శరీరధారణ ప్రాముఖ్యతను పరిపూర్ణం చేసే రెండు శరీరధారణలు
దేవుని ద్వారా జరిగే ప్రతి కార్యపు దశకు దాని సొంత ఆచరణాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. అప్పట్లో, యేసు వచ్చినప్పుడు, పురుషుని రూపంలో వచ్చాడు, ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు, ఆయనది స్త్రీ రూపం. దీని నుండి, దేవునిచే సృష్టించబడిన స్త్రీ పురుషులిద్దరూ ఆయన కార్యములో ఉపయోగపడగలరని, ఆయనకు లింగభేదం లేదని మీరు చూడవచ్చు. ఆయన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన ఇష్టపడే ఏ శరీరాన్నైనా ఆయన తీసుకోగలడు, మరియు ఆ శరీరము ఆయనకు ప్రాతినిథ్యం వహిస్తుంది; స్త్రీయైనా పురుషుడైనా, ఆయన అవతార శరీరముగా ఉన్నంత వరకు అది ఆయనకు ప్రతినిధిగా ఉండగలదు. యేసు వచ్చినప్పుడు ఆయన స్త్రీగా ప్రత్యక్షమైనప్పటికీ, మరో మాటలో చెప్పాలంటే, మగ శిశువు కాకుండా, ఆడ శిశువు పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించి ఉన్నప్పటికీ, ఆ కార్యపు దశ అదేవిధంగా పూర్తయ్యేది. అప్పుడు అలా జరిగి ఉంటే, బదులుగా ప్రస్తుత కార్యపు దశ పురుషుని ద్వారా పూర్తి చేయబడేది. అయితే, కార్యము మాత్రం అదేవిధంగా పూర్తిచేయబడేది. ప్రతి దశలో చేయబడే కార్యము దాని ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది; ఏ దశ కార్యమూ పునరావృతం కాదు, అది ఒకదానితో మరొకటి విభేదించదు. ఆ కాలంలో, యేసు ఆయన కార్యాన్ని చేసినప్పుడు, ఏకైక కుమారునిగా పిలవబడ్డాడు, “కుమారుడు” అనేది పురుష లింగాన్ని సూచిస్తుంది. ప్రస్తుత దశలో ఏకైక కుమారుడని ఎందుకు ప్రస్తావించబడలేదు? ఎందుకంటే, కార్యపు అవసరతలు యేసు లింగ మార్పును తప్పనిసరి చేశాయి. దేవునికి లింగ బేధం లేదు. ఆయన తన కార్యాన్ని తాను కోరుకున్న విధంగా చేస్తాడు, ఆయన చేసే కార్యములో ఆయన ఎటువంటి పరిమితులకు లోబడకుండా, ప్రత్యేకించి స్వేచ్ఛగా ఉంటాడు. ఇంకా, కార్యపు ప్రతి దశకు దాని సొంత ఆచరణాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడు రెండుసార్లు శరీరధారిగా మారాడు, అంత్య దినాల్లోని ఆయన శరీరధారణయే అంతిమ సమయం అని అదే స్వయంగా నిరూపిస్తుంది. ఆయన తన క్రియలన్నిటినీ తెలియజేయడానికి వచ్చాడు. ఈ దశలో మనిషి సాక్ష్యమివ్వడానికి ఆయన వ్యక్తిగతంగా కార్యమును చేయడానికి శరీరధారిగా మారకపోతే, దేవుడు ఎప్పటికీ స్త్రీ కాదు, పురుషుడే అనే భావన మనిషి కలిగి ఉండేవాడు. దీనికి ముందు, దేవుడు పురుషుడు మాత్రమేనని స్త్రీ దేవునిగా పిలవబడలేదని మానవజాతి అంతా నమ్మారు, ఎందుకంటే మానవజాతి అంతా పురుషులకు స్త్రీలపై అధికారం ఉందని భావించారు. పురుషుడు తప్ప, ఏ స్త్రీ కూడా అధికారం చేపట్టదని వారు నమ్మారు. ఇంకా ఏమిటంటే, స్త్రీకి పురుషుడే శిరస్సని, స్త్రీ పురుషునికి తప్పనిసరిగా లోబడాలని మరియు స్త్రీ పురుషుడిని అధిగమించకూడదని కూడా వారు చెప్పారు. గతంలో, స్త్రీకి పురుషుడు శిరస్సని చెప్పబడినప్పుడు, అది సర్పముచే మోసగించబడిన ఆదాము అవ్వలకు ఉద్దేశించి చెప్పబడిందే తప్ప, ఆదిలో యెహోవా చేత సృష్టించబడిన స్త్రీ, పురుషుడి గురించి కాదు. నిజానికి, స్త్రీ తన భర్తకు లోబడి అతడిని ప్రేమించాలి, భర్త తన కుటుంబాన్ని పోషించి సంరక్షించడం నేర్చుకోవాలి. భూమి మీద మానవజాతి తమ జీవితాల్లో కట్టుబడి ఉండడానికి యెహోవా ద్వారా నియమించబడిన కట్టడలు మరియు శాసనాలు ఇవే. యెహోవా స్త్రీతో, “నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.” మానవజాతి (అంటే స్త్రీ పురుషులిద్దరూ) యెహోవా అధీనంలో సాధారణమైన జీవితాలను జీవించడానికి, మానవాళి జీవితాలు ఒక నిర్మాణాన్ని కలిగి ఉండడానికి, వారు సరైన క్రమంలో నుండి పడిపోకుండా ఉండడానికి మాత్రమే యెహోవా ఈ విధంగా మాట్లాడాడు. కాబట్టి, స్త్రీ పురుషులు ఎలా ప్రవర్తించాలో తగిన నియమాలను యెహోవా రూపొందించాడు, అయితే ఇది భూమిమీద సృజించబడి జీవిస్తున్న వాటన్నిటికి సంబంధించింది మాత్రమే, శరీరధారి అయిన దేవుని దేహానికి దీనితో ఎలాంటి సంబంధం లేదు. దేవుడు తాను సృజించిన వారితో సమంగా ఎలా ఉండగలడు? ఆయన వాక్యాలు ఆయన సృజించిన మానవాళికి మాత్రమే నిర్దేశించబడ్డాయి; మానవాళి సాధారణ జీవితాలను జీవించడానికి ఆయన ఈ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆది యందు, యెహోవా మానవజాతిని సృజించినప్పుడు స్త్రీ మరియు పురుషుడు, అనే రెండు రకాల మానవులను చేశాడు; అందువలన ఆయన అవతార దేహాలలో స్త్రీ పురుషులనే వర్గీకరణ ఉంది. ఆయన ఆదాము అవ్వలతో మాట్లాడిన మాటల ఆధారంగా తన కార్యాన్ని నిర్ణయించుకోలేదు. మానవాళిని మొదటగా సృజించిన సమయంలోనే ఆయన ఆలోచనల ప్రకారం రెండుసార్లు శరీరునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు; అంటే, ఆయన తన రెండు శరీరధారణల కార్యాన్ని స్త్రీ పురుషులను బట్టి వారు చెడిపోక ముందే పూర్తి చేశాడు. సర్పము చేత మోసగించబడిన ఆదాము హవ్వలకు యెహోవా చెప్పిన మాటలను మానవాళి స్వీకరించి, దేవుని శరీరధారణ కార్యానికి వాటిని అన్వయిస్తే, యేసు కూడా తనకు నచ్చిన విధంగా తన భార్యను ప్రేమించాల్సిన అవసరం లేదా? దేవుడు ఇంకా ఈ విధంగానే దేవునిగా ఉంటాడా? ఈ విధంగానే ఉంటే, ఆయన తన కార్యమును ఇప్పటికీ పూర్తి చేయగలడా? శరీరధారిగా అవతరించిన దేవుని దేహం స్త్రీగా ఉండటం తప్పు అయితే, స్త్రీని సృజించడం మహోన్నతుడైన గొప్ప దేవుడు చేసిన తప్పు కాదా? దేవుడు స్త్రీగా అవతరించడం తప్పు అని ఇప్పటికీ ప్రజలు విశ్వసిస్తున్నట్లయితే, వివాహం చేసుకోకపోయిన కారణంగా, తన భార్యను ప్రేమించలేకపోవడమనేది యేసు అవతారంలోని లోపం కాదా? నేడు దేవుని అవతారపు సత్యాన్ని కొలవడానికి హవ్వతో యెహోవా మాట్లాడిన మాటలను మీరు ఉపయోగిస్తున్నారు కాబట్టి, కృపా కాలంలో శరీరధారియైన యేసు ప్రభువును తీర్పు తీర్చడానికి ఆదాముతో యెహోవా మాట్లాడిన మాటలను మీరు ఉపయోగించాలి. ఇవి ఒకే విధమైనవి కావు కదా? సర్పము చేత మోసగించబడని పురుషుని ప్రకారం, మీరు ప్రభువైన యేసును కొలవడం వల్ల, సర్పము చేత మోసగించబడిన స్త్రీని బట్టి నేటి అవతార సత్యాన్ని తీర్పు తీర్చలేరు. అది అన్యాయం అవుతుంది! దేవుడిని మీరు ఈ విధంగా కొలవడం వల్ల మీకు వివేకము లేదని రుజువు అవుతుంది. యెహోవా రెండు సార్లు శరీరునిగా అయినప్పుడు, తన శరీరపు లింగము సర్పము చేత మోసగించబడని స్త్రీ మరియు పురుషునికి సంబంధించినది; సర్పముచే మోసగించబడని స్త్రీ పురుషులకు అనుగుణంగా ఆయన రెండుసార్లు శరీరధారి అయ్యాడు. సర్పముచే మోసగించబడిన ఆదాము పురుషత్వము మరియు యేసు పురుషత్వము ఒకటే అనుకోకండి. రెండూ పూర్తిగా సంబంధం లేనివి, వాళ్లు రెండు విభిన్న స్వభావాలు కలిగిన పురుషులు. యేసు పురుషత్వమనేది ఆయన స్త్రీలందరికే తప్ప పురుషులకు శిరస్సు కాలేడని ఖచ్చితంగా చెప్పగలమా? ఆయన యూదులందరికీ (పురుషులు మరియు స్త్రీలతో సహా) రాజు కాదా? ఆయనే దేవుడు, స్త్రీకి మాత్రమే కాదు పురుషునికి కూడా ఆయనే శిరస్సు. ఆయన సమస్త జీవులకు ప్రభువు మరియు అధిపతియై ఉన్నాడు. యేసు పురుషత్వాన్ని స్త్రీ శిరస్సుకు చిహ్నమని మీరెలా నిర్ణయించగలరు? అది దైవదూషణ కాదా? యేసు చెడిపోయిన పురుషుడు కాదు. ఆయన దేవుడు; ఆయన క్రీస్తు; ఆయనే ప్రభువు. ఆదాము వలె చెడిపోయిన పురుషునిగా ఆయన ఎలా ఉండగలడు? దేవుని అత్యంత పరిశుద్ధాత్మ ధరించిన శరీరమే యేసు. ఆయన ఆదాము లాంటి పురుషత్వం కలిగిన దేవుడని నీవెలా చెప్పగలవు? అదే నిజమైతే, దేవుని కార్యమంతా తప్పే కదా? సర్పముచే మోసగించబడిన ఆదాము పురుషత్వాన్ని యేసులో యెహోవా ప్రవేశపెడతాడా? లింగ పరంగా యేసుకు భిన్నంగా మరియు స్వభావంలో ఆయన లాగా ఉండే, ప్రస్తుత కాలపు అవతారం దేవుని అవతారపు కార్యానికి మరొక ఉదాహరణ కాదా? సర్పముచే మోసగించబడినది స్త్రీ కాబట్టి, దేవుని శరీరధారణ స్త్రీ కాబోదని చెప్పే దైర్యం నీకు ఇంకా ఉందా? స్త్రీ అత్యంత అపవిత్రమైనది మరియు మానవజాతి చెడిపోవడానికి మూలం కాబట్టి, దేవుడు స్త్రీగా శరీరం ధరించలేకపోయాడని చెప్పే ధైర్యం నీకు ఇంకా ఉందా? “స్త్రీ ఎప్పుడూ పురుషునికి లోబడాలి, అలాగే స్పష్టంగా లేక ప్రత్యక్షంగా దేవునికి ప్రతినిధిగా ఉండకూడదు” అని నీవు గట్టిగా చెప్తున్నావా? గతంలో నీవు అర్ధం చేసుకోలేదు, కానీ ఇప్పుడు దేవుని కార్యాన్ని, ముఖ్యంగా దేవుని అవతార దేహాన్ని దూషించగలవా? ఇది నీకు స్పష్టంగా తెలియకపోతే, నీ మూర్ఖత్వము, అజ్ఞానము, వికార స్వరూపము బయట పడకుండా ఉండడానికి నీ నాలుకను జాగ్రత్తగా చూసుకో. నీకు సర్వం అర్ధమైందని అనుకోవద్దు. నీవు చూసి అనుభవించినవన్నీ నా నిర్వహణ ప్రణాళికలో వెయ్యో వంతు అర్ధం చేసుకోడానికి కూడా సరిపోవని నేను నీకు చెప్తున్నాను. అలాంటప్పుడు, నువ్వెందుకు గర్వంగా ప్రవర్తిస్తున్నావు? నీకున్న కొద్దిపాటి ప్రతిభ, చిన్నపాటి జ్ఞానమనేది యేసు తన కార్యములో ఒక్క క్షణం ఉపయోగించుకోడానికి కూడా సరిపోదు! నిజంగా నీకు ఎంత అనుభవం ఉంది? నీ జీవితకాలంలో నీవు చూసి, విని, ఊహించినవన్నీ నేను ఒక్క క్షణంలో చేసే కార్యము కంటే తక్కువే! అనవసరమైన లోపాల కోసం వెదకి తప్పును కనుగొనకపోవడమే నీకు ఉత్తమం. నీవు కోరుకున్నంత దురహంకారంతో నీవు ఉండగలవు, కానీ నీవు ఒక చీమతో సమానమైన జీవి తప్ప ఇంకేమీ కాదు! నీ కడుపులో నీవు కలిగి ఉన్నదంతా చీమ కడుపులో ఉన్న దాని కంటే తక్కువ! నీవు కొంత అనుభవమును సంపాదించుకున్నంత మాత్రాన, అది నీకు క్రూరంగా ప్రవర్తించడానికి పెద్దగా మాట్లాడడానికి హక్కును కలిగిస్తుందని అనుకోవద్దు. నీ అనుభవం, నీ జ్యేష్టత్వం నేను చెప్పిన మాటల వలన వచ్చింది కాదా? అవి నీ కష్టానికి నీ శ్రమకి బదులుగా వచ్చాయని నీవు నమ్ముతున్నావా? నేడు, నేను శరీరధారిగా మారాడాన్ని నీవు చూస్తున్నావు దీన్ని బట్టి నీకు అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి మరియు వాటినుండి కలిగే తలంపులకు అంతం లేదు. నా అవతారం కోసం కాకపోతే, నీవు అసాధారణమైన ప్రతిభ కలిగి ఉన్నా కూడా, నీకు అనేకమైన భావనలు ఉండవు; నీ భావనలు వాటి నుండి వచ్చినవి కావా? యేసు మొదటిసారి శరీరధారిగా అయ్యుండకపోతే, నీకు అవతారం గురించి తెలిసేదా? రెండవ అవతారం గూర్చి తీర్పు తీర్చడానికి నీవు మొండిగా ప్రయత్నించడానికి కారణం మొదటి అవతారం నీకు ఇచ్చిన జ్ఞానం కాదా? విధేయత కలిగిన అనుచరుడిలా ఉండడానికి బదులు ఎందుకు నీవు ఈ విషయాన్ని అధ్యయనానికి గురి చేస్తున్నావు? ఈ విషయములోకి వచ్చి, శరీరధారి అయిన దేవుని ఎదుటకు నీవు వచ్చినప్పుడు, ఆయనను శోధించడానికి నిన్ను అనుమతిస్తాడా? నీవు నీ కుటుంబ చరిత్రను పరిశోధించుకోవచ్చు, కానీ దేవుని కుటుంబ చరిత్రను నీవు పరిశోధించాలని ప్రయత్నిస్తే, అటువంటి అధ్యయనం నిర్వహించడానికి నేటి దేవుడు నిన్ను అనుమతిస్తాడా? నీవు గుడ్డివాడవు కాదా? నీ పైకి నీవే తిరస్కారాన్ని కొనితెచ్చుకోవట్లేదా?
ఈ అంత్య దినాల్లో యేసు చేసిన కార్యము జరిగి, అది పూర్తి అయ్యుండకపోతే, దేవుని ఏకైక కుమారుడు కాకుండా, ఆ తర్వాత ఇంకొక పేరుతో ఎవరు వచ్చినా, స్వయంగా దేవుడే వచ్చినా, యేసు మాత్రమే దేవునికి ఏకైక కుమారుడని, దేవునికి ఒక్కడే కుమారుడనే భావనకే మనిషి ఎప్పటికీ కట్టుబడి ఉండేవాడు. పాపపరిహారార్ధ బలిగా జరిగించే వారెవరైనా దేవుని పక్షముగా అధికారాన్ని తీసుకొని, మానవ జాతిని విమోచించే వారెవరైనా దేవునికి ఏకైక కుమారుడనే భావన మనిషికి ఉంది. వచ్చేవాడు పురుషుడు అయినందున, దేవునికి ఏకైక కుమారుడని దేవుని ప్రతినిధిగా పరిగణించబడతాడని విశ్వసించే వారు కొందరు ఉన్నారు. యేసు యెహోవా కుమారుడని, ఆయనకు ఏకైక కుమారుడని చెప్పేవారు కూడా ఉన్నారు. అలాంటి ఆలోచనలు మరీ అతిగా లేవా? అంత్య కాలంలో కార్యపు దశ పూర్తి కాకపోతే, అప్పుడు మానవజాతి మొత్తం దేవుని పట్ల అంధకారపు నీడలో మరుగుపడి ఉంటుంది. అదే గనుక జరిగితే, మనిషి తనను తాను స్త్రీ కంటే ఉన్నతంగా ఊహించుకుంటాడు, మరియు స్త్రీలు ఎప్పటికీ తలెత్తుకోలేరు, ఆపై ఒక్క స్త్రీ కూడా రక్షించబడదు. దేవుడు పురుషుడని, అంతేకాకుండా, ఆయన ఎల్లప్పుడూ స్త్రీని తృణీకరించి మరియు ఆమెకు రక్షణను అనుగ్రహించడని ప్రజలు ఎప్పుడూ భావిస్తుంటారు. అదే గనుక జరిగితే, యోహోవాచే సృజించబడి మరియు చెడిపోయిన, స్త్రీలందరికీ రక్షింపబడే అవకాశము ఇక ఎన్నటికీ ఉండదేనేది వాస్తవం కాదా? మరి అలాంటప్పుడు యెహోవా స్త్రీని, అంటే, హవ్వను సృజించడం అర్ధరహితం కదా? అప్పుడు స్త్రీ శాశ్వతంగా నశించిపోదా? ఈ కారణాన్ని బట్టే, అంత్య దినాల్లోని కార్యపు దశ స్త్రీని మాత్రమే కాకుండా, సమస్త మానవజాతిని రక్షించడానికి చేపట్టబడింది. స్త్రీని రక్షించడానికి మాత్రమే దేవుడు స్త్రీ శరీరధారి అయ్యాడని ఎవరైనా అనుకుంటే, అప్పుడు ఆ వ్యక్తి నిజంగా మూర్ఖుడే!
నేటి కార్యము కృపా కాలపు కార్యాన్ని ముందుకు నెట్టింది; అంటే, మొత్తం ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక కింద ఉన్న కార్యము ముందుకు కదిలింది. కృపా కాలము ముగిసిపోయినప్పటికీ, దేవుని కార్యములో మాత్రం పురోగతి ఉంది. ఈ కార్యపు దశ కృపా కాలము మరియు ధర్మశాస్త్ర కాలంపై కట్టబడుతుందని పదేపదే నేను ఎందుకు చెప్తున్నాను? నేటి కార్యము కృపా కాలంలో జరిగించబడిన కార్యానికి కొనసాగింపు, మరియు ధర్మశాస్త్ర కాలంలో జరిగిన దానికంటే ముందుకు సాగడం. మూడు దశలు పటిష్టంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి, ఆ గొలుసులోని ప్రతి మెలిక తదుపరి దానితో దగ్గరగా వేయబడి ఉంటుంది. ఈ కార్యపు దశ యేసు జరిగించిన దానిపై కట్టబడి ఉంటుందని నేను ఎందుకు చెప్తున్నాను? ఈ కార్యము యేసు జరిగించిన కార్యము మీద కట్టబడలేదని అనుకుంటే, అప్పుడు ఈ దశలో ఇంకో సిలువ కార్యము జరగవలసి ఉంటుంది, మరియు కిందటి దశ విమోచన కార్యాన్ని మొత్తాన్ని మళ్ళీ చేయవలసి వస్తుంది. ఇదంతా అర్ధం లేనిది అవుతుంది. అంటే, కార్యము పూర్తిగా అయిపోయిందని కాదు, కానీ కాలము ముందుకు సాగి మరియు కార్యపు స్థాయి మునుపటి కంటే ఉన్నతముగా ఎదిగిందని భావం. ఈ కార్యపు దశ ధర్మశాస్త్ర కాలపు పునాదిపై మరియు యేసు కార్యమనే బండపై కట్టబడిందని చెప్పవచ్చు. దేవుని కార్యము దశల వారీగా కట్టబడింది, మరియు ఈ దశ నూతన ఆరంభమేమీ కాదు. మూడు దశల కార్యపు సమ్మేళనమే ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికగా పరిగణించబడుతుంది. ఈ కార్యపు దశ కృపా కాలపు కార్యము యొక్క పునాది మీద జరిగించబడింది. ఒకవేళ కార్యపు ఈ రెండు దశలు సంబంధం లేనివి అయితే, మరి సిలువ కార్యము ఈ దశలో ఎందుకు పునరావృతం కాలేదు? ఎందుకు నేను మనిషి పాపాలను భరించకపోగా, బదులుగా మనిషి నేరుగా తీర్పు తీర్చి, దండించడానికి వచ్చాను? ఒకవేళ నా కార్యము మనిషిని తీర్పు తీర్చి మరియు దండించి, తదుపరి సిలువ వేయబడకుండా, పరిశుద్దాత్మ ద్వారా గర్భం దాల్చకుండా ఇప్పుడు వచ్చి ఉంటే, అప్పుడు నేను మనిషిని తీర్పు తీర్చి దండించడానికి అర్హత పొందను. యేసుతో ఉన్నది ఖచ్చితంగా నేనే కాబట్టి మానవుని దండించి తీర్పు తీర్చడానికి నేను నేరుగా వచ్చాను. ఈ దశలోని కార్యము మొత్తం మునుపటి దశలోని కార్యం మీద కట్టబడింది. అందుకే ఈ రకమైన కార్యము మాత్రమే మనిషిని అంచెలంచెలుగా రక్షణలోనికి తీసుకురాగలదు. నేను మరియు యేసు ఒకే ఆత్మ నుండి వచ్చాము. మా శరీరాల పరంగా మేము వేరుగా ఉన్నప్పటికీ, మా ఆత్మలు ఒక్కటే; మేము చేసే కార్యక్రమం మరియు మేము చేసే కార్యము ఒకేలా లేకపోయినప్పటికీ, స్వభావ పరంగా మేము ఒకేలా ఉంటాము; మా శరీరాలు వేర్వేరు రూపాలు కలిగి ఉన్నాయంటే, ఇది యుగములోని మార్పు మరియు మా కార్యపు విభిన్న అవసరతలు కారణమై ఉన్నాయి; మా పరిచర్యలు ఒకేలా ఉండవు, కాబట్టి మేము ముందుంచే కార్యము మరియు మనిషికి మేము బయలుపరిచే స్వభావాలు కూడా వేరుగా ఉంటాయి. అందుకే నేడు మనిషి చూసేది మరియు గ్రహించేది గతానికి భిన్నంగా ఉంటుంది, దీనికి కారణం యుగంలో కలిగిన మార్పు. అందరికీ వారి శరీర రూపాలలోను మరియు లింగ పరంగా వేరుగా ఉన్నారని, మరియు వారు ఒకే కుటుంబములో పుట్టలేదని, ఇంకా ఒకే కాలానికి చెందలేదని, అనిపించినా వారి ఆత్మ ఒక్కటే. వారి శరీరాలు ఏ విధమైన రక్తాన్ని మరియు శారీరక బంధుత్వాన్ని పంచుకోలేదు, వారు రెండు వేర్వేరు కాలాలకు చెందిన దేవుని మానవావతారపు దేహాలని తిరస్కరించలేము. వారు దేవుని శరీరధారణ దేహాలు అనేది కాదనలేని సత్యము. అయితే, వారు ఒకే రక్త సంబంధానికి చెందినవారు కాదు మరియు ఒకే మానవ భాషను పంచుకున్నవారు కాదు (ఒకరు యూదుల భాషను మాట్లాడే పురుషుడు మరియు మరొకరు చైనీస్ మాత్రమే మాట్లాడే స్త్రీ). ఈ కారణాలను బట్టి వారు ఒకొక్కరూ చేయదగిన కార్యాన్ని, అదికూడా వేర్వేరు కాలాల్లో చేయడానికి, వారు వేర్వేరు దేశాల్లో నివసించారు. వారు ఒకే ఆత్మ అన్నది, ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నారన్నది వాస్తవమైనప్పటికీ, వారి బాహ్యపు కవచాల మధ్య ఖచ్చితమైన సారూప్యతలేవీ లేవు. వారు పంచుకున్నదల్లా ఒకే మానవ స్వభావం, అయితే వారి శరీరాల బాహ్య రూపాలు మరియు వారు జన్మించిన పరిస్థితులకు సంబంధించినంత వరకు వారు ఒకేలా ఉండరు. ఈ విషయాలేవీ వారికి సంబంధించిన కార్యముపై గానీ వారి గురించి మనిషి కలిగి ఉన్న అవగాహన మీద గానీ ఎలాంటి ప్రభావం చూపవు, ఎందుకంటే, అంతిమ విమర్శలో వారు ఒకే ఆత్మగా మరియు ఎవరూ విడదీయలేని వారుగా ఉంటారు. వారు రక్త సంబంధీకులు కాకపోయినప్పటికీ, వారి అస్తిత్వాలు మొత్తం వారి ఆత్మల స్వాధీనంలో ఉంటూ, వేర్వేరు కాలాల్లో వేర్వేరు కార్యాలను వారికి కేటాయించాయి మరియు వారి శరీరాలు వేర్వేరు రక్త సంబంధాలను కలిగి ఉంటాయి. యెహోవా ఆత్మ యేసు ఆత్మకు తండ్రి కాదు, మరియు యేసు ఆత్మ యెహోవా ఆత్మకు కుమారుడు కాదు: వారు ఒక్కరే మరియు ఒకే ఆత్మ. అదేవిధంగా, ఈ నాటి శరీరధారి అయిన దేవుడు మరియు యేసు రక్త సంబంధీకులు ఏమీ కాదు, కానీ వారు ఒక్కరే, ఎందుకంటే వారి ఆత్మలు ఒక్కటే. దేవుడు దయ మరియు ప్రేమా కనికర పూర్వకమైన కార్యము, అలాగే మానవుని పట్ల నీతియుక్తమైన తీర్పు మరియు దండన, మనిషిపై శాపాలను కురిపించి; చివరకు, లోకాన్ని నాశనం చేసి దుష్టులను శిక్షించే కార్యాన్నీ చేయగలడు. ఆయనే ఇవన్నీ చేయలేదా? ఇది దేవుని సర్వశక్తి కాదా? మనిషి కోసం ఆయన న్యాయ విధులను ప్రకటించడం మరియు అతనికి ఆజ్ఞలను ఇవ్వడం రెండూ చేయగలిగాడు, మరియు ఆదిమ ఇశ్రాయేలీయులను భూమి మీద వారి జీవితాలను జీవించడానికి కూడా ఆయన నాయకత్వం వహించి, దేవాలయము మరియు బలిపీఠాలను కట్టడంలో వారికి ఉపదేశించి, ఇశ్రాయేలీయులందరినీ తన ఆధీనంలో ఉంచుకోగాలిగాడు. ఆయన అధికారాన్ని బట్టి, ఆయన భూమి మీద ఇశ్రాయేలు ప్రజలతో రెండు వేల సంవత్సరాలు నివసించాడు. ఇశ్రాయేలీయులు ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసే సాహసం చేయలేదు; అందరూ యెహోవాను గౌరవించి ఆయన ఆజ్ఞలను పాటించారు. నీతియుక్తమైన ఆయన అధికారము మరియు ఆయన సర్వశక్తి ద్వారా జరిగిన కార్యము అలాంటిది. మరి, కృపా కాలంలో, నశించిన సమస్త మానవజాతిని (ఇశ్రాయేలీయులను మాత్రమే కాదు) విమోచించడానికి యేసు వచ్చాడు. మనిషి పట్ల ఆయన దయ మరియు ప్రేమపూర్వక కనికరాన్ని చూపించాడు. కృపా కాలంలో మానవుడు చూసిన యేసు ప్రేమ కనికరంతో నిండినదై, మానవుని పట్ల ఎల్లప్పుడూ ప్రేమను కలిగినదై ఉంది, ఎందుకంటే ఆయన మానవజాతిని పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. ఆయన సిలువ వేయబడి మానవజాతిని పాపమూ నుండి పూర్తిగా విమోచించే వరకు మనుష్యులను, వారి పాపాలను ఆయన క్షమించగలిగాడు. ఈ నాటి కాలంలో, దేవుడు మనిషి యెదుట దయ మరియు ప్రేమ కనికరాలతో ప్రత్యక్షమయ్యాడు; అంటే, ఆయన మానవుని కోసం పాపపరిహారార్ధ బలిగా మారి, మానవ పాపాల బట్టి సిలువ వేయబడ్డాడు, తద్వారా అవి శాశ్వతంగా క్షమించబడతాయి. ఆయన దయగలవాడు, కరుణామయుడు, సహనశీలుడు, మరియు ప్రేమమయుడు. కృపా కాలంలో ఆయనను అనుసరించిన వారందరూ అదే విధమైన సహనము మరియు ప్రేమ సమస్త విషయాలలో కలిగి ఉండాలని వేడుకున్నారు. వారు సహనము కలిగి, కొట్టబడినా, శపించబడినా, లేక రాళ్లతో కొట్టబడినా సరే ఎన్నడూ ప్రతిఘటించలేదు. కానీ అంతిమ దశ ఇకపై అలా ఉండదు. యేసు మరియు యెహోవా ఒకే ఆత్మను కలిగి ఉన్నప్పటికీ వారి కార్యము మొత్తము ఒకేలా ఉండదు. యెహోవా కార్యము యుగాంతాన్ని తీసుకురాలేదు, కానీ కాలాన్ని నడిపించి, భూమి మీద మానవజాతికి జీవితానికి నాంది పలికింది, ఈనాటి కార్యము అన్య దేశాల్లో ఘోరంగా చెడిపోయిన వారిని జయించడం, మరియు చైనాలో దేవుడు ఏర్పరచుకున్న వారిని మాత్రమే కాకుండా, సర్వలోకాన్ని మరియు సమస్త మానవజాతిని నడిపించడం. ఈ కార్యము కేవలం చైనాలో మాత్రమే జరుగుతున్నట్లు నీకు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది ఇదివరకే విదేశాలకు విస్తరించడం ప్రారంభమైంది. చైనాకు బయట ఉన్న ప్రజలు సత్య మార్గాన్ని పదేపదే ఎందుకు అన్వేషిస్తున్నారు? ఎందుకంటే, ఆత్మ ఇప్పటికే కార్యము చేయడానికి సిద్దంగా ఉన్నాడు, మరియు నేడు మాట్లాడిన వాక్యాలు లోకమంతటా ఉన్న ప్రజల వైపునకు నిర్దేశించబడ్డాయి. దీనితో, సగం కార్యం ఇప్పటికే జరుగుతున్నట్టే. లోకము సృజించబడినది మొదలుకుని నేటి వరకు, దేవుని ఆత్మ గొప్ప కార్యాన్ని కొనసాగిస్తూ, పైగా వేర్వేరు కాలాలలో వేర్వేరు దేశాల మధ్య భిన్నమైన కార్యాన్ని చేసింది. విభిన్న కాలాలకు చెందిన ప్రజలు ఆయన చేసే భిన్నమైన కార్యము ద్వారా సహజంగా బయలుపరచబడే ఆయన భిన్నమైన స్వభావాన్ని చూస్తారు, ఆయన దయ మరియు ప్రేమా కనికరముతో నిండిన దేవుడు; ఆయన మానవుని కొరకైన పాపపరిహారార్ధ బలి మరియు మనుష్యుల కాపరి; కానీ, ఆయన మనుష్యుల న్యాయతీర్పు, దండన, మరియు శాపము కూడా. భూమి మీద ఆయన మానవుని జీవించడానికి రెండువేల సంవత్సరాలు నడిపించగలిగాడు, మరియు చెడిపోయిన మానవజాతిని పాపము నుండి కూడా ఆయన విమోచించగలిగాడు. నేడు, ఆయనను ఎరుగని, మానవజాతిని కూడా ఆయన జయించి తన ఆధిపత్యానికి వారిని సాగిలపడేలా చేయగలడు, తద్వారా అందరూ ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకుంటారు. చివరికి, ఆయన దయ మరియు ప్రేమ కనికరం గల దేవుడు మాత్రమే కాదు, జ్ఞానం కలిగిన మరియు అద్భుతాలు చేయగల దేవుడు మాత్రమే కాదు, పరిశుద్ద దేవుడు మాత్రమే కాదు, కానీ అంతకంటే ఎక్కువగా, మానవుని తీర్పు తీర్చే ఏకైక దేవుడని కనుపరచడానికి లోకమంతటా ఉన్న ప్రజలలోని అపవిత్రమైన మరియు అన్యాయమైన అన్నిటినీ ఆయన కాల్చివేస్తాడు. మానవజాతిలోని దుష్టులకు, ఆయన మండుచున్న అగ్ని, న్యాయతీర్పు, మరియు శిక్షా విధి; పరిపూర్ణత పొందవలసినవారికి, ఆయన శ్రమలు, శుద్దీకరణ, మరియు కష్టాలు, అలాగే ఓదార్పు, జీవనాధారం, వాక్యాలతో పోషణ, పరిష్కారము, మరియు సవరించడం ఉంటాయి. మరియు విడిచి పెట్టబడిన వారికి ఆయన శిక్ష మరియు ప్రతీకారము. దేవుడు సర్వశక్తిమంతుడు కాదా, నాకు చెప్పండి? నీవు అనుకుంటున్నట్టు, సిలువ వేయబడటానికి మాత్రమే కాదు గానీ, ఎంతటి కార్యాన్నైనా చేయడానికి ఆయన సమర్ధుడు. దేవుని గురించి నీవు చాలా తక్కువగా భావిస్తున్నావు! నీవు నమ్మేదంతా ఆయన సిలువ వేయబడటం ద్వారా ఆయన సర్వ మానవాళిని విమోచించగలడు, అంతే కదా? ఆ తర్వాత, జీవ వృక్ష నుండి ఫలము తిని జీవనదిలోనిది త్రాగడానికి పరలోకము వరకు నీవు ఆయనను అనుసరిస్తావా? … ఇది అంత సులభంగా ఉంటుందా? నీవు సాధించింది ఏమిటో నాకు చెప్పు? యేసు జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? నిజముగా నీవు ఆయన ద్వారా విమోచించబడ్డావు, కానీ సిలువ వేయబడటం యేసు తనకు తానుగా చేసిన కార్యము. మానవునిగా నీవు నెరవేర్చిన కర్తవ్యం ఏమిటి? నీవు పైకి మాత్రమే భక్తి కలిగి ఉన్నావు, కానీ నీవు ఆయన సత్య మార్గాన్ని అర్థంచేసుకోలేదు. నీవు ఆయనను ఇలా వ్యక్తపరుస్తావా? నీవు దేవుని జీవాన్ని పొందకపోతే, లేక నీతియుక్తమైన ఆయన స్వభావపు నిత్యత్వాన్ని చూడకపోతే, అప్పుడు నీవు జీవాన్ని కలిగి ఉన్నావని చెప్పుకోలేవు మరియు పరలోక రాజ్యపు ద్వారము గుండా వెళ్ళడానికి నీవు అర్హుడవు కావు.
దేవుడు ఆత్మ మాత్రమే కాదు, ఆయన శరీరధారి కూడా కాగలడు. అంతేగాక, ఆయన మహిమ కలిగిన శరీరధారి. యేసును మీరు చూడనప్పటికీ, ఇశ్రాయేలీయులు—ఆనాటి యూదులు—ఆయనకు సాక్ష్యమిచ్చారు. మొదట ఆయన మాంసపు దేహముగా ఉన్నాడు, కానీ ఆయన సిలువ వేయబడిన తరువాత, ఆయన మహిమాన్విత శరీరముగా మారాడు. ఆయన సర్వమూ సంచరించు ఆత్మగా ప్రతి చోటా కార్యము చేయగలడు. ఆయన యెహోవా, యేసు లేక మెస్సయ్య కాగలడు; చివరికి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా కాగలడు. ఆయనే నీతి, న్యాయతీర్పు, మరియు దండన; ఆయనే శాపము మరియు ఉగ్రత; అంతేకాకుండా దయ మరియు ప్రేమా కనికరము కూడా ఆయనే. అయన చేసిన కార్యాలన్నీ ఆయనను సూచించగలవు. దేవుడు ఎలాంటి వాడని నీవు చెప్పగలవు? నీవు వివరించలేవు. నీవు నిజంగా వివరించలేకపోతే, దేవుని గురించి నీవు నిర్ధారణలకు రాకూడదు. కేవలం ఒక దశలో దేవుడు విమోచన కార్యాన్ని చేశాడు కాబట్టి దేవుడు నిరంతరం దయ మరియు ప్రేమ కనికరాన్ని కలిగి ఉంటాడని నిర్ధారణకు రావద్దు. ఆయన కేవలం దయగల మరియు ప్రేమమయుడైన దేవుడని నీవు ఖచ్చితంగా చెప్పగలవా? ఒకవేళ ఆయన కేవలం దయగల మరియు ప్రేమామయుడైన దేవుడైతే, అంత్య దినాల్లో ఆయన యుగాన్ని ఎందుకు అంతం చేస్తాడు? అనేకమైన విపత్తులను ఆయన ఎందుకు పంపుతాడు? ప్రజల తలంపులు మరియు ఆలోచనల ప్రకారం, అంతము వరకు దేవుడు దయ మరియు ప్రేమ కలిగి ఉండాలి, తద్వారా మానవజాతిలోని ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. అయితే, అంత్య దినాల్లో, దేవుడు శత్రువుగా భావించే ఈ దుష్ట మానవాళిని నాశనం చేయడానికి ఘోర విపత్తులైన భూకంపం, తెగులు, మరియు కరువులను ఆయన ఎందుకు పంపుతాడు? ఈ విపత్తులను అనుభవించడానికి మానవుడిని ఆయన ఎందుకు అనుమతించాడు? దేవుడు ఎలాంటివాడో చెప్పడానికి మీలో ఎవరూ సాహసించలేరు, మరియు వివరించలేరు. ఆయన నిజంగా ఆత్మేనని నీవు కచ్చితంగా చెప్పగలవా? ఆయన మరెవరో కాదు యేసు శరీరమే అని చెప్పే ధైర్యం నీకుందా? మరియు ఆయన మనుష్యుల కోసం నిరంతరం సిలువ వేయబడే దేవుడని చెప్పడానికి నీవు సాహసించగలవా?