇప్పుడున్నట్లుగా “లోతుగా, నిగూఢంగా” ఉండరు. దేవుని సన్నిధిలో, కొంతమంది చక్కగా, మంచిగా ఉంటారు. “మంచి ప్రవర్తన” కలిగి ఉండటానికి అన్ని శ్రమలు పడతారు. ఐతే, ఆత్మ ముందు తమ కోరలు విప్పి, తమ పంజాలను విసురుతారు. అలాంటి వారిని మీరు నిజాయితీపరులతో లెక్కించగలరా? మీరు వేషధారియైతే, “వ్యక్తులతో సంబంధాలలో” నేర్పరియైనవారైతే, అప్పుఢు నీవు ఖచ్చితంగా దేవునితో చులకనగా ఉంటావని నేను అంటాను. నీ మాటలు సాకులతో, విలువలేని రుజువులతో కలిసి ఉంటే, అప్పుడు నీవు సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి ఇష్టపడని వ్యక్తివని నేను అంటాను. నీకు అనేక రహస్యాలుండి, వాటిని పంచుకోవడానికి విముఖత చూపిస్తూ, వెలుగుకు దారిని వెతుకుతూ ఇతరుల ముందు నీ రహస్యాలను—నీ కష్టాలను—బయటపెట్టడానికి అయిష్టత కల్గి ఉంటే, అప్పుడు నీకు రక్షణ అంత తొందరగా రాదని నేను అంటాను. నీవు అంత తేలికగా చీకటి నుండి బయటికి రాలేవని కూడా నేను అంటాను. సత్యానికి దారి వెతకడం నీకు చాలా ఇష్టమైతే, అప్పుడు నీవు ఎల్లప్పుడూ వెగులో నివసించే వ్యక్తివి. దేవుని ఆలయంలో సేవ చేయడానికి నీకు చాలా ఇష్టమై, ఎక్కడో మారుమూల కష్టపడుతూ నిజాయితీగా పనిచేస్తూ, ఎప్పుడూ ఇవ్వడమే గానీ తీసుకోకుండా ఉంటూ ఉంటే, అప్పుడు నీవొక నమ్మకమైన పరిశుద్ధుడవని నేను అంటాను. ఎందుకంటే, నీవు ఎటువంటి బహుమానం ఆశించక, కేవలం ఒక నిజాయితీపరునిగా ఉంటున్నావు. నీవు దాపరికంలేని వానిగా ఉండటానికి ఇష్టపడి, నీకున్నదంతటిని ఇవ్వడానికి ఇష్టపడితే, దేవుని కోసం నీ జీవితాన్నంతటిని త్యాగంచేయగలిగి, నీ సాక్షంలో స్థిరంగా ఉండగలిగితే, కేవలం దేవునిని తృప్తిపర్చడమే నీకు తెలుసు గానీ, నీ కోసం నీవు తీసుకోవడం లేదా నిన్ను నీవు పరిగణించుకోవడం నీకు చేతకానంత మట్టుకు నీవు నిజాయితీగా ఉంటే, నీవు వెలుగులో బలపడుతూ, దేవుని రాజ్యంలో నిత్యం నివసిస్తావని నేను అంటాను. నీలో నిజమైన విశ్వాసం, నిజమైన నమ్మకత్వం ఉందో లేదో, దేవుని కోసం శ్రమపడే వృత్తాంతం ఉందో లేదో, దేవునికి నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకున్నావో లేదో, నీవు తెలుసుకోవాలి. నీలో ఇవి కొదువైతే, అప్పుడు నీలో అవిధేయత, మోసం, దురాశ, ఫిర్యాదు చేసే స్వభావం ఇంకా ఉన్నట్లే. నీ హృదయం నిజాయితీకి దూరంగా ఉన్నందున, నీవు దేవుని నుండి సానుకూలమైన గుర్తింపును పొందుకోలేదు, వెలుగులో అసలు జీవించలేదు. ఒకరి తలరాత చివరకు ఎలా ఉంటుందో, వారి నిజాయితీ, ఇంకా రక్త-వర్ణం లాంటి హృదయం మీద, వారి పవిత్రమైన ఆత్మ మీద ఆధారపడుతుంది. నీవు నిజాయితీలేని వానివై, ద్వేషపూరిత హృదయం కలిగి ఉండి, అపవిత్రమైన ఆత్మ కలిగి ఉంటే, నీ తలరాతను నమోదు చేసిన పుస్తకంలో రాసినట్లు మానవునికి శిక్షను విధించే ప్రదేశంలోనే నీ ముగింపు ఉంటుంది. నీవు నిజాయితీపరునివని చెప్పుకుంటూ సత్యం ప్రకారం మాట్లాడక, ప్రవర్తించకపోతే, దేవుడు నీకు బహుమానం ఇస్తాడని ఇంకా నీవు వేచిచూస్తున్నావా? దేవుడు నిన్ను ఇంకా తన కనుపాపలో చూస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? అలాంటి తలంపు మూర్ఖత్వం కాదా? అన్ని విషయాల్లో దేవుని నీవు మోసం చేస్తున్నావు; అపవిత్ర చేతులు కలిగిన నీలాంటి వ్యక్తి దేవుని ఆలయంలో ఎలా ఉండగలడు?

మీకు చెప్పాలనుకున్న మూడవ విషయం ఇదే: దేవునిలో విశ్వాస జీవితాన్ని గడిపే ప్రతి వ్యక్తి, దేవుణ్ణి ప్రతిఘటించే, మోసం చేసే పనులు చేసారు. కొన్ని తప్పుడు పనులను నేరాలుగా నమోదు చేయనవసరం లేదు, కానీ కొన్ని క్షమించలేనివి. ఎందుకంటే, చాలా క్రియలు నిర్వాహణా చట్టాలను అతిక్రమించేవిలా ఉన్నాయి. అవి దేవుని స్వభావాన్ని నొప్పిస్తాయి. తమ తలరాత గురించి ఆందోళన చెందే అనేకమంది ఈ క్రియలు ఏమిటని అడుగుతారు. మీరు స్వాభావికంగా గర్విష్టులు, అహంకారులనీ, వాస్తవాలకు లోబడటానికి ఇష్టపడరనీ, మీరు తెలుసుకోవాలి. ఈ కారణం చేత, మిమల్ని మీరు పరిశోధించుకున్న తర్వాత, నేను కొంచెం కొంచెంగా మీకు విడమరచి చెప్తాను. కట్టడలు సారాన్ని మీరు సరిగా అర్థం చేసుకొని, దేవుని స్వభావాన్ని అర్థం చెసుకోవడానికి ప్రయత్నించాలని నేను మిమల్ని హెచ్చరిస్తున్నాను. అలా కాని పక్షంలో మీ పెదవులను కాచుకోవడం మీకు చాలా కష్టం. మీ నాలుకలు ఇష్టం వచ్చినట్లు డాంబికంగా పలుకుతాయి, దేవుని స్వభావాన్ని అనుకోకుండా నొప్పించి మీరు చీకటిలో పడిపోతారు. పరిశుద్ధాత్ముని సన్నిధిని, వెలుగును మీరు పోగొట్టుకుంటారు. నీవు నీ క్రియల్లో నీతినియమాలు లేనందువలన, నీవు చేయకూడనిది చేస్తూ మాట్లాడటం వలన, నీకు తగినట్టు ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. మాటల్లో, క్రియల్లో నీకు నీతినియమాలు లేకపోయినా, దేవుడు రెండిటిలో నీతినియమాలు అధికంగా కలిగియున్నాడని నీవు తెలుసుకోవాలి. నీవు మనిషిని కాదు గానీ దేవుణ్ణి నొప్పించావు గనుక నీవు శిక్షను పొందుకుంటున్నావు. నీవు నీ జీవితంలో దేవుని స్వభావానికి వ్యతిరేకంగా అనేకమైన అతిక్రమణలను చేస్తే, అప్పుడు నీవు నరకపు బిడ్డవవుతావు. నీవు సత్యానికి వ్యతిరేకంగా కొన్ని క్రియలను మాత్రమే చేసావని మానవునికి కనిపించవచ్చు. ఐతే, దేవుని దృష్టిలో నీకు పాప పరిహారము ఇంక లేదని నీకు తెలుసా? ఎందుకంటే, నీవు దేవుని కట్టడలను ఒకసారికంటే అధికంగా అతిక్రమించావు మరియు దాని గురించి నీకు పశ్చాత్తాపమే లేదు. అప్పుడు నిన్ను నరకంలో పడవేయడం తప్పించి ఇంకేమి చేయలేరు. దేవుడు మానవుని శిక్షించేది నరకంలోనే. కొద్ది సంఖ్యలోని ప్రజలు కొంతమంది, దేవుణ్ణి వెంబడిస్తూనే నియమాలకు వ్యతిరేకంగా క్రియలు చేసారు. కానీ, వారిని సరి చేసి, వారికి దారిని చూపించిన తర్వాత, వారు తమ అపరాధాన్ని తెలుసుకొని, సత్య మార్గంలోనికి మళ్ళి, నేడు సక్రమంగా జీవిస్తున్నారు. అలాంటివారు చివరి వరకు స్థిరంగా నిలుస్తారు. అయినను, నేను వెతికేది నీతిమంతులనే; నీవు గనుక నీతిమంతుడవై, నియమాల ప్రకారం జీవిస్తుంటే, అప్పుడు నీవు దేవునికి విశ్వాసపాత్రుడవు కాగలవు. నీ క్రియల్లో నీవు దేవుని స్వభావాన్ని నొప్పించకుండా, దేవుని చిత్తాన్ని వెతుకుతూ, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే, అప్పుడు నీ విశ్వాసం తగిన ప్రామాణాన్ని కలిగి ఉంటుంది. ఎవరైతే దేవునికి భయపడక, భయంతో వణికే హృదయాలు కలిగి ఉండరో, అట్టి వారు దేవుని కట్టడలను అతిక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేకమంది తమ ఇష్టం కొద్దీ దేవుణ్ణి సేవిస్తారు కానీ వారికి దేవుని న్యాయ విధుల పట్ల అవగాహన లేదు. ఆయన మాటల తాత్పర్యం ఇంకా అర్థం కాదు. అందుకనే, తరచుగా వారు తమ మంచి తలంపులతో దేవుని యాజమాన్యాన్ని భంగపర్చే పనులను చేస్తారు. తీవ్రమైన పరిస్థితుల్లో, వాళ్ళు ఇంకా ఆయనను వెంబడించే అవకాశం లేకుండా బయటికి విసిరివేయబడతారు. వారు నరకంలోనికి పారద్రోయబడి, దేవుని ఆలయంతో వారికి ఇంక సంబంధం ముగుస్తుంది. ఇలాంటివారు దేవుని ఆలయంలో తమ బుద్దిలేనితనపు సంకల్పాలతో పనిచేస్తూ, చివరికి దేవునికి కోపాన్ని కలిగిస్తారు. అధికారులకు, ప్రభువులకు సేవ చేసే విధానాలను దేవుని ఆలయంలోకి తీసుకొచ్చి, వాటితో ఆటలాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ వాటిని సులువుగా అన్వయించవచ్చని అనుకుంటారు. దేవునిది గొర్రె స్వభావం కాదు గాని సింహపు స్వభావం అని వారు అస్సలు ఊహించరు. అందుకనే, దేవునితో మొదటిసారి సంబంధం కల్గినవారు, ఆయనతో మాట్లాడలేరు. ఎందుకంటే, దేవుని హృదయం మానవుని హృదయం లాంటిది కాదు. అనేక సత్యాలను నీవు గ్రహించిన తర్వాతే నీవు దేవుణ్ణి తెలుసుకోవడం కొనసాగించగలవు. ఈ జ్ఞానం మాటలతో, సిద్ధాంతాలతో చెప్పలేము కానీ, ఒక నిధిగా దీన్ని ఉపయోగించి దేవునితో సాన్నిహిత్యాన్ని పొందడానికీ, ఆయన నిన్ను గూర్చి ఆనందిస్తున్నారనడానికి నిదర్శనంగా ఉపయోగించుకోవచ్చు. నీవు వాస్తవికమైన జ్ఞాన లేమి కలిగి ఉండి, సత్య హీనుడిగా ఉంటే, అప్పుడు నీ ఇష్టపూరితమైన సేవ దేవుని అసహ్యాన్ని, చీదరింపును నీ మీదకు తీసుకొస్తుంది. దేవునిలో విశ్వాసం కేవలం వేదాంత విద్య మాత్రమే కాదని ఈపాటికి నీకు అర్థమయ్యి ఉంటుంది.

నేను మిమల్ని హెచ్చరించే మాటలు క్లుప్తంగా ఉన్నాయి కానీ, నేను చెప్పినవన్నీ మీకు కొదువగా ఉన్నాయి. నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ మానవుల మధ్య నా చివరి పని అని, మానవుని ముగింపుకోసమని మీరు తెలుసుకోవాలి. ఫలితంలేని పనులేవీ నేను చేయడానికి ఇంక ఇష్టపడటం లేదు. అలాగే, కుళ్ళిపోయిన చెక్కలాంటి మనుషులకు మార్గదర్శకుడిని కావడం, రహస్యంగా చెడ్డ తలంపులు కల్గిన వారిని నడిపించడం నాకు ఇష్టం లేదు. బహుశా ఒకరోజు, నా మాటల వెనుకున్న నిజాయితీగల నా ఉద్దేశాలను, మానవాళికోసం నేను చేసిన నా సహకారాలను మీరు అర్థం చేసుకోగలరేమో. బహుశా ఒకరోజు, మీ అంతమును గూర్చి నిర్ణయించుకోవడానికి సహకరించే సందేశాన్ని మీరు గ్రహించగలరేమో.

మునుపటి:  గమ్యం గురించి

తరువాత:  అతిక్రమణలు మనిషిని నరకం వైపుకు నడిపిస్తాయి

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger